నువ్వో లేడీ సైకో ...

ఒక అకస్మాత్తులో
పరిమళించిన మత్తు మందులా
మాటల్తో మెత్తగా
మనసును హత్తుకున్నావ్.

కొన్ని భావాలు విచిత్రంగా ఉంటాయ్...
కొన్ని మనస్సులు పవిత్రంగా ఉంటాయ్...
బహుశా అవే ఇద్దర్నీ కలిపుంటాయని
అవే మన హద్దుల్ని చెరిపుంటాయని
భ్రమలో భ్రమరమై తిరిగా!
సందేహంలో కెరటమై ఉరికా!!

ఎందుకో తెలీదు.
ఉన్నట్టుండీ ఉలిక్కిపడతావ్.
మాటల బెత్తంతో నన్ను కొడతావ్.
లేని ప్రేమను చూపించమంటావ్.
పెళ్ళీ పెళ్ళని బలవంతపెడతావ్.

నేనేదో పనిమీద పలకరిస్తేనే నువ్వు మొదట పలికావ్.
తర్వాత అదేపనిగా నువ్వే పలకరించావ్.
ఎన్నో అనుభవాల్ని తలుచుకుంటూ
ఎన్నో భావాల్ని పంచుకున్నావ్.

నేనేమో స్వఛ్ఛంగా నీతో చెలిమి చేయాలనుకున్నా.
నువ్వేమో మొత్తంగా జీవితాన్నే పంచుకోమన్నావ్.

బ్రతుకంటే మాటలు చెప్పడం కాదని
బాధ్యతలంటే పూటకు దింపుకునేవి కావని
నీదంతా ఆకర్శణేనని
అదంతా భవిష్యత్తుకు అడ్డేననీ
ఆలోచించుకోమన్నా... ఆవేశపడకన్నా...

నువ్వస్సలు వినలేదు.
నన్నస్సలు వదల్లేదు.

నాకెప్పుడూ కాల్స్ చేస్తూనే ఉంటావ్..
ప్రతి మాటతో నన్ను కాల్చేస్తూనే ఉంటావ్.

ఎన్ని సార్లని స్విచ్చాఫ్ చేయను.
ఎన్ని నెంబర్లని బ్లాక్ చేయను.
ఎన్ని మెసేజుల్ని అన్రీడ్ చేయను.

సరాసరి ఫేస్బుక్ వాల్లోకొస్తావ్.
నీ ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పమంటావ్.
నలుగుర్లో నానా హడావిడీ చేస్తావ్.

ఎలా చెప్పను నువ్వంటే నాకిష్టం లేదని.
ఎలా చెప్పను నీ నీడనైనా చూడలేనని.
ఎలా చెప్పను నువ్వో లేడీ సైకోవని.

అందుకే..
బాధతో ద్రవించిన నా హృదయాన్ని మోస్తూ..
వ్యధతో కన్నీటికి బదులు రుధిరాన్ని స్రవిస్తున్నా!!

క్షమించు నిన్ను సైకో అన్నందుకు.

30/11/2013

సిగ్గంటే...

మెత్తటి ఆకుల్నో
నెత్తుటి పిడిబాకుల్నో
దారాలుగా అల్లి
హారాలుగా వేసుకో!
నీ ఆత్మ కప్పుకున్న నగ్న దేహాన్ని
నిండుగా దాచేసుకో!!

రోమరోమాల్లో
అలుముకున్న అయోమయాన్ని
దేహ బాహ్యాల్లో
విచ్చుకున్న వంకర మూలల్నీ
ధూళి కణాలు తాకకుండా
గాలి అణువులు దూరకుండా
గుడ్డ ముక్కల్నో
గడ్డి రేకుల్నో
గబగబా చుట్టేసుకో!
ఉన్న సిగ్గును కప్పేసుకో!!

వలపు వాంఛలు వదిలిపోనివి.
కలుగు కోర్కెలు కాలిపోనివి.
కొత్త సిగ్గుకు మొగ్గ తొడుగు.

మేని ఛాయ మాసిపోనిది.
మనసు గాయం మానిపోనిది.
పాత సిగ్గును తొక్కిపెట్టు.

సిగ్గు సిగ్గులో తప్పిపోతూ
లేని సిగ్గులో నెగ్గుకుంటూ
నవ్వు వస్త్రం కొనుక్కో !!
నిన్ను మాత్రం వెతుక్కో !!!

29/11/2013

కొ(చె)త్త సూక్తులు...రెక్కలు మొలుస్తున్నాయని ఇప్పుడే ఎగరద్దు.
ఉచ్చులు మ్యానుఫ్యాక్చరౌతున్నాయ్...
జాలీగా తిరిగేస్తూ హద్దులు దాటేయ్యాలనుకోవద్దు.
తిమ్మిరి కాళ్ళకు ఉక్కు చైన్లు బిగుస్తున్నాయ్...

చాకచక్యమంటే హద్దులు చెరిపి విరరించడం కాదు.
సరిహద్దుల లోయల్లో మైదానాలు మొలిపించడం.
గమ్యమంటే నెత్తిన బండరాళ్ళు మోయడం కాదు.
భావితరాలకు నీ గుండె రుచిని చూపించడం.

పుట్టినప్పుడే నిన్ను కన్నపేగొకటి వీడనంది.
దాన్నొదుల్చుకున్నాకే నువ్వూపిరి పీల్చడం మొదలెట్టావ్...
ఆ వీడ్కోలులో నీ ఏడుపు నవ్వులు పంచిందని గుర్తుంచుకో.
వారి చిరునవ్వుల్లో నువ్వే దాగున్నావని అర్థంచేసుకో.

ఆనందమనేది నీకు పర్మనెంట్ బానిసనుకున్నావా?
అసలది నీదెలా అవుంతుంది? డామిట్..
మనిషో ప్రకృతో ఎవరో ఒకరు అప్పిస్తేగానీ నీకది కలుగదు.
నీ వేదనను ఎవరికో ఒకరికి దానమిస్తే గానీ
సంతోషం నీ దాహాన్ని తీర్చదు. హాంఫట్..
అందుకే దేన్నీ ఆశించకు. అన్నిట్నీ ఆస్వాదించు.

చావో బ్రతుకో ఒక్క శ్వాస సావాసమే తేడా.
వెలుగో చీకటో ఒక్క రెప్ప కదలికే తేడా.
శూన్యమో సమస్తమో ఒక్క అణువు చలనమే తేడా.

ఉన్నది గెలుపూ మలుపే.
ఓటమనేదంతా ఒట్టి ట్రాష్..
మనకు గీయబడ్డ గమ్యనేదీ ఒక్కటే.
అలసిపోతే సమాధుల్లో పడుకోవడమంటాను. అదే భేష్.....

28/11/2013

ఘాట్ రోడ్డు నిర్మాతలు

గట్టు కోణం అంటే తీటా విలువ తెలియక
గుట్టుగా తప్పించుకునే ఇంజీనీర్లారా!
ఎన్ని లారీలు బోల్తాకొట్టాయో చూడండి.
ఎన్ని బస్సులు అదుపుతప్పాయో చూడండి.
ఎన్ని శవాలు సమాధులయ్యాయో చూడండి.

అపకేంద్రాభికేంద్ర బాలాలంటే
మాబలం రాజకీయమనే కాంట్రాక్టర్లారా!
ఎన్ని మలుపులు హద్దు మీరాయో చూడండి.
ఎన్ని అడ్డు గోడలు బద్దలయ్యాయో చూడండి.
ఎన్ని జీవులు నిశ్శబ్ధమయ్యాయో చూడండి.

ఊపిర్లొదిలిన ఆత్మలు నిద్రల్లో తరమకుంటే అడగండి.
క్షతగ్రాతుల వెర్రికేకలు చెవుల్లో మర్మోగకుంటే అడగండి.

అలానే చూస్తూ ఉండిపోండి.
మీరెప్పుడైనా అదే దార్లో కార్లో వస్తూ చూడండి.
మలుపు మలుపుకూ గుండె వేగం పెరక్కపోతే అడగండి.
చుట్టు చుట్టు కీ జుట్టూ నిగ్గపొడుచుకొకుంటే అడగండి.

మీ చిన్న కూతురు భయంతో మిమ్మల్ని వాటేసుకోకుంటే అడగండి.
నిజం తెలిస్తే నిందలేస్తూ మనసులోంచి మిమ్మల్ని గెంటేయకుంటే అడగండి.

అయినా సరే మీ గుండె అడుగంటి మసిబారిందని అనిపిస్తే
మనసు కడుక్కోకుండా ఆ యముడి పోటీగా
ఇక్కడే ఇంకో నరకాన్ని నిర్మించండి.
అందులోనూ నాసిరకపు శిక్షలే వేస్తూ
స్వర్గాన్ని సెకన్లచొప్పున అమ్మేసుకోండి.

27/11/2013


వెన్నెలంటే అంతే ...

అది అందని జాబిలి.
కనిపిస్తుంది. మురిపిస్తుంది.
మెరిసీ మెరిసీ మైమరపిస్తుంది.
రోజుకో భిన్న రూపంతో అందర్నీ అలరిస్తుంది.

నీతో పాటే అందరినీ చల్లగా చూస్తోందని అసూయ చెందకు.
నువ్వెకడికెళ్తున్నా నిన్నే చూస్తోందని సంతోషించు.

నీతో పాటే అందరూ కోరుకుంటున్నారని ఈర్ష చెందకు.
నీ కోసమే పున్నమి వెన్నలై దర్శనమిస్తుందని సంబరపడిపో.

మబ్బుల చాటు దాగి నిన్ను ఏడిపిస్తోందనుకోకు.
దాగుడుమూతలాడి నిన్ను కవ్విస్తుందనుకో.

అమావాస్యలో కనిపించదని ఆగ్రహించకు.
కనిపించకున్నా నిన్నే తలుస్తోందని గ్రహించు.

ఎంత వేచినా రాదనుకోకు.
వచ్చేదే నీకోసని భ్రమించు.
భ్రమలో భూగోళం చుట్టూ గంతులేస్తూ పరిభ్రమించు.

26/11/2013

ఎందుకీ ఆత్రుత ఓ విష్వక్సేనా?నాకు దేని గురించీ తెలియదు.
ఏవేవో శ్రుంగ ద్రోణులు ఇమిడిన గాలి తరంగాల్లో
అప్పుడప్పుడూ కొన్ని తీగలు అలా మెరుస్తాయి.

మెరుపో మానవాతీత మ్యాజిక్కో
నా మెదళ్లో ఒక్కసారిగా జిమ్నాస్టిక్ చేసినప్పుడు;
వింత భావాల అలజడి చలరేగుతుంది.
తెలియకుండానే గుండె కరుకైపోతుంది.

శూన్యం నుండి ఆకలి దప్పికలు
విస్పోటనం నుంచి శాంతి సమూహాలు
గాల్లో ఈకలు తేలినట్లు  
కలంలో ఇంకు అలా ప్రవహిస్తూనే ఉంటుంది.

విశాల విశ్వంలో దాగిన మర్మాలను
నిర్విరామంగా శోధిస్తూ.. ఏవేవో సాధిస్తూ..
అనంత గరళ గొంతుకల్ని
అమాయకపు సరళ ఘోషల్ని
రొమ్ము విరుస్తూ.. రెప్ప కదుల్చుతూ..
విష్వక్సేనుడొకడు ఉన్నట్లుండీ ఒళ్లోకోస్తాడు.

ఏవేవో ఎడతెరిపిలేకుండా లిఖిస్తూ..
బ్రహ్మాండాన్నే చుక్క సిరాలో బంధిస్తూ..
అలా వచ్చి వెళ్ళిపోతాడు.
తర్వాత అంతా శూన్యమే!

ఇప్పుడు నాకేం తెలియదు.
కొద్దో గొప్పో రుచి గల ముద్ద పప్పుని.
అసలు నేనొక మట్టి ముద్దని.

అందుకే నాకంత ఆత్రుత.
ఎప్పుడెప్పుడు ఫ్రేం లోంచి బయట పడదామని.
అసలు నాలో ఏం జరుగుతోందో తెలుసుకుందామని.

25/11/2013


  
    

     కొట్టుపోవడమే...

సహజంగానే అప్పుడెవరూ లేరు
నిజంగానే నే పుట్టకముందెవ్వరూ లేరు

నిశీధితో సాహసం చేసిన అదృశ్యం తప్ప
శూన్యంతో సావాసం చేసిన నిశ్శబ్ధం తప్ప

విశ్వమంతా నిశ్చలత్వమే
ప్రపంచమంతా అంధత్వమే
సమస్తమంతా ఏదో ఒక తత్వమే

ఏ జన్మలో ఏ అమ్మ దాచిపెట్టిన పురుటినొప్పులో
పుట్టగానే చెమ్మగిల్లిన కళ్ళు ఏడ్చేస్తాయ్

శిలల్లో ఉప్పొంగే అలల ఆటుపోట్లు
అలల్లో తప్పిపోయే కలల కునికిపాట్లు
కలల్లో తెప్పదాటే కళల పనిమూట్లు

ఏ మేఘం పొట్ట పగిలితే రాలిపడ్డాయో
ఏ వైభవం మట్టికరిస్తే తూలిపడ్డాయో
అసలివన్నీ ఎలా కింద పడ్డాయో!!

కళ్ళు తెరిచీ తెరవంగానే హత్తుకున్న ప్రకృతి
ఊహ తెలిసీ తెలవంగానే అద్దుకున్న సంస్కృతి

ఏది బంధమో బానిసత్వమో తేల్చే సత్యాలెక్కడ?
ఏది బాధో బహుమానమో కొల్చే కొలమానమెక్కడ?

విధి విధిల్చే వేదనలో విశ్వాసాన్నెత్తుకుని
కాలం కాల్చే సహనంలో సంతోషాన్నెతుక్కున్ని

అతక్కుండా ఆగకుండా
కొట్టుకుపోవడమే నా పుట్టుక ప్రయాణం

24/11/2013


గాధా సప్తశతి ..

ి

గాధా సప్తశతి గ్రంధ ప్రతి కవితలో
కొలువైన అనంత ప్రేమ నీదీ నాదే

అభిజ్ఞానులైనా అజ్ఞాతలైనా అందరూ
అలరించిన అమోఘ భావాలు నీవీ నావే

పురుషుల కన్నా స్త్రీలే మిక్కిలి ధారబోసిన
ఊసుల రాశుల్లో రెక్కలు తొడిగింది నువ్వూ నేనే

సరదా సరసంలోనూ వీర విహారంలోనూ
ఏ శయ్య కదిపినా ఏ వనం నవ్వినా నువ్వూ నేనే

ఎడబాటైనా ఎద పాట్లైన దొర్లిన అక్షరక్షరాల్లో
నిండుగా నిక్షిప్తమైన వేదనంతా నీదీ నాదే

ఏడు జన్మలూ ఏడధ్యాయాలుగా కూర్చబడితే
ప్రతి అధ్యానికోవందేళ్ళు వైద్యం చేసింది నువ్వూ నేనే

ఇద్దరం కల్పితమే అయినా ఎవ్వరికీ కనరాక కచేరీ చేసే
కాల్పనిక వింత పుస్తకమే మన ఈ గధా సప్తశతి.

23/11/2013

( గాధా సప్తశతి 700 కవితలు కలిగిన ఒక ప్రచీన కవితా సంపుటి. ఇందులో అధ్యాయానికి 100 కవితల చొప్పున 7 అధ్యాయాలు ఉన్నాయి. 270 పైచిలుకు కవులు రాసిన కవిత సమాహారం ఇది. ఇందులో సగం మంది అజ్ఞాతలు. ఎక్కువ కవితలు స్త్రీలే రాశారు. కవితల్లో ఎక్కువ పాళ్ళు ప్రేమ, స్రీ పురుషుల మధ్య గల సంబంధాల చుట్టూనే తిరుగుతాయి.
)

తాగు తాగు

బలిపశువుల మెడలు వంచి
బానిసలను బెదిరించి
పితికిన ఎర్ర నెత్తురది.
తాగు తాగు.

రాక్షసత్వ దర్పంతో
కపట బుద్ధి సర్పంతో
కళ్ళాపి చల్లిన నెత్తురది.
తాగు తాగు

త్యాగాలను తప్పుపట్టి
మోహాన్నే చేతబట్టి
చప్పరించిన నెత్తురది.
తాగు తాగు.

దీనుల శ్రమ దోపిడీతో
దరిద్రుల కొన ఊపిరితో
మండిన నెత్తురది.
తాగు తాగు.

స్వేదంతో కండ తడిపి
వేదనతో గుండె నలిపి
పిండిన నెత్తురది.
తాగు తాగు.

కార్మికుడి కూడు దోచి
కర్షకుడి కడుపు చీల్చి
చిందిన రక్తమది.
తాగు తాగు.

యోధుడి పోరాటాన్ని
నిస్సహాయుడి కంఠాన్ని
తడిపిన రక్తమది.
తాగు తాగు.

22/11/2013

కొత్త కావ్యం...

అందమైన జీవిత కావ్యాన్ని ఆహ్లాదంగా మలచాలని కలం పడితే
తడబడిన వేదన సిరా ఆవేశంతో ఉప్పొంగి అక్షరాలనే ముంచేసింది.

ఊహలన్నింటినీ రంగరించి కాగితాలకు కొత్త రంగులను అద్దబోతే
అందినట్టే అందిన హరివిల్లు కాస్తా చిటికెలోనే మాయమైంది.

ఆలోచనలను ఆనందాక్షరాలుగా ప్రతి పుటలోనూ అమర్చబోతే
అనుకోని అనుభవాల జడివాన బాధతో పుస్తకాన్నే తడిపేసింది.

అపురూపమైన ఎద భావాలను మది మూలల్లో మధించబోతే
కనిపించని ఆవేదనంతా భారంగా ప్రతి కాగితాన్నీ నలిపేసింది.

కొట్టివేతలు లేని వాక్యాన్నొక్కటైనా నిర్మిద్దామని ఆశగా ప్రయత్నిస్తే
తూట్లు పడ్డ గుండె జ్ఞాపకాల సమాధుల్లోంచి బయటకు రానంది.

చివరి పుటనైనా సంతోషంతో ముగిద్దామని పదాలను వెదకబోతే
రాని నవ్వులను తెప్పించడాని మనసు జోకరు వేషం వేయనన్నది.

21/11/2013

నాకేమాత్రం అభ్యంతరం లేదు. నరికేయ్.గొడ్డలి వేటు పడగానే చెట్లూ బిగ్గరగా అరుస్తాయ్..
మనకు మాత్రం వినపడవ్!
గొడ్డలి జరిపాక మనసుతో చూస్తే కనపడతాయ్..
అరుస్తూ రోదించే నోర్లెన్నో!

వాటి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో!
వినలేక విహంగాలన్నీ దానిపైనుండి ఎగిరిపోతాయ్.

వాటి సంతోషం ఎంత ఆర్ద్రంగా వీడుతుందో!
దెబ్బ దెబ్బకీ బెరడు ముక్కలు రాలి వీడ్కోలు పలుకుతాయ్.

వాటి కన్నీరు ఎంత గాఢంగా స్రవించబడతాయో!
ఏడ్చీ ఏడ్చీ జిగురుతో గాయల్ని కప్పెట్టేసుకుంటాయ్.

జే.సి. బోస్ రాసిన బుక్కులు చదవక్కర్లేదు.
చిన్నప్పటి సైన్సు పుస్తకాలూ తిరగేయనక్కర్లేదు.
ఒక్కసారి నిన్ను నువ్వే గిల్లుకుని అద్దంలో చూసుకో.

ఇంకా నరకాలనిపిస్తోందా?
అయితే నిర్మొహమాటంగా నరికేయ్.

అమ్మొక్కసారే నీకూపిరి పోసీ జన్మనిచ్చింది.
మరి ఇన్ని రోజులూ నీకెవరు ఊపిరి పోస్తున్నారో
రెండే రెండు నిమిషాలు ఆలోచించి
తర్వాత మొత్తంగా నరికేయ్.

నాకేమాత్రం అభ్యంతరం లేదు. నరికేయ్.

20/11/2013

తామరాకు - నీటి బొట్టు

వెన్నెలతో రేయంతా జాగారం చేసిన చిరుగాలొకటి
వేకువనే చల్లని మంచు బిందువునొకటి ప్రసవించింది.

అది తమకంతో కొలనులోని తామరాకును మెత్తగా హత్తుకుంది.
తామర ప్రాకృతిక జారుడు స్వభావం మాత్రం ఊరుకుంటుందా?
బొట్టును వెలుపలికి వొలికిపోనిస్తుందా?
అలా అని లోనికి అక్కున చేర్చుకుంటుందా?
తన పరిధిలో గింగిరాలు తిరిగేట్టు చేయడం తప్ప.

నిలుస్తుందా ఆ నీటి బొట్టు?
ఏ ఉదయ భానుడు నవ్వితే ఆవిరౌతుందో !
ఏ వెచ్చని చిరుగాలి కదిపితే ఎగిరిపోతుందో !
ఏ చేపపిల్ల మొప్పతో పొడిస్తే నీట జారుతుందో !

ఆకు చిద్రం అవ్వడమో;
బిందువు విచ్చిన్నమవ్వడమో...
ఎప్పుడు తెగిపోతుందో ఈ విచిత్ర బంధం.

ఓ ప్రకృతీ పరీక్షించు.
మరోమారు నీ మాయా చాతూర్యంతో.
ఓ విధీ ప్రదర్శించు.
మునుపెన్నడూ వాడనీ నీ మంత్ర విద్యల్ని.

19/11/2013సమాధుల్లో సమాధానాలా?

ఎప్పుడు చచ్చామో! నువ్వూ నేనూ.
ఇలా పక్క పక్క సమాధుల్లో
ఇద్దరం పలకరించుకుంటున్నాం.
చచ్చావా? చంపారా?
ఆక్సిడెంట్లోనా? ఆయుష్షు తీరా?
పాము కరిచా? పక్కింటోడరిచా?
హత్యా? ఆత్మ హత్యా?

***

ఎంత కులాసాగా అడుగుతున్నావ్?
కుమిలి కుమిలి చచ్చాను తెలుసా?
నా సంతోషాన్ని ఎందరో హరించిన
క్షణాల్ని ఎన్ని ఉదహరించమంటావ్?

సరే చెప్పేస్తున్నా..

ఒక్క తొందరపాటుతో చచ్చా.
ఒక్క నిమిషం ఓపిక నశించి చచ్చా.
ఒక్క రూపాయ్కి కక్కుర్తిపడి చచ్చా.

క్షణికానందం కోసం
లక్షణమైన జీవితాన్ని తాకట్టుపెట్టి మరీ చచ్చా.

* * *

అన్నో ! ఒట్టు నువ్వు పోయెట్టువే.
అందుకే అందరూ నిన్ను ' పోయేట్టు ' చేశారు.
పెసరట్టులా రుచిగా చెప్పినా; నాకు ఆంలెట్టే ఆనుద్ది !!
నీ తాకట్టుల గోల కట్టిపెట్టి, అసలు విషయం చెప్పన్నో !

* * *

ఇంకేం చెప్పను బ్రదర్? నాకెచ్చైవీ...

18/11/2013

నిర్భాగ్యుడి తలపు...

అప్పుడెప్పుడో వెన్నెల గిలిగింతలకు ఆకాశం ఆహ్లాదంగా నవ్వితే
రాలిపడ్డ ముత్యాలనేరుకూంటూ నిన్ను మొదటిసారి చూశాను.

మంత్రమేసినట్లు నా కన్నులు నిన్నే చూస్తూ ఉండిపోయాయి.
చేతులు వశం తప్పి నీకెప్పుడర్పించేశాయో నే పోగేసిన ముత్యాల్ని.

నా అణువణువూ నిండిన నిశ్శబ్ధం నీ అందానికి దాసోహమయ్యి
ఒక్క మాటా పలుకలేక మౌనంగా నీ ధ్యానానికి అలవాటుపడింది.

ఇలా తలిస్తే చాలనుకున్నావేమో! అసలు కనిపించడమే మానేశావు.
ఎక్కడా వెతకనవసరం లేకుండా నా కన్నుల్లోనే నిక్షిప్తమైపోయావు.

మళ్ళీ ఇన్నాళ్ళకి, నవ్వుతూ ఉండే ఆకాశాన్ని ఎవరేడిపించారో ఏమో!
ఇప్పుడు ముత్యాలకు బదులు వడగండ్లనూ పిడుగుల్నూ రాలుస్తోంది.

ఇప్పుడైనా నీ ధ్యానంలోచి బయటపడదామంటే గుండెల్లో ఏదో భయం.
పిడుగుల్నైనా ఏరుకుని దాచుకోగలనేను ఎక్కడ నీకర్పిస్తానేమోనని.

17/11/2013


అందుకే నువ్వంటే నాకిష్టం !!

నేనేం చెప్పినా నువ్వలా వింటూనే ఉంటావ్.
ఒక్క మాటా ఎదురు చెప్పవ్.

బాధల్లో ఉన్నప్పుడు హత్తుకుంటే కాసింత ఓదార్పునిస్తావ్.
ఆనందంగా ఉన్నప్పుడు ఎత్తుకుంటే ఎంతో హాయినిస్తావ్.

ఒంటరితనాన్ని నానుంచెప్పుడూ దూరం చేస్తావ్.
కొట్టినా తిట్టినా అలా పడి ఉంటావ్.
ఎప్పుడూ ఒక్కమాట కూడా అని నన్ను బాధపెట్టవ్.

నేను గదిలో ఎటు తిరుగుతున్న నన్నే చూస్తూ ఉంటావ్.
నిద్రలో కూడా నన్ను వీడకుండా పక్కనే ఉంటావ్.
అసలు నువ్వు బత్రూం కి కూడా వెళ్ళవ్.

ఎందుకో నువ్వు ఒక్క మాటా మాట్లాడవ్.
అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. .. టెడ్డీ !!

16/11/2013ఎందుకీ భ్రమ?

నిన్నే తలుస్తూ కనురెప్పలు భారంగా మూస్తుంటే
నా నుదిటిపై ముద్దిస్తూ చప్పున మేల్కొలుపుతావు.

నీ పెదాలకంటిన కుంకుమను తలాడిస్తూ నా ముక్కుపై రాస్తావు.
ఇంకొంచెం కిందికొచ్చి నా పెదాలపై యుద్ధం చేస్తావు.

గెలిచావో.. వోడావో ! అంతటితో మెల్లగా వెనుదిరిగి
నా భుజాలను నీ రెండు చేతుల్లో తీసుకుంటావు.

మెడపై ఉయ్యాలలూగే నా కురులను వెనక్కి సవరించి
నీ లేత మీసాల మిళిత చుంబనాలతో గిలిగింతలు పెడతావు.

ఆ గిలిగింతలకు మైమరచి నేను మెలికలు తిరుగుతుంటే
నా నాజూకు నడుముని నీ మెత్తటి స్పర్శతో నంజుకుంటావు.

నిశ్చలంగా ఉండి నా నిఛ్వాశను తుఫానులా మారుస్తుంటే
నీ బిగి కౌగిలిలో నను బంధించి వేస్తావు.

నేనూ హత్తుకుందామని నీ మీద చేతులువేయబోతుంటే
నేను భ్రమలో ఉన్నానని గుర్తుచేసి బాధపెడతావు.

15/11/2013నాకు మాట్లాడ్డం రాదు -3

మాట్లాడదు. మాట్లాడదు.
నా మనసెందుకో మాట్లాడదు.
నా కనులెందుకో వెంటాడవు.

నిశ్శబ్ధం తన అందాన్ని సవరించుకునే వేళ
చిమ్మ చీకటి భస్మమైఎర్రటి నిప్పులు చెరిగే వేళ

కడలిని భరిస్తున్న కన్నుల కురులు జారి వర్షించే వేళ
గుండెలో దాగిన మిన్నంత భారం రాలి ముక్కలైన వేళ

నీ మనసులోంచి రెండు సన్నజాజులు నా గుండెలపై వాలే వేళ
నా కళ్ళలోంచి రెండు చుక్కల మల్లె మొగ్గలు నీ చేతిని తడిమేవేళ

చూద్దాం!!
అప్పుడైనా మాట్లాడుతుందో లేదో.
నా మూగ మనసు.నో పాస్ టు లివ్ !!భూమి చుట్టూ చంద్రుడొక చుట్టేసి, అలిసిపోయే కాలానికి
నువు రక్తం స్రవిస్తావ్...
మది మూలల్లో మభ్యపెడుతున్న భావాలను
సభ్య సమాజం ఏమంటుందనో ఆ రక్తంలో త్యజిస్తావ్...
ఎప్పుడూ ఎవడోఒకడు కాపలా కాస్తున్నా
ఎప్పుడూ వందల దృశ్య భాణలు గుచ్చుకుంటున్నా
తలవంచుకునే అన్నీ భరిస్తావ్...
అమాయకపు కన్నీటి బొట్టులో
మహా భావ సంద్రాన్నే నిక్షిప్తం చేస్తావ్...
మనసెక్కడ బయట పడుతుందేమోనని పైట సర్దుకుంటావ్..
నచ్చిన వారందరికీ నవ్వుతూ శెలవు చెప్పి
నడిచెళ్ళాక కుమిలి కుమిలి ఏడుస్తావ్...
జీవితానికి ఈ బాధలే రంగులద్దుతాయనీ
కొత్త లోకాలకెళ్ళినా రెండ్రోజులకు పాతవౌతాయని
సూక్ష్మం లోనే గొప్ప ప్రవచనాలను వెతుక్కుంటావ్...
అంతలోనే చంద్రుడు ఇంకో చుట్టు తిరిగాడు.
మళ్ళీ స్రవించు.
మోనొపాజ్ ఇంకా మైళ్ళ దూరంలో ఉంది.

తడబాటెందుకు?

గమ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
దారి కూడా ఎంతో స్వచ్చంగా ఉంది.
అసలు ఏచీలకలూ లేవు. ఏ మలుపులూ లేవు.
ఏ ముళ్ళూ లేనేలేవాబాటలో.
దారంతా పరిచిన మెత్తటి పూల తివాచీలే.

మరెందుకనో తడబాటు?

మనసు ఆహ్లాదంగా ఉంది.
తనువూ ఆరోగ్యంగా ఉంది.
కాళ్ళూ చేతులూ బాగునాయ్.
కళ్ళూ కర్ణభేరీ ఫర్వాలేదు.

అయినా ఎందుకో! ఇంకా తడబాటే.

కాళ్ళెంత ప్రయత్నించినా
సరిగా పడటంలేదు ఏ అడుగూ.
నడకలో ఏ ఇబ్బందీ లేదు.
అయినా తడబాటు మాత్రం తప్పడం లేదు.

ఎంకుకని ఆలోచిస్తే అర్థం కాలేదు.
పిడికిలి బిగిసిన రెండు చేతులూ
నడుముపై పెట్టి, ఏంటిదని అనుకుంటే తెలిసింది.
నా పాంట్ కొంచెం లూజని.
దానికి బెళ్ట్ లేదని.

12/11/2013తెలిసిన విషయాలే..

అంతమో ఆరంభమో !
అనంత ఘోషల ఆరాటమో !!
ఏ క్షణం ఎలా మలుస్తుందో
నడుస్తున్న ప్రతీ సంధర్భాన్నీ...

తీక్షణంగా పరిశీలించిందెవరు?
తధేకంగా పరిశోధించిందెవరు?

గాలి గమనానికి రాలక
ఊగిసలాడే ఫలాల లెక్క తెల్చేదెవరు?

కనికరమో కర్కశమో !
కాల సంద్రపు కోప కెరటమో !!
ఏ బిందువు ఎలా భరిస్తుందో
పొంగుతున్న ప్రతీ తరంగాన్నీ...

ఆత్రుతగా అన్వేషించిందెవరు?
అనుభవంతో ఆలోచించిందెవరు?

దూర తీరాలు చేరక
కెరటాల వలలో పడ్డ నావల బాధలు తీర్చేదెవరు?

మాటల కోలాటమాడి తడబడనిదెవరు?
జీవిత తహతహలాటలో ఓడి తడవనిదెవరు??

11/11/2013

వింత కవలలు

ఒకడూ ఇంకొకడూ
ఇద్దరూ వింత కవలలే!
అందరికీ తెలిసిన కవలలే!
ఎవ్వరూ గమనించని కవలలే!

ఒకడేమో ఎదో ఒకరంగులో,
ఇంకొకడు ఎప్పుడూ నలుపులో..

ఒకడేమో రంగులు మేనికి అద్దుతాడు.
ఇంకొకడికి అడ్డినా అంటుకోదు...

ఒకడేమో ఎప్పుడూ వాగుతాడు.
ఇంకొకడు వింటూనే ఉంటాడు.

ఒకడేమో నడుస్తాడు.
ఇంకోకడు వాడిని అనుసరిస్తాడు.

ఒకడేమో ఎదోఒకటి చేస్తాడు.
ఇంకొకడు వాడిని అనుకరిస్తాడు.

ఒకడేమో వస్త్రం ధరిస్తాడు.
ఇంకొకడు నగ్నంగా ఉంటాడు.

ఆ ఒకడేమో నేను.
ఇంకోకడు నా నీడ.

10/11/2013

దగ్ధమైన నిప్పుకణం ..

ఎందుకో ఏమో! మంటలు ఆర్పడానికని
ఇంకో మంట నుండి పురుడు పోసుకున్న
ఒక నిప్పు కణం హడావిడిగా బయలుదేరింది.

కాలుతున్న దట్టమైన ఎద కనుమలను ఆర్పడానికంట.
కృంగిపోతున్న మనసు చెట్టును మొలిపించడానికంట.
పొంగిపోతున్న కన్నీటి ఉప్పెనలను అడ్డుకునేందుకంట.

ఎంత ధైర్యమో దానికి
ఆలోచనా శకలాల్ని తట్టుకుంటుందా?
ఆవేశపు భావాలను భరిస్తుందా?
కోల్పోయిన నవ్వులను పూయిస్తుందా?

ఏమో! ఎవరికి తెలుసు?
దాని నమ్మకమే దాని శక్తేమో!
దాని ధైర్యమే దాని యుక్తేమో!

గాలి ఎటు వీస్తే అటు పరిగెడుతోందది.
కానీ ఏ వర్షానికి ఆరిపోవడం లేదు.
బాధలెక్కడున్నాయో గాలిస్తోందది.
కానీ తన సంతోషాన్ని వదులుకోవడం లేదు.

గాయాలను నయం చేయడానికని ప్రయత్నిస్తోంది.
తనకు గాయాలు అవ్వకుండా జాగ్రత్తపడుతోంది.
కష్టాలు తొలగించడానికి తిరగాడుతోంది.
తనకు కష్టాలు రాకుండా తప్పించుకుంటోంది.

ఆ నిప్పు కణం కర్తవ్యమేంటో?
అసలు దాని గమ్యమేంటో?
తీరా బయలుదేరేసాక
ఇప్పుడు సంధిగ్ధంలో పడి దగ్ధమౌతోంది.

09/11/2013ప్రశ్నలు బదులిస్తాయా?

రెప్పలసలు లేని కంటికి కన్నీటి ధారలు అందాన్నిస్తాయా?
తలుపులు మూసిన మనసుకు తలపులు గాయం చేస్తాయా?

ఎద తడిమే జ్ఞాపకాల చినుకులు తనువునే తడిపెస్తాయా?
మరచిన అనుభూతుల కేరింతలు ప్రేమలో చిగురిస్తాయా?

ఊహలు దరిదాపులకు రాని ఆశలకు అపోహలు అడ్డోస్తాయా?
సమసిపోని గురుతులు స్పృహ కోల్పోయినా సేదతీరుస్తాయా?

సంతోషం పంచని సహవాసానికి బంధాలనే బాకులు గిరిగీస్తాయా?
ఓపికలేని వాంఛలెన్నో పాషాణ హృదయంతో పయనిస్తాయా?

సమ్మతి తెలుపని ఆశలు సమయం లేదంటు సర్దుకుపోతాయా?
ఎడతెరపి లేని కోర్కెలు ఓపిక లేదంటూ వేదనను భరిస్తాయా?

అదుపులేని ఆశయాలు అందిన ఆనందాలను కడతేరుస్తాయా?
కనిపించని జీవితపు దారులు బాధ్యతల చికాకులు మిగిలిస్తాయా?

    

నా చూపులూ నీలాంటివే !

నువు కోపంగా చూస్తున్నాననుకుంటావ్.
నీ చూపులకు నేను భయపడుతున్నాననుకుంటావ్.
అదంతా నీ భ్రమ.
నీవి చాలా పెళుసు చూపులు.
నాకెంత గుచ్చుకున్నా ఇట్టే విరిగిపోతాయి.

ఏ వాన జల్లో మెల్లగా తడిమినట్టు
ఏ పూల రెక్కో మెత్తగా తాకినట్టు
ఏ గాలి తెమ్మెరో ముందుకు తట్టినట్టు
నీ చూపులింకా ఉత్తేజాన్నిస్తాయ్.
నా మనసులో కొత్త ఆశలను రేపుతాయ్.

మైనంతో స్నానం చేసినట్టు నీ చెక్కిళ్ళు అలా ఎలా మెరుస్తున్నాయ్?
నిండు జాబిలి నెలవంకైనట్టు నీ పెదాలపై ఎప్పుడూ ఎలా నవ్వులు పూస్తాయ్?

నెమలి అందం నాట్యమాడేప్పుడు తెలిసినట్టు
నువు చీరలోనే ఎంతో బాగుంటావ్.
ఎవరు నేర్పారు? ఇలా పిచ్చెక్కించేలా చీర కొట్టొచ్చని.

సదా సీదా కాటన్ చీరే అది.
నీ మేని తాకగానే కొత్త అందంతో మురిసిపోతుంది.
లెదర్ హ్యండ్బ్యాగ్ కొద్దిగా పెద్దదే.
నీ భుజాలనుంచి జారి నడుముపై నాట్యం చేయడానికేమో.

ఎందుకింత సన్నగా ఉంటావో నువ్వు!
తింటున్నావో లేదో అని నా బాధంతా.
అలా గోర్లన్నీ కొరికేస్తున్నట్టు కనిపిస్తావ్.
కానీ నీ నెయిల్ పాలిష్ మాత్రం చెరగనివ్వవ్.

జారకున్నా నీ పైటనెందుకు పదేపదే సర్దుకుంటావ్.
నా చూపులు చిరుగాలులు కాదులే.
నీ చూపుల్లా నావీ చాలా పెళుసు.
అందుకే ఇన్నిరోజుల్నుంచీ నీ వెంట పడుతున్నా,
నన్ను నువ్వేమనట్లేదు. త్యాంక్యూ !!

08/11/2013


చిత్రవధలెందుకు ?

చిత్రవధలెందుకు ?

ప్రేమ సోకని పాదరస మనసులో కన్నీటి వరదలెందుకు?
పూవులా వాడిపోయే బ్రతుకుకి వికసించాలనే ఆశలెందుకు?

మూగబోయిన మాటలకు ఒక్కసారిగా తొందరపాటెందుకు?
తొణికిసలాడే మూగ బాసలకు భరించలేని బాధలెందుకు?

చిగురు తొడగని ప్రేమకు పరిచయాల పరామర్శలెందుకు?
బాధల వగరు ఫలములెన్ని తిన్నా ఆకలి తీరదెందుకు?

తలుపు వేసిన మనసుకు ఆశల తాళం దొరికిందెందుకు?
అందుకోలేని ఎండమావిలా కోరుకున్నవి దొరకవెందుకు?

మూసిన కనులకు ఎంతసేపైనా కునుకు రాదెందుకు?
వచ్చినా కలలోనూ కలవరపెట్టే ఈ చిత్రవధలెందుకు?

ఎంత మరచిపోదామన్నా కొన్ని బంధాలు వీడవెందుకు?
మనసు మరణించినా పడ్డ నిందలు తొలగిపోవెందుకు?

07/11/2013


ఇద్దరూ కరుణించరా?

ఎడతెరిపిలేకుండా కన్నీరు కారుస్తూనే ఉన్నా!
అది నీ పల్లానికి చేరి సెలయేరైతే
ఈదుకుంటూ నిన్ను చేరదామని.

నిస్సహాయంగా నిట్టూర్పులొదులుతూనే ఉన్నా!
అది చిరుగాలై నీ శ్వాసను చేరితే
మెల్లగా నీలో ప్రవేశిద్దామని.

నిర్విరామంగా సమయాన్ని నిందిస్తూనే ఉన్నా!
అది నీ జ్ఞాపకాల తీరం చేరితే
నేనూ అదృశ్యమై నీ ముందు వాలదామని.

అయినా ఏం లాభం? ఈ ప్రకృతి కనికరిస్తే కదా?
కరుణజూపి నాపై ప్రేమ కురిపిస్తేకదా?

ఎంత ప్రకోపించినా దీనికి పరిహసించడమే తెలుసు.
ప్రశాంతతనివ్వాలని మాత్రం తెలియదు.

ఎంత వేడుకొన్నా విని వదిలేయడమే తెలుసు.
వేడుక చేసుకొమ్మని వరమివ్వడం తెలియదు.

ఎంత పరితపిస్తున్నా పరీక్ష పెట్టడమే తెలుసు.
ప్రేమ భిక్ష పెట్టాలని మాత్రం తెలియదు.

ఎంత కాదన్నా..
నీ అనురాగం ఒక తీయని బాధ
కావాలనే నను కమ్ముకునే తీరని వ్యధ
నను కలకాలం నడిపించే తరగని సుధ

అందుకే నువ్వూ ఆ ప్రకృతీ ఏదీ నను కనికరించకున్నా
కాశాయం ధరించక, కమండలం పుచ్చుకోక..
నువు సేదతీర్చిన ఒడిని తలుచుకుంటూ
జ్ఞాపకాల బడిలో భగ్న ప్రేమికులందరికీ
ప్రేమ పాఠాలను బోధిస్తున్నా...
నీ తలపుల్నే నెమరేస్తూ జీతంగా పుచ్చుకుంటున్నా...

06/11/2013పిచ్చి మాటలు

భయం భయం ఇక.... క్షణ క్షణం పద.
జగాన్ని కాల్చే పరాన్న జీవులు
రంగులు మార్చే ఊసరవెల్లులు
విజృంభించాయ్.. పదపద పదపద

విరాట పర్వపు వింత నాటకం
విరామమెరుగక మొదలవనుంది.
స్వరాలు మార్చీ పరులనేమార్చీ
మొదలెట్టేయ్ నువ్వో సొంత నాటకం.

నిశీధి దూరని నేల మాళిగలు
ప్రకాశ వేషం వేస్తున్నాయ్...
ధగ ధగ మెరుపుల ఆకర్శణతో
ధరిత్రి నిండా మాటేస్తాయ్...


తరంగ రక్తం పారదర్శకం
కిరణం స్పర్శకి పరావర్తనం
ఆ కాంతికి జడిసే పవిత్రులంతా
పంకిల మనసులు మోసుకుపోనీ.
నిస్తంత్రి మాటల్తో నాశనమవనీ.

చేతులు చకచక నడిచే లోకం
చేదు నిజాల్ని దాచే రూపం
త్వరలో భువిలో వెలియును పాపం.
నువ్వూ నేనే భరిస్తాం శాపం.

గజిబిజి పదముల ఆర్తనాదమిది.
గంభీర స్వర ఉపన్యాసమిది.


06/11/2013
ఎవరు చెప్పారు నీకు?

ఎవరు చెప్పారు? నేను ప్రశాంతంగా ఉన్నానని.
ఎప్పుడూ ముత్యంలా మెరిసే నా నవ్వా?
నన్ను చూసి మురిసిపోయే ప్రతి పువ్వా?

నన్నూ నా నవ్వునూ చూశానన్నావ్! సరే,
సముద్రాన్ని చూశావా? నువ్వూ
తీరం వెంబడి నడిస్తే నీ కాళ్ళను స్పృశించి అది మైమరచిపోతుంది.
అదే కాళ్ళతో ఒక్కసారి హద్దుమీరి చూడు.
కెరటాలతో వెంబడించి మరీ చంపుతుంది.

అప్పుడైనా నీకు అర్థమౌతుందో లేదో!
సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో!
చావు ఎంత భయంకరంగా ఉంటుందో!

నేను అణుబాంబును కాను.
ఆనందం మాటున అణుబాంబును దాచుకున్న చిన్ని రేణువుని.
వినోదాలు పంచుతూ
విషాదాన్ని దిగమింగుకునే దేశదిమ్మరిని.
దేన్నైనా ఎదుర్కోగల ధైర్యశాలినే కానీ అశృపిపాసిని.

అనుభవించింది ఇసుమంత జీవితమే.
ఆకళింపు చేసుకున్నది మాత్రం అనంతమే.
అందుకే సంతోశాన్ని పంచుతూ వెళ్తాను.

అయినా నీకేం? నీ ప్రయాణం సాఫీగా సాగుతోందని అంటావా?
చిరునవ్వుతో చిందేస్తున్నావంటావా?

అయితే విను...
అన్నీ మలుపులే అలుపెరుగక సాగే నా ప్రయాణంలో
అన్నీ కలుగులే అనంత గునపాలు దిగిన నా హృదయంలో

ఎన్నిసార్లు నా గుండె కన్నీటి బొట్టై రాలిపడలేదూ
ఎన్ని కనిపించని గాట్లు మనసును తూట్లు పొడవలేదూ
ఎన్ని ఉద్వేగాగ్నిపర్వతాలు నాలో బద్ధలవ్వలేదూ
ఎన్ని నిశ్చల జలపాతాలు నాలో ఉప్పొంగలేదూ

నాకూ ఉన్నాయ్ కలతలూ కన్నీళ్ళూ
నాకూ ఉన్నాయ్ బాధలూ బంధాలూ

నా గుండెలోనూ పగిలిన గాజుముక్కలెన్నో గుచ్చుకున్నాయ్
నా మెదడులోనూ తుప్పుపట్టిన నాడీ కణాలెన్నో నిర్వీర్యమయ్యాయ్

నా ఆనందంలోనూ విశాద చాయలున్నాయ్
నా విషాదంలోనూ ఆనంద పరిమళాలున్నాయ్

నానుండి విడిపోకముందే నాత్మ చెప్పిన నిజమొక్కటే
నేను నేను కాదనీ ... నేనసలు లేనే లేననీ ...
నేను నాకోసం కాదనీ ... నాకోసం ఏదీ లేదనీ ...

ఇప్పుడు చెప్పు. నేను ప్రశాంతంగా ఉన్నానా?

06/11/2013


రాతి బండ..

నీదని ఊరికే పరిహాసమాడా.
కాదు. నాదే రాతి హృదయం.
పాల రాతి సౌందర్యమే పైపైన.
నల్లత్రాచు విషమే నా గుండె లోలోన.
చూసే అందరికీ అది హలహలం.
అదుంటేనే నాకు కోలాహలం.

నేనో హృదయాన్ని తొలిచే వడ్రంగి పిట్టని.
దరిదాపులకు రానీయక రాళ్ళతో కొట్టండి.
ఎంత వద్దనుకున్నా
విషం చిమ్మడం నా అలవాటు.
దూరంగా ఉంచి మనసులోంచి వెలివేయండి.

ఫలాలు మాగి నోరూరిస్తాయి.
అందులో దాగి విషతుల్యం చేసే వింత కీటకాన్ని నేను.
మీ చేతుల్లో ఉంచుకోకండి. చేయ్యే పాడవగలదు.

ఆమని వెన్నెల్లో కోయిలై కూస్తుంది.
అది నచ్చక అప్పుడప్పుడూ నేను అమావాస్యనౌతా.
ఆ ఒక్కరోజూ నన్ను తిట్టుకొని కాలం గడిపేయండి.

మిగిలిన రోజులు కొద్ది కొద్దిగా విషాన్ని త్యజిస్తూ
పక్షానికోసారి అమృతం పంచే పౌర్ణమినౌతా.
ఆ ముసుగులో మాయచేసి మరింత ప్రకాశిస్తా.

మళ్ళీ మొదటికే వస్తా మరుసటి రోజు.
కిద్ది కొద్దిగా విషాన్ని స్రవిస్తా.
ఆ విషాన్ని నరనరానా నింపుకొని
పూర్తి స్థాయి రాతిబండనౌతా.

మీ అందరి గుండెల్ని మెలితిప్పి
కళ్ళలోంచి కన్నీరులా బయటికి వస్తా.

04/11/2013


రావా? చెలీ !

కలవరింతల మేడలో ఉన్నా చెలీ
కనికరించి పోగొట్టవా నా చలి గిలీ

వెక్కిళ్ళతో చంపుతావెందుకే కోమలి
నీ చక్కిళ్ళలో దాచుకోక సరాసరీ

రెప్ప మూయకనే తలుచుకుంటున్నా చెలీ
రేయి జాగారం నాకు కొత్త కాదుగా మరీ

నిట్టుర్పుల సెగలో రగులుతున్నానే జాబిలీ
నీ చల్లని స్పర్శ పంచగ చేరవా నా దరి

జ్ఞాపకాల బరువుని మోస్తున్నానే చెలీ
జాలి చూపి నా భారం తగ్గించవా ఓసారీ

04/11/2013


ముగిస్తే !

సుగంధాలను శ్వాసించిన ఊపిర్లు
దుర్ఘంధాలను వెదజల్లుతున్నాయి.

ఎందర్నో శాశించిన శరీరాలు
స్పృహలేని శవాలై పడిఉన్నాయి.

కొత్త శిలాజాలుగా మారబోయే కాయాలు
భద్రంగా నేలలో దాగబోతున్నాయి.

ఆకలి తీరిన చితిమంటలు
ఆవలిస్తూ బూడిదను విసర్జిస్తున్నాయి.

భాస్వరం నిండిన అస్తికలు
కొరివిదయ్యాలై మండుతున్నాయి.

కాలీ కాలని కపాలాలు
కఠోర సత్యాలను వల్లిస్తున్నాయి.

బంధాలు కాలిపోయే స్మశానంలో
సమాధులు సాక్షాలై నిలుస్తున్నాయి.

ఎప్పుడూ ఏదో హడావిడి.
ఇక్కడంతే! నిత్య దీపావళి.

03/11/2013మంత్రమేల?

మనసుందని చెప్పి మసి తెరలతో మొండిగా కప్పనేల
మాయ తెలియని ప్రేమకు మంత్రసానై పురుడు పోయనేల

మూసి ఉన్న కనులలో చేరి కలవరింతల మంత్రమేల
మాసిపోని జ్ఞాపకానికి మమకారపు రంగు అద్దనేల

మరుపు రాదని తెలిసి మది నిండా కలల కాంతులేల
మనసు మోయగలదని ఆప్యాయతల వల విసరనేల

మునిగిన ఆనందాశ్రువులు నీ ఊసులలో తేలనేల
మది కొలనులో నిండి తలపు కన్నీరు మిగిల్చనేల

మలినమంటని మాటలతో మనసుకు చేరువ కానేల
మణి దీపాల కాంతిలో దాగి గుండె చెరువు చేయనేల


Related Posts Plugin for WordPress, Blogger...