తను నన్ను జయించింది...

మనసు గుట్టును ముందుంచుకుని 
నన్ను నేను ఏకాంతంలో రమిస్తూ
జీవితపు అంచులు తాకాలని కలగంటున్నపుడు
తనంది ఇంతకీ నీకేంకావాలి?
ప్రేమని జీవితం జయించడమా? 
ప్రేమ నీజీవితాన్ని జయించడమా? ' అని
సందిగ్ధావస్థలో ... 'నాకీవాక్యం అర్థం కాలేదు' 
అన్నాను నేను..
తను నవ్వుతూ తలనిమిరి
"ముందు నీ సందిగ్ధాన్ని జయించు" అంది.
అప్పటినుంచి నా జీవితంలో 
లెక్కలేనన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి
ఒక్కో సమాధానాన్ని అన్వేషిస్తూ 
చివరికి జీవితాన్ని ప్రేమతో జయించాను!
తను మళ్లీ తారసపడి "నీకేంకావాలి'అంది 
మళ్లీ ఇంకోసారి నా తల నిమరమన్నాన్నేను ఆతృతగా...!

వ్యావహారిక తెలుగు భాషోద్యమం - గిడుగు రామ్మూర్తి


ఎందుకు ఇవాళ తెలుగుభాషా దినోత్సవం జరుపుకుంటున్నాం
?? 
ఎవరు ఈ గిడుగు రామ్మూర్తి??
తెలుసుకోవాలంటే చదవండి....మీకోసం...

ఎవడ్రా అక్కడ ?? ఇవాళ కూడా మీ గ్రాంధిక సంస్కృత పదాలతో పాండిత్యాన్ని ప్రదర్శించేది...
ఇవాళ మా గిడుగు బర్తడే! అన్నది మరిచారా??

నిజానికి వాడుక తెలుగు భాషకు ప్రాణం పోసిన చిచ్చరపిడుగు గిడుగు రామ్మూర్తి. అప్పట్లో, పుస్తకాల్లో రాతలేమో గ్రాంధికం, మాట్లాడేదేమో మామూలు తెలుగు ఉండేది. సామాన్య జనాలకు జ్ఞానం పొందడం కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో కరుడుగట్టిన భాషావాదులతో సైతం వాదులాడి వాడుక భాష కోసం ఎంతో కృషి చేశాడు ఈ పిడుగు.

నా చిన్నప్పుడు తెలుగుపుస్తకాల్లో 'చిన్నయ సూరి' పాఠాలు అంటే భయం వేసేది. ప్రతి తరగతిలో 'నీతి చంద్రిక' కు సంబంధించి ఏదో ఒక కథ గ్రాoధికంలో వుండి మెదడు తొలిచేసేది. అరసున్నాలు, విభక్తులతో నిండిన తెలుగుభాష నన్ను పీక్కుతినేది. ఎందుకు ఇలా రాస్తారు ?? మాట్లాడుకునే భాషలో రాయచ్చు కదా ఈ కథలు. పైగా అందులో నీతి తప్ప సాహిత్యవిలువలు కూడా లేవు. ఈ పరవస్తు చిన్నాయసూరి తెలుగు బాలవ్యాకరణం రాసి భాషను మరింత క్లిష్టం చేశాడు. బహుశా నాలాంటి వాళ్ళ బాధను గిడుగు అప్పుడే అర్థం చేసుకున్నాడేమో ఆధునిక తెలుగుభాషా ఉద్యమం/ వ్యావహారిక తెలుగు భాషోద్యమం మొదలుపెట్టాడు.

అప్పట్లో ఈ కరుడుగట్టిన భాషావాదులను ఎదుర్కొనడం అంటే మాటలు కాదు. కొక్కొండం వెంకటరత్నం పంతులు, జయంతి రామయ్య వంటి భాషాకోవిధులు గిడుగును తప్పుబట్టారు. గ్రాంధికం రానివాళ్లే ఇలా అంటారని, మామూలు తెలుగు మూర్ఖుల భాష అని గిడుగును ఎద్దేవా చేశారు. గిడుగు యేమ్ తక్కువ తిన్నడా? వీళ్లిద్దరూ రాసిన పుస్తకాలు చదివి తెలుగు గ్రంధికంలో రాసిన తప్పులను ఎత్తిచూపుతూ ఏకంగా ''ఆంధ్ర పండిత భాషాభిషేక్కుల భేషజం" అనే పుస్తకం రాసి తూర్పారబట్టాడు. భాషావాదులను నోళ్లు మూయించాడు. బాలకవి శరణ్యం అనే గ్రంధాన్ని వెలువరించారు. మాట్లాడే ఏ భాషకయినా వ్యాకరణం (గ్రామర్) ఉంటుందని దాన్ని పట్టుకొని భాషను క్లిష్టం చేయకుడదని తెగలు మాట్లాడే 'సవర' భాషకు లిపి కనిపెట్టి వ్యాకరణం రాసి నిరూపించాడు. తెలుగు అనే పత్రికను సైతం నడిపాడు.

గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని వాడుక భాషలో రాయడానికి గిడుగే ఆదర్శం. గ్రాంధికవాది అయిన వీరేశలింగం సైతం తన అవసాన దశలో గిడుగును మెచ్చుకొని ఆధునిక తెలుగు భాషా ఉద్యమానికి అనుకూలంగా ప్రకటన చేశాడు.

గిడుగు ఇంత చేసాడు కాబట్టే, మనం మన భావాలను వాడుకభాషలో వెలువరిస్తున్నాం, వచన కవితలు రాస్తున్నాం, పుస్తకాల్లో చదివేది మాట్లాడేది ఇంచుమించు ఒకేలా ఉండి భాషాసౌఖ్యాన్ని పొందుతున్నాం.
తెలుగును మరింత సులభతరం చేద్దాం! 
తెలుగు భాషను కాపాడుకుందాం!!

 - విష్వక్సేనుడు వినోద్

Related Posts Plugin for WordPress, Blogger...