నిశ్చలమే!



నువ్వెళ్తుంటావ్...నిర్విరామంగా...
యేదో పనిలో తలమునకలై
గుమ్మం.. వీధి.. నగరం..
ప్రపంచపుటంచులు దాటేస్తూ....

పాదానికీ పాదానికీ మధ్య
అడుగుల వ్యత్యాసంలో తడబాట్లను
చూసే తీరికలేకో?!
మనసుకీ మెడడుకీ మధ్య
ఏర్పడ్డ శూన్యాన్ని పరిపక్వతతో
పూడ్చే ఓపికలేకో?!
అసహజత్వాన్ని మోస్తూ...
నీ సహజత్వాన్ని కోల్పోతుంటావ్....

ఎటో...యే యుగాలు తవ్విన గోతుల్లొనో
యే చరిత్రలు ఆక్రమించిన కాగితాల్లోనో
నీ మనో నిధిని వెచ్చిస్తూ
వెలికితీయబడని గుప్తనిధిగా మారిపోతావ్...

అస్పష్ట సూత్రం!



స్వచ్ఛమైన మనస్సు నగ్నత్వాన్ని కప్పడానికి
నోటిమాటల రాట్నంలో ఎన్ని వస్త్రాల్ని వడకాలో
ఉత్తేజిత ఎద స్ఖలించిన కోర్కెల్ని అణచడానికి
హావభావాల్లో ఎంత సంపీడ్యతను మోయాలో
నాకిప్పటికీ అర్థంకాదు!

మర్మశిఖరాన్ని మోస్తున్న నిష్కపట శరీరం
అర్థంలేని ఆవేశంలో అగ్నిపర్వతాన్నో
అంతులేని ఆనందంలో మంచుపర్వతాన్నో
వొక అప్రతిపాదిత మనోచలనసూత్రం ప్రకారం
అకస్మాత్తుగా దేన్నేప్పుడు విసర్జిస్తుందో
నాకిప్పటికీ అర్థంకాదు!

పరిష్కరించలేని అనేకానేక జీవిత ప్రశ్నల్లో  
యే సందర్భాన్ని ఎప్పుడు సూక్ష్మీకరించాలో
యే ఆలోచనాచలరాశిని ఎప్పుడు ప్రతిక్షేపించాలో
భిన్న వ్యక్తిత్వాల లెక్కల్లో కనుగొనే సాధనేదో   

నాకసలేప్పటికీ అర్థంకాదు!
Related Posts Plugin for WordPress, Blogger...