కడుపు మోసేది కొన్ని నెలలే !

అమ్మెప్పుడూ నన్ను తొంగి చూస్తూనే ఉంటుంది.
నేనెక్కడున్నా ఆ చూపులే నాకు కాపలాగా ఉంటాయి.
ఆమె కడుపు కొన్ని నెలలకే ప్రసవించినా,
హృదయం మాత్రం నిత్య గర్భిణై నన్నెప్పుడూ మోస్తూ,
ఇప్పటికీ సమ్రక్షిస్తూనే ఉంది.

ఆ గోడలమధ్యే నా హృదయం ప్రేమ పొరలను తొడుక్కున్నది.
ఆ గుండె గదులే నేర్పించాయి: నా సంస్కారాభరణాలను
సహనంతో చేయబడ్డ కవచకుండలాల వెనుక దాచాలని.
అందుకే ఆ హృదయద్వారాలు దాటి నేనెక్కడికీ వెళ్ళను.

అప్పుడప్పుడూ అమ్మ గుండెందుకో
నా ఆశలకు కళ్ళెంవేయడానికని కుచించుకుపోతూ ఉంటుంది.
అది నచ్చక గుండెగోడల్ని నా రెండు కాళ్ళతో తంతూనే ఉంటాను.
అయినా గుండె మాత్రం వ్యాకోచించదు.

తన్నీ తన్నీ అలసిపోయి నేను అక్కడే కూలబడతాను.
కుదుటుపడి ఆలోచిస్తే అమ్మ చేసిందే సరైనదనిపిస్తుంది.
ఇంకా లోతుగా ఆలోచిస్తే, అమ్మ గుండెను నలుపుతున్నది
నా చేస్టల పిడికిలేనని తెలుసుకుని సిగ్గుపడతాను.

ఓ వైపు అమ్మ గుండెల్లో తంతూ ఇంకోవైపు పిడికిలిలో బిగిస్తూ
అమ్మను ఎంత క్షోభ పెట్టానోనని క్షమాపణలు కోరతాను.

అప్పుడు అమ్మ ఏమంటుందో తెలుసా?
" చిన్నప్పుడు కడుపులో తన్నినప్పుడు బాధపడ్డానా?
అవి నాకెంతో ఆనందాన్ని కలిగించాయి.
ఇప్పుడు అంతకంటే ఆనందంగా ఉన్నాను.
నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావని తెలిసీ "

05/10/2013




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...