ఎందుకో ఏమో ??!!



ఆశలు చిగురిస్తూనే ఇన్ని ఆంక్షలెందుకో ?
ఆమని పలకరిస్తూనే అకాల కరువెందుకో?

మాయని గాయానికి తీపి లేపనమెందుకో?
ఎగిరిపోని మనసుకి ఊహల రెక్కలెందుకో ?

కరిగిపోయే కాలానికి కరుణసలే లేదెందుకో ?
తరిగిపోయే యవ్వనానికి కోర్కెల సెగలెందుకో?

సేదతీరే దేహానికి విశ్రాంతికై తీరిక ఉండదెందుకో?
పారిపోయే ఆయుష్షుకి ప్రాణంతో పనిలేదుందుకో?

చేయని తప్పుకు సమర్థనల సముదాయింపులెందుకో?
మూసిన భావాలకు బయటపడాలని ఆవేశమెందుకో ?

చెరగని ప్రేమ ధార రాతి మనసును మార్చలేదెందుకో?
తెరచి ఉన్న కన్నులు కన్నీటికి సాక్షాలౌతాయెందుకో ?

కోయ్యగుర్రమైతేనేం!


మనస్సు అద్దమై
అద్దం వందల ముక్కలై
ముక్కలు మనుషుల ప్రతిబింబాలై
ప్రతిబింబాలు సమాజపు పరావర్తనాలై
చూసే ఎన్నో వెక్కిరి చూపులు.
చేసే ఇంకెన్నో పరిహాసపు పకకలు.
  
 ముసురుకున్న అన్నిటి నడుమ
ఆశయాన్ని గుండెల్లోంచి పెకళించి,
ఆవేశాన్ని గమ్యంకోసం అణచిపెట్టి,
అనంత దూరం పయనించాలని,
అలసిపోని అశ్వాన్నెక్కానన్న ఆనందంతో
సహనవాహనంపై సవారీ చేస్తున్నా...

నాదంతా నిజం లాంటి భ్రమ!
ఊహాజనిత వాస్తవం!!
ఏంటని మేల్కొంటే,
నేనెక్కిందో కొయ్య గుర్రం!!!

 అయితేనేం?
నాది కిరణానికి కరిగిపోయే
మంచు దేహం కాదు.
భయంకర లావా ప్రవాహానికి తొలి రూపం.
మహోజ్వలిత నిప్పు రణానికి మలి దాహం. 
నాది త్వరణానికి వణికిపోయే
పెళుసు ప్రాయం కాదు.
ప్రేమనే కవచంగా ధరించిన ఉక్కు హృదయం
స్వార్థాన్నే అర్థించని అగ్గి రుధిరం.

అందుకే..
కొయ్య గుర్రానికీ 
నేను పరుగులు నేర్పిస్తాను!
దాని సకిలింపులూ వింటాను!!
నిగమ నడివీదుల్లో,
నిర్మానుష దారుల్ని ఎంచి,
మొలిచిన చీకటి గడ్డిమొక్కల్ని చీల్చుకుంటూ,  
ధైర్యంతో ముందుకు నడిపిస్తాను!

ధరిత్రిని నిభిడాశ్చర్యంలో ముంచేస్తాను!!

ఇంకో డెఫినేషన్... LOVE

ఆశల పూబంతులు ఎగసి
మనో కుడ్యాలపై
కూచిపూడి నృత్యమాడితే
పులకరించిన తొలిప్రాయానికి
చిగురించిన చిరు ఇష్టం
' ప్రేమ '
ఎడబాటులో మాధుర్యం
' ప్రేమ '

తలపుల తడి ఆరని
వలపుల వాన జల్లు కురిస్తే
రెండు హృదయాల రాపిడికి
గర్జించిన తొలి ఉరుము
' ప్రేమ '
సంఘర్షణలో కొస మెరుపు
' ప్రేమ '


ప్రేమ ఒక యాత్ర !!

రా పయనిద్దాం !
ఆకాశం ఆనందాన్ని కోల్పోతే
మన ప్రేమని హరివిల్లును చేసి
సృష్టికే రంగులద్దుదాం !!
విరహ రెక్కల్ని కట్టుకొని
వలపు విహంగాలమై
విశ్వమంతా విహరిద్దాం !!

రా పయనిద్దాం !
సెలయేరు సెలవంటూ ఇంకిపోతే
మన ఊసుల్ని సలిలంగా మార్చి
సంద్రాన్నే నింపేద్దాం !!
సరస సరస్సులు దాటి
స్వచ్చమైన చినుకులమై
ప్రపంచాన్నే తడిపేద్దాం !!

రా పయనిద్దాం !
వనం వాడిపోయి విలపిస్తే
మన ప్రణయాన్ని పచ్చికలా చేసి
నేలంతా పరిచేద్దాం !!
ఎండు కొమ్మల్ని తాకి
పచ్చని చిగురుటాకులమై
ప్రకృతినే పులకరిద్దాం !!


పూల ప్రపోజల్ ...

అనురాగ గాలి అసలే సోకని మనసుకు
వసంత చేమంతులను పరిచయం చేసి

ఆశల ఊహలెరుగని నిద్రిత నయనాలకి
కోర్కెల కనకాంబరాలతో బంధీని చేసి

భావ స్పందనంటూ తెలియని తనువుకి
సుగంధ సంపెంగ పూల అత్తర్లను చల్లి

ఆప్యాయతను అన్వేషిస్తున్న కర్ణాలకు
మల్లెలంటి స్వచ్చమైన నీ పలుకులు పంచి

ప్రేమంటే తెలియని నా పసి హృదయానికి
ప్రాణమిస్తానంటూ పసిడిపద్మమై నిలిచావు.

అందుకే ప్రేమంటే తెలిసొచ్చాక చెబుతున్నా చెలీ...
" నేన్నిన్ను ప్రేమిస్తున్నాను "

ఏమని ??

కనికట్టుచేసే ఈ కాలాన్ని ఏమని నిందించను
తలవగానే ఇట్టే నిన్ను మోసుకొస్తుందనా?
సడి చేయని నా యదని ఏమని ప్రశ్నించను
నీ తలపుల ధ్యానంలో మూగదైపోయిందనా?

నిట్టూర్పు సెగలకు ఏమని సమాధానమివ్వను
నువ్వు కనికరించడం ఒక కలే అని చెప్పనా?
వలపు ఉచ్వాశలకు ఏమని సముదాయించను
ప్రతి శ్వాసలో నిన్నే పీలుస్తున్నానని ఒప్పించనా?

రెప్ప మూయని కనుపాపను ఏమని ఓదార్చను
ఎదురుచూపుల్లోనే నీకై ఆరాధన బాగుందనా?
ఎడబాటులో రాలే కన్నీటికి ఏమని దారిచూపను
సెలయేరుగా మారి నీ సముద్రంలో కలవమనా?


ప్రేమ చిహ్నం

నాకో ముళ్ళ కిరీటం కావాలి
శిధిలమైన నా హృదయానికి
ప్రేమ శిలువ మోస్తున్న నా ఊపిరికి
గుర్తుగా గాయంగా
కఠిన లోహపు తంత్రులతో అల్లిన
పదునైన ముళ్ళ కిరీటం కావాలి.

అలాగే నాకో పూలపానుపూ కావాలి
ప్రయాస ఎరుగని ప్రయాణానికి
ప్రణయ కాంతుల విరహ పరిచయానికి
జ్ఞాపకంగా ఘుభాళింపుగా
స్వచ్చమైన సుగంధ పుప్పొడిని చల్లిన
మెత్తటి పూలపానుపు కావాలి

పరస్పర విరుద్ధ భావాలకు జన్మనిచ్చే
ఈ నా పరార్థ్యమైన ప్రేమకు చిహ్నంగా
నాకు పూలూ-ముళ్ళూ రెండూ కావాలి.
Related Posts Plugin for WordPress, Blogger...