మాసిపోని మరకలు....

రక్తం స్రవించిన కొందరి శ్రామికుల
కాలి పగుళ్ళ మరకలు
గుండె మాటున దాగిన దిగుళ్ళను
వాటి ఎర్రదనంతో కప్పేస్తున్నాయి.

పంటి కింద స్వేదం అంటిన
కొన్ని అన్నం మెతుకులు
బయటపడుతున్న ఆక్రందనల్ని
గొంతులో అణగద్రోక్కుతున్నాయి

బాధనో బంధనపు సంకెళ్లనో
తెంచుకోవాలన్న తెంపరితనపు ఆలోచనకు నోచుకోక
యెవరి దయా వర్షించబడని
పాడుబడ్డ అస్పృశ్య హ్రుదయాలయాలవి

యే కర్మసిద్ధాంతాలూ మార్క్సిజాలూ
వారి కష్టాలకు ఫలితాల్ని ఇప్పించడం లేదు
యే వైప్లవ్య గీతాలూ యుద్ధనగారాలూ
వారి రక్తాన్ని వృధాఆవకుండా ఆపడంలేదు
యే ప్రజాస్వామ్యాలూ నియంతృత్వాలూ
వారి స్వేదానికి ఖచ్చితమైన విలువివ్వడంలేదు

చిక్కుముడుల హక్కులతో బంధించబడ్డ దీనులు
ప్రపంచం నలుమూలలా
ఉచ్చుల హుక్కులకు వేలాడుతున్నారు
వారి ఆశ చిగురించినది
వారి ఘోష బయటపడనిది........

నీకై...అపుడప్పుడూ నిశ్శబ్ధాన్ని పలకరిస్తూ
శున్యంలో నీకోసం

మౌనంగా ఎదురుచూస్తాను...
చీకటిని కప్పుకొని 
వెలుతురు పాటొకటి పాడుకుంటూ

మిణుగురులా తిరుగుతాను....
నలుపూతెలుపుల రాత్రీపగల్ల గళ్ళలో
చదరంగమాడుతూ

నీకోసం వెదుకుతూ
ప్రేమ నావలో ఒంటరిగా సాగిపోతానూ...
కాలమనే కాన్వాసుపై

కాసిన్ని కన్నీళ్ళతో అలల్లాంటి గీతలు గీస్తాను...
నీవెదురొచ్చే క్షణం కోసం
పరోక్షంగా మరణంతో పోరాడుతాను...

నల్ల వెలుతుర్లురాత్రి
ఆకాశం ముఖాన్ని
పూర్తిగా చూడకముందే
సూరీడు
చీకట్లను కొద్దికొద్దిగా కడిగేసుకుంటూ
కష్టజీవుల రక్తాన్ని
ఎర్రెర్రగ ప్రతిబింబిస్తూ నిద్రలేస్తున్నప్పుడు
దోసిళ్ళతో
కాసిన్ని చన్నీళ్ళు
మొహాన కుమ్మరించుకుని
వలసపిట్టల్లా ఒద్దిగ్గా ఎగిరిపోతున్న కొందరు
లేవగానే ఆకలి యుద్ధానికి
సన్నద్ధమౌతుంటారు...

వారిక్కావల్సింది
డొక్క నింపుకోవడానికి వొక పని
రెక్కల్లో సత్తువ అరిగిపోయేదాకా
యంత్రాల కుతంత్రాలకు ధీటుగా
పుంజుకొని ఇంకొంచెం చకచకా కదలడానికి
శ్రమజీవుల కష్టాన్ని లెక్కలేయడానికి
చర్నకోల్ లాంటి వొక యజమాని....

ఇప్పుడీ బేరసారాల జీవనయాత్రలో
బ్రతుకు భారం కాకుండా
గుప్పెడు మెతుకులకై వెదుకులాటలో
కుమిలిపోని మదితో
కమిలిపోయిన భుజాలపై
నిర్విరాంగా స్వేదరధాన్ని మోయాలి...
విధి రధచక్రాల్లో నలిగి
రుధిరం స్రవిస్తూ
ఎప్పుడో వొకసారి బలైపోవాలి...

ఇదో నిగూఢ అరాచకత్వం!
ఉన్మత్త అమాయకత్వం!!

ఉత్తమ విలన్... ఓ వెర్రి ప్రేమకు ప్రతిరూపం ఈ లఘు చిత్రం.....

" ఈ కాలంలో స్టూడెంట్స్/యూత్ చాలావరకూ ఎందుకు ప్రేమలో పడుతున్నారు.. " అన్న చిన్న కాన్సెప్ట్ తీస్కోని నాణానికి మరోవైపు ప్రేమించడానికి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక షార్ట్ పిల్మ్ ని అధ్బుతంగా తెరపై చిత్రించాడు మా మిత్రుడు భరత్ Bharath Kumar M).. ఈ లఘుచిత్రానికి చాయాగ్రాహకుడిగా నేను పని చేయడం ఎప్పటికి మరచిపోలేనిది... ఎడిటింగ్ లో కూడా కొంతవరకూ నా తోడ్పాటు ఉంది. చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తూ.....

విప్లవమా నీ ఉనికి చాటుకో...!!


సుప్తావస్తలో కూలబడ్డ ఓనా విప్లవమా!!
ఎర్రగుడ్డని నడుముకు చుట్టి
హితకార్యాలు చేయడం మరచి
తలపాగాగా చుట్టి
విజ్ఞానం తమసొత్తని విర్రవీగుతూ
వెర్రిగా విమర్శించే సోమరి కామ్రేడ్ల మొహాలపై
ఎర్ర సిరాతో అచేతనులుగా ముద్రెయ్యి...

చచ్చినపుడు పొగిడేస్తూ
ఎర్రజెండానొకదాన్ని కప్పి
పొడగాటి స్తూపాన్నొకటి కట్టి
సంతాపసభలంటూ
సంఘశ్రేయశ్శును మరవమని
ఏ ఏంగెల్సూ చెప్పలేదు
ఏ దాస్క్యాపిటల్లోనూ రాయలేదని
దేశానికో ఖండంగా నరకబడ్డ
విప్లవ అంగాల్లో పబ్బంగడిపే కుక్కలకోమారు
నీ గట్టి పిడికిలితో బుద్ధిచెప్పు...

గుండెల్లో కాక
కేవలం రక్తంలోనే ఎరుపున్న ఎర్రినాయాళ్ళకొక్కసారి
లెనిన్ స్పీచుల్లో ఒక్క పీచునైనా వినిపించు
దెబ్బకు నరాలుబిగవవేమో చూపించు....

ప్రపంచ తీవ్రవాదులకు తలొగ్గి
ప్రశించే తత్వం కోల్పోయిన పిరికివాదులను
నీ రుధిర దేహంనుంచి తరిమికొట్టు...

విప్లవస్వామ్యమా...
చేతల్లో సత్తువలేని అచేతనుల్ని చాపలోచుట్టి
బిగిపిడికిలి ధీరుల్నీ, బలచిత్త బుద్ధుల్ని
నీ ఎరుపుకి వారసులుగా చెసి
నీ అరుపుల్ని ఆచరణలో పెట్టించు...
విప్లవమా వర్ధిల్లు!!

అంతర్యాగం!గడుస్తున్న జీవితాన్ని రాత్రుళ్ళు లెఖ్ఖలేసుకోవడం
మనకీమధ్య అలవాటైపోయింది...
కష్టాన్నో సుఖాన్నో - వలపునో - వేదన్నో
పారదర్శకంగా పంచుకోవడం పరిపాటైపోయింది...

మన మనసుల్లో మొలిచే మోహపు మర్రిచెట్టుకో అలవాటుంది...
తన్మయత్వంతో నగ్నత్వాన్ని ఆసరాకోరి
దమనిసిరల్లో ఎగసిపడే రక్తప్రవాహాల్తో
ఉచ్వాసల్ని ఊడలుగా విస్తరించి అలసిన తనువులని తృప్తిపరుస్తూ
నిచ్వాసల్లో మనస్సులని మమేకం చేస్తుంటుంది...

ఇరువురిని జతకూర్చిన
అపురూపమైన మన హృదయద్వయానికి
ఒక సంతృప్తతనిచ్చే వెచ్చని స్పర్శతో
అభిషేకించుకోకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుంది...


కరిగిన గుండెతో ఉప్పుంగే నువ్వు వో హిమనీనదానివి
నీ వెచ్చని కలయికతో పరవశించే నేను వో అగాధదరిని
అవిశ్రాంతంగా నాలో ప్రవహించడం నీవొంతు!
నిర్విరామంగా నిన్నైక్యం చేస్కోవడం నావొంతు!!

హేయ్...

హేయ్.... అలా దగ్గరికి రాకు...
మేఘాల అంచులవెంబడి 
వేలాడుతున్న మంచుబిందువుల తాకిడి 
వెన్నెలకు చల్లగా గుచ్చుకున్నట్లు 
నా ఒళ్ళంతా జిల్ జిల్...మంటోంది!

అయ్యో! వచ్చేసావా! అలా సున్నితంగా తాకకు...
పున్నమి అలలు పరుగులెత్తినపుడు
కోతకుగురైన తీరంలా
హృదయమంతా కంపనలకు లోనౌతోంది...

అబ్బా...వచ్చి ఇలా నా గుండెలపై రోమాలుమెలితిప్పకు...
ఇప్పటికే అదుపుతప్పిన మదపుటేనుగులా
ఒళ్ళంతా దహించబడుతున్న ఖాండవవనమై
కోరికలతో రగిలిపోతోంది...

సుహృల్లేఖతుషారకలశాన్ని మనస్సులో నింపుకొని
మేఘాల మాటునదాగిన మోహాన్ని చుట్టుకొని
నక్షత్రాల వెలుగుల్తో వదనాన్ని అలంకరించుకుని
నీ పలకరింపులతో రాత్రుల్ని వధిస్తూ స్వప్నకౌముదినొకటి
నా హృదయ హరివాణంలో విసిరెస్తావు చూడూ...
అప్పుడు నిద్రొస్తుంది నాకు!
కలల్లో...కన్నీటి కాఠిన్యాన్ని దాస్తూ ప్రవహించే నీ నవ్వుల
అలల్లో...నాకూ ఓభాగముందనుకొని
ఒక సంతృప్తానుభూతికి లోనౌతూ
నా రెప్పల ద్వారాన్ని మూసి
నీకై రెక్కల స్వప్నాల్లో విహరిస్తాను...

అగాథంలో ఉన్న నీ మనస్సు
అంతుచిక్కనిది అంటే నేనొప్పుకోను...
ఎందుకంటే నేను అగ్నిపర్వతాన్ని
అగాధంలోనే ఎక్కువ బద్ధలౌతుంటాను...
గుబురుపొదలంటి ఎద ద్వీపాల సముదాయాల్నో
ఆలోచనల్తో దహించబడ్డ ద్వీపకల్పాల తీరాల్నో అప్పుడప్పుడు స్పృశిస్తుంటాను...

నువ్వు అగాధాన్ని నింపుకొన్న నీరువు
నేను అగధాల్లో బద్ధలయ్యే అగ్నిశిఖని
సాన్నిహిత్యానికి పొంతన అవసరమని
అందర్లా వంతపాడ్డం నాకు నచ్చదు..
వంతులేసుకొని పలకరిస్తూ
కృత్రిమనవ్వుల్ని చిలకరించడం నీకు నచ్చదు...

ఇద్దరం సమవుజ్జీలమే...
హృదయసమతౌల్యతాసముపార్జులమే...
రా...కన్నీటి చారల్లో నవ్వుల సలిలాన్ని నింపి
తుషార కలశాన్ని ప్రపంచానికి అడ్డుగా వొంపి
భవబాంధవ్యాల నూతనాధ్యాయాన్ని లిఖిద్దాం!!

W/o. విష్వక్సేన....


తనో హృదయోద్భవ శిల్పం!
ప్రేమ ఉలితో
తనువు మొలచబడి
నవ్వుల్లో మకరందాన్ని వర్షించే
అమృతపుష్పం.....

తనో బాహ్యాంతర అందం!
మదిదీపంతో
ఙ్ఞానం ప్రకాశించబడి
చూపుల్లో కరుణత్వాన్ని కాంతించే
దయాకల్పవృక్షం.....

తనో నిత్యాధ్భుత బంధం!
వలపుగీతంతో
విరహం ఆలపించబడి
వేదనలోనూ వాత్సల్యాన్ని పంచే
కరుణైకసంద్రం.....

మళ్ళీ యింకొక్కసారి...మళ్ళీ వొకసారి వచ్చివెళ్ళాలనుంది..
అద్దమంటి దేహానికి ఆకాశముక్కల్ని అద్దుకుని
విశ్వమై నిన్నొక్కసారి పలకరించాలనుంది...

చెప్పకుండా చెంతచేరి
సన్నగిల్లుతున్న కొన్ని భావాల్ని అకస్మాత్తుగా నీమదిలో నింపి
వొకింత విశ్వాసాన్ని నింపాలనుంది...

కత్తిరించబడ్డ నా హృదయరెక్కల్ని
రహస్యంగా యేరుకుని
నీ వొడిలో ఇంకోసారి వాలిపోవాలనుంది....

తనువుల దాహం తీరక
సెలయేరై పారిన క్షారస్వేదంలో
వొకసారి పరవశంతో రమించాలనుంది...

బయటపడలేని భారమైన భావాల్ని
నానుంచి వేరుచేసి
నీముందు మౌనంగా గుట్టువిప్పాలనుంది...

పయనించే నీ గమనంలో వెంబడిస్తూ
వాడిపోయిన దారుల్లో
పచ్చటి వనాన్ని చిగురింపజేయలనుంది...

దూరమైన నీ నిచ్వాశల్లో
భావాల పుప్పొళ్ళను సేకరిస్తూ
గండుతుమ్మెదనై తిరగాడాలనుంది...

అనిశ్చిత ఈ లోకంలో
అనుకోకుండా మరణించినా
ఆత్మగా మారి నీతోనే ఉండిపోవాలనుంది...

23.05.2015

వొకానొక రాతిరి
పక్షానికోమారు నగ్నత్వం సవాలువిసిరిన వొక రాతిరి
హృదయపొరలను తడిపి
ప్రణయకోలాహలాన్ని కోరిన వేళ
వెన్నెల అమావాస్యను కప్పుకున్నపుడు....

రేరాజు వెలుగుల్ని వెక్కిరిస్తున్న
తారకల పొగరుని
తన చిరునవ్వులతో అణిచి
చురకలంటిస్తున్న శ్వేతకలువ స్పర్శకై
చలువ హృదయ చంద్రుడు
ఒక్కో మేఘాన్ని అద్దుకొని
ఒక్కో చినుకులా కొలనులో రాలిపోతున్నాడు...

అది వర్షపు హోరు కాదు
రెండుహృదయాల సంఘర్షణల జోరు
నడిరాతిరి కలువకై
చందుడు రాల్చిన
ప్రవహించెడి వన్నెలపొడి సెలయేరు.....

క....కవిత... | విష్వక్సేనుడు వినోద్క్రమమేరుగని బాధాతరంగాల అలజడులతో
చాన్నాళ్ళుగా క్రమక్షయానికి గురైన హృదయాంతర తీరాలు
దీనావస్త నుండి నెమ్మదిగా ఒకసారి కోలుకోగానే
అక్షరాలు సుప్తావస్తను వీడి
పదాల్లో పరకాయప్రవేశం చేసినపుడు
మనసు కుదుటపడేలా
ఒంటరిగా కూర్చొని ఒక కవిత రాయాలనిపిస్తుంది!

జీవిత ఆటుపోట్లలో విధికి జడవక
మది భావాలను జాగురుకతతో ప్రతిబింబించి
ముందుకు నడిపించిన నా కళ్ళను
కలం జార్చిన సిరాక్షారాలతో అభిషేకించాలనిపించినప్పుడు
హృద్యంగా ఒక కవిత రాయాలనిపిస్తుంది!

మంచుపూలంటి ఆశయాలను అందబుచ్చుకునే ప్రయత్నంలో
ముళ్ళబాటల్లోనూ ధైర్యంగా అడుగులేసి
అలసిపోక శ్రమించిన కాళ్ళకి
పదాల్లో పద్మదళములు పరిచి సేదతీర్చాలనిపించినపుడు
ఖచ్చితంగా ఒక కవిత రాయాలనిపిస్తుంది!

16-05-2015

‘ఉత్తమ విలన్’

ఓ చిన్న ప్రయత్నం....
నేను తీసిన షార్ట్ ఫిలిం ‘ఉత్తమ విలన్’ ట్రైలర్ ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. నా తోలిప్రయత్నాన్ని తప్పక చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలతో ఆశీర్వదిస్తారని ప్రార్థన _/\_

క...కవి

కవివో కల్మష కేతువ్వో!?
రవివో రాక్షస రాహువ్వో!?

ఆకలంటావు..అభాగ్యుల అరుపులంటావు...
అన్నం వృధాగా పడేస్తావు!

విప్లవమంటావు..విరసంలో సభ్యుడంటావు...
వీధిదీపాలువేయించలేవు!

నువ్వో "కలం" అంటుంటావ్...
కలకలం సృష్టించాలనుకుంటావ్...
కాల్పనిక కెరటాల్లో కలకాలం యీదలేక
కొట్టుమిట్టాడానంటావ్!

నువ్వో "ఖడ్గం" అంటుంటావ్...
కుటిలత్వాన్ని ఖండించాలంటావ్...
కటిన మనసుపొరలను కోయలేక
కన్నీరుపెట్టుకున్నానంటావ్!

పల్లెలంటావు..ప్రకృతిమాతంటావు...
పచ్చనిమొక్కనొకటి నాటలేవు!

స్త్రీవాదమంటావు... సరసశృంగారమంటావ్...
సన్మానం లేకపోతే సభకురావు...

కవివో కల్మష కేతువ్వో!?
రవివో రాక్షస రాహువ్వో!?

26-04-2015

నిశ్చలమే!నువ్వెళ్తుంటావ్...నిర్విరామంగా...
యేదో పనిలో తలమునకలై
గుమ్మం.. వీధి.. నగరం..
ప్రపంచపుటంచులు దాటేస్తూ....

పాదానికీ పాదానికీ మధ్య
అడుగుల వ్యత్యాసంలో తడబాట్లను
చూసే తీరికలేకో?!
మనసుకీ మెడడుకీ మధ్య
ఏర్పడ్డ శూన్యాన్ని పరిపక్వతతో
పూడ్చే ఓపికలేకో?!
అసహజత్వాన్ని మోస్తూ...
నీ సహజత్వాన్ని కోల్పోతుంటావ్....

ఎటో...యే యుగాలు తవ్విన గోతుల్లొనో
యే చరిత్రలు ఆక్రమించిన కాగితాల్లోనో
నీ మనో నిధిని వెచ్చిస్తూ
వెలికితీయబడని గుప్తనిధిగా మారిపోతావ్...

అస్పష్ట సూత్రం!స్వచ్ఛమైన మనస్సు నగ్నత్వాన్ని కప్పడానికి
నోటిమాటల రాట్నంలో ఎన్ని వస్త్రాల్ని వడకాలో
ఉత్తేజిత ఎద స్ఖలించిన కోర్కెల్ని అణచడానికి
హావభావాల్లో ఎంత సంపీడ్యతను మోయాలో
నాకిప్పటికీ అర్థంకాదు!

మర్మశిఖరాన్ని మోస్తున్న నిష్కపట శరీరం
అర్థంలేని ఆవేశంలో అగ్నిపర్వతాన్నో
అంతులేని ఆనందంలో మంచుపర్వతాన్నో
వొక అప్రతిపాదిత మనోచలనసూత్రం ప్రకారం
అకస్మాత్తుగా దేన్నేప్పుడు విసర్జిస్తుందో
నాకిప్పటికీ అర్థంకాదు!

పరిష్కరించలేని అనేకానేక జీవిత ప్రశ్నల్లో  
యే సందర్భాన్ని ఎప్పుడు సూక్ష్మీకరించాలో
యే ఆలోచనాచలరాశిని ఎప్పుడు ప్రతిక్షేపించాలో
భిన్న వ్యక్తిత్వాల లెక్కల్లో కనుగొనే సాధనేదో   

నాకసలేప్పటికీ అర్థంకాదు!

వీడలేని బంధానికి ఇక వీడ్కోలు...స్వాప్నిక జగత్తులో 

నీ రూపమెరుగని నా కళ్ళకు సవ్వళ్ళుచేస్తూ 
సామీప్యమైన మగువనే ఓ మత్తుసంద్రమా!

విధి చేసిన అలజడుల్లో 

నలిగిపోయిన గతాన్ని మోస్తూ 
అర్ద్రంగా అలసిన నా మదిని 
నీ ముందు ఆవిష్కరించాలని...
నా యెదపొందిన అందమైన అనుభూతుల్ని
నీ సాంగత్యంలో వర్షింపజేయాలని...
ఎన్నెన్ని కునుకుపాట్లు ....ఎన్నెన్ని చిగురుటాశలు... 
చంచలమైన యీ చిరు హృదయానికి...

పురుషులంటే గిట్టని నీ హృదయ పరిధిలో

సరసమైన మాటలతో నన్నెందుకాహ్వానించావ్?
తేనె పలుకులన్నీ పంచేసి 
కర్కశత్వాన్ని మిగుల్చుకున్నావేమో కదా? 

మన మనసులాడిన సయ్యాటలో సరిజోడివో

తపన పడ్డ యెదఘోషలో నైరాశ్యానివో
అనుభవంతో నే రాసుకుంటున్న బ్రతుకుపాఠంలో 
గుణపాఠమై వో అధ్యాయాన్ని ఆక్రమించావు!

కాలగమనంలో మనం తారసపడ్డా 

బంధమంటూ ఏర్పరుచుకోలేని ఈ సాంగత్యంలో 
కలలోనైనా ఇంకెప్పటికీ నిన్ను కలవలేను....

అర్థంచేసుకోవడానికి సంవత్సరాలు 

మర్చిపోవడానికి యుగాలను వెచ్చించడానికి
నా జీవితాన్ని నీ వయస్సుతో హెచ్చించలేను....
నన్ను క్షమించు నేస్తమా!

సుతిమెత్తని నీ సంస్కారంతో నన్ను గేలిచేయకుండా

భవిష్యత్తులో నన్నింకోసారి ఓడిపోనివ్వకుండా 
మొత్తానికి నువ్వే నెగ్గావ్... 
ఇంకెప్పుడూ నేనే గెలుస్తానన్న భరోసా మాత్రం 
నీకు తెలియకుండా నా అణువణువూ నింపేశావ్...

దేశ ర(భ)క్షకులు!!స్వాతంత్ర్యమొచ్చిందని చంకలుగుద్దుకునేలోపే
ఎనభైలక్షల బ్రిటన్ గూడుపుటానీ అగ్రిమెంటులో
జీపులలెక్కలు తేల్చక సగంనోక్కేసి
చరిత్రహీనులై నిలిచిన నాదేశపు రక్షణకవచాల్లారా...

బోఫోర్స్ స్కామ్లో సాక్షాలిస్తామ్ మొర్రో అంటున్నా
స్వీడిష్ పోలీసుల్ని నామమాత్రమైనా కలవక
బూటకపు ఆరోపణలతో బిగ్-బి ని నిందించి
యాభైకోట్ల అవినీతంటూ రెండొందలయాభై కోట్లు మింగిన
సి.బి.ఐ. తిమింగళాల్లారా...

జర్మనీ నుంచి తెచ్చుకున్న జలాంతర్గాముల్లో
ఇజ్రాయెల్ బరాక్ క్షిపణుల ఒప్పందంలో
రష్యా పంపిన ఘోర్ష్కొవ్ నౌకల్లో
నూటతోమ్భయ్యెడు రైపిల్ద్ హెలికాఫ్టర్ ఒప్పందరద్దుల్లో
వేలకోట్లు స్వాహా చేసిన యుద్ధవీరుల్లారా...

కార్గిల్ రణరంగంలో ప్రాణాలర్పించిన ధీరులకు
అమెరికా నుంచి శవపేటికలంటూ
శవాలపై రెండువేలకోట్లు మింగి
శ్రద్ధాంజలి ఘటించిన వీరచక్రాల్లారా...

పక్కలోబల్లెం అంటూ సాకుచూపి
ఆయుధాలు దిగుమతిలో అగ్రస్తానంలో
అధునాతన ఆయుధాల ఉత్పత్తిలో..ఎగుమతుల్లో...
అట్టడుగున నిచిన సరిహద్దు జలగల్లారా...

కష్టపడి ఆపాదించుకున్న మూర్తిత్వంతో
ఒళ్లంతా దేశభక్తి రంగుపులుముకొని
ఖద్దరు బట్టలకు ఖరీదుచేసే శాల్యుట్లు కొట్టండి!
కుంభకోణాల్లో కోట్లకు కోట్లు పట్టండి!!

దేశద్రోహుల్లారా....!! యాక్ థూ.....

(Note:: రక్షణ వ్యవస్తలో నిజమైన దేశభక్తులేందరో ఉన్నారు. ఇది తక్కిన వారి గురించి మాత్రమె సుమా...  I am not against to the Government but with Political & bureaucratic scandals)

కొన్ని కవితలకి శీర్షికలు అవసరంలేదు -1
నీ మదిలో ఏదో మూలన
నాపై దాగిన ఏహ్యభావాలు కొన్ని
నువ్వు చూపించలేకున్నా
అప్పుడప్పుడూ ఆతాలూకు కెరటాలు
సున్నితపు నా హృదయాన్ని
బలంగా తాకుతాయన్న ఛాయల్ని
నీ పరిధిలోనికి స్పృహలోకూడా రానీయవు...

ఎగసిన వ్యధ తాకిడితో
కన్నీటికోతకుగురైన
నా హృదయాంతరాలను దాటి
అవి చేసే నిశ్శభ్ద అలజడులను సైతం
నీ వినికిడికి కూడా పసిగట్టనీయవు...

అయినా నువ్వోక్కసారి
నా మదిలోయాల్లో పరికించి చుస్తే
ఆచ్చాదన లేని స్వచ్చత తాలూకు భావాలే తప్ప
బాధించి వేధించే అయిష్టతల చేష్టలు నాలో శూన్యం!


నీపై మోజుపడ్డా...ఒక పువ్వు కొమ్మని విడిచి
నేలరాలుతున్న క్షణాన
జలదరించిన నా తనువు సాక్షిగా...

సిగ్గుతో మంచుపైట కప్పుకొని
ఒద్దిగ్గా అందాలు ఆరబోసే అడవిపై
మోహం పెంచుకున్న నా ఆరాధన సాక్షిగా...

చల్లని వెన్నెలకాంతిలో
విరహంతో అల్లాడుతున్న మల్లెల్ని
తృప్తిపరిచిన నా వెచ్చటి స్పర్శ సాక్షిగా..

ముళ్ళున్నాయని మొహమ్మాడ్చుకొన్న
గులాబీలను ముద్దుతో పలకరించి
వికసింపజేసిన నా పెదాల సాక్షిగా..

భానుడు వెళ్తున్నాడన్న బాధతో
రక్తసికమైన సాయంకాల సంద్రాన్ని చూసి
చెమ్మగిల్లిన నా కనుపాప సాక్షిగా...

ఓ ప్రకృతీ..!
చదివేకొద్దీ చలింపజేసే భావానివి నువ్వు!
ఆస్వాదించేకొద్దీ పెరిగే మోహానివి నువ్వు!
ఎంతనుభవించినా తీరని దాహానివి నువ్వు!!
అందుకే నీపై మనసుపడ్డాను...
మనిషినై చాలా ఋణపడ్డాను....

నిజం చెప్పాలంటే
నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను!!

నా ఉదయం...


నేను లేవగానే 
నువ్వు నా పక్కనుండవు
అయినా నిద్రమత్తులోనే పరుపంతా తడుముతాను...

నీ పరువాల తాకిడికి
సిగ్గుతో కందిపోయిన మల్లెల్ని తప్ప
నిన్నస్సలు స్పృశించలేకపోతాను ...

కలబడ్డప్పుడు 
కుదుపుల్లో నలిగిన 
మెత్తటి రోజా పూరెక్కల వెక్కిరింపులు తప్ప
నీ ముద్దులు అందుకోలేకపోతాను ...

విరహంతో నేను కళ్ళు తెరవలేకున్నప్పుడు
అప్పుడే స్నానమాడివచ్చిన 
నీ తడి ఆరని కురుల్లోంచి
నా రెప్పపై జారిపడ్డ నీటిబిందువు
నన్ను తమకంతో మేల్కొలుపుతుంది...

నువ్వు గడుసుదనంతో కళ్లెగరేస్తూ
పెదాల దాహం తీరుస్తానని వచ్చి
మోసంతో కాఫీ ఇచ్చి
నన్ను మేల్కొలుపుతూ నవ్వుతావు చూడూ
అప్పుడే నీ చూపులో నేను సూర్యోదయం చూస్తాను...


ఎప్పుడొస్తావు?నాకు తెలుసు
నేను కోరుకున్నప్పుడు కాదు
నీకు అనిపించినపుడు మాత్రమే
నన్ను పలకరించడానికొస్తావని...

హృదయంలో తడిలేనప్పుడు మొలకెత్తిన
స్వార్థపు కలుపుమొక్కలు ఎండిపోయినపుడా...
జీవనాడిగోడల పగుళ్ళలోంచి స్రవిస్తున్న
ప్రేమధారల ప్రవాహాలు ఇంకిపోతున్నప్పుడా...
ముసుగులోంచి వెలివేయబడ్డ అపనమ్మకపు
అంచుల్లో క్రోధబీజాలు చిగురిస్తున్నప్పుడా...
ఆజ్ఞానపు కట్టుడురాళ్ళతో నిర్మించబడ్డ
ఆశయాలపునాదుల్లో స్థిరత్వం కోల్పోయినప్పుడా...

మరణమా...
అసలెప్పుడొస్తావో నికైనా తెలుసా?
నన్ను పలకరించడానికై
పాశంతో పనిగట్టుకు రావడానికి
నీకే సంధర్భం కావాలో చెప్పు..
కృత్రిమంగానైనా సృష్టించుకొని
నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను..!!

ఒరేయ్ కవి..ఒకప్పుడు
మొక్కలే మొలవని మదిలో
అక్షరాలపూలను పూయించావ్...
పచ్చదనమెరుగని ఆలోచనల్లో
పసిడిపంక్తుల్ని పండించావ్ ...

కాలానికి జలుబుచేసిందని
కలం కరిగించి ఆవిరిపట్టావ్ ..
కడలి కల్లోలమైందని
కళతో అలల్ని శాంతపరిచావ్....

ఇప్పుడు
ఏవిషాన్ని మింగావని
విషాధాన్ని వర్షిస్తున్నావ్...
ఏఅమృతం అజీర్తిచేసిందని
అసంతృప్తితో విలపిస్తున్నావ్...

ఏకల నీకళ్ళను కనికరించలేదని
రెప్పల్ని అశృనిప్పుల్లో కాల్చేస్తున్నవ్...
ఏమౌనం నీమనసును మోసంచేసిందని
నిరాశతో మోడుబారి ధు:ఖమై చిగురిస్తున్నావ్...

యాన్ ఎరిత్రియన్ రైజ్ఎర్రబడ్డ చేతుల్తో
మెతుకు ముట్టని రాత్రుల్లో
నీ కంట్లోని ఆక్రోశం...

ఒళ్ళు హూనమయ్యి
మంచానపడ్డ రోజుల్లో
నీ పిడికిల్లోని ఆవేశం...

బద్దలైన నీ ఆత్మగౌరవంతో
ఇంకొకడికి బద్ధుడివైన అప్పటి నీవు
ఇప్పుడిక నీవు కానే కావు...

శ్రమదోపిళ్ళలో బలిపశువై
దోసిళ్ళలో కాసులకు బదులు
రుధిరాశృవుల్ని చవిచూసి
కాలిన కడుపుతో కదంతొక్కిన
ఒకప్పటి పీడిత కాందిశీకుడా...

నరాల్లో తరాలుగా నింపబడ్డ
బానిసత్వపు గరళాన్ని
తరంగాలుగా ఎగజిమ్ము!

నెర్రలుచీలిన బ్రతుకుభూముల్లో
వలసలై పారిన దోపిడీ మలినాల్ని
విప్లవకెరటమై పారద్రోలు!

రెక్కల్నీ..రక్తాన్నీ..
అమాయకంగా ధారబోసి
అరువుగా తెచ్చుకున్న
దారిద్ర్యపు దాస్యసంకెళ్ళని
నీ కంఠధ్వని పదునుతో విడనాడు!

శ్రామికుల కష్టాన్నిజెప్పి
కాసుల సంచులుదెచ్చి
జిత్తుల నక్కలా జుర్రేసి
దీనుల పక్షాన కుత్తుకైనా కదపని
చెత్త నాయకుల చర్మం వొలుచు!

దగాపడ్డ దీనుడా...ధీరుడవై ప్రశ్నించు!
ఎరుపెక్కిన కాంతికిరణమై ప్రసరించు!!
ఎదురులేని విప్లవనదిలా ప్రవహించు!!!


Related Posts Plugin for WordPress, Blogger...