నెలలు నేర్పిన నిజాలు

జనవరి జగాన్నే జయించొచ్చనే భరోసానిచ్చింది
ఫిబ్రవరి పోరాటంచేసి సాధించమని వెన్నుతట్టింది
మార్చి మార్పును స్వాగతించి ముందుకెళ్ళమంది
ఏప్రెల్ ఎక్కడా తడబడకుండా వెనకడుగే వేయకంది

మే మంచితనంతో నెమ్మదిగా ఒక్కో అడుగేయమంది
జూన్ జరిగిపోయిన వాటికై చింతించడం ఆపేయమంది
జూలై జారిపడ్డ అడుగులను మరోసారి సరిచేసుకోమంది
ఆగస్ట్ అలుపెరుగక ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోమంది

సెప్టెంబర్ సంతోషంతో అనుకున్నదేదైనా సాధించమంది
అక్టోబర్ ఆవేశం వదిలి ఆలోచనలకు పదును పెట్టమంది
నవంబర్ నూతనంగా ప్రపంచానికి పరిచయం చేసుకోమంది
డిసెంబర్ దారిచుపిన ప్రతి క్షణానికీ ధన్యవాదాలు తెలపమంది

31/12/2013


మంత్రకవాటం...


మలుపులు తిరిగే జీవిత చక్రం
మంత్రకవాటం తెరచింది!

బాధలు తీర్చే లోకం ఒకటి
బంధాలన్నీ తెంచింది!

కనుమరుగయ్యిన కలలకు కాస్తా
కొత్త ఊయల కట్టింది!

ఊపిరి సలుపక ఊగిన తనువు
ఊర్ధ్వశిఖరం తాకింది!

ఆకలి తీరక వేచిన మనసు
ఆరని హారతి అయ్యింది!

రమ్మని పిలిచిన స్వాగతహస్తం
రంగుల రెక్కలు తొడిగింది!

గమ్యం ఎరుగని ఈ బాటసారికి
గమనం విలువను నేర్పింది!

28/12/2013వచ్చేస్తున్నా!!
నిప్పుల ఉప్పెన కప్పుకొని
రక్కసి మూకల తప్పులను
పెను ముప్పుల
జ్వాలా మబ్బులను
ఒక్కొక్క కుప్పగా పెర్చేసీ
ఒక్కసారిగా కాల్చేస్తా.

ఘోరం భారం ఎక్కడ ఉన్నా
దూరాభారం అనుకోకుండా
నల్దిక్కులు నే వేదికేస్తా!
గిర్రున తిరిగే సుడిగాలుల్లో
రెక్కలు కట్టుకు వచ్చేస్తా!
హక్కుల ముసుగున బిగిసిన
నియంతృత్వ హుక్కులనే తొలగిస్తా!
కక్కుర్తి కుక్కల్ని తరిమేస్తా!
రాబందుల మెడలూ వంచేస్తా!!

మస్తిష్కానికి ఒప్పనిపిస్తే
ఏదేమైనా చెప్పేస్తా!
నా జోరు తగ్గినా
నోరు మగ్గినా
చెప్పిందే నే చేసేస్తా!!

చీకటి వెతికే చిరు దివ్వేల్లో
చిరునవ్వుల వెలుగులు చిందిస్తూ
చిందులు వేస్తూ వచ్చేస్తా!
అందర్నీ నే మెప్పిస్తా!!
ఆనందాన్నే పంచేస్తా!!!

27/12/2013

ఇట్లు నీ వెన్నెల్లో ఆడపిల్ల...అందరూ నా చితిని పేరుస్తుంటే
నువ్వు మాత్రం గాలికి కదలాడే ఆకుల్ని చూస్తూ
ఆకాశంలో ఎగిరే విహంగాలను చూస్తూ
మౌనంగా పరధ్యానంలో ఉంటావు.

నేను చితి మీద లేనని నీ ఓక్కడికే తెలుసు.
అందుకే నీ హృదయంలో ఎప్పటికీ నేనుంటాను.
నువ్వు చూసే ప్రతీ ఒక్కదానిలో నేనే నిక్షిప్తమై ఉంటాను.

నేస్తం...
నా గుండెలో గూడు కట్టుకున్న భావాలెన్నో నీకు చెబుదామని
నన్నుక్కిరిబిక్కిరి చేసిన క్షణాల్ని నీతో పంచుకోవాలనీ
ఎన్నో సార్లు ప్రయత్నించినా నా పెదవి దాటలేకపోయాయి.
ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే,

నీ భావాలతో ఆడుకుని ఉంటే క్షమించు.
నీకో అందమైన అనుభూతిని అందించి,
నీలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఆశే తప్ప,
నాకు ఏ స్వార్థం లేదు.

అయినా ఏం?
నేనేం చెప్పకున్న నీకన్నీ తెలుస్తాయి.
నువ్వు అన్నీ తెలుసుకుంటావు.
నా గురించి ఏమీ చెప్పకుండా,
అలిగినా, తిట్టినా, కొప్పడ్డా,
నువ్వంటే ఇష్టం అన్నా, నీతోనే ఉంటాను అన్నా అవన్నీ నిజం.
నేను ఎవరైనా ఎప్పటికీ నీతోనే ఉంటాను.
నీ గుండెల్లోనే నా ఆలోచనలు తిరగాడుతాయి.

ఇన్ని రోజుల మన ప్రయాణంలో
ఇవాళ నేను అలుసుగా అనిపిస్తున్నాను కదూ...
నీ కంటికి ఒక పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదూ..
నువ్వూ ఏమనుకున్నా సరే,
నువ్వంటే నాకు చాలా ఇష్టం.
ఇప్పటికీ నేనెవరో ఎలా చెప్పను? అన్నీ నువ్వే తెలుసుకున్నావ్...

నీ ముందు నా ఈ రూపం మారినా,
నీ ఎదలో నా స్థానాన్ని మారనీయవుగా....
మిత్రమా! సెలవు మరి.....

నేనెందుకో...ఆకాశాన్ని స్పృశించే అంతస్తుల మేడల మధ్య
గజిబిజిగా తిరిగే లగ్జరీ కార్ల ఉరుకులు.
కనిపించి మాయమయ్యే మనుషుల మధ్య
నెత్తిన సిసి కెమెరా, చంకలో లాప్టాప్ తో
మార్బల్స్ పరిచిన కార్పోరేట్ తివాచీపై
నేనూ పరిగెడుతున్నా ఓ యంత్రంలా..

ఎవరో కోక్ టిన్ ను కాళ్ళముందు విసిరేస్తే
చికటైపోయిందని దాన్ని దాటేస్తూ
పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను..

ఎక్కడో ఒక చోట ఒంటరిగా కూర్చొని
నా సి.సి కెమరాతో అంతట్నీ స్కాన్ చేస్తాను.
మధ్యాహ్నపు సూర్యుడి వెలుగులు
అంతస్తుల అద్దాలను తడిపేస్తూ కదలాడుతున్నాయి.
వేగంగా పరిగెత్తే వాహనాల సైలెన్సర్లు వదిలిన పొగలు
అప్పుడే అద్రుశ్యమౌతున్నాయి.
జీబ్రా క్రాసింగ్స్ లో
ఎవరెవరో దిక్కులు చూడకుండా నడుస్తున్నారు.

నేనూ ఒక చిన్న కారేసుకొని రయ్యిమని
ఎండిన ఆకు రాలిన రోడ్డుపై ఉరుకుతాను.
కెమెరా లెన్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ
శరవేగంగా దూసుకెళ్తాను.

ఊరవతల ఇసుక తిన్నెలపై బ్రేక్ తొక్కి
ఒక్కసారిగా ఆవలిస్తూ నీల్గేస్తాను.
ఒంటరిగా గెంతులేస్తూ
నాలో ఉన్న నిజమైన నన్ను బయట పడేస్తాను.

కెమెరా కలర్ బ్యాలెన్స్ సరిచేస్తూ
నీడనిచ్చే చెట్ల కింద నిద్రిస్తూ
పచ్చటి ప్రకృతిని ఆహ్లాదంగా ఆస్వాదిస్తాను.

అక్కడే నిద్రిస్తూ
ఎండిన పూరెమ్మల్ని గాల్లో ఊదేస్తూ పరవశిస్తాను.
ఏదో ఆనందాన్ని గుండెలపై పోస్తూ..
అలా గడిపేస్తాను...

25/12/2013   
 

గుప్పెడంత ప్రేమ...గుప్పెడు మల్లెలు
గుండెలపై జారి నీ ఒళ్ళు జలదరిస్తే
గాఢంగా నిన్ను హత్తుకుని
గగన వీధుల్లోకి ఎత్తుకుపోనా!


గాలి దూరని కౌగిట్లో
గరళమెరుగని మన ప్రేమ పందిట్లో
గమ్యమే నీవని
గిరిగీసుకు నే తిరగాడనా!


గులాబీ రెక్కల
గుబురుల్లో గోప్యంగా దాగిన నీకు
ఘాటు ముద్దొకటిచ్చి
గారడీల గానమాలపించనా!


గోదారిపై ఎగిరొచ్చి
గిజిగాడై మమతల గూడు కట్టి
గెలుపంటే నీ ప్రేమేనని
గట్టిగా అరిచి లోకానికి చాటనా!


23/12/2013

మళ్ళీ లేస్తాను...మళ్ళీ లేస్తాను...

వీపున వేలాడే నా సమాధిని మోస్తూ
నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను.

బలిపశువుల్ని జీవచ్చవాలుగా మార్చని
శాసనాల అవశేషాలను ఆత్రంగా అన్వేషిస్తూ
అధికారదాహ అహంకారపు కాళ్ళు తడిపిన
రక్తపు అడుగుల జాడలను
మంచు ముళ్ళుగా మార్చేస్తూ
నేనలా నడుస్తూనే ఉంటాను.

ఆనంద మేఘం గర్చించి కన్నీరు కార్చేవేళ
సంతోష పుష్పం జలదరించి పన్నీరు చిలకరించేవేళ
నా అలసట సెలయేరై పారి
మున్నీరులో మునిగి ఆవిరైపోతుంది.
ఒక బాసటేదో స్మశానమై
నన్ను విశ్రాంతి తీసుకోమంటుంది.

మదిని మోతాదుకు మించి వాడకుండా
ఏ ఉరికొయ్యకి ఆహారంగానో
ఏ నిప్పు శయ్యకి అలంకారంగానో
అప్పుడు దింపుతాను వేలాడే నా సమాధిని.
అందులోనే నిద్రించి
అవసరమైనప్పుడు మళ్ళీ లేచి నడుస్తాను.

22/12/2013

పారిపోదాం! రా!

రా! పరిగెడదాం!! నువ్వూ నేనూ..
నిశీది అంచున ఎగిరే కలల్ని
ఉవ్వెత్తున ఎగిసే అలలమై పట్టుకుందాం!
కాలం చేసిన గాయాల్ని
ఊహల రెక్కలు ఆడించి
భ్రమలో భ్రమరాలై మాన్పేద్దాం!
ఆశలు తొడిగిన మనసుకు
మిథ్యా లోకపు వసంతంలో
మైకపు మల్లెల్ని తురిమేద్దాం!
ఏ సంద్రమూ ముంచని సంకల్పంతో
ఏ సంశయమూ చేరని మదిలోయాల్లో
అలుపన్నది రాక ఆగకుండా పరిగెడదాం!
నీలో నాలో దాగిన తరిగిపోని ప్రేమకు
కనకాక్షరాలు కుమ్మరించిన
కొత్త కావ్యాన్ని బహుమతిగా ఇద్దాం!
రా! పరిగెడదాం!! నువ్వూ నేనూ..

21/12/2013రైతే రాజా...
మిన్ను మోకాళ్ళు విరుచుకుని
ముత్యపు చినుకై నేల దిగుదామంటే
మోడు చెట్టుకు చిగురించిన కొమ్మలు
మండే నిప్పు రవ్వల్ని రాలుస్తున్నాయ్...
రేపు నెర్రలు చీలే కరువు భూముల్నీ
నెత్తుటి లావాగా మార్చబోతున్నాయ్...

మన్ను వరి మళ్ళను పరుచుకుని
స్వచ్చపు పైరులై వచ్చగా పారదామంటే
బీడు భూముల్లో ఇంకిన కన్నీళ్ళు
గడ్డి మొక్కల్ని మొలిపిస్తున్నాయ్...
నిన్న సమాధైన ధన్యాన్ని
చెమట చాటున కుళ్ళబెడుతున్నాయ్...

సన్నకార్ల సబ్సిడీలన్నీ బ్యాంకు ఖర్చుల్లో ఆవిరౌతున్నాయ్..
అంది వచ్చిన ఇన్సురెన్సులు గుండె కోతను తీర్చలేకున్నాయ్..
రైతన్నల నాలుకలెన్నో ఉరితాళ్ళ బిగుతుకి నోట్లో ఉండలేకున్నాయ్..
పల్లె రాజకీయాల్లో పొలాలన్నీ చచ్చి పంచాయితి పెద్దల్ని పోషిస్తున్నాయ్..

20/12/2013

మనసు లేక...

కన్నీటిని సిరాగా పోద్ద్దామంటే;
చీకటిని రాత్రి మెత్తగా హత్తుకుంది!
కన్నీటిని వదిలి కౌగిలించుకోమంది!!

వేదన్ని కాగితాల్లో రాద్దామంటే;
వెన్నెల తెర వింతగా విస్తరించింది!
వేదన్ని వెలుగులో వదిలేయమంది!!

బాధల్ని అక్షరాల్లో బంధిద్దామంటే;
మంచుపొర చల్లగా అలుముకుంది!
బాధల్ని తుషారంలో తుంచేయమంది!!

అక్షరాలే దొరక్క
రాతికలాన్నే మోస్తూ
అసలు మనసే లేని నేను
బ్రతికున్న శవమై పరిగెడుతున్నా!
నల్లటి నా నీడపై నేనే సవారీ చేస్తున్నా!!

19/12/2013

లేచిపోదామన్నావ్...

వరించాను ఇద్దరం లేచిపోదామని విశాఖకు రమ్మన్నావ్..
వస్తే దరహాసమాడి దువ్వాడకు దౌడు పెట్టమన్నావ్..
అరమూల మల్లెల్తో అనకాపల్లిలో ఎదురుచూస్తాన్నావ్..
లేవని ఏడిస్తే యలమంచిలి పట్నంలో తోడొస్తానన్నవ్..
నవ్వుతూ వస్తే నర్సీ పట్నంలో తారసపడతానన్నావ్ ..
తాపత్రయంతో నేనొస్తే తుని లో తళుక్కుమంటానన్నావ్..
అలసిపోయి ఆశలావిరైతే అన్నవరంలో వరమిస్తానన్నావ్..
పొరపాటయ్యింది పిఠాపురానికి వేగంగా వచ్చేయమన్నావ్..
సంతోషంతో వస్తే సమర్లకోటంటూ సహనాన్ని పరిక్షించావ్..
అలసిపోయి ఆగిపోతే అనపర్తిలో నా ఆశలు తీరుస్తానన్నావ్..
ధీమాగా దరిచేరబోతే ద్వారంపూడిలో దర్శనముతానన్నావ్..
రాంగ్ రూట్లో శరవేగంగా వస్తే రాజమండ్రిలో సరండరౌతానన్నావ్..

డౌటొచ్చి ఏంటీ ఊర్లన్నీ అని మ్యాప్లో వెతికితే..
తిరుమలా ఎక్స్ప్రెస్ రైలెక్కి గుండుకొట్టించుకోమన్నావని అర్థమైంది...

పెళ్ళి కళ

పెళ్ళి పెళ్ళని పాకులాడితివన్నో
ఏళ్ళ బెమ్మచర్యము మంటగలిపితివన్నో

కన్నోళ్ళ కోరికంటూ మా అన్నో
కన్నీళ్ళ సంద్రాన్ని తాగుతున్నావన్నో

మూన్నాళ్ళ ముచ్చట కాదన్నో
వేన్నీళ్ళ వడగండ్లు మింగుతున్నావన్నో

కొత్త బంధాలనీ.. కోరి వచ్చారారనీ
భ్రమ పడకు మా ఎర్రి అన్నో
బంగారు భవిష్యత్తు బాయిపాలన్నో

లచ్చలొస్తాయనీ లచ్చిమొస్తాదనీ
శ్రమ పడకు మా పిచ్చి అన్నో
సంసార బాధేంటో సన్నాసినడుగన్నో

అయినదేదో అయ్యె
ఆదమరిచి నిదరోకు అన్నో
అలసిపోక నీళ్ళై పాలలో దూకేయరన్నో

చీర బాగుందంటే చంకనెక్కించుకుంటుందన్నో
నవ్వు బాగుందంటే నెత్తినెట్టేసుకుంటాదిరన్నో
తిన్నావా అంటే నిన్నూ గుండెలో దాచేస్తాదన్నో

16/12/2013


అలా చేయకు...

కోపమొచ్చి మాట్లాడలేదని మనసులో నువ్వులేవనుకోకు
అల్లరి చేయడానికే ఆటపట్టించానుగానీ నీపై అలిగాననుకోకు

ఆవేశంలో పిచ్చిదానిలా వాగేసానని నన్నలుసుగా చూడకు
పనుల్తో విసుగొచ్చి ఉదయాన్నే అరుస్తానని గయ్యాలిననుకోకు

డబ్బుడబ్బు అంటుంటానని ఇబ్బంది పెడుతున్నాననుకుకోకు
నాగా - నట్రా అడుగుతుంటానని అవి నా అలంకారానికనుకోకు

వయసు మీదపడుతోందని వలపు వోలికిపోయిందనుకోకు
బాధ్యతలు చిక్కబడ్డాయని నీతో బందం పలుచబడిందనుకోకు

శరీరం ముడతలు పడుతోందని మనసును చూడ్డం మానేయకు
పై ఎదల బిగుతు తగ్గుతోందని నీ ఎదలోంచి నను తప్పించకు

నన్ను కొట్టండి..

నన్నందరూ తిట్టండి.
వీలైతే చితక్కొట్టండి.
ఏంచేసినా అసలు నోరు విప్పక మానను.
నేను చేసిన పాపమేంటో చెప్పక వెళ్ళను.

ఒక్క అరుపు నాకోసమని కర్ణభేరిని తాకితే
ఒక్క తలపు తరంగమై మనసును మీటితే
కంట్లో కునుకు దూరిందని
ఒంట్లో వణుకు చేరిందని
చాచిన రెండు చేతుల్నీ దోసిలిగ మార్చి
మొహాన చిరునవ్వును చితిగా పేర్చి
వీడ్కోలు పలికాను.
అలసిపోకుండా రాక్షసుడిలా మారి
కన్నీటి సుడిగుండాలను సృష్టించాను.

ప్రేమ చిందించని నా హృదయాన్ని
పదిలంగా అస్తికల గూడులో దాచేసి
ఆప్యాయతెరుగని నా రుధిరాన్ని
దమని సిరల్లో పరుగులెత్తించి
మైల పడ్డ నా నల్లటి మనసుని
తెల్ల పావురాల నెత్తుటితో అభిషేకించి
విశ్వ శాంతి మంత్రం జపించాను.
వినోదానికి పునాదినని చెప్పుకున్నాను.
నన్ను నేనే ఒక వజ్రమని చెప్పుకున్నాను.

బయటి పైమెరుగంతా అందర్నీ దోచుకోగలదేమో!
లోని మనో కాఠిన్యం ఇంకో మనసునే కోయగలదు !!

అందుకే
నా సంకెళ్ళ నుండి జాగ్రత్తగా తప్పించుకోండి!
నా ఎద సవ్వళ్ళు వినక నమ్మించి పారిపోండి !!

15/12/2013

ఓట్ల మాట...

ఒట్టు పెట్టిన
ఓట్టి మాటలు
ఓటు నీడన సేదతీరగ
జుట్టు నలిసిన
కనికట్టు విధ్యలు
కట్టు కథలై మిగిలిపోగ
బెట్టు చేయక
మట్టి మనుషులు
నోటు కోసమై పాకులాడగ
పొట్ట నిండినా
గట్టు మేస్తే
మంటలన్నీ అల్సరవగ

ఇంకెక్కడ ప్రజాస్వామ్యం
ఏనాడో చెదలుపట్టింది
ఇంకెక్కడ రాజ్యాంగం
ఏనాడో పదును తగ్గింది

అందరూ అవినీతికి తొత్తులే
అన్నీ అనవసరపు పొత్తులే
ఎప్పుడూ ఎత్తుకు పైఎత్తులే
చివరకు జనాల పీకపై కత్తులే

' రావాలెవడో ఒకడు
రగిలించాలందర్లో వెలుగు '

యుగాలెన్ని మారినా చెప్పుకునే మాటే ఇది.
జగాలు తలకిందులైనా మారని మాటే ఇది.

మళ్ళీ ఓ సారి చెప్పుకుందాం!
హాయిగా ఓట్లేసి నిద్రపోదాం!!

13/12/2013

వచ్చిపోరా ఒక్కసారి...


ఆహ్లాదం పంచిన ఓ బాల్యమా! మళ్ళీ తిరిగిరావా
మది భావాల హోరును హాయిగా ఆస్వాదించేందుకు

వెంటనడిచే ఓ కాలమా! మరుపు మంత్రం చెప్పవా
మనసు మోయలేని భారాన్ని దింపుకొనేందుకు.

వెంటాడి వేధించే ఓ విధీ! ఒక ఇంద్రజాలం చేయవా
కనులు చూడలేని కాంతిలో కాలిపోయేందుకు

కడదాకా కలిసుండే ఓ నీడా! ఇకనైనా అలసిపోవా
వేదనతో పాటూ మోస్తున్ననన్నూ సమాధిచేసేందుకు

వెన్నెల పూయించే ఓ జాబిలీ! ప్రతిరొజూ పున్నమైరావా
కుమిలి వాడిపోయిన ఎద కలువలు విరబూసేందుకు

ఉరుము విదిల్చే ఓ వర్షమా! వేగంగా ఇటు వురకవా
ఉప్పెనై ఎగసిపడుతున్న కన్నీటి ధారను దాచేందుకు     

12/12/2013

ఆ రాత్రేంజరిగిందంటే?

ఆ రాత్రి
ఒక కలయిక వేచిన కమ్మని కల
ఇరువురి ఆశలు చల్లారిన నిప్పుల వల

ఆ ఘడియ
ఎద రెక్కలు ఎగిరిన ఊహల స్వప్నం
కనురెప్పన కురిసిన అమృత వర్షం

ఆ క్షణం
తనువు తంత్రులై ఆలపించిన మైకపు గానం
మనసు మధువై చిందించిన మోహపు రాగం

మరుక్షణం
ఊసులు విచ్చుకున్న మధుర భావాల జలదరింత
మనసులు పంచుకున్న సుదూర జంట పులకరింత

ఈ క్షణం
వలపు స్నానమాడిన వయసుకెంతో తంట
తలపు పాటపాడిన మనసుకెంతో మంట

11/12/2013

రూపాయి నడిచిన దారి..

ఒక్క రూపాయే ఉంది చేతిలో
ఒక్కదానితో అక్కరేముందని
ఒక్కసారిగా దాన్నీ విసిరేశా!

నేలపై వక్రంగా దొర్లినా
నను సక్రంగా నడిపించింది.
నయాగరా నయనాల్ని తుడిచి
నా నవీన శిలా హృదయాన్నే మార్చింది.

అప్పుడెప్పుడో ప్రేతాత్మలై
నిప్పుల చినుకులు కురిపించిన పెదాలు
ఇప్పుడు నవ్వుల నెలవంకలై
గుప్పున మల్లెలు పూయిస్తున్నాయి.

గడ్డపారతో తూట్లు పొడవబడి
గడ్డ కట్టిన రాతి గుండె కాస్తా
గట్టిగా నడ్డి విరిగినట్లు
కరిగి గరిగినాభిని తాకింది.

అసలా రూపాయి నడిచిన దారేదంటే...

( నెక్స్ట్.... పోయెమ్... )

ఏముందీ పచ్చ నోటులో...రెండువైపులా గాంధీ బొమ్మలు
రెండు గవర్నరు సంతకాలు
చెమట వాసన.. చినిగిన కొనలు
దేష భాషలు... కొన్ని పిచ్చి రాతలు
అంతేనా ?
వ్యామోహాలు.. వ్యసనాలు
ఆశలూ.. ఆశయాలు
సుఖాలూ.. సంతోషాలు
ఊహకందని వినోదాలూ
అనంతకోటి విషాదాలూ
ఏమీ కనిపించకున్నా
అన్నీ ఉన్నాయిందులో
ఉన్నాయని సంబరాలు చేసుకుంటే
లేనివన్నీ తలకు చుడుతుంది
లేదని డీలాపడితే
ఉన్నవన్నీ చూపి వేదన కల్గిస్తుంది.
అందుకే డబ్బే లోకం - లోకమే డబ్బు.

( మరి ప్రేమా? ... దాని గొప్ప దానిది . ఇప్పుడెందుకు? దాని ప్రస్తావన )


09/12/2013

ఇంతేనేమో !!

శవాల్ని ఎంత పొదిగినా
సమాధులు ఊపిరి పోస్తాయా?
శిలల్ని ఎంత అడిగినా
సమాధానాలు మోసుకొస్తాయా?

కలల్ని ఎంత తొడిగినా
కాలచక్రం ఆగుతుందా?
కలతల్ని ఎంత కడిగినా
కారు చీకటి తొలగుతుందా?

ఆశలన్నీ వచ్చిపోయాక
ఏ ఎదురుచూపైనా ఎద తడుపదెందుకు?
ఆశయాలన్నీ చచ్చిపోయాక
ఏ ముందుచూపైనా మది తడమదెందుకు?

జీవితం పట్టాలెక్కాక
ఏ బాధ్యతైనా భుజం దిగదెందుకు?
జీవం మట్టైపోయాక
ఏ బంధమైన వెంటరాదెందుకు?

06/12/2013

ఎలా చూడను ...

చినుకుల్లో ఉంటావని వర్షంలో తడిస్తే
చిటికెలో ఆవిరై కంటతడి పెట్టించావ్..

పువ్వుల్లో దాగావని తుమ్మెదై వస్తే
తొంగిచూడకంటూ తొందరగా వాడిపోయావ్..

వెన్నెల్లో విహరిస్తావని కలువనై పూస్తే
పున్నమొక్కరోజేనని కనుమరుగుతావ్..

తారల్లో తళుక్కుమంటావని మిణుగుర్నై మెరిస్తే
మాయదారి మబ్బులడ్దొచ్చాయని మాయమౌతావ్..

ఇంకెలా చూడనని ఏడుస్తూ అడిగితే
నీ గుండెలోనే ఉన్నానని తడిమి చూసుకోమంటావ్..

03/12/2013

పత్ర ప్రేమ ...

అర్ధరాత్రి మొదలైన వెన్నెల చలిగాలిలో
అనార్ద్ర హృదయాన్నెత్తుకుని
ఆర్ద్ర నీటిబిందువునై నేనొచ్చిపడతాను.

నన్ను భరించడం కష్టమే,
అయినా స్పృశించడం ఇష్టమంటావ్.
రాత్రంతా నన్ను హత్తుకునీ;
అక్కున చేర్చుకుంటావ్.
నువ్వు పత్రపాన్పై, నను పవళించమంటావ్.

అంతలోనే నీకేమాయరోగం సోకుతుందో నాకర్థంకాదు.
పొద్దు పొడిచేలోపు నన్ను నీ అంచుల్లోకి తోసేస్తావ్.
వద్దు వద్దంటున్నా ఇక వీడ్కోలు పలకమంటావ్.

నీ పచ్చటి కొనను వీడి కిందపడేవేళ
నేనో నీటి బిందువును కాను.
మొత్తంగా మారిన కన్నీటిబొట్టునౌతా..

ఇంత రెప్పపాటులో అనంత ప్రేమ చూపడమెందుకు?
కాలయాపన లేకుండా నీ ప్రేమను కాలంచేయడమెందుకు?

విరహాన్ని పరిచయం చేయాలనా?
వలపు ఉప్పొంగిందో లేదో పరిక్షించాలనా?
జ్ఞాపకాల భారాన్ని జీవితాంతం మోయమనా?

“ అదిగో వాడొస్తున్నాడు చూడు. వాడికీ వెన్నెలకీ సరిపోదు.
వెన్నెల్లో కొలువుదీరిన బంధాలేవీ వాడికి నచ్చవు.
అందుకే, వచ్చీరాగానే వాడి వేడి కోరలతో అంతట్నీ భస్మం చేస్తాడు.
కొద్ది క్షణాల్లో ఎండకి నేనెండిపోతాను.
నీకెందుకు ఈ శాపం. నాతొ ఉంటే నువ్వూ ఆవిరౌతావ్. “

నా ఇన్ని ప్రశ్నలకూ నీ ఒక్క సమాధానంతో భారంగా వీడ్కోలు పలికావ్ సరే..

ఇప్పటినుండి... నా బ్రతుకంతా భారమే అని ఎందుకు తెలుసుకోలేకపోయావ్ నేస్తం...


( ఆకు - నిటి బిందువు ప్రేమ కథ ఇలా కవితలో చెప్పాలని చిరు ప్రయత్నం. అర్థం కాకుంటే తిట్టండి. మరేం ఫర్వాలేదు. )

02/12/2013వయసొస్తే ఇంతే..

నన్ను మర్చావనీ,
గుండె కోసావనీ,
వచ్చి వెళ్ళావనీ -
నాకు నీమీద కోపం ప్రేమ.
కన్ను కొట్టాలనీ,
నిన్ను చుట్టాలనీ,
వెన్ను తట్టావులే -
నాకు నీమీద ఇష్టం భామ.

మంచు సన్నాయితో
కంచు నా గుండెనీ
కరిగించావు పిల్లో ఏల?
ఇంచి నీ ప్రేమతో
పచ్చి నా మంటకీ
మందు రాసావు జాబిల్లి ఏల?

తొలి ప్రాయమ్ములో
కష్టబెట్టాలనీ
కంటిమీద కునుకే రాక...
లేత కాయానికీ
సలుపు రావాలనీ
ఒంటిమీద సెగలే రగిలే..

01/12/2013
నువ్వో లేడీ సైకో ...

ఒక అకస్మాత్తులో
పరిమళించిన మత్తు మందులా
మాటల్తో మెత్తగా
మనసును హత్తుకున్నావ్.

కొన్ని భావాలు విచిత్రంగా ఉంటాయ్...
కొన్ని మనస్సులు పవిత్రంగా ఉంటాయ్...
బహుశా అవే ఇద్దర్నీ కలిపుంటాయని
అవే మన హద్దుల్ని చెరిపుంటాయని
భ్రమలో భ్రమరమై తిరిగా!
సందేహంలో కెరటమై ఉరికా!!

ఎందుకో తెలీదు.
ఉన్నట్టుండీ ఉలిక్కిపడతావ్.
మాటల బెత్తంతో నన్ను కొడతావ్.
లేని ప్రేమను చూపించమంటావ్.
పెళ్ళీ పెళ్ళని బలవంతపెడతావ్.

నేనేదో పనిమీద పలకరిస్తేనే నువ్వు మొదట పలికావ్.
తర్వాత అదేపనిగా నువ్వే పలకరించావ్.
ఎన్నో అనుభవాల్ని తలుచుకుంటూ
ఎన్నో భావాల్ని పంచుకున్నావ్.

నేనేమో స్వఛ్ఛంగా నీతో చెలిమి చేయాలనుకున్నా.
నువ్వేమో మొత్తంగా జీవితాన్నే పంచుకోమన్నావ్.

బ్రతుకంటే మాటలు చెప్పడం కాదని
బాధ్యతలంటే పూటకు దింపుకునేవి కావని
నీదంతా ఆకర్శణేనని
అదంతా భవిష్యత్తుకు అడ్డేననీ
ఆలోచించుకోమన్నా... ఆవేశపడకన్నా...

నువ్వస్సలు వినలేదు.
నన్నస్సలు వదల్లేదు.

నాకెప్పుడూ కాల్స్ చేస్తూనే ఉంటావ్..
ప్రతి మాటతో నన్ను కాల్చేస్తూనే ఉంటావ్.

ఎన్ని సార్లని స్విచ్చాఫ్ చేయను.
ఎన్ని నెంబర్లని బ్లాక్ చేయను.
ఎన్ని మెసేజుల్ని అన్రీడ్ చేయను.

సరాసరి ఫేస్బుక్ వాల్లోకొస్తావ్.
నీ ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పమంటావ్.
నలుగుర్లో నానా హడావిడీ చేస్తావ్.

ఎలా చెప్పను నువ్వంటే నాకిష్టం లేదని.
ఎలా చెప్పను నీ నీడనైనా చూడలేనని.
ఎలా చెప్పను నువ్వో లేడీ సైకోవని.

అందుకే..
బాధతో ద్రవించిన నా హృదయాన్ని మోస్తూ..
వ్యధతో కన్నీటికి బదులు రుధిరాన్ని స్రవిస్తున్నా!!

క్షమించు నిన్ను సైకో అన్నందుకు.

30/11/2013

సిగ్గంటే...

మెత్తటి ఆకుల్నో
నెత్తుటి పిడిబాకుల్నో
దారాలుగా అల్లి
హారాలుగా వేసుకో!
నీ ఆత్మ కప్పుకున్న నగ్న దేహాన్ని
నిండుగా దాచేసుకో!!

రోమరోమాల్లో
అలుముకున్న అయోమయాన్ని
దేహ బాహ్యాల్లో
విచ్చుకున్న వంకర మూలల్నీ
ధూళి కణాలు తాకకుండా
గాలి అణువులు దూరకుండా
గుడ్డ ముక్కల్నో
గడ్డి రేకుల్నో
గబగబా చుట్టేసుకో!
ఉన్న సిగ్గును కప్పేసుకో!!

వలపు వాంఛలు వదిలిపోనివి.
కలుగు కోర్కెలు కాలిపోనివి.
కొత్త సిగ్గుకు మొగ్గ తొడుగు.

మేని ఛాయ మాసిపోనిది.
మనసు గాయం మానిపోనిది.
పాత సిగ్గును తొక్కిపెట్టు.

సిగ్గు సిగ్గులో తప్పిపోతూ
లేని సిగ్గులో నెగ్గుకుంటూ
నవ్వు వస్త్రం కొనుక్కో !!
నిన్ను మాత్రం వెతుక్కో !!!

29/11/2013

కొ(చె)త్త సూక్తులు...రెక్కలు మొలుస్తున్నాయని ఇప్పుడే ఎగరద్దు.
ఉచ్చులు మ్యానుఫ్యాక్చరౌతున్నాయ్...
జాలీగా తిరిగేస్తూ హద్దులు దాటేయ్యాలనుకోవద్దు.
తిమ్మిరి కాళ్ళకు ఉక్కు చైన్లు బిగుస్తున్నాయ్...

చాకచక్యమంటే హద్దులు చెరిపి విరరించడం కాదు.
సరిహద్దుల లోయల్లో మైదానాలు మొలిపించడం.
గమ్యమంటే నెత్తిన బండరాళ్ళు మోయడం కాదు.
భావితరాలకు నీ గుండె రుచిని చూపించడం.

పుట్టినప్పుడే నిన్ను కన్నపేగొకటి వీడనంది.
దాన్నొదుల్చుకున్నాకే నువ్వూపిరి పీల్చడం మొదలెట్టావ్...
ఆ వీడ్కోలులో నీ ఏడుపు నవ్వులు పంచిందని గుర్తుంచుకో.
వారి చిరునవ్వుల్లో నువ్వే దాగున్నావని అర్థంచేసుకో.

ఆనందమనేది నీకు పర్మనెంట్ బానిసనుకున్నావా?
అసలది నీదెలా అవుంతుంది? డామిట్..
మనిషో ప్రకృతో ఎవరో ఒకరు అప్పిస్తేగానీ నీకది కలుగదు.
నీ వేదనను ఎవరికో ఒకరికి దానమిస్తే గానీ
సంతోషం నీ దాహాన్ని తీర్చదు. హాంఫట్..
అందుకే దేన్నీ ఆశించకు. అన్నిట్నీ ఆస్వాదించు.

చావో బ్రతుకో ఒక్క శ్వాస సావాసమే తేడా.
వెలుగో చీకటో ఒక్క రెప్ప కదలికే తేడా.
శూన్యమో సమస్తమో ఒక్క అణువు చలనమే తేడా.

ఉన్నది గెలుపూ మలుపే.
ఓటమనేదంతా ఒట్టి ట్రాష్..
మనకు గీయబడ్డ గమ్యనేదీ ఒక్కటే.
అలసిపోతే సమాధుల్లో పడుకోవడమంటాను. అదే భేష్.....

28/11/2013

ఘాట్ రోడ్డు నిర్మాతలు

గట్టు కోణం అంటే తీటా విలువ తెలియక
గుట్టుగా తప్పించుకునే ఇంజీనీర్లారా!
ఎన్ని లారీలు బోల్తాకొట్టాయో చూడండి.
ఎన్ని బస్సులు అదుపుతప్పాయో చూడండి.
ఎన్ని శవాలు సమాధులయ్యాయో చూడండి.

అపకేంద్రాభికేంద్ర బాలాలంటే
మాబలం రాజకీయమనే కాంట్రాక్టర్లారా!
ఎన్ని మలుపులు హద్దు మీరాయో చూడండి.
ఎన్ని అడ్డు గోడలు బద్దలయ్యాయో చూడండి.
ఎన్ని జీవులు నిశ్శబ్ధమయ్యాయో చూడండి.

ఊపిర్లొదిలిన ఆత్మలు నిద్రల్లో తరమకుంటే అడగండి.
క్షతగ్రాతుల వెర్రికేకలు చెవుల్లో మర్మోగకుంటే అడగండి.

అలానే చూస్తూ ఉండిపోండి.
మీరెప్పుడైనా అదే దార్లో కార్లో వస్తూ చూడండి.
మలుపు మలుపుకూ గుండె వేగం పెరక్కపోతే అడగండి.
చుట్టు చుట్టు కీ జుట్టూ నిగ్గపొడుచుకొకుంటే అడగండి.

మీ చిన్న కూతురు భయంతో మిమ్మల్ని వాటేసుకోకుంటే అడగండి.
నిజం తెలిస్తే నిందలేస్తూ మనసులోంచి మిమ్మల్ని గెంటేయకుంటే అడగండి.

అయినా సరే మీ గుండె అడుగంటి మసిబారిందని అనిపిస్తే
మనసు కడుక్కోకుండా ఆ యముడి పోటీగా
ఇక్కడే ఇంకో నరకాన్ని నిర్మించండి.
అందులోనూ నాసిరకపు శిక్షలే వేస్తూ
స్వర్గాన్ని సెకన్లచొప్పున అమ్మేసుకోండి.

27/11/2013


వెన్నెలంటే అంతే ...

అది అందని జాబిలి.
కనిపిస్తుంది. మురిపిస్తుంది.
మెరిసీ మెరిసీ మైమరపిస్తుంది.
రోజుకో భిన్న రూపంతో అందర్నీ అలరిస్తుంది.

నీతో పాటే అందరినీ చల్లగా చూస్తోందని అసూయ చెందకు.
నువ్వెకడికెళ్తున్నా నిన్నే చూస్తోందని సంతోషించు.

నీతో పాటే అందరూ కోరుకుంటున్నారని ఈర్ష చెందకు.
నీ కోసమే పున్నమి వెన్నలై దర్శనమిస్తుందని సంబరపడిపో.

మబ్బుల చాటు దాగి నిన్ను ఏడిపిస్తోందనుకోకు.
దాగుడుమూతలాడి నిన్ను కవ్విస్తుందనుకో.

అమావాస్యలో కనిపించదని ఆగ్రహించకు.
కనిపించకున్నా నిన్నే తలుస్తోందని గ్రహించు.

ఎంత వేచినా రాదనుకోకు.
వచ్చేదే నీకోసని భ్రమించు.
భ్రమలో భూగోళం చుట్టూ గంతులేస్తూ పరిభ్రమించు.

26/11/2013

ఎందుకీ ఆత్రుత ఓ విష్వక్సేనా?నాకు దేని గురించీ తెలియదు.
ఏవేవో శ్రుంగ ద్రోణులు ఇమిడిన గాలి తరంగాల్లో
అప్పుడప్పుడూ కొన్ని తీగలు అలా మెరుస్తాయి.

మెరుపో మానవాతీత మ్యాజిక్కో
నా మెదళ్లో ఒక్కసారిగా జిమ్నాస్టిక్ చేసినప్పుడు;
వింత భావాల అలజడి చలరేగుతుంది.
తెలియకుండానే గుండె కరుకైపోతుంది.

శూన్యం నుండి ఆకలి దప్పికలు
విస్పోటనం నుంచి శాంతి సమూహాలు
గాల్లో ఈకలు తేలినట్లు  
కలంలో ఇంకు అలా ప్రవహిస్తూనే ఉంటుంది.

విశాల విశ్వంలో దాగిన మర్మాలను
నిర్విరామంగా శోధిస్తూ.. ఏవేవో సాధిస్తూ..
అనంత గరళ గొంతుకల్ని
అమాయకపు సరళ ఘోషల్ని
రొమ్ము విరుస్తూ.. రెప్ప కదుల్చుతూ..
విష్వక్సేనుడొకడు ఉన్నట్లుండీ ఒళ్లోకోస్తాడు.

ఏవేవో ఎడతెరిపిలేకుండా లిఖిస్తూ..
బ్రహ్మాండాన్నే చుక్క సిరాలో బంధిస్తూ..
అలా వచ్చి వెళ్ళిపోతాడు.
తర్వాత అంతా శూన్యమే!

ఇప్పుడు నాకేం తెలియదు.
కొద్దో గొప్పో రుచి గల ముద్ద పప్పుని.
అసలు నేనొక మట్టి ముద్దని.

అందుకే నాకంత ఆత్రుత.
ఎప్పుడెప్పుడు ఫ్రేం లోంచి బయట పడదామని.
అసలు నాలో ఏం జరుగుతోందో తెలుసుకుందామని.

25/11/2013


  
    

     కొట్టుపోవడమే...

సహజంగానే అప్పుడెవరూ లేరు
నిజంగానే నే పుట్టకముందెవ్వరూ లేరు

నిశీధితో సాహసం చేసిన అదృశ్యం తప్ప
శూన్యంతో సావాసం చేసిన నిశ్శబ్ధం తప్ప

విశ్వమంతా నిశ్చలత్వమే
ప్రపంచమంతా అంధత్వమే
సమస్తమంతా ఏదో ఒక తత్వమే

ఏ జన్మలో ఏ అమ్మ దాచిపెట్టిన పురుటినొప్పులో
పుట్టగానే చెమ్మగిల్లిన కళ్ళు ఏడ్చేస్తాయ్

శిలల్లో ఉప్పొంగే అలల ఆటుపోట్లు
అలల్లో తప్పిపోయే కలల కునికిపాట్లు
కలల్లో తెప్పదాటే కళల పనిమూట్లు

ఏ మేఘం పొట్ట పగిలితే రాలిపడ్డాయో
ఏ వైభవం మట్టికరిస్తే తూలిపడ్డాయో
అసలివన్నీ ఎలా కింద పడ్డాయో!!

కళ్ళు తెరిచీ తెరవంగానే హత్తుకున్న ప్రకృతి
ఊహ తెలిసీ తెలవంగానే అద్దుకున్న సంస్కృతి

ఏది బంధమో బానిసత్వమో తేల్చే సత్యాలెక్కడ?
ఏది బాధో బహుమానమో కొల్చే కొలమానమెక్కడ?

విధి విధిల్చే వేదనలో విశ్వాసాన్నెత్తుకుని
కాలం కాల్చే సహనంలో సంతోషాన్నెతుక్కున్ని

అతక్కుండా ఆగకుండా
కొట్టుకుపోవడమే నా పుట్టుక ప్రయాణం

24/11/2013


గాధా సప్తశతి ..

ి

గాధా సప్తశతి గ్రంధ ప్రతి కవితలో
కొలువైన అనంత ప్రేమ నీదీ నాదే

అభిజ్ఞానులైనా అజ్ఞాతలైనా అందరూ
అలరించిన అమోఘ భావాలు నీవీ నావే

పురుషుల కన్నా స్త్రీలే మిక్కిలి ధారబోసిన
ఊసుల రాశుల్లో రెక్కలు తొడిగింది నువ్వూ నేనే

సరదా సరసంలోనూ వీర విహారంలోనూ
ఏ శయ్య కదిపినా ఏ వనం నవ్వినా నువ్వూ నేనే

ఎడబాటైనా ఎద పాట్లైన దొర్లిన అక్షరక్షరాల్లో
నిండుగా నిక్షిప్తమైన వేదనంతా నీదీ నాదే

ఏడు జన్మలూ ఏడధ్యాయాలుగా కూర్చబడితే
ప్రతి అధ్యానికోవందేళ్ళు వైద్యం చేసింది నువ్వూ నేనే

ఇద్దరం కల్పితమే అయినా ఎవ్వరికీ కనరాక కచేరీ చేసే
కాల్పనిక వింత పుస్తకమే మన ఈ గధా సప్తశతి.

23/11/2013

( గాధా సప్తశతి 700 కవితలు కలిగిన ఒక ప్రచీన కవితా సంపుటి. ఇందులో అధ్యాయానికి 100 కవితల చొప్పున 7 అధ్యాయాలు ఉన్నాయి. 270 పైచిలుకు కవులు రాసిన కవిత సమాహారం ఇది. ఇందులో సగం మంది అజ్ఞాతలు. ఎక్కువ కవితలు స్త్రీలే రాశారు. కవితల్లో ఎక్కువ పాళ్ళు ప్రేమ, స్రీ పురుషుల మధ్య గల సంబంధాల చుట్టూనే తిరుగుతాయి.
)

తాగు తాగు

బలిపశువుల మెడలు వంచి
బానిసలను బెదిరించి
పితికిన ఎర్ర నెత్తురది.
తాగు తాగు.

రాక్షసత్వ దర్పంతో
కపట బుద్ధి సర్పంతో
కళ్ళాపి చల్లిన నెత్తురది.
తాగు తాగు

త్యాగాలను తప్పుపట్టి
మోహాన్నే చేతబట్టి
చప్పరించిన నెత్తురది.
తాగు తాగు.

దీనుల శ్రమ దోపిడీతో
దరిద్రుల కొన ఊపిరితో
మండిన నెత్తురది.
తాగు తాగు.

స్వేదంతో కండ తడిపి
వేదనతో గుండె నలిపి
పిండిన నెత్తురది.
తాగు తాగు.

కార్మికుడి కూడు దోచి
కర్షకుడి కడుపు చీల్చి
చిందిన రక్తమది.
తాగు తాగు.

యోధుడి పోరాటాన్ని
నిస్సహాయుడి కంఠాన్ని
తడిపిన రక్తమది.
తాగు తాగు.

22/11/2013

కొత్త కావ్యం...

అందమైన జీవిత కావ్యాన్ని ఆహ్లాదంగా మలచాలని కలం పడితే
తడబడిన వేదన సిరా ఆవేశంతో ఉప్పొంగి అక్షరాలనే ముంచేసింది.

ఊహలన్నింటినీ రంగరించి కాగితాలకు కొత్త రంగులను అద్దబోతే
అందినట్టే అందిన హరివిల్లు కాస్తా చిటికెలోనే మాయమైంది.

ఆలోచనలను ఆనందాక్షరాలుగా ప్రతి పుటలోనూ అమర్చబోతే
అనుకోని అనుభవాల జడివాన బాధతో పుస్తకాన్నే తడిపేసింది.

అపురూపమైన ఎద భావాలను మది మూలల్లో మధించబోతే
కనిపించని ఆవేదనంతా భారంగా ప్రతి కాగితాన్నీ నలిపేసింది.

కొట్టివేతలు లేని వాక్యాన్నొక్కటైనా నిర్మిద్దామని ఆశగా ప్రయత్నిస్తే
తూట్లు పడ్డ గుండె జ్ఞాపకాల సమాధుల్లోంచి బయటకు రానంది.

చివరి పుటనైనా సంతోషంతో ముగిద్దామని పదాలను వెదకబోతే
రాని నవ్వులను తెప్పించడాని మనసు జోకరు వేషం వేయనన్నది.

21/11/2013

నాకేమాత్రం అభ్యంతరం లేదు. నరికేయ్.గొడ్డలి వేటు పడగానే చెట్లూ బిగ్గరగా అరుస్తాయ్..
మనకు మాత్రం వినపడవ్!
గొడ్డలి జరిపాక మనసుతో చూస్తే కనపడతాయ్..
అరుస్తూ రోదించే నోర్లెన్నో!

వాటి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో!
వినలేక విహంగాలన్నీ దానిపైనుండి ఎగిరిపోతాయ్.

వాటి సంతోషం ఎంత ఆర్ద్రంగా వీడుతుందో!
దెబ్బ దెబ్బకీ బెరడు ముక్కలు రాలి వీడ్కోలు పలుకుతాయ్.

వాటి కన్నీరు ఎంత గాఢంగా స్రవించబడతాయో!
ఏడ్చీ ఏడ్చీ జిగురుతో గాయల్ని కప్పెట్టేసుకుంటాయ్.

జే.సి. బోస్ రాసిన బుక్కులు చదవక్కర్లేదు.
చిన్నప్పటి సైన్సు పుస్తకాలూ తిరగేయనక్కర్లేదు.
ఒక్కసారి నిన్ను నువ్వే గిల్లుకుని అద్దంలో చూసుకో.

ఇంకా నరకాలనిపిస్తోందా?
అయితే నిర్మొహమాటంగా నరికేయ్.

అమ్మొక్కసారే నీకూపిరి పోసీ జన్మనిచ్చింది.
మరి ఇన్ని రోజులూ నీకెవరు ఊపిరి పోస్తున్నారో
రెండే రెండు నిమిషాలు ఆలోచించి
తర్వాత మొత్తంగా నరికేయ్.

నాకేమాత్రం అభ్యంతరం లేదు. నరికేయ్.

20/11/2013

తామరాకు - నీటి బొట్టు

వెన్నెలతో రేయంతా జాగారం చేసిన చిరుగాలొకటి
వేకువనే చల్లని మంచు బిందువునొకటి ప్రసవించింది.

అది తమకంతో కొలనులోని తామరాకును మెత్తగా హత్తుకుంది.
తామర ప్రాకృతిక జారుడు స్వభావం మాత్రం ఊరుకుంటుందా?
బొట్టును వెలుపలికి వొలికిపోనిస్తుందా?
అలా అని లోనికి అక్కున చేర్చుకుంటుందా?
తన పరిధిలో గింగిరాలు తిరిగేట్టు చేయడం తప్ప.

నిలుస్తుందా ఆ నీటి బొట్టు?
ఏ ఉదయ భానుడు నవ్వితే ఆవిరౌతుందో !
ఏ వెచ్చని చిరుగాలి కదిపితే ఎగిరిపోతుందో !
ఏ చేపపిల్ల మొప్పతో పొడిస్తే నీట జారుతుందో !

ఆకు చిద్రం అవ్వడమో;
బిందువు విచ్చిన్నమవ్వడమో...
ఎప్పుడు తెగిపోతుందో ఈ విచిత్ర బంధం.

ఓ ప్రకృతీ పరీక్షించు.
మరోమారు నీ మాయా చాతూర్యంతో.
ఓ విధీ ప్రదర్శించు.
మునుపెన్నడూ వాడనీ నీ మంత్ర విద్యల్ని.

19/11/2013సమాధుల్లో సమాధానాలా?

ఎప్పుడు చచ్చామో! నువ్వూ నేనూ.
ఇలా పక్క పక్క సమాధుల్లో
ఇద్దరం పలకరించుకుంటున్నాం.
చచ్చావా? చంపారా?
ఆక్సిడెంట్లోనా? ఆయుష్షు తీరా?
పాము కరిచా? పక్కింటోడరిచా?
హత్యా? ఆత్మ హత్యా?

***

ఎంత కులాసాగా అడుగుతున్నావ్?
కుమిలి కుమిలి చచ్చాను తెలుసా?
నా సంతోషాన్ని ఎందరో హరించిన
క్షణాల్ని ఎన్ని ఉదహరించమంటావ్?

సరే చెప్పేస్తున్నా..

ఒక్క తొందరపాటుతో చచ్చా.
ఒక్క నిమిషం ఓపిక నశించి చచ్చా.
ఒక్క రూపాయ్కి కక్కుర్తిపడి చచ్చా.

క్షణికానందం కోసం
లక్షణమైన జీవితాన్ని తాకట్టుపెట్టి మరీ చచ్చా.

* * *

అన్నో ! ఒట్టు నువ్వు పోయెట్టువే.
అందుకే అందరూ నిన్ను ' పోయేట్టు ' చేశారు.
పెసరట్టులా రుచిగా చెప్పినా; నాకు ఆంలెట్టే ఆనుద్ది !!
నీ తాకట్టుల గోల కట్టిపెట్టి, అసలు విషయం చెప్పన్నో !

* * *

ఇంకేం చెప్పను బ్రదర్? నాకెచ్చైవీ...

18/11/2013

Related Posts Plugin for WordPress, Blogger...