మట్టి చేతులు


ఒకడు నీ రక్తాన్ని తాగి
స్వేదంతో స్నానం చేసుకుంటాడు ...
మరొకడు నీ రెక్కల్ని వాడుకొని
వాడి డొక్క నింపుకుంటాడు...
ఇంకొకడేమో నీ కండల్ని కరిగించి
కనకపు కుర్చీలో కూర్చుంటాడు...
అనేకమంది
నీ అమాయకత్వాన్నో
నీ శ్రమించే వ్యక్తిత్వాన్నో
అలుసుగా చేసుకొని
నలుసులా నిన్ను నలిపేసారు....
ఎందరో
నీ మట్టి చేతులను తొక్కిపెట్టాక
నీ మెత్తని కుత్తుకఫై కత్తిపెట్టాక
ఆఖర్లో నిస్సాహాయతతో ఏడుస్తావెందుకు?
ప్రశ్నించడం చేతగాక చచ్చిపోతావెందుకు?
వొక విరగకాసిన తెంపరితనంతో
బాధల బందీఖనాలో బానిసత్వాన్నితెంపుకొని
ఒక్కసారి చచ్చిపోకుండా....
పోరాడుతూ ప్రతిరోజూ బ్రతుకవోయ్...బ్రతుకు...
జీవులకు తిండిగింజలు పెట్టే పచ్చని మొక్కలా  
కోట్ల కర్షకులకు ఆదర్శంగా
మా స్వార్థం కోసమైనా
ఇంకొన్నేళ్ళు బ్రతకవోయ్ భగవద్స్వరూపుడా!!!



తను...!!


మంచు బిందువుల్ని తొడుక్కుని 
చలిని ఆస్వాదించే చెట్టుకోమ్మల్లా 
తడి ఆరని హృదయంతో 
చెలి తెచ్చే వసంతమ్ కోసం
నేను ఎప్పటికీ ఎదురు చూస్తూంటాను...
తన భరోసానిచ్చే పిలుపు
భారాన్ని తొలగించే తొలకరిజల్లై
నిలువెల్లా ఎప్పుడూ తడుపుతూనే ఉంటుంది...
పీల్చే గాలిలో గంధమై
తాగే నీరులో మకరందమై
స్పృశించే వస్తువులో అందమై
తనెప్పటికీ నాతోనే సహచరిస్తుంటుంది...
ఆమె కోసమే పదేపదే వినిపిస్తున్న
నా హృదయ సరాగం
ఆమె నిరీక్షణలో
ఇప్పటికీ విలపిస్తూనే ఉంది...

ఐడెంటిటి...

కులమతాల కవాతు ధ్వానాల్లో 
ధ్వంసమైన ఓ సందేహ దేహమా!
పుట్టుకతో వొక ఐడెంటిటీని ముద్రించబడ్డ 
జుగుప్సాకర క్రోమోజోమువి నువ్వు....
గతం విత్తు తాలూకులక్షణాలను
బలవంతంగా జొప్పించే
వొక విద్రోహ సమాజం ఆడే
క్రూరత్వపు యుద్ధతంత్రంలో
బలిపశువైన రక్తపు ముద్దవి నువ్వు....
పొరబాటున నువ్వు రాజకీయంలో వొక వోటువో
మతవిశ్వాసాల్లో వొక భక్తుడవొ మాత్రం కాకపోతే
దేశద్రోహశంకతో నీ చేతులకు ఇనుప సంకెళ్ళే!!!

ఒక చిన్ని చరిత్ర


గుహల్లో మనుషులూ
రాళ్ళ రాఫిడికి నిప్పురవ్వలు
కొత్తయుగంలో పరుగెత్తిన చక్రాలు
సింధూ పరివాహక సంస్కృతులు
సర్పలిపి ఆకృతులు
వేదకాలపు కొత్త దేవుళ్ళు
అడ్రస్సులు తెలియని ఆర్యులు
అస్తిత్వానికి యజ్ఞయాగాలు
విఛ్ఛలవిడి బలిదానాలు
సత్యాహింసల బౌద్ధజైనాలు
హర్యాంక గాంధార సింధ్ సేత్రపీలు
మగధ శిశునాగ నందులు
అలెగ్జాండర్-పోరస్ సెల్యుకస్- చంద్రగుప్తులు
కళింగలో అశోకుడు కళ్ళజూసిన రక్తాలు
శుంగ కణ్వ శాతవాహనులు
కనిష్క శాతకర్ణ గుప్తులు
పల్లవ చాళుక్య రాష్ట్రకూటులు
అద్వైత శంకరాచార్యులు
ఖజురహో ఛండేలులు
వరంగల్లు కాకతీయులు
ఘజినీ ఘోరీ చొరబాట్లు
ఖిల్జీ సుల్తాన్ బహ్మనీలు
విజయనగర హరిహర బుక్కరాయలు
తెలుగు లెస్స కృష్ణదేవరాయలు
రాజపుత్ర మొగలాయి పీష్వాలు
విదేశీ దురాక్రమణలు
పాగా వేసిన ఆంగ్లెయులు
మతసంస్కరణొద్యమాలు
ఆవుకొవ్వు తూటాలు
రాజ్య సంక్రమణ సిద్ధంతాలు
సిపాయిల తిరుగుబాటు విప్లవాలు
భీబత్సమైన దళిత తిరుగుబాటు ఉద్యమాలు
కాంగ్రేస్ పుట్టుక వెనుక జుగుప్సాకర పరీస్తితులు
మితవాద అతివాద దశలు
బెంగాల్ విభజన వందేమాతరోద్యమాలు
మింటో మార్లే చేంమ్స్ ఫర్డ్ ద్వంద చట్టాలు
హోం రూల్ ఖిలాఫత్ సైమన్ కమీషన్లు
సహాయనిరాకరణ దండియాత్రలు
తిలక్ బోస్ గాంధీ అంబేద్కర్లు
ముస్లీం లీగ్ కుట్రలు
క్విట్టిండియా అణచివేతలు
బెంగాల్లో కరువులు
మౌంట్ బాటన్ పాచికలు
విభజనలో పారిన రక్తాలు
రక్తాన్ని కప్పి భారత జెండా రెపరెపలు

అర్రే...


పుర్రెలో పుట్టిన భావాలను
వెర్రి మనసు గ్రహించడంలేదని
వర్రీ అవకు నేస్తం....
కర్రి కోసం కొట్టుకునే
గొర్రె మొహాలు వెక్కిరిస్తున్నాయని
హర్రీ బర్రీగా డెసిషన్లంటూ
బుర్ర చించుకోకు మిత్రం....
బర్రెల్లా ఎదిగిన
దొర్రిపళ్ళ మెధావుల నాల్కల్లో
మర్రి విత్తంటి వాళ్ళ మస్తిష్కాల్లో
చెర్రీ, బ్లాక్ బెర్రీల భావాత్మక రుచులు ఇమడలేవు సత్యం...
అర్రే!.. నీ భావాలకు
కొర్రీలు వేయడమే ఈ లోకం పని రా భాయ్...

ఉత్కమణo!



వెలుగుల్ని నిషేధిస్తూ
నిశీధిని ఆహ్వానిస్తూ
ఎక్కడో చరమాద్రిన అస్తమించే ఎర్రటి సూరీడు
ప్రపంచాన్ని పగలంతా వెలిగించాడు కానీ
మూడత్వంతో కుచించుకుపోతున్న
ఒక్క చీకటి హృదయాన్నైనా వెలిగించలేక
దివి భువితో కలిసే పెవీలియన్లో కనుమరుగైపోతున్నాడు పాపం....

టన్నుల ఉక్కు కవచాల్లో భద్రంగా దాచుకొన్న
జుగుప్సాకర మెటీరియలిస్టిక్ భావాలు
మనిషితనాన్ని వేల పాథంలోతుల్లో నేట్టేస్తున్నపుడు  
ఆ మనస్తత్వాల్లో భానుడి వెలుగులు ప్రసరించడానికి
ఎన్ని కోట్ల కాంతిసంవత్సరాలు పడుతుందో...

ఉత్కృష్టపు గారడీల సెప్టిక్ ట్యాంక్ జీవితాల్లో
త్రవ్వినకొద్దీ వూరే దుర్ఘంధపు గరళాలనూ...
నికృష్టపు ఆరాటాల స్వార్థ హృదయాల్లో
క్వింటాళ్ళకొద్దీ బయటపడే కుటిలత్వాలనూ...
సమూలంగా పెకలించడానికి
ఒక్క రోజుకి ఎన్ని గెలాక్టిక్ ఉదయాలు అవసరమో!?  

Related Posts Plugin for WordPress, Blogger...