పూలు-స్త్రీలు





ఎందుకీ వేదన? దేనికోసం నీ శోధన ?

పదేపదే మకరందానికై నీ చెంతచేరే
తుంటరి తుమ్మెద కోసమా?
అయితే అది రాదు.
తేనెలూరని నీ తనువుతో దానికిక పనిలేదు.


తలపని, వలపనీ, అనురాగమనీ, ఆప్యాయతనీ...
నీ చుట్టూ తిరిగిన తూనీగలకోసమా?
అయితే, అది కూడా రాదు.
రంగు కోల్పోయిన నీ పూల రెక్కలతో దానికేఅవసరమూ లేదు.


కనువిందులు చేయడానికని వేషాలు మార్చి
నీపై వాలే రంగుల సీతాకోక కోసమా?
అయితే, అదికూడా ఖచ్చితంగా రాదు.
నేల రాలిన నీ పుప్పొడితో దానికే ఉపయోగమూ లేదు.


నిస్వార్థంతో నీ పరిమళాన్ని నలుదిక్కులకూ వెదజల్లి
నీ రెక్కలు రాలిపోయినా, నువు రంగులు కోల్పోయినా,
ప్రేమగా నిను స్పృశించి పరామర్శించే
స్వచ్చమైన గాలి కోసమా?
అతితే నువు దిగులు పడాల్సిన అవసరం లేదు.
అసలు ఎదురుచూడాల్సిన పనికూడా లేదు.
ఎందుకంటే, అది నీకు కనిపించడంలేదు కానీ ఇంకా నీ వెంటే ఉంది.
ఆప్యాయతతో నీ చుట్టూనే తచ్చాడుతోంది.


                                                                                                                   28/09/2013

ఫక్కున నవ్వీ ఏడ్చేశాను!





దాచినా దాగని ప్రేమా! నువ్వెక్కడికెళ్ళావు?
నను ఒంటరివాడిని చేసీ ఏ దిక్కున దాగావు
?

కన్నుల పరదా తెరచీ నా కలలోకొచ్చావు.
చీకటి హృదయంలో చేరీ చిరుదీపం పెట్టావు.

వెన్నెల వెలుగైవచ్చి కనువిందులు చేశావు.
చిరునవ్వును వరముగ ఇచ్చీ గిలిగింతలు పెట్టావు.


చూసీచూడని.కన్నులకు నువు తారసపడ్డావు.
వెదికీ వెదకని దారుల్లో నా దరి చేరావు.

చిరునామా చెప్పకముందే నా హృదయం వీడావు.
నీ చెలిమిని నిచ్చెన చేసీ ఈ నింగిని చేరాను.


తాళుకుల తారల గుంపుల్లో నీ జాడను వెదికాను.
విశ్వం అంచున వీధుల్లో నీ రూపును చూశాను.

అపార్థపు అద్దాలతో నీ మనసును మూశావు.
ఆ తలుపులు తెరిచే తాళాన్ని నేనన్వేషించాను.


జగమంతా గాలించీ నా మనసే తాళమని కనుగొన్నాను.
అది నీ వద్దే ఉందని తెలిసీ ఫక్కున నవ్వీ ఏడ్చేశాను.

                                                                                                26/09/2013

ప్రియుడి కోసం పదహారు....



 ప్రియుడికి షోడశోపచారాలు 

నీ ప్రేమ మందిరంలోకి అడుగెడితే చల్లని చిరునవ్వులతో స్వాగతం పలుకుతావు.
నీ హృదయాన్ని ఆసనంలా మార్చి నన్ను కూర్చొని సేదతీరమంటావు.
మంచు తుంపరల నీ మాటలను చల్లి నా పాదాలను పవిత్రం చేస్తావు.
ఆప్యాయత అందించే నీ స్పర్శతో నా చేతుల్లోని మలినాలను పోగొడతావు.
నీ అధరామృతాన్ని పంచి పాలవెల్లిలా నా దాహం తీరుస్తావు.
విరహాన్ని పోగొట్టే నీ బిగి కౌగిలిలో గోరువెచ్చని స్వేదస్నానం చేయిస్తావు.
నా తలపుల తెరలను తొలగించి నీ వలపుల వస్త్రాలను కట్టుకోమంటావు.
మైలపడ్డ నా హృదయపొరలను నీ ప్రేమా సలిలంతో శుభ్రపరుస్తావు.
నులివెచ్చని నీ శ్వాసా సుగంధాలను నా శరీరంపై చినుకుల్లా వెదల్లుతావు.
నీ నిచ్వాసని నా ఉచ్వాసంగా మలచి హృదయంలో కుసుమంలా పరిమళిస్తావు.
కాంక్షలతో రగిలే నీ సొగసులతో నా చుట్టూ ధూపపు సెగలను ఆవిశ్కరిస్తావు.
కందిన నీ ఎర్రని బుగ్గల కాంతులతో నన్ను కనువిందు చేస్తావు.
నీ మనసును నైవేద్యంగా మలచి దేవుడివంటూ నాకర్పిస్తావు.
నీ తనువు తాంబూలంగా చుట్టి చిన్నగా నా ఒడిలో ఒదిగిపోతావు.
నీ ముడివిప్పిన కురులతో నా ఎదపై తలవాల్చి ఏంచేసినా గౌరవిస్తానంటావు.
పానుపుపై ప్రదక్షిణలు చేస్తూ నా తనువును పెనవేస్తావు.

నీ మందిరంలోకొస్తే నన్ను నేనే మరిచేలా ఇన్ని సత్కారాలా ప్రియా?

24/09/2013

గడ్డి పూల హృదయాలు





ఆ గడ్డిపూలు అచ్చం హృదయాల్లా ఉన్నాయి.
మనసులే కొమ్మలకు చిగురించాయన్న భ్రమలో
నేను కళ్ళార్పకుండా చూస్తున్నా.. తధేకంగా వాటిని.

ప్రేమతోనో, మోహంతోనో ఎటునుంచో వీచిన గాలి ఆ పూలను ఎత్తుకెళ్ళింది.
ఎంతో ముచ్చటగా ఉంది ఆ విన్యాసం.
గుండెలు గాల్లో తేలడం అంటే అదేనేమో !
అవి అలా ఎగుగురుంటే చూస్తూ నా గుండే తేలడం ఆరంభించింది.

ఆ గాలికి ఏమైందో ఏమో
గడ్డి హృదయాలను హటాత్తుగా నిప్పురవ్వల్లో విసిరేసింది.
నా గుండె ఒక్కసారిగా అదిరిపడింది.
కళ్ళు మాత్రం ఇంకా తధేకంగానే చూస్తున్నాయి.

పూల రెక్కల్లో నిండిన కణద్రవ్యం కాలి
కన్నీటి చుక్కల్లా నేల రాలుతోంది.
ఆహుతైన ఆ పూల హృదయాలు
కొత్తరూపాన్నేం ధరించలేదు.
నలుపు రంగును పూసుకొని,
గాలి కంటే తమ బరువు తేలిక పరచుకొని
మళ్ళీ ఎగరడం ఆరంభించాయి.

ఈ సారి వాటికి నిప్పంటే భయం లేదు.
ఎందుకంటే ఆహుతవ్వడానికి వాటిదగ్గర ఇంకేం లేవు.
ప్రపంచమే ప్రేమనయమని చాటే వాటి రూపాలు తప్ప.

అప్పుడర్థమైంది నా హృదయానికి -
హృదయం అంటే అలా ఉండాలని...

                                                                                                11/09/1013

ఆకలాట





ఈ దేవుడింతే! అన్నిట్లోనూ తిరకాసే.
ఆకలి.
ఇక్కడా పెట్టాడు. దీన్నీ వదల్లేదు.
అసలు దేన్నీ వదలడేమో !

ఆకలి గొప్ప వరం కొందరికి
అంతకంటే గొప్ప శాపం మరికొందరికి

దోపిడీలు, దొంగతనాలు..
యాచనలూ, మోసాలూ...
ఆకలి కడుపులకు అన్నీ లోకువేలే!
అది తీరకపోతే కడుపులో పిడిబాకులేలే !!

వెన్నంటిన పొట్టొకడిది.
ఆకలంటే ఆకలంటూ అరుపెందుకో?
పెడితే ఎక్కడ దాచుకుంటాడో !
అసలు పొట్ట జాడేలేదు.

బానలాటి పొట్టొకడిది.
ఆకలో ఆకలి.. ఇక్కడా అదే అరుపు.
ఇంకెక్కడ పెట్టుకుంటాడో!
ఎంత తిన్నాడో నిండు కుండలా ఉంది.

లావూ సన్నం; పొట్టీ పొడుగూ..
పూట పూటకీ కలవరపెట్టే మాయరోగమిది.
ఎవ్వరినీ వదలకుండా వ్యాపించే
అంతుచిక్కని వైరస్ ఇది.

కోటి విద్యలకు జీవం పోసే అదృశ్య శాసనమిది.
ఎన్ని కండల్నైనా కరిగించే కర్మకారిణి ఇది.

అన్నం కోసం కొందరి ప్రయాసలు
తినీతినీ ఇంకొందరి ఆయాసాలు.
అన్నీ అరుపులే!
ఒక్కో అరుపులో ఒక్కో వైవిధ్యం.
అమ్మా ! అని ఒకడు
కమ్మగా ఉందని ఒకడు.
ఆ.. అంటూ అరుపులు కొందరివ్వి.
ఆహా .. అంటూ ఆనందాలు ఇంకొందరివి.

పట్టెడన్నం కోసం ఆరాటపడటమో శాపం.
అన్నీ ఉండి వృధా చేయడమో వరం !

ఆకలి కోసం చావును వెదికే చీకటి కోణాలెన్నో..
వీదుల్లో నడిచెళ్తుంటే తారసపడే కన్నీటి గాధలెన్నో...

మనం తోటివారికి చేసే సహాయాలు
మానవత్వపు జాడలకు నిదర్శనాలు.

ఆజాడలు చెరిగిపోకుండా
మానవత్వపు పట్టుకొమ్మలు ఎండిపోకుండా
మనం మనుషుల్లా ప్రవర్తిద్దాం!
మనసుల్ని మనసుల్తోనే జయిద్దాం !!
ఆకలి బాధలను తీర్చేద్దాం !!!

                                                                        12/09/2013
Related Posts Plugin for WordPress, Blogger...