మంచు హృదయమే! కానీ..

రాయిలా కనిపిస్తున్నా
అందరిలా నీదీ ఓ మంచు హృదయమే !
నీ చుట్టూ నువ్వే సృష్టించుకొన్న చల్లదనం వల్ల
అది కరగడం లేదు.
ఎంతో క్రమశిక్షణతో హద్దు దాటకుండా
నీకు నువ్వే ఆవిష్కరించిన వింత వాతావరణమది.

ఎన్నో ఆశల్ని బలమైన నీ నిగ్రహంతో
బంధించి ఊహల్లో సంతృప్తి చెందుతావు.
హృదయంలో అలజడులు రేగుతున్నా
అంటీ ముట్టనట్లు వ్యవహరించి
దేనికోసమో ప్రాకులాడతావు.

అలరించే సీతాకోకలు కనువిందు చేస్తే
అల్పసంతోషివై మరో విన్యాసం వైపు పరుగులు తీస్తావు.
కానీ ఆ సీతాకోకల్ని తలుచుకుంటూనే ప్రతిక్షణం గడుపుతావు.

ఎప్పుడో గానీ నీ మనసు కరుగదు.
అప్పుడు అది ద్రవించి కన్నీటి జలపాతాలను సృష్టిస్తుంది.
ప్రేమో అంతకన్నా గొప్ప బంధమేదో
నీ మదిలో తొణికిసలాడుతుంది.

దానికప్పుడు ప్రాణం పోయడానికనీ ప్రయత్నించి
నిన్ను నువ్వే ఏమార్చుకుంటూ
టక్కున నీ మనస్సును మార్చుకుంటావు.

వెంటనే నీ ఉద్వేగాన్ని అణచుకొని
మునుపటి వాతావరణాన్నే మళ్ళీ ఆశ్రయిస్తావు.
శాస్వితంగా నీ మంచు హృదయాన్ని నిలుపుకునేందుకు
మళ్ళీ తహతహలాడతావు.

12:00 ఉదయం. .. 15/10/2013


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...