దైగంబరికం!


ఎందుకు నువ్వు వస్త్రాన్ని కప్పుకుతిరగాలో
వొకసారి ప్రశ్నించుకొన్నావా?
యే ధూళి రవ్వలో
యే చలి పరాగాలో
యే వర్షపు తుంపరలో
నిన్ను తాకుతాయనో కాక
యే కళ్ళు నీ నిజరూపాన్ని చూస్తాయనో
నీ ఒళ్ళు కొన్ని జంతువులకన్నా
భిన్నంగా ఉండాలనో
మేను మన్నయ్యేదాకా
మనస్సు నగ్నత్వాన్ని వదిలేసి
వొంటికి కొన్ని వేల సార్లు రంగుల బట్టలు కప్పుకుంటావు...

శరీరం కోసం మానసికంగా జోప్పించబడిన
వొక క్రమానుగత మార్పు
యుగాలుగా నీ దేహాన్ని
దేహమందలి అనేక భాగాల్ని
వింత సాంప్రదాయాల పోగులతోనో
వైవిధ్య సాంస్కృతిక విప్లవాల వడుకులతోనో
కప్పుతూ ఇప్పటి నీ స్థాయిని కించిత్ శాసిస్తోంది...

నీ మనసుకి యేదో లేనితనాన్ని తొలగించి
నీ మేనికి వొక ఔన్నత్యాన్ని ఆపాదించే వస్త్రం
నీ దిగంబరత్వాన్ని దోచేస్తోందా? దాచేస్తోందా?

ఎప్పుడైనా ప్రశ్నించుకోన్నావా??   

జీవచ్ఛవం...

అనుభవంతో నువ్వు గ్రహించిన సారాన్నో
విచక్షణతో నువ్వు సంపాదించుకొన్న నిగ్రహాన్నో
జీవితంలో వొక్కోసారి కోల్పోవాల్సివస్తుంది
మనసు గొడలకు భద్రంగా అంటిపెట్టుకున్న కొన్ని బంధాలను
యిష్టాయిష్టాల పెనుగులాటలో జారిపోకుండా
మరింత భద్రంగా దాచుకోవాల్సివస్తుంది
భరించడం బాధ్యత అయినపుడు
అనుబంధాలు గాయపరచిన ప్రతిసారీ
కలిమిలేముల్లో కలిసుండేలా
వొక సున్నిత వాగ్దానం చేయాల్సిఉంటుంది
బంగారు కోటగా కట్టుకొన్న
వొక బంధం మనసు గొడలుదాటి
దూరమయినట్లు అనిపించినప్పుడు
కొంచెం వెర్రిదనమో
ఇంకొంచెం వెలితిదనమో
మనస్సులో చివుక్కుమంటుంది
ఎక్కడి అగ్నిపర్వతమో ఇక్కడ బద్దలవుతున్నట్లు
ఎక్కడి సుడిగుండమో ఇక్కడ విజృంభిస్తున్నట్లు
వొకటే నిరాశ...వొకటే నిర్వేదం ...
అగాధమంటి ఒకటే బాధ
అదేవరూ పూడ్చలేనిది
పూడ్చినా లోలోపల కుంగిపోయే ఒక హరివాణమై
మనస్సు లోతుల్ని పరీక్షిస్తూనేవుంటుంది
పరీక్షలో నెగ్గడం అంటే బంధాల బంధిలో నువ్వు జీవించడం
ఓడిపోవడం అంటే బంధాల గిరిదాటి నువ్వు జీవచ్ఛవమవడం
Related Posts Plugin for WordPress, Blogger...