మాసిపోని మరకలు....

రక్తం స్రవించిన కొందరి శ్రామికుల
కాలి పగుళ్ళ మరకలు
గుండె మాటున దాగిన దిగుళ్ళను
వాటి ఎర్రదనంతో కప్పేస్తున్నాయి.

పంటి కింద స్వేదం అంటిన
కొన్ని అన్నం మెతుకులు
బయటపడుతున్న ఆక్రందనల్ని
గొంతులో అణగద్రోక్కుతున్నాయి

బాధనో బంధనపు సంకెళ్లనో
తెంచుకోవాలన్న తెంపరితనపు ఆలోచనకు నోచుకోక
యెవరి దయా వర్షించబడని
పాడుబడ్డ అస్పృశ్య హ్రుదయాలయాలవి

యే కర్మసిద్ధాంతాలూ మార్క్సిజాలూ
వారి కష్టాలకు ఫలితాల్ని ఇప్పించడం లేదు
యే వైప్లవ్య గీతాలూ యుద్ధనగారాలూ
వారి రక్తాన్ని వృధాఆవకుండా ఆపడంలేదు
యే ప్రజాస్వామ్యాలూ నియంతృత్వాలూ
వారి స్వేదానికి ఖచ్చితమైన విలువివ్వడంలేదు

చిక్కుముడుల హక్కులతో బంధించబడ్డ దీనులు
ప్రపంచం నలుమూలలా
ఉచ్చుల హుక్కులకు వేలాడుతున్నారు
వారి ఆశ చిగురించినది
వారి ఘోష బయటపడనిది........

వొకానొక రాత్రివొకానొక రాత్రి
యెక్కడైనా మనిద్దరం
యేకాంతంగా కలుద్దాం...

మెల్లగా వొకరి కన్నీటిని
యింకొకరి మనసులో వొంపుకొని
యెడబాటు మలినాల్ని కాస్తంత పోగొట్టుకుని
గాఢమైన కొన్ని కౌగిళ్ళతో
కుశల ప్రశ్నలు సంధించుకుందాం...

మనసులో నలుగుతున్న
కొన్ని ఉద్వేగాలను
సున్నితంగా పెకళించి
మౌన క్షణాలను నిశ్శబ్ధంగా ఆస్వాదిద్దాం...

లెఖ్ఖలేనన్ని జీవిత చిక్కుముడులని
ఓపిగ్గా ముడులువిప్పుకుంటూ
కొత్త సమాధానాలను అణ్వేషిద్దాం...

గతకాలపు గురుతుల మన పుస్తకంలో
ఇంకొన్ని పుటల్ని ప్రేమతో అతికించి
బ్రతుకు గ్రంధాన్ని
అందంగా రాసుకుందాం...

నక్షత్రాలతో సుందరంగా తయారైన
ఒకానొక ఈ రాత్రిని
మన చిరునవ్వుల వెన్నెల్లతో
మరింత అందంగా ముస్తాబుచేద్దాం...
Related Posts Plugin for WordPress, Blogger...