జీవచ్ఛవం...

అనుభవంతో నువ్వు గ్రహించిన సారాన్నో
విచక్షణతో నువ్వు సంపాదించుకొన్న నిగ్రహాన్నో
జీవితంలో వొక్కోసారి కోల్పోవాల్సివస్తుంది
మనసు గొడలకు భద్రంగా అంటిపెట్టుకున్న కొన్ని బంధాలను
యిష్టాయిష్టాల పెనుగులాటలో జారిపోకుండా
మరింత భద్రంగా దాచుకోవాల్సివస్తుంది
భరించడం బాధ్యత అయినపుడు
అనుబంధాలు గాయపరచిన ప్రతిసారీ
కలిమిలేముల్లో కలిసుండేలా
వొక సున్నిత వాగ్దానం చేయాల్సిఉంటుంది
బంగారు కోటగా కట్టుకొన్న
వొక బంధం మనసు గొడలుదాటి
దూరమయినట్లు అనిపించినప్పుడు
కొంచెం వెర్రిదనమో
ఇంకొంచెం వెలితిదనమో
మనస్సులో చివుక్కుమంటుంది
ఎక్కడి అగ్నిపర్వతమో ఇక్కడ బద్దలవుతున్నట్లు
ఎక్కడి సుడిగుండమో ఇక్కడ విజృంభిస్తున్నట్లు
వొకటే నిరాశ...వొకటే నిర్వేదం ...
అగాధమంటి ఒకటే బాధ
అదేవరూ పూడ్చలేనిది
పూడ్చినా లోలోపల కుంగిపోయే ఒక హరివాణమై
మనస్సు లోతుల్ని పరీక్షిస్తూనేవుంటుంది
పరీక్షలో నెగ్గడం అంటే బంధాల బంధిలో నువ్వు జీవించడం
ఓడిపోవడం అంటే బంధాల గిరిదాటి నువ్వు జీవచ్ఛవమవడం

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...