నీపై మోజుపడ్డా...ఒక పువ్వు కొమ్మని విడిచి
నేలరాలుతున్న క్షణాన
జలదరించిన నా తనువు సాక్షిగా...

సిగ్గుతో మంచుపైట కప్పుకొని
ఒద్దిగ్గా అందాలు ఆరబోసే అడవిపై
మోహం పెంచుకున్న నా ఆరాధన సాక్షిగా...

చల్లని వెన్నెలకాంతిలో
విరహంతో అల్లాడుతున్న మల్లెల్ని
తృప్తిపరిచిన నా వెచ్చటి స్పర్శ సాక్షిగా..

ముళ్ళున్నాయని మొహమ్మాడ్చుకొన్న
గులాబీలను ముద్దుతో పలకరించి
వికసింపజేసిన నా పెదాల సాక్షిగా..

భానుడు వెళ్తున్నాడన్న బాధతో
రక్తసికమైన సాయంకాల సంద్రాన్ని చూసి
చెమ్మగిల్లిన నా కనుపాప సాక్షిగా...

ఓ ప్రకృతీ..!
చదివేకొద్దీ చలింపజేసే భావానివి నువ్వు!
ఆస్వాదించేకొద్దీ పెరిగే మోహానివి నువ్వు!
ఎంతనుభవించినా తీరని దాహానివి నువ్వు!!
అందుకే నీపై మనసుపడ్డాను...
మనిషినై చాలా ఋణపడ్డాను....

నిజం చెప్పాలంటే
నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను!!

నా ఉదయం...


నేను లేవగానే 
నువ్వు నా పక్కనుండవు
అయినా నిద్రమత్తులోనే పరుపంతా తడుముతాను...

నీ పరువాల తాకిడికి
సిగ్గుతో కందిపోయిన మల్లెల్ని తప్ప
నిన్నస్సలు స్పృశించలేకపోతాను ...

కలబడ్డప్పుడు 
కుదుపుల్లో నలిగిన 
మెత్తటి రోజా పూరెక్కల వెక్కిరింపులు తప్ప
నీ ముద్దులు అందుకోలేకపోతాను ...

విరహంతో నేను కళ్ళు తెరవలేకున్నప్పుడు
అప్పుడే స్నానమాడివచ్చిన 
నీ తడి ఆరని కురుల్లోంచి
నా రెప్పపై జారిపడ్డ నీటిబిందువు
నన్ను తమకంతో మేల్కొలుపుతుంది...

నువ్వు గడుసుదనంతో కళ్లెగరేస్తూ
పెదాల దాహం తీరుస్తానని వచ్చి
మోసంతో కాఫీ ఇచ్చి
నన్ను మేల్కొలుపుతూ నవ్వుతావు చూడూ
అప్పుడే నీ చూపులో నేను సూర్యోదయం చూస్తాను...


ఎప్పుడొస్తావు?నాకు తెలుసు
నేను కోరుకున్నప్పుడు కాదు
నీకు అనిపించినపుడు మాత్రమే
నన్ను పలకరించడానికొస్తావని...

హృదయంలో తడిలేనప్పుడు మొలకెత్తిన
స్వార్థపు కలుపుమొక్కలు ఎండిపోయినపుడా...
జీవనాడిగోడల పగుళ్ళలోంచి స్రవిస్తున్న
ప్రేమధారల ప్రవాహాలు ఇంకిపోతున్నప్పుడా...
ముసుగులోంచి వెలివేయబడ్డ అపనమ్మకపు
అంచుల్లో క్రోధబీజాలు చిగురిస్తున్నప్పుడా...
ఆజ్ఞానపు కట్టుడురాళ్ళతో నిర్మించబడ్డ
ఆశయాలపునాదుల్లో స్థిరత్వం కోల్పోయినప్పుడా...

మరణమా...
అసలెప్పుడొస్తావో నికైనా తెలుసా?
నన్ను పలకరించడానికై
పాశంతో పనిగట్టుకు రావడానికి
నీకే సంధర్భం కావాలో చెప్పు..
కృత్రిమంగానైనా సృష్టించుకొని
నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను..!!

ఒరేయ్ కవి..ఒకప్పుడు
మొక్కలే మొలవని మదిలో
అక్షరాలపూలను పూయించావ్...
పచ్చదనమెరుగని ఆలోచనల్లో
పసిడిపంక్తుల్ని పండించావ్ ...

కాలానికి జలుబుచేసిందని
కలం కరిగించి ఆవిరిపట్టావ్ ..
కడలి కల్లోలమైందని
కళతో అలల్ని శాంతపరిచావ్....

ఇప్పుడు
ఏవిషాన్ని మింగావని
విషాధాన్ని వర్షిస్తున్నావ్...
ఏఅమృతం అజీర్తిచేసిందని
అసంతృప్తితో విలపిస్తున్నావ్...

ఏకల నీకళ్ళను కనికరించలేదని
రెప్పల్ని అశృనిప్పుల్లో కాల్చేస్తున్నవ్...
ఏమౌనం నీమనసును మోసంచేసిందని
నిరాశతో మోడుబారి ధు:ఖమై చిగురిస్తున్నావ్...

యాన్ ఎరిత్రియన్ రైజ్ఎర్రబడ్డ చేతుల్తో
మెతుకు ముట్టని రాత్రుల్లో
నీ కంట్లోని ఆక్రోశం...

ఒళ్ళు హూనమయ్యి
మంచానపడ్డ రోజుల్లో
నీ పిడికిల్లోని ఆవేశం...

బద్దలైన నీ ఆత్మగౌరవంతో
ఇంకొకడికి బద్ధుడివైన అప్పటి నీవు
ఇప్పుడిక నీవు కానే కావు...

శ్రమదోపిళ్ళలో బలిపశువై
దోసిళ్ళలో కాసులకు బదులు
రుధిరాశృవుల్ని చవిచూసి
కాలిన కడుపుతో కదంతొక్కిన
ఒకప్పటి పీడిత కాందిశీకుడా...

నరాల్లో తరాలుగా నింపబడ్డ
బానిసత్వపు గరళాన్ని
తరంగాలుగా ఎగజిమ్ము!

నెర్రలుచీలిన బ్రతుకుభూముల్లో
వలసలై పారిన దోపిడీ మలినాల్ని
విప్లవకెరటమై పారద్రోలు!

రెక్కల్నీ..రక్తాన్నీ..
అమాయకంగా ధారబోసి
అరువుగా తెచ్చుకున్న
దారిద్ర్యపు దాస్యసంకెళ్ళని
నీ కంఠధ్వని పదునుతో విడనాడు!

శ్రామికుల కష్టాన్నిజెప్పి
కాసుల సంచులుదెచ్చి
జిత్తుల నక్కలా జుర్రేసి
దీనుల పక్షాన కుత్తుకైనా కదపని
చెత్త నాయకుల చర్మం వొలుచు!

దగాపడ్డ దీనుడా...ధీరుడవై ప్రశ్నించు!
ఎరుపెక్కిన కాంతికిరణమై ప్రసరించు!!
ఎదురులేని విప్లవనదిలా ప్రవహించు!!!


Related Posts Plugin for WordPress, Blogger...