ఘాట్ రోడ్డు నిర్మాతలు

గట్టు కోణం అంటే తీటా విలువ తెలియక
గుట్టుగా తప్పించుకునే ఇంజీనీర్లారా!
ఎన్ని లారీలు బోల్తాకొట్టాయో చూడండి.
ఎన్ని బస్సులు అదుపుతప్పాయో చూడండి.
ఎన్ని శవాలు సమాధులయ్యాయో చూడండి.

అపకేంద్రాభికేంద్ర బాలాలంటే
మాబలం రాజకీయమనే కాంట్రాక్టర్లారా!
ఎన్ని మలుపులు హద్దు మీరాయో చూడండి.
ఎన్ని అడ్డు గోడలు బద్దలయ్యాయో చూడండి.
ఎన్ని జీవులు నిశ్శబ్ధమయ్యాయో చూడండి.

ఊపిర్లొదిలిన ఆత్మలు నిద్రల్లో తరమకుంటే అడగండి.
క్షతగ్రాతుల వెర్రికేకలు చెవుల్లో మర్మోగకుంటే అడగండి.

అలానే చూస్తూ ఉండిపోండి.
మీరెప్పుడైనా అదే దార్లో కార్లో వస్తూ చూడండి.
మలుపు మలుపుకూ గుండె వేగం పెరక్కపోతే అడగండి.
చుట్టు చుట్టు కీ జుట్టూ నిగ్గపొడుచుకొకుంటే అడగండి.

మీ చిన్న కూతురు భయంతో మిమ్మల్ని వాటేసుకోకుంటే అడగండి.
నిజం తెలిస్తే నిందలేస్తూ మనసులోంచి మిమ్మల్ని గెంటేయకుంటే అడగండి.

అయినా సరే మీ గుండె అడుగంటి మసిబారిందని అనిపిస్తే
మనసు కడుక్కోకుండా ఆ యముడి పోటీగా
ఇక్కడే ఇంకో నరకాన్ని నిర్మించండి.
అందులోనూ నాసిరకపు శిక్షలే వేస్తూ
స్వర్గాన్ని సెకన్లచొప్పున అమ్మేసుకోండి.

27/11/2013


2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...