వాడంతే !!

వాడంతే నెమ్మదిగా అటు వైపెళ్తూ
కావాలనే పేడ తొక్కి గుంపులో పరిగెడతాడు.

మాసిపోయిన కాలికున్న హవాయి చెప్పులు
తప్ తప్ తప్పని ప్రతిసారీ అరుస్తుంటాయి.
చినిగిపోయిన బట్టలు ఒక్కో పేలికను రాలుస్తూ ఉంటాయి.
అయినా అంటుకున్న పేడను అందరిపై ఎగజిమ్ముతూ
వాడింకా హుషారుగా ముందుకు పరిగెడతాడు.

ఆ గుంపంతా అందరూ దొంగలే
వొళ్ళంతా తెల్లటి వస్త్రాన్ని చుట్టుకొని
తేట తెల్లగా నవ్వులు చిందిస్తూ
ఒకర్నొకరు భ్రమింపజేసుకునే వింత పశువులు
పైపై మాటల వలలు పన్నే రాక్షస సాలీడు బంధువులు

అందుకే వాడిజోలికెవ్వరూ వెళ్ళరు.
వాడి పరుగే వాడి సంపాదన.
అదే మనసుకు మూడు పూటలా తిండి పెడుతుంది.
వాడి నీడే వాడి బలం.
అదే వాడి వెనకుంటూ ఎక్కడలేని ధైరాన్నిస్తుంది.

వాడెప్పుడూ ఆగనే ఆగడు. అలసిపోతేగా
వాడెప్పుడూ తిననే తినడు. ఆకలేస్తేగా
వాడెప్పుడూ కలలే కనడు. నిద్రొస్తేగా

కుళ్ళిపోయిన మెదడే. మనసు కృంగిపోనిది.
మాటలు తుప్పుపట్టినవే. చేతలు చాలా పదునైనవి.

వాడంతే. వాణ్ణలా వదిలేయండి.

30/10/2013


Black Heart

పచ్చి మనసు

మనసు మరీ పచ్చిగా ఉంది.
తేమకు మగ్గిపోకముందే
ఎండలో వీలైనంతవరకూ ఆరబెట్టుకోవాలి.

దొక్కదొరికిందో ప్రొద్దుతిరుగుడు పువ్వు.
మనసును ఈ పువ్వులో పెట్టి
ఎండిపోయేవరకూ నేను దానికిందే నిద్రపోవాలి.

కను రెప్పలు మూస్తే గానీ
బహిర్గతం కాని నా అంతరంగం
నన్నెందుకో వింతగా చూపిస్తుంది.

ఆ పువ్వులో ఒదిగిన మనసు మాత్రం
భానుకిరణం ఎటు కాల్చేస్తే అటు తిరుగుతూ
నల్లగా మాడిపోయింది.

ఇప్పుడు నా మనస్సు రంగు
అన్నిటినీ ఇముడ్చుకుని
అంతటినీ తట్టుకోగలిగే నలుపు.

28/10/2013

అందుకో విజయం

ప్రభాత కిరణం అడ్డొస్తే
విధాతవై నువు ప్రాణం పొయ్..

నదీనదాలు నిను ముంచేస్తే
పదేపదే పోరాటం చెయ్..

నిశీధి రెక్కలు ఆడించి, నిందలు తోకలు జాడిస్తే
శిలలా మారక శిధిలం అవ్వక
శాంతంతో మనసు కప్పేసెయ్
సహనంతో ముందుకే అడుగేసెయ్

కాలం నిప్పులు కురిపించి ఇంద్రజాలం విధిలా ఆడిస్తే
నిరాశనోదిలీ నిస్పృహవీడి
నటరాజువై నువు నృత్యం చేయ్
వాటన్నిటి భరతం పట్టేసెయ్

నలు దిక్కులు సుడిలా చుట్టేస్తే
నక్క జిత్తుల వలలూ మాటేస్తే
పై ఎత్తుల కొరడా ఝుళిపించెయ్
గమ్మత్తుగ గెలుపును ముద్దాడెయ్

27/10/2013


నాకు మాట్లాడ్డం రాదు - 2

నాకెందుకో మాట్లాడ్డం రాదు.
మళ్ళీ మళ్ళి ప్రయత్నించినా
పలుకులు పక్కదారి పడుతున్నాయి.
భాష తెలియక నోరు తికమకపడుతోంది.

అంతా నాకే తెలుసని విర్రవీగుతా.
ఆ భ్రమలో వివేకాన్ని మాత్రం కోల్పోతా.
ఏంజరుగుతుందో ఆలోచించకుండా
నా మనసును ఆనందంలో విసిరేస్తా.
మీ మనసుల్ని మాత్రం
బర్నాల్ రాసుకోవడానికి సిద్దం చేస్తా.

అందుకే ఇప్పుడు
నా మాటలు వేన్నీళ్ళై
కాళ్ళపై వొలికిపోయాయ్
మీ మనసులో నేను చేసిన చెరిగిపోని మచ్చ
చిటికెలో నా శరీరంపై గాయం చేసింది.

కలబంద గుజ్జు నా మంటను చల్లారుస్తుంది
మరి మీ మనసులో మంటనూ ???

26/10/2013

నువ్వూ - నేను

అన్నీ పక్షులే ఆకాశంలో.
కానీ దేనికీ రెక్కలు లేవు.
ఎక్కడినుంచో ఎగిరొచ్చి రెక్కలాడించే పక్షికి
నువ్వూ నేనే రెండు రెక్కలం.

అడవుల్లో ఎగరాలని నీవు
వనాల్లో విహరించాలని నేను
ఇవువురి భావమొక్కటే,
భాష మాత్రం అర్థం కావడం లేదు.
మౌనానికి ఓపిక లేదు.
మనసుకి తాళం లేదు.

మన పోట్లాట పక్షికే ప్రమాదం
ఈ వైరం కోసమే రెక్కలు లేని పక్షుల ఆరాటం
మరో రెక్కలు రాలిన పక్షిని మనం ఎందుకు తయారు చేయాలి?
అందుకే కలసి కట్టుగా ఈ పక్షిని గగనంలో విహరింపజేద్దాం!
అపార్థాలొదిలి అనంత లోకాలకు ఆదర్శమౌదాం!!

ఆడువారి చేష్టలకు అర్థాలే వేరులే...

అటువైపూ ఇటువైపూ
గిరిగీసిన తరువాత
ఎటువైపూ నడవనుగా
నీ అనుమతి లేకుండా

సడి చేయని శబ్ధాలు
టపాసులై పేలుతుంటే
నా చెవులే తధేకంగా
నీ పలుకులే వింటాయి

గిరగిరన గడియారం
ఘడియలన్నీ భోంచేస్తే
నా చూపులు ఆత్రంగా
నీ రూపునే చూస్తాయి

వందలాది పూలన్నీ
మకరందపు కుప్పేస్తే
నా మనసున చామంతై
విరిసావే వయ్యారి

వేవేల కవ్వాలు
చిలికి చిలికి అలిసిపోతే
సన్నని నీ నడుము చుట్టూ
వాల్జడనే విసిరావే

గీత దాట సాహసిస్తే
మాయమౌతానన్నావే
మరి గీతలోనే నేనుంటే
కవ్వింతల చర్యలేల?

ఓహోహో... నీ మర్మం నాకెరుక
కొద్ది సేపు వేచిచూస్తే
ఈ గీతలోనే నువ్వుంటావ్..
ఆడువారి చేష్టలకు అర్థాలే వేరులే....

24/10/2013


Lotus rain...

My sleep dreams a lotus rain every day.
I feel crazy to catch every lotus at a time.
but, nevere catch even a lotus bud.
Now I became a free bubble.
flying to hights in the lotus rain.
My joy tends to the peak.
My heart wants to asleep.

23/10/2013

ఆమె ఇప్పుడు వాడి భార్య

వాడి కళ్ళింకా రుధిరాన్నే స్రవిస్తున్నాయ్
కలలు మాత్రం ఊహల్లో భ్రమిస్తున్నాయ్

రెప్పార్పకుండా వాడలానే వాడిపోతున్నాడు
జారిపోతున్న రుధిరంలో అలానే తడిసిపోతున్నాడు

క్షణం వేచిన కాలం మరుక్షణమే మాట మార్చింది
ప్రేమ రక్షణ కరువైన గుండె గోడల్ని కూల్చేసింది

అయినా, ఎందుకో? ఏమో?
వాడి చూపులింకా నిరీక్షణలో నిమగ్నమై ఉన్నాయి
భగ్న హృదయం కాస్తా నగ్నంగా మూగబోతోంది

స్రవిస్తున్న రుధిరం నిండుతూ గుండెనే ముంచేసింది
ఇప్పుడది ఎర్రటి కవచాన్ని కప్పుకొని ఇంకా ఎర్రగా మారింది

అయినా ఆ కళ్ళకు ఏ మూలో ఒక చిన్న ఆశ
తన వాకిళ్ళను మూయక స్రవిస్తూ అలానే ఎదురుచూస్తోంది.

మనసెక్కడుంది? ఆ పొంగుతున్న రక్తానికి
మొత్తంగా నిండి, ఆ కళ్ళనూ ముంచేసింది
అక్కడ ఎండి పొడిబారిన రుధిరమే తప్ప హృదయమే లేదు

ఉన్న ఆ పొడినీ కూడా కక్కుర్తి పడ్డ వ్యాపారొకడు
కస్తూరిలో కలిపి కోవెల్లో అర్చనకని అమ్మేశాడు

ప్రియుడి కోసం కాకున్నా డేవుడి కోసం వచ్చిన ప్రేయసి
కోవెల్లో కుంకుమను నుదుటిపై దిద్దుకుంది

హృదయానికి దక్కని భాగ్యం రుధిరానికి దక్కింది
ఇప్పుడా ప్రేయసి వాడి భార్య
ఎవరు ఔనన్నా కాదన్నా....

22/10/2013
మనసు - ప్రేమ - ఆశ

మనసే మహత్తర జలపాతం
ఉదయించే ఆశల తొలిగీతం
కనిపించని కోర్కెల ప్రతిరూపం
వినిపించే భావపు సుమగీతం

ప్రేమే జగమున చిరు శాపం
ఆడును మనసుతో చలగాటం
ఎడబాటే దానికి మలిరూపం
ఎగిరిపడితే ఎక్కించును బలిపీఠం

ఆశే మనిషికి ఫలహారం
అత్యాశే దానికి కొలమానం
నిరాశ వదిలితే మణిహారం
కృషిచేస్తే తెచ్చును బహుమానం

22/10/2013


మనిద్దర్నీ చంపేస్తాయి.

నువ్వూ నేనూ ఎదురుపడతాం!
చెయ్యో చిరునవ్వో గబగబా
తమ కార్యాన్ని మొదలుపెట్టి
వెంటనే ముగించేస్తాయి.

మనసు నోట్లోంచి బయటికి కారిపోకుండా
తలో దిక్కుకు తరలిపోతాం!

ముక్కు ముందున్న దిక్కునే చూస్తూ
మునుముందుకు సాగిపోతాం!

అప్పుడు తలుచుకుంటాం. ఒకర్నొకరం!
అప్పుడెప్పుడో ఇద్దరికీ పుట్టిన జ్ఞాపకాల్ని
తిట్టుకోవడమో..తట్టి కౌకిలించుకోవడమో చేస్తూ
అడుగులు ఇంకా ముందుకే వేస్తూ పోతాం!

దారిలో ఏ మధుర భావనో
కాలికింద రాయిగా నలిగి
ఇద్దర్నీ వెనక్కి తిరిగేలా చేస్తుంది.

ఇద్దరం ఒకేసారి వెనక్కి తిరుగుతాం.
అక్కడ నీ ముందు నేను నా ముందు నువ్వూ
ఎవ్వరమూ ఉండము.
ఆ శూన్యంలో చచ్చిన క్షణాలు మనిద్దర్నీ చంపేస్తాయి.

20/10/2013


ముసుగులో ...

కనబడకుండా దాక్కుంటే
నిన్ను కనిపెట్టలేననుకున్నావా?

మాట్లాడకుండా మొహం చాటేస్తే
నీ కళ్ళలోని ఆప్యాయతని పసిగట్టలేననుకున్నావా?

నేను ప్రేమించింది నీ మనసును అయితే
నీ మేనికెందుకు ముసుగేసుకుంటావు?

ఆ ముసుగు నాకోసం కాదా?
అయితే ఎందరి హృదయాల్ని కొల్లగొట్టావ్?

నీ ముసుగుతో చేసే మ్యాజిక్కులకు పడిచచ్చే లోకాన్ని చూసి
సంతోషంతో గంతులేస్తూ సాగిపో

స్నేహానికి కొత్త నిర్వచనాన్నిచ్చి
కొలమానాలు లేని బావావాలతో
సనాతన సంస్కృతికీ అందని కొత్త బంధాన్ని సృష్టిస్తూ
వింతలోకంలో పరుగులు తీసేయ్..

ఎప్పుడూ ఆగకూడదనుకుంటావు.
ఎప్పుడో ఒకసారి ఆగాల్సిన పరిస్తితి వస్తుంది.

నీకున్న బాధలేవో నీవి.
నీకున్న భయమేదో నీది.
నీకున్న భావాలేవో నీవి.

" నేను నీ ముసుగు తొలగించాలి ప్రయత్నించడం లేదు.
నాకెందుకా అవసరం? " అంటూనే నీ ముసుగును నిందిస్తున్నా.
నా మనసును తెలిపేస్తున్నా..రెక్కలు మొలవాలా?

రెక్కలు లేవని బాధపడతావెందుకు?
ఉన్న కోళ్ళు ఎగురుతున్నాయా?
బద్దకించిన బాతులు విహరిస్తున్నాయా?

లేని మేఘాలను చూడు
దుమ్ము కణాల ధైర్యాన్ని చూడు
ఉన్నవే కావు లేనివెన్నో ఎగురుతున్నాయి చూడు.

చింతలను మరుపు దొంతెరలతో కప్పేయ్
జ్ఞానం కోసమే తప్ప
జ్ఞాపకాలకోసం అందులో తొంగి చూడకు.

గమ్యమంటారందరు.. దాని కోసం వెదక్కు.
నీ గమనంలో నిమగ్నమైపో
సరికొత్త రంగుల లోకం నీకోసం తెరుచుకుంటుంది.

ఎన్నో నదులూ పర్వతాలూ అడ్డొస్తాయి
అన్నీ అందమైనవే. ఆహ్లాదంతో పాటూ విషాదాన్నీ మిగుల్చుతాయి.
ఐనా సరే ఆలోచనల వంతెనలను నిర్మించి
చిరు నవ్వుతో అన్నిటినీ దాటేయ్.

సహనమనే ఆయుధాన్ని చేతపట్టి
సరిహద్దు లేని సంద్రాన్ని నీలో ఇముడ్చుకో.

అప్పుడు మొలుస్తాయ్ రెక్కలు
నీకు కాదు నీ హృదయానికి.
విహరిస్తావు. విశ్వంలో కాదు.
నలుగురి హృదయాల్లో.. నాలుగు తరాల నడకల్లో.

19/10/2013

కళ్ళు కింద పడ్డాయ్...

నువ్వు తారసపడ్డ ఆ త్రోవలొనే
నా రెండుకళ్ళూ రాలిపడ్డాయి.

నీ అడుగులే తప్ప నువ్వు లేవక్కడ.
ఎంత గాలించినా నువ్వు దొరక్క
నా కన్నులు అక్కడే నిన్ను ధ్యానిస్తూ ఉండిపోయాయి.

ఎన్ని క్షణాలు నీ తలపుల్లో తడిసాయో
భారంతో అస్సలు ముందుకు కదలడంలేదు కాలం.
నీ జ్ఞాపకాల్లో యుగాలు ఆవిరయ్యాయన్న భ్రమలో
ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి.

నీవు నడిచిన అడుగుల జాడలు అలానే ఉన్నాయి.
నీతో కలిసి నడిచే భాగ్యం లేక
ఆ కళ్ళు కన్నీళ్ళతో నీ ఒక్కో అడుగును
చిన్ని చిన్ని మడుగులుగా మలుస్తూ సాగిపోయాయి.
చివరకు కన్నీళ్ళూ ఇంకిపోయి
కళ్ళు బీటలు బారి భూమిలో కలిసిపోయాయి.

కాలం చేసిన ఇంద్రజాలంలోంచి
ఆనందంతో నువ్వెందుకో మళ్ళీ ఆ త్రోవలోనుంచే వస్తావు.
అక్కడ పడిఉన్న బుల్లి బుల్లి అడుగుల మడుగుల్లో కన్నీటిని
నీ పాదాల చప్పుళ్ళతో అలజడి చేస్తూ వెళ్తావు.

కన్నులకు నిన్ను చూసే భాగ్యం దక్కకున్నా
కన్నీళ్ళు నీ పాదలను స్పృశించే అవకాశం దక్కించుకున్నాయి.
ఈ ఆనందంతో కన్నీళ్ళు ఆనంద భాష్పాలై ఆవిరౌతూ
గాల్లో కలిసిపోతున్నాయి.

ఇంతలోనే ఎవడు పడేసుకున్నాడో మళ్ళీ
ఇంకో రెండు కళ్ళు అక్కడ తచ్చాడుతున్నాయి.

19/10/2013

ఆ కుర్చీకి కాళ్ళే లేవు !

ఎడారుల్లో ఎండమావుల్ని వెతుక్కుంటూ
ఎండిపోయిన గుండెలన్నీ
కన్నీటి మంటల్లో కొట్టుకుపోయి
టైటానిక్కును ముంచేసిన మంచు కొండల్ని
ఢీ కొట్టి మరీ పగిలిపోతున్నాయి.

చెల్లాచెదురైన ముక్కలన్నీ
పిచ్చిచూపులు చూస్తూ ఎదురుచూస్తున్నాయి.

వాడెవడో వచ్చి పూతమందు రాస్తాడని,
ఏదో టానిక్కిచ్చి ఠక్కున అతికిస్తాడని,
కొత్త రక్తాన్నెక్కించీ ఉత్తేజాన్ని రగిలిస్తాడనీ...

వాడెవడో రానేవచ్చాడు.
ఎన్ని కండువాలు మార్చాడో ఏమో!
ఖద్దరు చొక్కా అస్సలు నలగలేదు.
రెండు మంత్రాలేవో విసిరి
రాలిపడ్డ ముక్కల్ని తొక్కుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు.

పడుతూ లేస్తూ ఊగుతూ తూగుతూ
సరిగ్గా కూర్చోవడానికే ఐదేళ్ళు చాలడంలేదు.
మళ్ళీ విరిగిందిప్పుడు.
ఆ కుర్చీకసలు కాళ్ళే లేవు.

17/10/2013


నువ్వు అందని చందమామవు ..

నువ్వు నువ్వే కాకున్నా
నేను నిన్నే ఇష్టపడుతున్నా.

నువ్వు నిష్చలంగా ఉంటూ
నీ నీడతో మాత్రం కవాతు చేయిస్తావు.

వాడి నరకానికి పయనమయ్యే సుమాలన్నీ
నీ నడకలో నలిగి నెలవంకలై పూస్తాయి

ఆ వెలుగుల్లో నిన్ను చూద్దామని వెళ్తే
వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెన్నెల్లో వొలికిపోతావు

నాకిప్పుడర్థమైంది.
నువ్వు అందని అందమైన చందమామవని.

17/10/2013

నేనే నీ సర్వస్వం!

నేనే నీకు పంచభక్ష పరమాన్నం
పీల్చు నములు మింగు తాగు చప్పరించు

నేనే నీ శత్రువుని
కొట్టు తిట్టు గిల్లు కొరుకు చంపెయ్

నేనే నీ ప్రియసఖిని
పంచుకో ప్రేమించు పరవశించు లాలించు స్పృశించు

నేనే నీ సర్వస్వం
బంధించు భ్రమించు రమించు ఏలుకో ఐక్యం చేసుకో

16/10/2013నీ అలరింతలు

ఏ చిగురాకు నుంచి జాలువారిన మంచు ముత్యానివో
చిరురించని నా మనసులో చిరు సంద్రమై నిలిచావు.

ఏ చింత చిగురు కొమ్మ కుమ్మరించిన పుల్లదనానివో
చెంత చేరి నా చింతలన్నీ పోగొట్టే చిలిపి భావమైనావు.

ఏ పండు వెన్నెల ప్రసవించిన పడుచు పాల సంద్రానివో
కాంతి నింపి నా మదిని కొల్లకొట్టే గడుసు కోమలివైనావు.

ఏ సూర్య కిరణము మోసుకొచ్చిన సమ్మోహన శక్తివో
సొమ్మసిల్లిన నా కన్నులకు సోయగాల గాయాలు చేశావు.

ఏ ఆహ్లాద నట్యము నుండి రాలిపడ్డ నెమలి కన్నువో
పురివిప్పని నా ఆలోచనలకు కలల రంగుల్ని పులిమావు.

ఏ కోయిల స్వరరాలలో పులకించే నిత్య వసంతానివో
సారం లేని నా జీవితంలో సప్తస్వర విస్యాసాలతో అలరించావు.
ముద్దు కావాలా?

" ఈ బుంగమూతి ఎందుకే?
ఒసేయ్ ముద్దబంతీ! ఇంకా అలిగి నన్ను చంపకే .
నన్నింకా రెచ్చగొడుతోందే నీ కోపం.
దరి చేరి తీర్చుకోమంది నా తాపం.
అడిగింది చిన్న ముద్దైనా
వద్దు వద్దంటూ;
హద్దు మీరుతున్నావంటూ ఈ హెచ్చరికలెందుకే?
సర్దుకుపోయి సంతోషపెట్టక. "

" బుంగమూతి భావం చెప్పమంటావా? ఓ పిచ్చి మొద్దూ
పుచ్చుకోమనేగా నీ తాపం తీర్చే ఈ తొలి ముద్దు
వద్దూ వద్దు అనే విన్నావా?
నా తనువు కదలికలు కనరావా?
నేనేగా నీ సరి హద్దు
అది దాటి నువ్వింక వెళ్ళొద్దూ
తప్పో ఒప్పో ఇంకెలా చెప్పను ఒప్పుకున్నానని "

16-10-2013పెళ్ళి చూపులు

ఎన్నో కోల్పోవడానికి సిద్ధమౌతున్నా.
ఇంకెన్నో పొందడానికి పయనమౌతున్నా.

రెప్పలపై కన్నీటిని సునాయాసంగా మోస్తున్నా.
పెదాలపై చిరునవ్వును భారంగా భరిస్తున్నా.

ఆశయాలను మూట కట్టి మూల పడేస్తున్నా.
ఆశలను రెక్కలుగా తొడుక్కుంటున్నా.

పాత బంధాలకు జ్ఞాపకాల సంకెళ్ళు వేస్తున్నా.
కొత్త బంధాల పరిధిలో బంధీగా మారబోతున్నా.

మనసును చుట్టుముట్టే ఎన్నో బాధలతో కదలలేకున్నా
అదే మనసులో చిగురించే వింత భావాలతో నడుస్తున్నా

పైటచాటున దాచిన హృదయాన్ని
నిండా నగలతో నొక్కిపెట్టి మరీ
పెళ్ళిచూపులకు సిద్ధమౌతున్నా...

15-10-2013


మంచు హృదయమే! కానీ..

రాయిలా కనిపిస్తున్నా
అందరిలా నీదీ ఓ మంచు హృదయమే !
నీ చుట్టూ నువ్వే సృష్టించుకొన్న చల్లదనం వల్ల
అది కరగడం లేదు.
ఎంతో క్రమశిక్షణతో హద్దు దాటకుండా
నీకు నువ్వే ఆవిష్కరించిన వింత వాతావరణమది.

ఎన్నో ఆశల్ని బలమైన నీ నిగ్రహంతో
బంధించి ఊహల్లో సంతృప్తి చెందుతావు.
హృదయంలో అలజడులు రేగుతున్నా
అంటీ ముట్టనట్లు వ్యవహరించి
దేనికోసమో ప్రాకులాడతావు.

అలరించే సీతాకోకలు కనువిందు చేస్తే
అల్పసంతోషివై మరో విన్యాసం వైపు పరుగులు తీస్తావు.
కానీ ఆ సీతాకోకల్ని తలుచుకుంటూనే ప్రతిక్షణం గడుపుతావు.

ఎప్పుడో గానీ నీ మనసు కరుగదు.
అప్పుడు అది ద్రవించి కన్నీటి జలపాతాలను సృష్టిస్తుంది.
ప్రేమో అంతకన్నా గొప్ప బంధమేదో
నీ మదిలో తొణికిసలాడుతుంది.

దానికప్పుడు ప్రాణం పోయడానికనీ ప్రయత్నించి
నిన్ను నువ్వే ఏమార్చుకుంటూ
టక్కున నీ మనస్సును మార్చుకుంటావు.

వెంటనే నీ ఉద్వేగాన్ని అణచుకొని
మునుపటి వాతావరణాన్నే మళ్ళీ ఆశ్రయిస్తావు.
శాస్వితంగా నీ మంచు హృదయాన్ని నిలుపుకునేందుకు
మళ్ళీ తహతహలాడతావు.

12:00 ఉదయం. .. 15/10/2013


విజయనగరంలో ఓ సామాన్యుడి వేదన

అప్పుడు ప్రెంచి దొరలకు అమ్ముడుబోయిన గంజాయి మొక్క
ఇప్పుడు అదే గడ్డపై సారా మొక్కగా మొలిచింది.
నరనరాన నియంతృత్వాన్ని నింపుకొని
అధికారం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి
తన కొమ్మలను తానే నక్కుంది.
మోడుబారి కూడా మనుషుల్ని పాలించాలని
మానవావతారం ఎత్తింది.

* * *

వాడిప్పుడు తల్లి గుండెలను తన్నే మాతృద్రోహి.
పిల్లిలా మాట్లాడే అధిష్టానపు కీలుబొమ్మ.
విదేశీ రాణి భజనలు తప్ప
ప్రజల మనోగతాలను వల్లె వేయని ప్రజాస్వామ్యపు పాపి.
కుంభకోణాల్లో ప్రజల సొమ్మును
కుంభాలు కుంభాలుగా మింగిన అవినీతి కుంభకర్ణుడు.
మత్తుటేర్లు పారించిన మధ్యం మాఫియాకు మహారాజు.
సొంతాస్తులు కూడబెట్టి
సొంతవారికే పదవులు కూడగట్టుకున్న రాజ్యాగ విద్రోహి.

* * *

ఇప్పుడు ఏ అగ్ని పర్వతం బద్ధలు కాకున్నా
సామాన్యుడి నరాల్లో లావా ప్రవహిస్తోంది.
ఏ సునామీ విజృంభించకున్నా
విజయనగరుడి గుండెలు కెరటాల్లా ఎగసిపడుతున్నాయి.
ఏ భూకంపమూ భయపెట్టకున్నా
సారా కుటుంబ కుర్చీలు గజ గజా వణికిపోతున్నాయి.

* * *

కర్ఫ్యూలూ.. లాఠీ చార్జ్ లూ.. రబ్బరు బుల్లెట్లూ...
ఎన్ని కుట్రలూ.. ఎన్నెన్ని కుతంత్రాలు .. సామాన్యుడిపై..
అయినా ఏ మాత్రం ఆగని నిరసన.

ఉద్యమ కెరటాలింకా రగులుతూనే ఉన్నాయ్..
రగిలి రగిలి ఉవ్వెత్తున ఎగుస్తూనే ఉన్నాయి..
ఆంధ్రదేశాన్ని ముక్కలు చేయబోమన్నంతవరకూ
కుళ్ళు నేతల కుర్చీలు ఖాళీ అయ్యేంతవరకూ
ఇంకా ఇంకా రగులుతూనే ఉంటాయి.

* * *

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి చేతికీ
ఐదేళ్ళకోసారి తుపాకీ వస్తుంది.
ఆ తుపాకీలు చేతపట్టే సమయం ఎంతో దూరంలో లేదు.

ఓటు తూటాలతో విద్రోహుల గుండెల్ని పేల్చి
బూటుతో తన్నినట్లు ప్రాంతీయ ద్రోహులను
ఈ.వి.ఎం. మీట నొక్కి తరిమికొట్టాలి.
సమైక్యాంధ్రప్రదేశ్ ను సుస్తిరంగా నిలుపుకేనే
సమయం ఇంకా మించి పోలేదు.
జై సమైక్యాంధ్ర !
గులాబీ లేడీ [ నేటి మహిళ ]

గులాబీ మొక్కకు నీరు పోయాలి.
గబగబా ఇంటిపనులూ ఒంటపనులూ చక్కబెట్టుకోవాలి.
లంచ్ కూడా బ్రేక్ఫాస్ట్ తో కలిపి వండి క్యారీలో పెట్టుకోవాలి.
అంతకు ముందే ఆ దేవుణ్ణి ఒకసారి పలకరించాలి.
మనసునే నైవేద్యంగా పెట్టీ మళ్ళీ దాన్నే ప్రసాదంలా గుండెల్లో దోపుకోవాలి.

గుడ్డ కప్పిన స్కూటీ దుమ్ము దులిపీ ఆఫీసుకు పరిగెత్తాలి.
వందల వింత చూపులను చూసీ చూడనట్లు;
దూది పింజల మాటల్తో శూలాల్లా గుచ్చే నోర్లను,
చమత్కారంతో మూయించడమో
చిరునవ్వుతో స్వాగతించడమో...

సాయంత్రం వరకూ ఇదేవరస.
యంత్రం లా పనిచేసే ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు.
గుండెకు తూట్లు పడుతున్నా సంజాయిషీలతో
ఇంట్లో వాళ్ళకు సెల్ఫోన్లో పలకరింపులు.
మధ్య మధ్యలో విచిత్ర బంధాల చిత్రవధలు.

సేదతీరేందుకని పరిగెడితే నవార్లు తెగిన చెప్పుల వెక్కిరింతలు.
పంచరైన బండిని రెపేరు చేయించి మళ్ళ్లీ ఇంటిదారి పట్టాలి.

అలసటతోనో.. అసహనంతోనో ...
దివాన్ కాట్ మీద దివానీలా కూలబడితే
కాలింగ్ బెల్లుల మోత. ఎన్నో బిల్లుల వాత.

ఇంటిని సర్దే కార్యక్రమం అప్పుడే మొదలౌతుంది.
అందర్నీ సేదతీర్చాల్సిన పనీ అప్పుడే.
సగం రాత్రి గడచినా సగం పనులు పూర్తికాకముందే
మళ్ళీ ఆ సూర్యుడు రొటీన్ గా వెక్కిరిస్తాడు.

వాడిపోయే గులాబీ మొక్కకు ఇప్పుడు మళ్ళీ నీరు పోసి బ్రతికించాలి.
మరి నా జీవితం ఎప్పుడు పువ్వై పూస్తుందో ?!

11/10/2013

( డెడికేటెడ్ టు ఆల్ వుమెన్ )


ఉరేసుకోవాలని ఉంది.

నేను నిన్నెప్పుడూ గమనిస్తుంటాను.
ఇప్పుడు కూడా.
ఉన్నవి రెండు కళ్ళే.
హ్రదయ వైశాల్యం మాత్రం ఊహలకు అందనిది.

ఎందుకలా తికమక పడి ఆలోచిస్తావ్?
కొత్త సమాధానాలు ఇక్కడేం అవసరం లేదు కదా!
సమాధానం " అవును " " కాదు " ఎదో ఒకటేగా?

అవునంటే
నీతో జతకట్టి ఇంకో జాబిలమ్మకు
జన్మనివ్వాలని ఉంది.
కాదంటే
ఉన్న జాబిలికి తాడు కట్టి
ఉరేసుకోవాలని ఉంది.

00 :12 09/10/2013


My first Love Letter

ప్రేమ లేఖను ఇలా రాయొచ్చా? నేనెప్పుడూ రాయలేదు. ఇదే నా మొదటి ప్రేమలేఖ.


ప్రియాతిప్రియమైన నా హృదయ దేవతకి, నీ తలపులనే అక్షరాలుగా కుమ్మరించి రాస్తున్నా ఈ తొలి ప్రేమ లేఖ. నువు మొదటిసారి కనిపించినపుడు నీ అందం నన్నేమీ మాయ చేయలేదు. నాలో ఏ అలజడీ సృష్టించలేదు. నిజం చెప్పాలంటే సాధారణ అమ్మాయిలాగే నాకు కనిపించావు. కానీ నీ అందంలో ఒదిగిన అమాయకత్వం నన్ను ఆకట్టుకుంది. ఆ అమాయకత్వంలో దాగిన గడసరిదనమే నన్ను ముగ్దుణ్ణి చేసింది. అప్పుడే నీకు నా మనసును నీకు తెలపాలనుకున్నా. నా మదిలో ఎక్కడో దాగిన మొహమాటం దాన్ని ఆపింది. నేని క్రికేట్ ఆడేటప్పుడు నువ్వెప్పూడో ఒకసారి అటుగా వస్తావు. నీ చూపులు నన్ను గమనించాలని ఎంత గోలచేశానో నలుగుర్లో. అవి నీకు ఇబ్బంది పెట్టిఉంటే క్షమించు. నువ్వు ఉదయానే ఇంటిముందు ముగ్గులేస్తావని తెలుసు అందుకే నిన్ను చూడ్డానికని అదేపనిగా మీ ఇంటికి పెపర్ వేయడానికని పనిలో చేరను. ఒకరోజు నువ్వు సరిగ్గ చుక్కలు కలపకుండా ముగ్గును తప్పుగా వేసి ఏంచేయాని ఆలోచించి కంగారుగా తుడిపేస్తూ తెల్లటి ముగ్గుపిండిని స్పృశించిన నీ చేతుల్తో ముంగురుల్ని సవరించావు. అప్పటీ హావభావాలు చిలిపిగా నా మదిలో ఇప్పటికీ గిలిగింతలు పెడుతూనేఉన్నాయి. నువ్వు అప్పుడప్పుడూ స్కూటీలో దూసెళ్తే నీ కురులు గాలికి నాట్యమాడి నన్ను ఆహ్లాదపరుస్తాయి. చున్నీ రెపరెపలాడి నా గుండె వేగాన్ని పెంచేస్తుంది. నీ స్థైర్యం చూసినప్పుడల్లా నేను మంత్రముగ్దుణ్ణి అయిపోయి అలా చూఉస్తూనే ఉంటాను. ఎప్పుడూ నన్ను కన్నెత్తి చూసేదానివి కాదు. ఈ మధ్యెందుకో నన్ను గమనిస్తున్నట్లూ నీ చూపులు నా విరహాన్ని అర్థంచేసుకుంటున్నట్లు నాకనిపిస్తోంది. మొన్న మార్కెట్లో నిన్ను చూస్తూ డజన్ కొత్తిమీర అడిగినప్పుడు నవ్వావుగా. ఆ నవ్వులు నా హృదయంలో ఎప్పటికీ పదిలమే. ఈ చనువునే ఆసరాగా తీసుకుని ఎంతో ధైర్యం చేసి చెప్పేస్తున్నా ప్రియతమా. నా మనస్సు నిన్ను కోరుకుంటోంది. ఎందుకని అంటే నేను మాటల్లో చెప్పలేను. అది నావల్ల కావడం లేదు. నీ మీదున్న నా ప్రేమని మూడు మాటల్లో చెప్పాలని లేదు. నువ్వు అంగీకరిస్తే జీవితాంతం దాన్ని పంచాలని ఉంది. నా మదిలో ఉన్న ప్రేమని ఇంకెలా చెప్పాలో నాకు అర్థం అవట్లేదు. ఇది నీకు ఏమాత్రం అర్థమైనా మీ అన్నయ్యకు చెప్పొద్దు ప్లీస్. " నువ్వు నాకు ఇష్టం లేదు" అని కూడా చెప్పొద్దు. అలా చెప్పాలనుకుంటే రేపు ముగ్గు వేయడానికి రావొద్దు. నా జీవితంలో నీ రాక కోసం ఎదురుచూస్తూ ఇంతటితో ముగిస్తున్నా. స్పందిస్తావు కదూ...

నాకెందుకో మాట్లాడ్డం రాదు.

నాకెందుకో మాట్లాడ్డం రాదు.
కదిలించి గిలిగింతలు పెడితే
కొద్దిగా నవ్వి ఊరుకుంటాను.

ఎప్పుడో ఒకసారి ఏదో భయంభయంగా
ఆచితూచి రెండు మాటలు మాట్లాడతాను.

ఎన్నో ఊసుల్ని మనసులోంచి తీసి
ఎదుటివాళ్ళ మస్తిష్కంలో ముంచాలని
మాటిమాటికీ ప్రయత్నిస్తుంటాను.
పెదాలు మాత్రం బద్దకస్తుల్లా
ఒక్క మాటనూ గడప దాటనీయవు.

అప్పుడప్పుడూ అసంధర్భంగా అప్రయత్నంగా
కొన్ని పదాలు అలా వచ్చేస్తుంటాయి.
అవి వెగటు పుట్టిస్తూ విచిత్రంగా ఉంటాయి.
నా పైత్యాన్ని నలుగురికీ చాటుతుంటాయి.
నాకు మళ్ళీ మాటలు నేర్పించడానికి
అమ్మ అమ్మమ్మలకూ ఓపిక లేకపోయింది.
నేను మళ్ళీ నేర్చుకోవడానికి
బాల్యంలో ఉన్నంత ఉత్సాహమూ లేదు.
అందుకే మాటలు రాని నేను
మొండి కవితలు రాస్తూ
ఇలా మాటలొచ్చిన మూగవాడిగా మిగిలిపోతున్నా.

08/10/2013

నిద్ర కావాలి !

నాకు నిద్ర కావాలి.
సాయంత్రం సూర్యుడిలా ఆవలిస్తూ
రాత్రి నిద్ర పోయినట్లు కనిపిస్తాను.
నా కోసం మరో ప్రపంచం కళ్ళార్పకుండా
ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇక్కడ మిమ్మల్ని భ్రమలో ముంచి
అక్కడి కళ్ళలో మునిగిపోతాను.
ఉన్న వెలుగునే వొలికిపోకుండా
ఎక్కడెక్కడో పంచేస్తూ ఉంటాను.
ఇప్పుడు నాకు అలసట వచ్చింది.
గాడంగా నిద్రపోయే రాత్రిలో
మరింత గాఢంగా నిద్రించాలి.
చీకట్లను బెదరగొట్టి
విశ్వాన్ని అర్థించే
బుడబుక్కలవాడి శబ్ధంలోని ఆంతర్యాన్ని
కలలుగనేలా నాకు ఓ మంచి నిద్ర కావాలి.
ఎవరైనా ఇస్తారా మరి?

10:06 07/10/2013

అర్థిస్తున్నా ! ్

నువు వెన్నెల గుడిలో నిదురిస్తున్నా,
నేనిక్కడి నుండే నిను చూస్తున్నా !

నీ తలపుల జడి నను తడిపేస్తున్నా,
నువు పంచిన ఎదనే తడిమేస్తున్నా !

నీ వెచ్చని కౌగిలి గుర్తొస్తున్నా,
నీవిచ్చిన శ్వాసను పీల్చేస్తున్నా !

నువు కమ్మని కలవై వచ్చేస్తున్నా,
నే కన్నులు మూయక వెతికేస్తున్నా !

నీ సొగసుల శరములు బాదిస్తున్నా,
నా వలపులు మొత్తం దాచేస్తున్నా !

నా యదలో విరహం నర్తిస్తున్నా,
నీ యదతో జతకై అర్థిస్తున్నా !

07/10/2013
గాజు మనిషి

గాజులాగా పారదర్శకంగా ఉండాలని
గాజు బొమ్మనే అయిపోయాను.
మనసులోని నిజాల్ని
బహిర్గతం చేయాలని పరిగెత్తాను.
చిన్న అబద్ధం ఒకటి అడ్డొస్తే
జారిపడి ముక్కలైపొయాను.
ఇప్పుడు ఎంతమంది గుండెల్లో గుచ్చుకుంటానో ?
ఎంతమంది ప్రతిబింబాలను పరావర్తనం చేస్తానో?

05/10/2013

ఇగ్లూ

మోయలేని కొండల్ని
ఎత్తుకోవాలనీ హత్తుకోవాలనీ
కండల్ని కరిగించీ రక్తాన్ని మరిగించీ
సడిచేయని మువ్వని సన్నని దారంతో
మెడకు తొడుక్కుని
వడివడిగా నడుస్తూ
ఘడియ ఘడియనీ అడుగుల్తో
వెనక్కి నెడుతూ
పిడుగులా ప్రకాశిస్తూ ప్రకోపిస్తూ
గమ్యమే కానరాని గుబురు దారుల్లో
ఒంటరి వానపామునై
ఆవేశాన్ని ఆలోచనలతో సంపర్గిస్తూ
మస్తిష్కపుటెడారుల్లో
మంచు ముక్కల ఇగ్లూలకు జన్మనిస్తూ
గదులు కడుతూ కూల్చేస్తూ
కూలబడుతూ గడ్డకడుతూ
దాహ సంద్రాన కొట్టుమిట్టాడుతూ
ఎప్పుడో ఒకసారి అర్ధాంతరంగా
ముగించేస్తా ఈ జీవితాన్ని

06/10/2013

కడుపు మోసేది కొన్ని నెలలే !

అమ్మెప్పుడూ నన్ను తొంగి చూస్తూనే ఉంటుంది.
నేనెక్కడున్నా ఆ చూపులే నాకు కాపలాగా ఉంటాయి.
ఆమె కడుపు కొన్ని నెలలకే ప్రసవించినా,
హృదయం మాత్రం నిత్య గర్భిణై నన్నెప్పుడూ మోస్తూ,
ఇప్పటికీ సమ్రక్షిస్తూనే ఉంది.

ఆ గోడలమధ్యే నా హృదయం ప్రేమ పొరలను తొడుక్కున్నది.
ఆ గుండె గదులే నేర్పించాయి: నా సంస్కారాభరణాలను
సహనంతో చేయబడ్డ కవచకుండలాల వెనుక దాచాలని.
అందుకే ఆ హృదయద్వారాలు దాటి నేనెక్కడికీ వెళ్ళను.

అప్పుడప్పుడూ అమ్మ గుండెందుకో
నా ఆశలకు కళ్ళెంవేయడానికని కుచించుకుపోతూ ఉంటుంది.
అది నచ్చక గుండెగోడల్ని నా రెండు కాళ్ళతో తంతూనే ఉంటాను.
అయినా గుండె మాత్రం వ్యాకోచించదు.

తన్నీ తన్నీ అలసిపోయి నేను అక్కడే కూలబడతాను.
కుదుటుపడి ఆలోచిస్తే అమ్మ చేసిందే సరైనదనిపిస్తుంది.
ఇంకా లోతుగా ఆలోచిస్తే, అమ్మ గుండెను నలుపుతున్నది
నా చేస్టల పిడికిలేనని తెలుసుకుని సిగ్గుపడతాను.

ఓ వైపు అమ్మ గుండెల్లో తంతూ ఇంకోవైపు పిడికిలిలో బిగిస్తూ
అమ్మను ఎంత క్షోభ పెట్టానోనని క్షమాపణలు కోరతాను.

అప్పుడు అమ్మ ఏమంటుందో తెలుసా?
" చిన్నప్పుడు కడుపులో తన్నినప్పుడు బాధపడ్డానా?
అవి నాకెంతో ఆనందాన్ని కలిగించాయి.
ఇప్పుడు అంతకంటే ఆనందంగా ఉన్నాను.
నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావని తెలిసీ "

05/10/2013
నా కవిత్వపు గురువు కిటికీ

ప్రతీ ఉదయం ఆఫీసుకని ఆర్టిసి బస్సేకుతాను
ఆ బస్సులో నా కోసం ఎదురుచూస్తూఉన్న కిటికీ పక్కకెళ్ళి
చిన్నగా నాతల దానికానిచ్చి కూర్చుంటాను.
నేను ప్రయాణించే డెబ్బయి నిమిషాల సమయంలో
ఆ కిటికీ నాకు కవిత్వపు పాఠాల్ని బోధిస్తుంది.

కండెక్టర్ వద్ద విసిల్ మ్రోగి, బస్సు బయలుదేరగానే
రకరకాల దృశ్యాలను చూపి భావాల డిక్టేషన్ రాయమంటుంది.
ముందుగా తన అద్దంలో నన్నే చూపించి నీకు నువ్వే గురువంటుంది.
చుసిన ప్రతిదాన్నీ మనస్సుతో నూతనంగా ఆవిష్కరించాలని,
ఆలోచనలకు అక్షరాలతో పదును పెట్టాలని పదేపదే హెచ్చరిస్తూఉంటుంది.
నేను నిత్యవిధ్యార్తినై శ్రద్ధగా ఆ దృశ్యాలను గమనిస్తూ వెళ్తాను.

తట్టలో ఎన్నో రకాలుగా అడుక్కునే బిచ్చగాళ్ళని,
అదే తట్టలో ఏదోఒకటి అమ్ముకుంటూ బ్రతికే చిరువ్యాపారుల్ని చూసి
కూడళ్ళలో పనికోసం కాపలాగాసే వందల కూలీలను చూసి
ఆకలి కవిత్వం రాస్తాను. శ్రామికుల స్వేదాన్ని నా సిరాలో పోసి
వారి కష్టాన్ని అక్షరాలుగా మారుస్తాను.

బస్సు అలానే ముందుకువెళ్తూ ఊరవతల బస్టాప్ లో ఆగుతుంది.
అక్కడ రోజూ ఎదురుచూసే ఒకమ్మాయి బస్సేక్కుతుంది.
నన్ను చూసీచూడనట్టు నా ముందు సీట్లోనే కూర్చుంటుంది.
తన వాలుజడను సవరిస్తూ, పూలను సర్దుకుంటూ ఆమె చూసే ఓర చూపులు చూసీ
ప్రేమ కవిత్వం రాస్తాను. ఆమె దిగాల్సిన చోటువచ్చి దిగిపోతుంటే
విరహ గరళాన్ని కాగితాలపై పోస్తాను.

బస్సు ఎన్నో చిన్న చిన్న పల్లెలు దాటుకుంటూ వెళ్తుంది.
సేద్యం చేస్తూ, పచ్చని పొలాలకు మందు చల్లుతూ, కలుపు మొక్కల్ని ఏరిపారేస్తూ
సన్ననికడుపుతో ఆహ్లాదంగా పనిచేసే రైతన్నలను చూసి
రైతు కవిత్వం రాస్తాను. అక్కడ పండిన ప్రతీ బియ్యపు గింజలపై
వాళ్ళ పేర్లను చెరిగిపోని రంగుతో లిఖిస్తాను.

బస్సు కొంచెం వేగం తగ్గి గువ్వలచెరువు ఘాట్ మార్గం గుండా వెళ్తుంది.
ఎన్నో ఉద్యానవనాలను ఒకచోట పేర్చినట్లుండే ఆ అడవి
పచ్చగా నవ్వుతుంటే ఆ నగవులను అక్షరాలుగా మలుస్తాను.
అక్కడ జోరున వర్షం కురుస్తుంటే కొండకు బదులు నా గుండెను తడిపేస్తూ
ప్రకృతి కవిత్వం రాస్తాను. ఆ శోభను అందమైన పదాలతో బంధిస్తాను.

వనాల సుగంధాలను మోసుకేళ్తూ బస్సు రైల్వే ట్రాక్ వద్ద గేటుపడి ఆగుతుంది.
ఎంత సహనంతో ఎదురుచూసినా ఆ రైలు సమయానికి రాదు.
కంగారుతోనో, నిరుత్సాహంతోనో, ఆలస్యం అవుతుందనో
ఎందుకో తెలియదు ఆగ్రహంతో నా సీట్లో కూర్చోలేక
ఆవేశ కవిత్వం రాస్తాను. అడ్డంకులను అక్షరాలతో తొలగిస్తూ కుదుటపడుతాను.

బస్సు మా ఆఫీసు వైపుగా వెళ్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆగుతుంది.
ఎన్ని అర్జీలు, ఎన్ని రిలే దీక్షలు, ఎన్నెన్ని రాజకీయ రంగులక్కడ.
ఎర్ర జెండాలను మోస్తూ స్థలం కోసం ఒకడు, ఇంటికోసం ఒకడు, పెన్షన్ కోసం ఒకడు..
పోరాటం చేసే సామాన్యులకక్కడ రొజూ లాఠీ చార్జీలే. అడిచుసి బిగిసిన నా పిడికితో
విప్లవ కవిత్వం రాస్తాను. రక్తాన్ని పూసుకున్న కత్తిని నా కాలంగా మలుస్తాను.

అంతలోనే మా ఆఫీస్ వచ్చినట్లు మళ్ళీ కండెక్టర్ విజిల్ మ్రోగిస్తాడు.
ఎందుకో గురువును వీడాలంటే ఎంతో బాధగా ఉంటుంది.
ఆ కిటికీ అద్దాన్ని మూసి తలదువ్వుకొని, నెమ్మదిగా ఆ బస్సునుండి నిష్క్రమిస్తాను.

      
04/10/2013        
     
    


అలా చెరిపివేయకునాకూ నా కన్నులకు ఈ నలతలూ, కలతలూ ఎందుకు?
ఎప్పుడూ నీ కలల్నే కంటుందనా?
నువు నిండిన ఈ గుండెను హరిస్తావెందుకు?
ఏమారకుండా నీ ఊహల్లొ విహరిస్తుంటుందనా?

అటు చూడు నువు నడుచుకుంటూ వెళ్తూ
వదిలేసిన నీ అడుగుల జాడలకు
గొడుగులు పట్టి రక్షించాను.
ఇప్పుడు నే కార్చే కన్నీటి ధారలకు
వాటిని కొట్టుకుపోనివ్వకుండా చూడు.

నీ వెచ్చని శ్వాసను తాకి చిగురించిన కొమ్మలు
ప్రేమ పుష్పాలను రాల్చితే
వాటితో అందమైన గూడును కట్టి
నిన్ను తలుచుకుంటూనే జీవిస్తున్నా.
నీ జ్ఞాపకాల పొదరిల్లది. చెరిపివేయకు.

03/10/2013
Related Posts Plugin for WordPress, Blogger...