మళ్ళీ యింకొక్కసారి...మళ్ళీ వొకసారి వచ్చివెళ్ళాలనుంది..
అద్దమంటి దేహానికి ఆకాశముక్కల్ని అద్దుకుని
విశ్వమై నిన్నొక్కసారి పలకరించాలనుంది...

చెప్పకుండా చెంతచేరి
సన్నగిల్లుతున్న కొన్ని భావాల్ని అకస్మాత్తుగా నీమదిలో నింపి
వొకింత విశ్వాసాన్ని నింపాలనుంది...

కత్తిరించబడ్డ నా హృదయరెక్కల్ని
రహస్యంగా యేరుకుని
నీ వొడిలో ఇంకోసారి వాలిపోవాలనుంది....

తనువుల దాహం తీరక
సెలయేరై పారిన క్షారస్వేదంలో
వొకసారి పరవశంతో రమించాలనుంది...

బయటపడలేని భారమైన భావాల్ని
నానుంచి వేరుచేసి
నీముందు మౌనంగా గుట్టువిప్పాలనుంది...

పయనించే నీ గమనంలో వెంబడిస్తూ
వాడిపోయిన దారుల్లో
పచ్చటి వనాన్ని చిగురింపజేయలనుంది...

దూరమైన నీ నిచ్వాశల్లో
భావాల పుప్పొళ్ళను సేకరిస్తూ
గండుతుమ్మెదనై తిరగాడాలనుంది...

అనిశ్చిత ఈ లోకంలో
అనుకోకుండా మరణించినా
ఆత్మగా మారి నీతోనే ఉండిపోవాలనుంది...

23.05.2015

వొకానొక రాతిరి
పక్షానికోమారు నగ్నత్వం సవాలువిసిరిన వొక రాతిరి
హృదయపొరలను తడిపి
ప్రణయకోలాహలాన్ని కోరిన వేళ
వెన్నెల అమావాస్యను కప్పుకున్నపుడు....

రేరాజు వెలుగుల్ని వెక్కిరిస్తున్న
తారకల పొగరుని
తన చిరునవ్వులతో అణిచి
చురకలంటిస్తున్న శ్వేతకలువ స్పర్శకై
చలువ హృదయ చంద్రుడు
ఒక్కో మేఘాన్ని అద్దుకొని
ఒక్కో చినుకులా కొలనులో రాలిపోతున్నాడు...

అది వర్షపు హోరు కాదు
రెండుహృదయాల సంఘర్షణల జోరు
నడిరాతిరి కలువకై
చందుడు రాల్చిన
ప్రవహించెడి వన్నెలపొడి సెలయేరు.....

క....కవిత... | విష్వక్సేనుడు వినోద్క్రమమేరుగని బాధాతరంగాల అలజడులతో
చాన్నాళ్ళుగా క్రమక్షయానికి గురైన హృదయాంతర తీరాలు
దీనావస్త నుండి నెమ్మదిగా ఒకసారి కోలుకోగానే
అక్షరాలు సుప్తావస్తను వీడి
పదాల్లో పరకాయప్రవేశం చేసినపుడు
మనసు కుదుటపడేలా
ఒంటరిగా కూర్చొని ఒక కవిత రాయాలనిపిస్తుంది!

జీవిత ఆటుపోట్లలో విధికి జడవక
మది భావాలను జాగురుకతతో ప్రతిబింబించి
ముందుకు నడిపించిన నా కళ్ళను
కలం జార్చిన సిరాక్షారాలతో అభిషేకించాలనిపించినప్పుడు
హృద్యంగా ఒక కవిత రాయాలనిపిస్తుంది!

మంచుపూలంటి ఆశయాలను అందబుచ్చుకునే ప్రయత్నంలో
ముళ్ళబాటల్లోనూ ధైర్యంగా అడుగులేసి
అలసిపోక శ్రమించిన కాళ్ళకి
పదాల్లో పద్మదళములు పరిచి సేదతీర్చాలనిపించినపుడు
ఖచ్చితంగా ఒక కవిత రాయాలనిపిస్తుంది!

16-05-2015
Related Posts Plugin for WordPress, Blogger...