ఇంతకీ నువ్వెవరూ?



పొద్దునే మొద్దులా నిద్రపోతుంటానా...
సూర్యకిరణాల్లోంచి వచ్చి గిల్లిమరీ నన్ను లేపుతావు!
నిద్రమత్తులో స్నానంచేస్తుంటానా...
ప్రతి నీటిచుక్కలో నువ్వొచ్చి నన్ను నిండా తడిపేస్తావు!
బద్దకంగా బట్టలు వేస్కుంటూంటానా...
అద్దంలోంచివచ్చి షర్ట్ ఇన్ చేస్కోమని కసురుతావు!
ఆలస్యంగా ఆఫీస్కి వెళ్తుంటానా...
బ్యాగ్లోంచి బుక్కువై వచ్చి నిన్ను చదవమంటావు!
హడావిడిగా ఫైల్లు తిరగేస్తుంటానా...
తెల్లకాగితంలోంచి వచ్చి నా ముద్దుసంతకం పెట్టించుకుంటావు!
మద్యాహ్నం బోంచేస్తుంటానా...
అన్ని మెతుకుల్లో నువ్వే దాగి నాలో నిండిపోతావు!
అలసిపోయి ఇంటికి వెళ్తుంటానా...
సెల్ ఫోన్లా మారి తుంటరి కబుర్లెన్నో చెప్తావు!
ఇంటికెళ్ళి షూస్ తీస్తుంటానా...
మల్లెతీగలా నన్నల్లుకొని పరిమళింపజేస్తావు!
రాత్రి నిద్రపట్టక దొర్లుతుంటానా...
దిండులా మారి నన్ను గట్టిగా హత్తుకుంటావు!
రెప్పవాల్చి సేదతీరుతుంటానా...
కమ్మని కలవై వచ్చి ముద్దెట్టి బజ్జోబెడతావు!
ఇంతకీ నువ్వెవరు?

కొత్త కవిత!??



పాతబుక్కుల తాలింపుల్లో
కొత్త కవితల కక్కులెన్నో

అచ్చేసిన కాగితాల్లో
పుచ్చిపోయిన రాతలెన్నో

భారమైన పదబంధాల్లో
భావంలేని వ్యర్థాలెన్నో

అర్థంలేని అల్లికల్లో
అడుగంటిన భావాలెన్నో

దొంగలించిన రంగు వాక్యాల్లో
దొరతనపు ముసుగులెన్నో

కిరాణా కవుల తిరుణాల్లో
అలిసిపోయిన అక్షరాల మరణాలెన్నో....

వెళ్ళిపో....



వద్దు
ఎందుకిలా మనసు చట్రాన్ని తిప్పుతావ్?
నన్ను పూర్వపు జ్ఞాపకాల లోయల్లో
ఎందుకలా నెట్టేయాలని చూస్తావ్?

నీకు నాపై ప్రేమో...పిచ్చో కావచ్చు
వలపో...వ్యామోహమో ఉండొచ్చు...
నువ్వు నా ఆస్వాదనలో స్వాంతనో...
నా ఆరాధనలో సంతోషాన్నో పొందొచ్చు...
నానుంచి మాత్రం స్వచ్చమైన ప్రేమని
ఖచ్చితంగా ఆశించలేవు.

గతం పొదల్లో దాగిన
మొగలిపరిమళాల్ని నీకోసం పంచలేను.
వ్యాపకాలైన నా కొన్ని జ్ఞాపకాల్లో
నిర్ధాక్షణ్యంగా నిన్ను నెట్టేస్తాను.
అంతేకానీ
నీపై వల్లమాలిన వలపు కురిపించలేను....

ప్రేమిస్తూ బ్రతకడంలో హాయుందని తెలుసంటావు...
మరి అది దక్కకపోతే మనసు రాయౌతుందని తెలుసుకోలేకపోయావా...

నాలోలోపలికి ఎంత తవ్వినా
నా నవ్వు తప్ప ఇంకేం కనపడదు నీకు
బంధాలూ... ఆప్యాయతలూ... అన్నీ సన్నాయి రాగాలే
ఒక్కసారి మూగబోయేంతవరకూ
వాటి కర్కశత్వం తెలియరాదు...

పో.. వెళ్ళిపో ...
నన్ను దాటుకొని... ప్రెమరాహిత్యాన్ని మూటగట్టుకుని...
ఎటైనా వెళ్ళి స్వార్థంతో బ్రతుకు..
మూగ మనసంటూ...
భావాల్ని మూగబోనివ్వకుండా నిర్భయంగా బ్రతుకు...
మనసు మాట వినదంటూ వెర్రి ఆశలతో
ప్రేమకు నా అనుమతికై కాలయాపన చేయకు...
వెళ్ళు... నానుంచి దూరంగా వెళ్ళిపో .....

నువ్వు కాలంచేస్తే...



నువ్వు నాకు దూరమై
లోకం విడిచి వెళ్ళిపోతే
నేనేమైపోతానోనని చింతించకు.

సహచరివిగా ఉన్న నువ్వు
శాస్వితంగా నాలో ప్రతిష్టించబడతావు.
నా అణువణువూ నిండి నిరాకారిణివై
చిరకాలం నాలో సంపూర్ణమైపోతావు.

మేఘాలు సంతోషంతో నవ్వే ఋతువుల్లో
ఆనందభాష్పమై రాలి నన్ను తడిపేస్తావు.

కలువ చంద్రుడితో చుట్టరికం కుదుర్చుకునే రాత్రుల్లో
చిరుగాలై నన్నావరించి చుంబిస్తావు.

ప్రపంచం గాఢంగా నిదరోతున్న వేళల్లో
మిణుగురు వెలుతుర్ల కౌగిలై జోలపాడతావు.

నాలో మౌనం మేల్కొన్నప్పుడు
నీ అందమైన గోర్లతో మెల్లగా గిల్లి మురిపిస్తావు.

నేను ఒంటరిగా ఉన్నప్పుడు
ప్రతి నిర్జీవిలో నువ్వు దూరి తుంటరిగా నన్ను తిడతావు.

ప్రయాణంలో నేనున్నపుడు
తెఅచిన కిటికీవై చల్లని కబుర్లెన్నో చెప్తావు.

ఇలా అన్నిట్లో నువ్వుంటావని సర్దుకుపోయేవేళ
అంతరాత్మవై జ్ఞాపకాల ఆశ్రువులు రాల్చి
నిన్ను మరచిపోని నా మదిని ముంచేస్తావు.

అయినా రోజూ బ్రతికేస్తాను
నాలో ఉన్న నిన్ను చంపుకోవడం ఇష్టంలేక.....

అఫీషియల్ లవ్వు లేఖ!


నీ చిరునవ్వును నే రాసుకున్న చిత్తుప్రతిలో
ఆమోదాద్యాక్షరమని నా వలపులేఖను నివేదిస్తూ
విరహాక్షరాలతో నిండిన నా హృదయ దస్త్రాన్ని
నీ ప్రేమముద్రకై అర్జీ పెట్టుకుంటున్నా ప్రియా!


అసంతృప్తితో అదనపు అర్హతల సంజాయిషీకై
పరిపరి విధాల ప్రత్యుత్తరాలు జరగాలంటూ
దయచేసి వాయిదాల ఆజ్ఞలు జారీచేయకని
బేజారి మోడుబారిన ఎదతో నివేదిస్తున్నా!

ప్రణయాన్నిమోదంతో ఆమోదిస్తావో
ప్రయాణాన్ని ఖేదంతో తిరస్కరిస్తావో
అర్హతకై స్వదస్తూరితో రాసిన ఆఖరి కాగితంలో
సమాధానంగా నీ తీపి సంతకం కోసం నిరీక్షిస్తున్నా!

ఆఖరిగా ఒక్క విన్నపం!
నీ తిరస్కారాన్ని బహిరంగంగా గస్తీపత్రంలో ముద్రించకు
సమ్మతమైతే నీ ఉత్తర్వులను శాసనాలుగా జారీచెయ్యి!!

మన బంధం


నిజంగా ఎప్పుడోఒకప్పుడు
ఖచ్చితంగా నీదరికొస్తాను
నెమ్మదిగా నగ్నంగా మారి
నీలో నిమగ్నమై కలిసిపోతాను
నీకు బాగా తెలుసు..
నాక్కూడా తెలుసు...
నా మనసుకు మిక్కిలి సౌఖ్యాన్నిచ్చేది
నీ నులివెచ్చని కౌగిలేనని
నేనక్కడే భద్రంగా ఉంటానని
అందుకేనేమో నువ్వు నిరభ్యంతరంగా
నా చుట్టూ పరుచుకుంటావు
శాశ్వితంగా నాకు ఆనందాన్ని పంచుతావు
ఒక్కసారి ఏకమైతే
ఇంకెవ్వరూ మనల్ని విడదీయలేరు
ఎవ్వరికీ అంతుచిక్కకుండా
యాద్రుచ్చికంగా నీ ఒడిలో వాలిపోతాను
నన్ను నీలో కలిపేసుకుంటావు కదూ...
తప్పకుండా కలిపేసుకుంటావు.
ఎందుకంటే నేను చచ్చిపోతే నా దేహాన్ని
నువ్వు తప్ప ఇంకెవరూ కౌగిలించుకోలేరు.
నువ్వు తప్ప నన్నెవరూ నీలో కలిపేసుకోలేరు
ని(మ)న్ను తలా పిరికెడు నాపై వెదజల్లి
మనిద్దర్నీ ఏకం చేసి... ఉన్న బంధాలన్నింటినీ తెంపేసుకుంటారు
ఇదిగో...వచ్చేస్తున్నా సిద్ధంగా ఉండు
Related Posts Plugin for WordPress, Blogger...