గాయం
నిర్మానుషమైన
నా జీవితానంతంతో
గుండెపగిలిన దాఖలాలు
ఏంటని తొంగిచూస్తే...
నువ్వు ముక్కలు చేసిన
నా మనోశకలాల
కన్నీటి సుడుల్లో
అవి తారసపడుతున్నాయి!
నయనాశృవులు కానరాలేదని
పైకి కానరాని
మనసు కన్నీరుని
ముసలి కన్నీరుగా లెక్కగట్టిన
నీ మానసిక జాడ్యానికి
చెరిగిపోని గుర్తుగా
ముక్కలైన నా హృదయానికి
కుట్లు వేసి
కొత్తరకం అల్లికని
ఒక పేరు పెట్టబోతే
వేసిన కుట్లని లాగేసి
పచ్చి గాయంతో చచ్చిపొమ్మన్నావు.

గెలవలేక...ఆకర్శణాక్షణాలను అపురూపంగా లెక్కించి
ఆనందమంటూ తనువంతా తాకట్టుపెట్టి
అక్కరకు రాని అరవిరిసిన అందం కోసం
అనవసర తాపత్రయం అదిమిపెట్టగలనా

ప్రేమ రుచిలేదని ప్రాయాన్ని పణంగాపెట్టి
పరువాలను సెలయేటి ధారలతో చుట్టి
పనికిరాని పిరికి దేహానికి పవిత్రతంటూ
పసుపురాసి గంధతో పరిమళింపజేయనా

వాడిపోనిది వలపని ఆప్యాయతనాశపెట్టి
వేడి వయసుకు తీపి కలల గంతలు కట్టి
వాంచల వలని చేదించి ఇదే స్వేచ్చంటూ
వెర్రిమనసుకుకిదోవ్యాదని మభ్యపెట్టగలనా

గుబులుగుండెలో చిగురుటాశల గూడుకట్టి
గమ్యం చేరకముందే మెదడుకు గొలుసుకట్టి
గాడితప్పాక దిష్టి తగిలి గాలి సోకిందంటూ
గెలువలేక విధిరాత ఇదని సర్దిపెట్టుకోగలనా

ఆక్రమణ...నీకూ నాకూ మధ్య
ఎప్పుడూ యుద్ధవాతావరణమే!
భీకరమైన మన పోరులో
నీ చిరునవ్వుల తూటాలు పేల్చి
నా దృష్టిని మరలుస్తావు.
చూపుల శరాలను సంధించి
నన్ను అచేతనుణ్ణి చేస్తావు.
తర్కానికి తిలోదకాలిచ్చి
రణంలో రసపట్టుతో కనికట్టు చేస్తావు.
కనిపించకుండానే నా మనసులో పాగా వేసి
నా అణువణువూ ఆకమించేస్తావు.
నా విద్యల్ని మరిపించేలా చేసిన నికు
యుద్ధతంత్రం బాగా తెలుసని
నిన్ను నేను కీర్తిస్తుంటే నువ్వంటావు...
ఏ తంత్రమూ ప్రదర్శించకుండానే
నేనెప్పుడో నిన్నాక్రమించానని.

పండని జీవితంసారవంతమైన నా జీవిత క్షేత్రం లో
క్షణక్షణం క్రమక్షయమే !
గడ్డిపోచనైనా మొలకెత్తించని
నా ఆలోచనా సేద్యానికి,
ఈ గంభీర కాయం విదిల్చిన
ఏ స్వేధబిందువూ సహకరించదు.
కనీసం విత్తునైనా మొలకెత్తించని
నా వేదనాశృవు,
ఉష్ణరుధిరమై ప్రవహించినా
ప్రకృతిలో ఏ అణువూ చలించదు !!

నేనెవరో...

నీ హృదయ పటాలంలో సూక్ష్మ కణమైనా కాను
ఒక జ్ఞాపకమై యుద్ధం చేద్దామంటే...

నీ మనో క్షేత్రంలో మూలబిందువునైనా కాను
మౌనంగా ఆశలు విన్నవిద్దామంటే...

నీ జీవిత వృత్తంలో వక్ర చాపాన్నైనా కాను
మలుపులో తలుపుగా నిలుద్దామంటే...

నేనెవరని నిన్నడిగితే...
కలలోనైనా దరిచేరనీయని కాకి ఎంగిలంటావు...
అలల్లో కొట్టుకుపోయే ఆశయశూన్యుడివంటావు...
వలలో చిక్కుకుపోయే వలపు వైధ్యుడివంటావు...
దేవుడంటే గిట్టని గర్భగుడి నైవేద్యమంటావు...

నేనెవరో నన్నడిగితే...
ఎప్పటికీ తీరందాటని
కోర్కెలు చంపుకున్న కంపిత కెరటాన్నంటాను...
ప్రతిక్షణం నీ ఎదలోంచి
గెంటేయబడుతున్న కన్నీటి కణాన్నంటాను...
Related Posts Plugin for WordPress, Blogger...