గులాబీ లేడీ [ నేటి మహిళ ]

గులాబీ మొక్కకు నీరు పోయాలి.
గబగబా ఇంటిపనులూ ఒంటపనులూ చక్కబెట్టుకోవాలి.
లంచ్ కూడా బ్రేక్ఫాస్ట్ తో కలిపి వండి క్యారీలో పెట్టుకోవాలి.
అంతకు ముందే ఆ దేవుణ్ణి ఒకసారి పలకరించాలి.
మనసునే నైవేద్యంగా పెట్టీ మళ్ళీ దాన్నే ప్రసాదంలా గుండెల్లో దోపుకోవాలి.

గుడ్డ కప్పిన స్కూటీ దుమ్ము దులిపీ ఆఫీసుకు పరిగెత్తాలి.
వందల వింత చూపులను చూసీ చూడనట్లు;
దూది పింజల మాటల్తో శూలాల్లా గుచ్చే నోర్లను,
చమత్కారంతో మూయించడమో
చిరునవ్వుతో స్వాగతించడమో...

సాయంత్రం వరకూ ఇదేవరస.
యంత్రం లా పనిచేసే ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు.
గుండెకు తూట్లు పడుతున్నా సంజాయిషీలతో
ఇంట్లో వాళ్ళకు సెల్ఫోన్లో పలకరింపులు.
మధ్య మధ్యలో విచిత్ర బంధాల చిత్రవధలు.

సేదతీరేందుకని పరిగెడితే నవార్లు తెగిన చెప్పుల వెక్కిరింతలు.
పంచరైన బండిని రెపేరు చేయించి మళ్ళ్లీ ఇంటిదారి పట్టాలి.

అలసటతోనో.. అసహనంతోనో ...
దివాన్ కాట్ మీద దివానీలా కూలబడితే
కాలింగ్ బెల్లుల మోత. ఎన్నో బిల్లుల వాత.

ఇంటిని సర్దే కార్యక్రమం అప్పుడే మొదలౌతుంది.
అందర్నీ సేదతీర్చాల్సిన పనీ అప్పుడే.
సగం రాత్రి గడచినా సగం పనులు పూర్తికాకముందే
మళ్ళీ ఆ సూర్యుడు రొటీన్ గా వెక్కిరిస్తాడు.

వాడిపోయే గులాబీ మొక్కకు ఇప్పుడు మళ్ళీ నీరు పోసి బ్రతికించాలి.
మరి నా జీవితం ఎప్పుడు పువ్వై పూస్తుందో ?!

11/10/2013

( డెడికేటెడ్ టు ఆల్ వుమెన్ )


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...