గాజు పరదా...


ఈ మనసు అనేది ఉంది చూడూ
అది గాజు పరదాల్లో చిక్కుకున్న
కోతిపిల్లలా ఆలోచిస్తూ వుంటుంది ...
వొక్కోసారి అనిపిస్తూవుంటుంది నాకు- 
దాని చేష్టలు ఎంత విచిత్రమో కదా అని..
దీనికి ఎంత కాల్పనిక శక్తి ఉంటే మాత్రం
ఇన్ని అసంబద్ధ కొరికలా?
ఎంత క్షమాగుణం ఉంటే మాత్రం
ఇంత దాతృత్వమా?
ఎంత కాఠిన్యం ఉంటే మాత్రం
ఇంత కర్కశత్వమా?
వో పట్టాన అంతుచిక్కని విశ్వరహస్యాన్ని
గుప్పెడు స్థలంలో దాచుకున్న
కృష్ణబిలంలాంటి దీని శాస్త్రీయతను
నేను ఎంత శోధించినా అంచనా వేయగలనా?
ఓ మనసా...
బంధించేకొద్దీ విస్తరించే నీ వైశాల్యానికీ
విస్తరించేకొద్దీ బందీ అయ్యే నా సంకుచిత్వానికి
ఎన్నెన్ని భేషజాలో కదా!??

ఎండమావులు...


అలుపులేని బతుకు ప్రయాణంలో
జీవితపు త్రోవంతా కనిపించని చీలికలే!
ఏది ఎండమావో తెలియని బంధాల నీడల్లో
సేదతీరే సమయమంతా తెలియని గుబులే!

కొన్ని ఆశల సౌధాల్లో
ఇంకొన్ని ఆశయాల మేఘాల్లో
యదలోతుల్లోంచి జారిపడే కలతల కన్నీళ్లు!
మనస్పర్ధల అలజడులతో ఉప్పొంగే భావావేశాల్లో
తుడిచిపెట్టుకుపోయే ప్రేమాభిమానాలు!

కోపతాపాల శత్రుసైన్యాన్ని
క్రోధావేశాల బలహీనతల్ని
ధనాత్మక ఆలోచనలతో జయించినపుడే కదా
అపార్థాల అడ్డుగోడలు తొలగి
దారంతా నిండిన సుమగంధాల పలకరింపులు
జీవితాన్ని ఇంకొంత దూరం
ఓపిగ్గా నెగ్గాడానికి దోహదం చేస్తాయి!

అగాధధరీ...


లోతుతెలియని అగాధమంత నీ మనసుతో
అంతులేని ఆకాశమంటూ నన్ను కీర్తిస్తూ
నీలోకి సమ్మోహనంతో స్వాగతిస్తావు!
నీక్కావలసింది అర్థమైనట్లు మెల్లగా నిన్ను పరుచుకొని
నా దాహాన్ని దేహంతో తీర్చుకోవడానికని
తీయని ప్రయాసపడటానికి ప్రయత్నిస్తాను!
అచ్చం జీవితంలానే మొదట మెల్లగా ప్రాకుతూ
ఆపై నడక తర్వాత ఆపకుండా పరిగెత్తి
జీవన గమ్యాన్ని చేరుకున్నట్లు అలసిపోతాను!
నుదుటిపై జారే చెమట చుక్కని ముద్దాడుతూ
నీ కన్నీటి తడిని పరిచయం చేస్తావు!
వ్యధ నిండిన గాలిబ్ గానంలా
అందమైనదిగానే కనిపించే నీ మొహాన్ని
మోహపు మసక వెలుతుర్ల మధ్య వుంచి
కొన్ని బాధల్ని నవ్వులతో కలబొసి
నాపై నిట్టూర్పుతో వంపుతావు!
సహజంగానే నీ తలను నా గుండెలపై వుంచి
నిన్ను సేదతీరుస్తానోలేదో తెలియని నాపై
అసహజంగా ఒక బాధ్యతను మోపి
మన బంధానికి ఇంకాస్త రంగులద్దుతావు!
వ్యధను పంచుకొని బాధను కాసింత తుంచుకోవడానికి
ఎంతైనా ఈ రాత్రుళ్ళు కాస్త సహాయపడతానుకుంటూ
ఎంతోకొంత బోధపడినవాడిలా నీ ఒళ్లో తలపెట్టుకుని
కన్నీళ్లను తుడుస్తూ కాసేపు ప్రపంచాన్ని మరచిపోతాను!

ఆకు పందిరి...

నిన్ను దూరం నుంచి కావలించుకుంటూ
నీ జీవితాన్ని కావలిగాస్తూ
ప్రాణవాయువును కానుకిచ్చే ఆకుపచ్చ హృది
అదిగో అంతరించిపోతున్న ఆ అడవే!

నీకోసం గగన శిఖరాలను కరిగిస్తూ
వురిమే మేఘాలను వింజామరై కదిలిస్తూ
చినుకు రవ్వల్ని నేలదించే అమృతవర్షిణి
అదిగో నువ్వు నరికేస్తున్న ఆ అడవే!

మృత్తిక లోతుల్లో ప్రేమవేర్లను పెనవేసి
నేలంతా పారవశ్యంతో పరచుకుని
నీకు ఆహారాన్నీ ఆహ్లాదాన్నీ పంచె ఆకుపందిరి
అదిగో నీదోపిడీకి ఖాళీ అవుతున్న ఆ అడవే!

రోదించే కరువు కన్నీళ్లు చూడలేక
మట్టికీ మేఘానికీ వంతెనవేసి
నీ మనుగడకు నీళ్ళను ధారబోసే నిచ్చెలి

అదిగో నువ్వు మరచిపోతున్న ఆ అడవే!

దొర గాళ్లు...


వాళ్ళు దొరతనపు కంపుని
దోసోట్లో పట్టుకుతిరిగెటోళ్లు
నువ్వు పొరబాటున కనబడితే
వాళ్ళు ముందు నీ బట్టలు చూస్తారు
నీ పేరును బట్టి ఏమీట్లో వెదుకుతారు
మాటలు కలిపి మూలాల్లో దూరతారు
నీ చర్మం రంగులో నీ పూర్వీ'కుల
రక్త నమూనాల్ని అంచనా వేస్తారు
నీ హోదాలు పలుకుబళ్ళు ఆరా తీసాక
మెల్లగా దోసిలి విప్పి
తాతల గొప్పలు ఇంటిపేరులోని వీరత్వాలు
తోకలోని పౌరుషాలు కథలు కథలుగా నీపై కుమ్మరిస్తారు
నిన్ను సరిగ్గా అంచనా వేశాక
నీపై సానుభూతితోనో నీ పట్ల అజమాయిషీతోనో
మెల్లగా భయపడేలా చేస్తారు
నీ అవసరాలన్నీ తెలుసుకొని
వారి చుట్టూ తిరిగేలా ప్రణాళికలు రచిస్తారు
నీ చుట్టూ తెలియని ఉచ్చు బిగించి
నీ అన్నం మెతుకుల్లో వేలుపెట్టి
నీ జీవితాన్ని వాళ్ళ తీరని ఆకలికి బలి ఇస్తారు
వేటాడ్డానికి అలవాటుపడ్డ దొరల దేహాలు
మళ్లీ ఇంకో బలిపశువుకై వెతుకులాటకు బయలుదేరతాయి

వై ఐ క్రైడ్? | Why I cried ?


పుట్టుకను బట్టో...
పుట్టించిన వాళ్ళను బట్టో...
బాల్యాలు దగ్ధమయ్యే నేలలో
దేశ ప్రగతి సందిగ్ధమే అవుతుంది!
అసంకల్పితంగా దారితప్పి
రెక్కలు మొలవని బాల్యం
సమాజపు సర్కస్ లో
వొక వెలకట్టలేని ప్రదర్శనే అవుతుంది!
అధికార దాహానికి ఓట్లు
ఐదేళ్లు సాగడానికి నోట్లు
ఇన్నిన్ని రాజకీయ కునుకుపాట్లలో
పసిమనసుల జీవితం
తెలియకుండానే వ్యధను నింపుకున్న
సంతోషభరిత గానం అవుతుంది!
నిలువెల్లా గాయపరుచుకున్న
పిల్ల'నగ్రోవి శబ్ధంలో
కనిపించని వో శూన్య వీచికే అవుతుంది!
హక్కులు మాట్లాడే విధ్యకీ
ఆకలిని తరిమే ఆహారానికీ
నోచుకోని చిరు స్వేచ్చాజీవులకు
రాజ్యం ఇప్పుడు యే పరిహారాన్ని ఇచ్చి
ప్రాయశ్చిత్తం చేసుకోవాలి??
Related Posts Plugin for WordPress, Blogger...