కవయుత్రితో ఓ రాత్రి..!


యుగాలనాటి శూన్యం బద్దలైనవేళ
నిశ్శబ్ధంలోంచి నిష్పాదించబడ్డ ఆమె
నిష్కల్మశత్వంతో నన్నాహ్వానించింది

ఆమె స్వచ్ఛమైన నవ్వులవెలుగు
పున్నమి వెన్నెల పరచిన దారిలా
నా యద పరదాలను తొలిచింది

ఒక్క నిమిషం అంతా ప్రశాంతత
నా చుట్టూ ఊహాతీత వ్యాకులత
కర్ణభేరి భరించలేని పూర్ణ నిశ్శబ్ధత

ఆత్రుత వొకవైపు
ఆశ్చర్యం వొకవైపు
ఆహ్వానంతో పులకించిన
అనిశ్చల హృదయానందం మరోవైపు
ఆమె ఆత్మీయత మాత్రం అన్నివైపులూ

ఐతిహాసిక పర్వమో
ఔన్నత్వపు గర్వమో
తెలియని మలుపేదో
ఇరువురి మధ్య వారధై నిలిచింది

అందుకేనేమో
కాలదోషం పట్టని కలయిక మాది
కలం కలిపిన కవితాబంధం మాది
కల్పనలకందని కమ్మని కథ మాది

ప్రేతా(మా)త్మ


అశ్రువులు రాలేవేళ
ఆయుష్షు తీరేవేళ
అస్తికలు కలిసేవేళ
ఆత్మగా మారినవేళ
సర్వం నేనై
నేనే సర్వాన్ని
స్వర్గమో నరకమో
శూన్యపు అంచుల్లో  
నిశ్శభ్దంగా నీవద్దకు సమీపించి
నిదరోతున్న ప్రణయవీణను మీటుతాను!
ప్రాణమున్నప్పుడు
పరిహసించబడ్డ నా ప్రేమభావాన్ని
అప్పుడు మనం ప్రకృతిలో ఐక్యమయ్యాక
మాసిపోని నీ మనస్సాక్షి ఎదుట
బహిర్గతపరుస్తాను....
అప్పుడైనా నా ప్రేమను గుర్తించు!

నన్ను నీతోనే ఉండనివ్వు!!

ఉన్మత్తవేదం!! ఉన్మత్త నృత్యంచేసే హృదయాన్ని
అదుపుచేసే బాధ్యతలు చేపట్టి
మానసిక వైవిధ్యానికి నిలువలేక
అలిసిపోయిన తార్కికవాదాలెన్నో...

నిశ్శబ్ధం నిండిన జీవిత గోడల్లో
మైలుపడ్డ మనసుల్ని మోస్తూ
నిస్సత్తువతో ప్రతిధ్వనిస్తున్న
సంశయాత్మక ఆలోచనాత్మలెన్నో....

ప్రతి మనసుస్పందనకీ ఒక భాష్యం
ప్రతి ఆలోచన వెనుక ఒక స్వార్థం
ప్రతి ఆత్మ అంతరాల్లో ఒక నైరాశ్యం
ప్రతి అనుభవసారానికి ఒక వైరాగ్యం

అంతుచిక్కని ఈ జీవన గమనంలో
అంతమైపోవడమే ఆఖరి గమ్యం!!
Related Posts Plugin for WordPress, Blogger...