వాడంతే !!

వాడంతే నెమ్మదిగా అటు వైపెళ్తూ
కావాలనే పేడ తొక్కి గుంపులో పరిగెడతాడు.

మాసిపోయిన కాలికున్న హవాయి చెప్పులు
తప్ తప్ తప్పని ప్రతిసారీ అరుస్తుంటాయి.
చినిగిపోయిన బట్టలు ఒక్కో పేలికను రాలుస్తూ ఉంటాయి.
అయినా అంటుకున్న పేడను అందరిపై ఎగజిమ్ముతూ
వాడింకా హుషారుగా ముందుకు పరిగెడతాడు.

ఆ గుంపంతా అందరూ దొంగలే
వొళ్ళంతా తెల్లటి వస్త్రాన్ని చుట్టుకొని
తేట తెల్లగా నవ్వులు చిందిస్తూ
ఒకర్నొకరు భ్రమింపజేసుకునే వింత పశువులు
పైపై మాటల వలలు పన్నే రాక్షస సాలీడు బంధువులు

అందుకే వాడిజోలికెవ్వరూ వెళ్ళరు.
వాడి పరుగే వాడి సంపాదన.
అదే మనసుకు మూడు పూటలా తిండి పెడుతుంది.
వాడి నీడే వాడి బలం.
అదే వాడి వెనకుంటూ ఎక్కడలేని ధైరాన్నిస్తుంది.

వాడెప్పుడూ ఆగనే ఆగడు. అలసిపోతేగా
వాడెప్పుడూ తిననే తినడు. ఆకలేస్తేగా
వాడెప్పుడూ కలలే కనడు. నిద్రొస్తేగా

కుళ్ళిపోయిన మెదడే. మనసు కృంగిపోనిది.
మాటలు తుప్పుపట్టినవే. చేతలు చాలా పదునైనవి.

వాడంతే. వాణ్ణలా వదిలేయండి.

30/10/2013


2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...