నువ్వు కాలంచేస్తే...



నువ్వు నాకు దూరమై
లోకం విడిచి వెళ్ళిపోతే
నేనేమైపోతానోనని చింతించకు.

సహచరివిగా ఉన్న నువ్వు
శాస్వితంగా నాలో ప్రతిష్టించబడతావు.
నా అణువణువూ నిండి నిరాకారిణివై
చిరకాలం నాలో సంపూర్ణమైపోతావు.

మేఘాలు సంతోషంతో నవ్వే ఋతువుల్లో
ఆనందభాష్పమై రాలి నన్ను తడిపేస్తావు.

కలువ చంద్రుడితో చుట్టరికం కుదుర్చుకునే రాత్రుల్లో
చిరుగాలై నన్నావరించి చుంబిస్తావు.

ప్రపంచం గాఢంగా నిదరోతున్న వేళల్లో
మిణుగురు వెలుతుర్ల కౌగిలై జోలపాడతావు.

నాలో మౌనం మేల్కొన్నప్పుడు
నీ అందమైన గోర్లతో మెల్లగా గిల్లి మురిపిస్తావు.

నేను ఒంటరిగా ఉన్నప్పుడు
ప్రతి నిర్జీవిలో నువ్వు దూరి తుంటరిగా నన్ను తిడతావు.

ప్రయాణంలో నేనున్నపుడు
తెఅచిన కిటికీవై చల్లని కబుర్లెన్నో చెప్తావు.

ఇలా అన్నిట్లో నువ్వుంటావని సర్దుకుపోయేవేళ
అంతరాత్మవై జ్ఞాపకాల ఆశ్రువులు రాల్చి
నిన్ను మరచిపోని నా మదిని ముంచేస్తావు.

అయినా రోజూ బ్రతికేస్తాను
నాలో ఉన్న నిన్ను చంపుకోవడం ఇష్టంలేక.....

3 comments:

  1. ఇదేం ప్రేమ వినోద్...కాలం చేయడమేంటి ప్రేమించినామె :-)

    ReplyDelete
  2. మెన్నే ప్రేమలేఖ రాసి అంతలోనే కాలంచేస్తే అనడం ఏంటో :-)

    ReplyDelete
  3. రోజూ బ్రతికేస్తాను.....like this

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...