దొర గాళ్లు...


వాళ్ళు దొరతనపు కంపుని
దోసోట్లో పట్టుకుతిరిగెటోళ్లు
నువ్వు పొరబాటున కనబడితే
వాళ్ళు ముందు నీ బట్టలు చూస్తారు
నీ పేరును బట్టి ఏమీట్లో వెదుకుతారు
మాటలు కలిపి మూలాల్లో దూరతారు
నీ చర్మం రంగులో నీ పూర్వీ'కుల
రక్త నమూనాల్ని అంచనా వేస్తారు
నీ హోదాలు పలుకుబళ్ళు ఆరా తీసాక
మెల్లగా దోసిలి విప్పి
తాతల గొప్పలు ఇంటిపేరులోని వీరత్వాలు
తోకలోని పౌరుషాలు కథలు కథలుగా నీపై కుమ్మరిస్తారు
నిన్ను సరిగ్గా అంచనా వేశాక
నీపై సానుభూతితోనో నీ పట్ల అజమాయిషీతోనో
మెల్లగా భయపడేలా చేస్తారు
నీ అవసరాలన్నీ తెలుసుకొని
వారి చుట్టూ తిరిగేలా ప్రణాళికలు రచిస్తారు
నీ చుట్టూ తెలియని ఉచ్చు బిగించి
నీ అన్నం మెతుకుల్లో వేలుపెట్టి
నీ జీవితాన్ని వాళ్ళ తీరని ఆకలికి బలి ఇస్తారు
వేటాడ్డానికి అలవాటుపడ్డ దొరల దేహాలు
మళ్లీ ఇంకో బలిపశువుకై వెతుకులాటకు బయలుదేరతాయి

4 comments:

 1. నీ జీవితాన్ని వాళ్ళ తీరని ఆకలికి బలి.

  ReplyDelete
 2. గరం గరం...గవర్నమెంట్ పైనా :)

  ReplyDelete
 3. నీ ఆవేశానికి అర్థం ఉంది వినోద్.

  ReplyDelete
 4. మీలో ఇంత ఆవేశం ఉందా?

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...