కన్నీటి కసి ...

నయవంచన నెమరువేస్తూ
నడివీధిన నేలకూలి
రాల్చేసెయ్ రాల్చేసెయ్...
కంటిపొరలు తొలగిస్తూ
పంటి బిగుతు సడలించి
కార్చేసెయ్ కార్చేసెయ్...

రాలిన ప్రతి బొట్టెగసీ
పర్వవేలా తరంగమై
సునామీలు సృష్టించనీ...

కారిన ప్రతి చుక్కరిచీ
ప్రహల్లాద హరిస్మరణై
గర్వాన్నే గద్ధించనీ...

ప్రపంచమే పులుముకొన్న
పాప భీతి పంకిలాన్ని
ప్రళయోధ్భవ కమలంతో
పారద్రోలి పారద్రోలి
ప్రకాశమే నింపనీ !
ప్రకృతినే పణమిల్లి
ప్రశాంతతను పంచనీ !!

ఏకత్వం

జగద్విదితం నా భాష్యం
మన:త్రిగుణం నా హాస్యం

చతుర్భద్రం నా లోకం
పంచతత్వం నా శోకం

సుమ ప్రవాహం నా రుధిరం
భ్రమ ప్రవళ్హికం నా హృదయం

చిద్విలాసం నా వస్త్రం
తత్వ తార్కికం నా అస్త్రం
ఆగని పయనం...

పవిత్ర పొర రాల్చిన
నెత్తుటి ముద్దొకటి, ఏడ్పును -
కుత్తుకలో మోస్తూ
మృత్తికను అప్పుడెప్పుడో
హత్తుకుంది.

ఆత్రమో అవశ్యమో
ఆక్రంద కందు ఆకాంక్షో
ప్రేగుతో బంధం తెగింది.
ప్రపంచంతో సంబంధం కలిసింది.

ఆశలెన్నో శ్వాసించి
భుజాన రంగుల రెక్కల్ని మొలిపించుకుంది.
బాధలెన్నో భరించి
హృదయాన కాంతి రేఖను ప్రసరించుకుంది.

ఒక్కో మెట్టెక్కి
ఆరడుగులకు చేరువౌతూ
అంగుళం దూరాన ఆగిపోయింది.
ఆశయం మాత్రం అలానే వెలుగుతూ
గమనంలో గమ్యాన్ని ఇంకా చేరువౌతూనేఉంది.

30/12/2013


Related Posts Plugin for WordPress, Blogger...