ఓ మగాడా...ఎవరు నువ్వు?
మాతృగర్భాన్ని తొలిచిన పురుగువా
మగువ దేహాన్ని వలచిన ప్రియుడివా
వారసుడంటూ కీర్తించబడే స్వార్థపిండానివా
వావీవరసల ఉచ్చులో తచ్చాడే అర్ధసన్యాసివా

అవును... కాదు కాదు...
నువ్వసలు నువ్వేనా
ఈర్షను జీర్ణించుకున్న నిర్జీవివేమో
పశ్చాత్తాపమెరుగని ఉన్మాదివేమో

ఏమో
నువ్వసలు నువ్వు కాకపోవచ్చేమో
మృత్యులోయలోపడి
మృతసంద్రాన్నీదే వానరానివేమో
కానరాని మనసు శిలను దాచిపెట్టి
మొండిబండలా బ్రతికే శిలాజానివేమో

అవును
ఒక్కోసారి నువ్వంతేనేమో
అంతేనా
ఇంకేం కావా నువ్వు?
అవుతావేమో కాస్త చూడు...
ఆలోచనల్ని అతికిస్తే
నిస్తేజాన్నొదిలిన నింగివౌతావేమో
ఊహల్ని శ్వాసిస్తే
రెక్కలవసరం రాని విహంగానివౌతావేమో
మగువ మనసెరిగితే
మంచును వెదజల్లే సూర్యతేజానివౌతావేమో

ఏమో
ఏమో నువ్వన్నీ అవుతావేమో
అపుడప్పుడూ అసలేం కావేమో..
ఏం చేసినా చేయనట్లు
చేయకున్నా చేసినట్లు
గొప్పవాడిగానో..
గొప్పలు చెప్పుకున్నవాడిగానో
ఎప్పుడో ఒకసారి
ఎక్కడో ఒకచోట
కుప్పకూలిపోతావ్....
ఓ మగాడా !
మనసును మోస్తున్న నువ్వు
యంత్రంలా కనబడే ఓ మనిషివే !!

మౌనానువాదంమేఘాల మోహంలో
పూచిన చినుకుల వర్షపు శబ్ధం

ప్రేమాలాపనలో
వేచిన మనసుల చప్పుళ్ళ లబ్దం

వెరసి పుట్టిన ఈ నిశ్శబ్ధానునాదం
ప్రకృతి భాషకు ఓ మౌనానువాదం

ప్రేమ క్రమక్షయం...
నీ నిరీక్షణలో బరువైన ఈ ఉదయం
క్రమక్రమంగా ఎదను కోస్తుంటే
ధారలుగా రాలుతున్న ప్రేమచారికలు
చెరలా నను బంధించాయని ధుఃఖిస్తున్నా !

నీ రక్షణ కరువైన ఈ హృదయం
ప్రేమ క్రమక్షయానికి గురౌతుంటే
పొరలుగా తరలిపోతున్న జ్ఞాపకాలు
మరలా దరిచేరవని చింతిస్తున్నా !

మౌనంగా శిధిలమౌతున్న ఎన్నో క్షణాలు
నిశీధి నీడల్లో నెట్టివేయబడుతుంటే
కదిలిపోతున్న ఒక్క క్షణాన్ని కూడా
పదిలంగా ఎదలోతుల్లో దాచుకోలేకున్నా !

వి'శేషం'


అనుకున్నదే తడవుగా
మెదడును సన్నద్ధం చేసి
ఆదిలోనే తప్పటడుగు వేస్తే
మనసు అద్దమై పగిలి
ముక్కలవడం సహజమే !

నిద్రాహారలు మాని
కనులు కలల్ని వెదుక్కుంటూ
నలుదిక్కులూ గాలించినపుడు
ఊహలు ఎండమావులై
తారసపడటం సంభవమే !

అంతులేని ఆశలెన్నో
ఆత్మవిశ్వాసపు పొరచే ఆవరించి
అలుపెరగక సాగిపోతున్నప్పుడు
పలుచబడిన ఆశయాలే
పరదాలవడం సామాన్యమే !

చిత్రమో చిత్తవిన్యాసమో ...
సహజంగా సంభవించే సామాన్య విషయాల గురించి
చింతించకుండా ఉండటం మాత్రం
కడు విడ్డూరం ! బహు వి'శేషం' !!

Related Posts Plugin for WordPress, Blogger...