నాకు మాట్లాడ్డం రాదు-4

ఒక్కోసారెందుకో
నాకసలు మాట్లాడ్డమే రాదు.

అప్పుడు...
ఒక మౌనపు వంతెన కట్టి
మెల్లగా కవాతుచేస్తాను.
ఒక నవ్వుల నిచ్చెనేసి
చిన్నగా దాటివెళ్ళిపోతాను.
ఒక నిట్టూర్పుగోపురం కట్టి
ఆకాశాన్ని విభజిస్తాను.

ఎందుకలా చేస్తానో తెలియదు.
తర్వాతేమౌతుందో తెలియదు.
తెలుసుకోవాలనే జిజ్ఞాస;
తప్పించుకోకూడదనే విజ్ఞత...
ఆక్షణాన ఉండదు నాకు.

పెదాలు వర్షించలేని పదాలను
కోలాహలంతో హలాహలంగా మార్చలేను.
అందుకే నేను కొన్ని మట్లాడలేకపోతాను.
మాట్లాడ్డం రాదనుకొంటూ
నిశ్శభ్ధవక్తనై శూన్యసూక్తిని బోధిస్తాను.

ప్రియతమా...అందుకో చెలియా...
పరిమళించే ఉఛ్వాసలో ప్రయాణించే నీ విరహ కౌముది
నా మదిని కోసినపుడు రాలిపడ్డ రంపప్పొట్టుని...
పరిత్యజించే నిఛ్వాసలో పారిపోయే నీ వలపు కోయిల
నా ఎదను మీటినపుడు ఊడిపడ్డ వెన్నెలపొడిని...

అందుకే సఖియా...
నేను నువ్వులేక ఖాళీగా తలచిన నీ క్షణాల్ని
అనుక్షణం శిక్షించకు...అందులో నేను లేనని !
నేను నవ్వాగలేక జాలీగా గడిపిన నీ తలపుల్ని
ప్రతిక్షణం బాధించకు...అందులో నువ్వున్నావని !

ఏదేమైనా ప్రియతమా...
నేను కలై వస్తే మూసిన నీ రెప్పలు కదలనీయకు !
నేను అలై వస్తే వేచిన నీ కనులను మూసివేయకు !!

మనం !!

నీకు నేనే.. నాకు నువ్వే... సర్వస్వమనుకుంటూ
నిన్ను నేను...నన్ను నువ్వు... సంపాదించుకున్నాం !!
ఒకరిలో రాలిన ఇంకొకరిని ఒకరినొకరం ఏరుకుంటూ
ఒకరిలో ఒకరం మోకరిల్లి...ఒకరింకొకరుగా మారిపోయాం !!

నీలోంచి నేను...నాలోంచి నువ్వు ...సమస్తం చేజిక్కించుకుని
ఒకరికి ఎలియకుండా ఒకరం ఎవరికివారమే ఖర్చైపోయాం !!
ఒక్కరమే అనంతాన్ని నింపుకొని ఇద్దరిగా అంకురించినట్లు
నీవు నేనై...నేను నువ్వై... శూన్యమై మిగిలిపోయాం !!

26/05/2014

అక్షరం ఆయువైతే !

అక్షరం ఇష్టమైనపుడు
నా అందమైన భావాలను
అపురూపంగా మలచి
ఆనందపడ్డాను

అక్షరం నేస్తమైనపుడు
నా అంతరంగ తరంగాన్ని
అనురాగం రంగరించి
ఆవిశ్కరించాను

అక్షరం వ్యసనమైనపుడు
నా అమూల్యమైన అనుభవంతో
అంతరాత్మను అనువదించి
అంతర్మధించాను

ఇప్పుడు అక్షరం ఆయువైంది
నేనే అక్షరమై అంకురించాను
ఇకపై
అక్షరం అక్షరమే ఔతుంది...

ఇప్పుడిలా నేను...
నేను చూశాను !
ఒక నిస్తేజమైన ఆలోచన
మస్తిష్కంలో జనించినపుడు
మనోకుడ్యాల్లో ఉత్ఫన్నమయ్యే
వెలుగు రేఖలు మసకబారడాన్ని...

నేను విన్నాను !
ఒక ఉత్తేజమైన పగటికల
ఉవ్వెత్తున ఎగసినపుడు
కంటి పొరల్లో అలికిడయ్యే
నిశ్శబ్ధ కాంక్షల కోలాహలాన్ని...

నేను స్పృశించాను !
ఒక సమ్మోహన వీచిక
గంభీరంగా వాలినపుడు
బాహ్యాంతరాల్లో భారమయ్యే
నిభిడీకృత బహు భావాలని...

ఇప్పుడు
చూడటానికి
ఏ దృశ్యం కనిపించడంలేదు
మసక మబ్బులో
మెరిసే మిణుగుర్లు తప్ప !

వినడానికి
ఏ శబ్ధం కర్ణబేరిని తాడంలేదు
గుండెలో అలజడయ్యే
నిర్మానుష ఘోష తప్ప !

స్పృశించడానికి
ఏ అణువూ మిగలడంలేదు
శున్యమైన మనస్సాక్షితో
శాస్విత కౌగిలి తప్ప !

ఒక్కోసారంతే...
ఒక్కోసారంతే...
దేహం నీరసపడ్డప్పుడే
మనసు రెక్కలు తొడుక్కుంటుంది.
కళ్ళు కలల్ని కసిరేసినప్పుడే  
కొత్తలోకం కరచాలనమడుగుతుంది.
ఆశలు ఆవిరుతున్నపుడే
ఎండమావుల కవాతు మొదలౌతుంది.
*  *  *
ఎందుకనో....
పదునైన కోర్కెలను సానపట్టే  
ఈ హృదయానికి దయే ఉండదు.
నిర్దాక్షిణ్యంగా తనను తానే గాయపరచుకుంటుంది.
ఉదయసంధ్యలూ ఏదో ఒక అలజడిని
సాలేగూల్ళలా మస్తిష్కంలో అలికిడి లేకుండా అల్లేస్తుంది.
అమాయకంగా అల్లిన గూడులోనే చిక్కుకుపోతుంది.
*  *  *
అయినా ...
రగిలే కాంక్షని త్యజించాలనుకునే మనిషిలో
యుగాలుగా మార్పే లేదు !!
కాలం మిగిల్చిన కన్నీటి చారికలను
మాన్పే లేపనమే లేదు !!

సాగిపో....కష్టం నష్టం వచ్చాయంటూ
ఒంట్లో సత్తువ వదలొద్దు...
బాధా ధు:ఖం తరిమాయంటూ
కంట్లో నెత్తురు రాల్చొద్దు...

ఆవేశం కోపం కలిగాయంటూ
శీఘ్రమే కుత్తుక కదపొద్దు...
అలుపూ సలుపూ వచ్చాయంటూ
గమ్యం తలుపులు మూయొద్దు...

వెలుగూ నీడా కలిశాయంటూ
వేదన కట్టలు తెంచొద్దు...
వానకి వరద తోడైందంటూ
తర్కానికి తిలోదకాలొదలొద్దు...

చేతులు కట్టుకు కూర్చోకుండా
చకచక ఎత్తులు సిద్ధం చెయ్...
కాళ్ళకు బుద్ధిని చెప్పేయకుండా
కుదురుగా నిలబడి యుద్ధంచేయ్...

వెలుగుకు నువ్వే వాహనమయ్యి
లోకం మొత్తం ప్రసరించేయ్...
చిరునవ్వుకే నువ్వు బానిసవయ్యి
చిగురించిన ఆశలను పాలించెయ్...

05/05/2014

ప్రేతాత్మతో ప్రేమ!

కైపెక్కించే నీలికళ్ళ సుందరికి సైటేద్దామంటే
సిసలైన సాఫ్ట్వేర్ ఇంజినీరైతేనే వాటేస్తానంది

సన్న నడుమున్న చలాకీ పిల్లకి ప్రపోస్ చేస్తే
సివిల్ సర్వీస్ లో ఉంటేనే తనకో స్టేటస్ అంది

కాలి గజ్జల కొంటె కోమలాంగిని కోరుకుంటే
కాంట్రాక్టర్ అయితేనే కోరికలు తీరతాయంది

లేత పెదవుల లేటెస్ట్ లేడీకి లవ్ లెటర్ రాస్తే
లాయరైతేనే తనపెదాలతో వాదించగలడంది

వాలుజడ వయ్యారికి చిరునవ్వును విసిరితే
విమానాలు నడిపెవాడివి కాదంటూ కసిరేసింది

ఇవన్నీ కాని నేను ప్రేతాత్మను ప్రేమిస్తానంటే
ప్ర్రాణంలేని తను నా ప్రాణమై ఉండిపోతానంది

ట్రాన్స్ఫార్మర్ హార్ట్ !!

ట్రాన్స్ఫార్మర్ హార్ట్ !!మితిమీరిన ఆశలకు కళ్ళెంవేస్తూ
జీవితపు సరిహద్దులు చేరపనీయక
సున్నితపు అనుబంధాలకు
సన్నని రాగితీగల బంధనాలతో చుట్టి
ఆలోచనా చలానాలను నియంత్రిస్తూ
తార్కికాయస్కాంతత్వానికి లోబడి స్పందించే
ట్రాన్స్ఫార్మర్ హృదయం నాది!!

మెదడూ మనసుల భావజాల వికేంద్రీకరణకు
అనుక్షణం అడ్డుకట్ట వేస్తూ
అంతులేని కోర్కెలకు మనోకారాగారంలో
నిరాశావాద ఖడ్గంతో శిక్షిస్తూ
చిరునవ్వును కవచంగా ధరించి
అనంతానంత దూరాలు సంచరిస్తున్నా!!

శూన్యాన్ని శరీరంలో దాచుకొని
సన్యాసిభావాల ఆత్మకి సహనంతో సమాధి కట్టి
సుదూర తారలను చేజిక్కించుకోవాలని
నా హృదయ దారాల నిచ్చెన జారవిడుస్తున్నా!!
Related Posts Plugin for WordPress, Blogger...