ప్రియా అందుకో ప్రేమలేఖ

 


మన ప్రేమ గురించి ఒక ఖండకావ్యం రాయాలని కలాన్ని  కదిలించా, 

కానీ ఖాండవ వన దహనం గుర్తొచ్చి ఆగిపోయా...


ప్రభంధం రాయాలని పెన్ను పట్టి కూర్చున్నా, 

కానీ హిమాలయాల్లో ప్రవరుడి ఆపసోపాలు గుర్తొచ్చి గమ్మున ఉండిపోయా....


గల్పికలా మన కథని  గమ్మత్తుగా రాయాలని కాగితాలు తీసుకున్నా, 

కానీ గురజాడవారి అడుగుజాడ అంటావాని వద్దనుకున్నా...


దీర్ఘకవిత రాయాలని మన దైనందిన సంభాషణల్ని నెమరువేశా, 

కానీ సినారె అంత సీన్ లేదని అక్షరబద్ధంచేసే  ధైర్యం చేయలేకపోయా...


నవలగా మన ప్రేమకథని రాయాలని ఉర్విళ్ళూరా, 

కానీ ప్రేమకథలకు సరైన సుఖంతం ఉండదని బాధతో ఆ ఊసే మర్చిపోయా...


అందుకే ఏమీ చేయలేక, 

ఆన్లైన్లో అయితే లవ్లీగా ఉంటుందని ఇలా రాస్తున్నా....


తిట్టుకోవు కదూ....

ప్రేయసీ....

 

ప్రేమ అంతిమ లక్ష్యం విషాదమే అని తెలిసి ఎందుకు ప్రేమించాను?

అది అమృతాన్ని చిలికి విషాన్ని మింగిస్తుందని తెలిసి ఎందుకు ప్రేమించబడ్డాను?

కూడికలు, తీసివేతల లెక్కల్లో

సమాధానాలు, సంజాయిషీల సూక్ష్మీకరణల్లో

అంచనాలు, అభియోగాల హెచ్చింపుల్లో

ఎక్కడ పోగొట్టుకున్నానో తెలియని హృదయాన్ని

వెదుక్కునే అవకాశం ఎక్కడ? 

ప్రేమంటే అర్థాన్ని, 

ప్రేమలోని వ్యర్థాన్ని 

ఆరాధనలోని అపార్థాల్ని , 

ఎడబాటు పలికే శాపనార్థాల్ని

సమయం తీసుకోనైనా

సగర్వంగా సమర్పించుకో....

నేనెక్కడికి పోతాను??? 

నీకోసమే కదా వెంపర్లాడుతుంటాను.....

ప్రేమ పైత్యం!


నేను

అల్పుడిని అయినా

నీ ప్రేమలో అధికుడిని అయ్యాను.


బలహీనుడిని అయినా

నీ మాటలతో బలవంతుడిని అయ్యాను.


మొరటోడిని అయినా

నీ స్పర్శతో మన్మధుడిని అయ్యాను.


అజ్ఞానిని అయినా

నీ తలపులలో కాలజ్ఞానిని అయ్యాను.


కానీ,

ముసలోడిని అయినా 

యవ్వనస్థుడిని కాలేకపోయాను.


ప్రియా....ఏమిటీ వైపరీత్యం??

కొంపదీసి ఇది నా పైత్యం అంటావా???


😀😀😀😀😀😀😀😀😀😀😀😀

నేనొక రాక్షసుడిని!

 

ఒక్క అరుపు నాకోసమని కర్ణభేరిని తాకితే
ఒక్క తలపు తరంగమై మనసును మీటితే
కంట్లో కునుకు దూరిందని
ఒంట్లో వణుకు చేరిందని
చాచిన రెండు చేతుల్నీ దోసిలిగ మార్చి
మొహాన చిరునవ్వును చితిగా పేర్చి
వీడ్కోలు పలికాను.
అలసిపోకుండా రాక్షసుడిలా మారి
కన్నీటి సుడిగుండాలను సృష్టించాను.

ప్రేమ చిందించని నా హృదయాన్ని
పదిలంగా అస్తికల గూడులో దాచేసి
ఆప్యాయతెరుగని నా రుధిరాన్ని
దమని సిరల్లో పరుగులెత్తించి
మైల పడ్డ నా నల్లటి మనసుని
తెల్ల పావురాల నెత్తుటితో అభిషేకించి
విశ్వ శాంతి మంత్రం జపించాను.
వినోదానికి పునాదినని,
నన్ను నేనే ఒక వజ్రమని చెప్పుకున్నాను.

ఈ వజ్రం పైమెరుతో అందర్నీ దోచుకోగలదేమో!
లోని మనో కాఠిన్యం ఇంకో మనసునే కోయగలదు !!

అందుకే
నా సంకెళ్ళ నుండి జాగ్రత్తగా తప్పించుకోండి!
నా ఎద సవ్వళ్ళు వినక తొందరగా పారిపోండి !!


Related Posts Plugin for WordPress, Blogger...