ఇప్పుడే మేల్కొనలేదా?


ఎదురైన ప్రతి అనుభవం

నా అజ్ఞానాన్ని దూరం చేయ ప్రయత్నం చేయలేదా?

విజ్ఞానాకాశాన్ని కళ్ళజూసిన నా ప్రతి చూపు

అజ్ఞానపు జాడల్ని మరువలేదా?

తీరా వెలుతురెదురయ్యేసరికి

నా నీడే నను నిలువునా దాహించాలేదా?

అంతలోనే అల్లుకున్న ఖరీదైన కిరాణా స్నేహాలు

ఆమడ దూరంలో నను నెట్టేసి

హమ్మయ్య అన్న నిట్టూర్పులొదలలేదా?

మోసపోయిన నా మనసు

మౌనంగా ఓ క్షణం మేల్కొనలేదా?

విజ్ఞానహంకారం నా సంస్కారాన్ని

విషతుల్యం చేసిందని గ్రహించిన ఓ క్షణం

నా మనసు మేల్కొనలేదా?

అంతరాంతరాల్లో దాగిన అహాన్ని

తరిమితరిమి కొట్టిన ఆ క్షణాన

నా మనసు మేల్కొనలేదా?

చెదిరిన చిరునవ్వులు

నా పెదాలకు పరిచయమైన ఆ క్షణాన

నా మనసు మేల్కొనలేదా?

అప్పుడే పుట్టిన పసిపాప తొలి చూపులా 
నా మనసు ఇప్పుడే మేల్కొనలేదా?



ఒక్క గుద్దుతో చీల్చనీ...



సలసల కాగే రక్తం మరగనీ..
జివ్వున సాగే నరాలు పొంగనీ..
తొణికే మాటలు మంటలు అవనీ..
అణిగిన శాంతం కోపం కానీ..
వేసే అడుగులు పరుగులు తీయని..
దవడలు కటకట శబ్దం చేయనీ..
సత్తువ నిండిన కండలు బిగవనీ..
బిగిసిన కండలు రాతి బండలై;
పాపం నిండిన మొండి కొండను,
ఒక్క గుద్దుతో చీల్చనీ...

ఘర్షణనొందని నిశ్చలౌల్కలం తిర్యగ్వలయం చేసింది...



ఘర్షణనొందని నిశ్చలౌల్కలం

తిర్యగ్వలయం చేసింది...

ఒత్తిడికోగ్గిన పుత్తడి పుడమి

ఆత్మభ్రమణం మార్చింది...

బాహ్య బలానికి సంకోచించి

దీర్ఘవృత్తమై తిరిగింది...

శూన్యదర్పణం ప్రసరించింది

పరవర్తనపు కాంతిసంవత్సరం...

జడత్వ జాడలు మరచిన భూమి

త్వరణంతో చలియించింది...

కాంతి భ్రాంతియై  వ్యాకోచించే...

కాలం కొలిమిన ఉష్ణం మండే...

అయస్కాంతపు దిగ్దర్శిని

ద్రువాలు మార్చే ఘనీభవించి...

తోక చుక్కలు వేడి ముక్కలై

ప్రయోగించే నిస్తంత్రి దైర్ఘ్యతరంగాల్...

విద్యుదయస్కాంతశక్తులేకమై సృష్టి వృష్టియై ....

దుప్పటి జారి, రెప్పలు తెరచిన;

వృక్షధూపం సాక్షాత్కరించే అమ్మ చేతిలో హారతియై...

వేకువ కలల్ని కాలరాస్తూ ...

తెలుగు మాధ్యమపు సామాన్యశాస్త్ర పాఠాల్ని గుర్తు చేస్తూ...

పదాలపై పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ...   

     

అద్దం ముక్కలు చేశాయా?





మోసం ద్రోహం దాగాయా
ప్రేమ స్నేహం ముసుగుల్లో?
నమ్మిన మనసును ముంచాయా?
అద్దం ముక్కలు చేశాయా?
లోపలి బాధను చెప్పుకురా!
జిగురును చేస్తా గాడంగా!
పగిలిన ముక్కలు తీసుకురా!
అతికించేస్తా అతిత్వరగా!
మౌనం వీడి దుఃఖం వీడి
కన్నులు నిండిన నీటిని తోడెయ్!
కష్టం వీడి నష్టం వీడి
తన్నుకు వచ్చిన కోపాన్నోదిలేయ్!
హృదయం బార్లా తెరిచేసేయ్!
గరుడపురాణం ముద్రిస్తా.
కొడవలి కత్తులు లేనే లేని
అంబులపొదినొకటమరుస్తా.
బుద్ధిని శుద్ధి చేసేస్తా.
సమయస్పూర్తిని నేర్పిస్తా.
సాహస గాధలు నింపేస్తా.
మస్తిష్కాన్నే మార్చేస్తా.
పగిలిన ముక్కలు తీసుకురా!
అతికించేస్తా అతిత్వరగా!


Related Posts Plugin for WordPress, Blogger...