ప్రాపంచికం!!


ఎందుకో ఈ ప్రపంచం
నీది నాదీ కాదనిపిస్తోంది...
నాల్కలపై కొన్ని రంగులు అద్దుకొని
పెద్ద పెద్ద ప్రవచనాలతో గద్దించే
రంగురంగుల మనుషుల అద్దెకుటీరమనిపిస్తోంది...
రక్తాన్ని..చెమటనీ..మెదళ్లనీ ఓపిగ్గా ఒంపి
బ్రతుకునిచ్చిన నేల దాహాన్ని తీరుస్తున్న
అసలైన యజమానుల స్మశానవాటికనిపిస్తోంది...
ఎందుకో ఈ ప్రపంచం
పొడిబారిన ఏడారుల్లో
అందంగా కనిపించే త్రాచుపాముల గుట్టలా...
మందుపెట్టి ఆకట్టుకునేలా పేర్చబడ్డ
పచ్చి మావిడిపళ్ల బుట్టలా...
ఎప్పుడు తెగిపోతుందో తెలియని
ఆహ్లాదకరమైన నిండు చెరువు గట్టులా...
అప్పుడే చీకటిని దాటుకుని వెలుగులోకి వచ్చిన
నీ నా కళ్ళకి చాలా నచ్చేట్లు కనిపిస్తోంది...
నిజానికి ఈ ప్రపంచం
నిన్నూ నన్నూ రంజింపజేయడానికి
ఎంతో కష్టపడుతూ అందమైన వినాశనానికి
ఆతృతతో దారులు పరుస్తోందో
ఒక్కసారి తనివితీరా చూడవూ....

ప్రణయస్థలి...


నీ మెడవొంపుల్లో దాచుకున్న
నా ముఖాన్ని తమకంతో చూడలేక
నుదుటిపైనుంచి జారిపడ్డ శ్రమ బిందువులని
పెదాలతో ప్రేమగా మాయం చేశాక....
సరస సతతహరితారణ్యంలో
మధుర జ్ఞాపకాల పొదల్లో వికసించిన
మన గరికపచ్చ ప్రేమని కిటికీ అద్దంలోంచి తొంగిచూసి
ఒక పిట్ట రోజూ ఎత్తుకెళ్లి గూడు కట్టుకున్నాక....
శ్రమైక జీవన సౌందర్యం అంటూ
దేహపు ఆకాశాన్ని తవ్వి సముద్రంలో పారబోయించి
నీరంతా ఇంకిపోయి పొడిబారిన పెదాలకు
రవంత ఎంగిలి తుంపర్లతో తడిపి
చిందరవందరగా చెరిగిన జట్టులో
నీ మునివేళ్ళను నాగళ్లుగా విసిరి సేదతీర్చాక...
యెద వ్యధను కన్నీళ్ళలో దాస్తూ
మమకారాన్ని చిరునవ్వుతో మోస్తూ
మురిపెంగా నీ ఎదపై వాలనిస్తావు...
అర్థంకాని జీవితపు పరిమళాన్ని
వొక్క వుదుటున పరిచయం చేసి
అసంకల్పితంగా రణస్థలం నుంచి వెళ్లిపోతావు చూడూ...
నీది యే యుద్దనీతి???
ఇంతకీ నేను ఓడినట్లా? గెలిచినట్లా??

వలపు హర్మ్యం!


సాంత్వన కోరుకోనిదే
జీవితపు చెట్టుకు ప్రేమైనా పూయదని
నడుస్తూ పలకరించే కాలం ఎందుకో హెచ్చరిస్తోంది...
మునుపటి ఉత్సాహం లేకపోతే
అనుక్షణం పెనవేసిన అనుబంధపు తీగలు
తరువునైనా విడిచిపెట్టునని చిరుగాలి సూచిస్తోంది....
ఒదార్పునీయని కోయిల గేయాలు
వలపు పునాదుల్ని పెకళించివేయునని
భారమెరిగిన చిగురువసంతపు మాటలు చలింపజేస్తోంది....  
వలపు హర్మ్యాలు ఉత్కృష్టమయ్యేకొద్దీ
తెలియని వేదనంతా వేదాంతమై
వడి కోల్పోతున్న హృదయానికి అర్థంకాకున్నది...

స్వేచ్ఛానురక్తి!

గాలి తరగల్లో 
చావూ బ్రతుకులనే
అప్రయత్న బిందువుల మధ్య
సరళహారాత్మక చలనంలా
ఊగిసలాడే జీవితానికి
ఎన్నెన్ని ఆంక్షలో...
న్యాయనికీ నిజానికి ఏర్పడ్డ అగాధాల మధ్య
బద్ధలయ్యే హక్కుల కోసం
హార్ట్ బీట్స్ లో కొన్ని టెక్టోనిక్ ప్లేట్స్
సృష్టించే ప్రకంపనల చీలిక దారుల్లో
నా స్వేచ్ఛకు రంగులద్దుకుంటూ
ఒక్కో బంధనాన్ని జారవిడచాలనిపిస్తుంది..
పుట్టగానే వో మతం రంగు పులిమేసి
కులం టాగ్ లైన్ తగిలించి
వో బలవంతపు బానిసత్వంలో నెట్టేసిన
యీ సోకాల్డ్ సాంప్రదాయ సమాజాన్ని
దాన్నుంచి బయటపడలేని అల్పజీవుల
జ్ఞానరహిత్యాన్ని దాటేసుకుంటూ
వో బుద్ధిజీవుడిలా వో విశ్వమానవుడిలా మారడానికి
కొన్ని సంభావ్యతలు లెక్కలేసుకుంటూ
మానవత్వం ధ్వనించే మార్గాన సాగే యీ నడక
యే మిల్కీ వే లో కలుస్తుందో....వో విష్వక్సేనుడా!
Pic: పికాసో

ప్రపంచ వచనం!నిన్ను గాఢంగా ముద్దాడాలనిపించినపుడల్లా
యీ గులాబీ రేకులను అలా తుంచిపడేస్తూ
పూలపట్ల పరుషంగా పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటాను
నాకు తెలుసు
యీ పూలను కొమ్మ నుంచి తెంపితే 
నీకు ఇష్టం ఉండదు... 
నా బ్లాక్మైల్ విరహాన్ని బ్లాక్ చేస్తూ
గెలాక్సీలు దాటే ఫ్రీక్వెన్సీలో 
బిగుతైన కౌగిలింత కాసేపు...
అంతకన్నా బిగుతుగా పెదాలతో 
చిలిపి చుంబనం ఇంకాసేపు 
కనీసం జీవితపు మొదళ్ళు తెలుసుకునేలోపైనా
నీ మొత్తాన్ని నన్ను అర్థంచేసుకునేలా
నన్ను చిన్నగా నీలో వొంపేసుకో...
వయసు మంటల్ని ఆర్పుతానని 
విరహాల వంటల్లో
మమతల మసాలా కలిపి
వలపు తాళింపులు వడ్డించావు...
ప్రేమలో యిన్నిన్ని ప్రవచనాలు వల్లించావు కదా
వో ప్రపంచ వచనం ఏదైనా కొత్తగా చెప్పవూ...
జీవితాన్ని ఇంకాస్త అర్థం చేసుకుంటాను...

గాజు పరదా...


ఈ మనసు అనేది ఉంది చూడూ
అది గాజు పరదాల్లో చిక్కుకున్న
కోతిపిల్లలా ఆలోచిస్తూ వుంటుంది ...
వొక్కోసారి అనిపిస్తూవుంటుంది నాకు- 
దాని చేష్టలు ఎంత విచిత్రమో కదా అని..
దీనికి ఎంత కాల్పనిక శక్తి ఉంటే మాత్రం
ఇన్ని అసంబద్ధ కొరికలా?
ఎంత క్షమాగుణం ఉంటే మాత్రం
ఇంత దాతృత్వమా?
ఎంత కాఠిన్యం ఉంటే మాత్రం
ఇంత కర్కశత్వమా?
వో పట్టాన అంతుచిక్కని విశ్వరహస్యాన్ని
గుప్పెడు స్థలంలో దాచుకున్న
కృష్ణబిలంలాంటి దీని శాస్త్రీయతను
నేను ఎంత శోధించినా అంచనా వేయగలనా?
ఓ మనసా...
బంధించేకొద్దీ విస్తరించే నీ వైశాల్యానికీ
విస్తరించేకొద్దీ బందీ అయ్యే నా సంకుచిత్వానికి
ఎన్నెన్ని భేషజాలో కదా!??

ఎండమావులు...


అలుపులేని బతుకు ప్రయాణంలో
జీవితపు త్రోవంతా కనిపించని చీలికలే!
ఏది ఎండమావో తెలియని బంధాల నీడల్లో
సేదతీరే సమయమంతా తెలియని గుబులే!

కొన్ని ఆశల సౌధాల్లో
ఇంకొన్ని ఆశయాల మేఘాల్లో
యదలోతుల్లోంచి జారిపడే కలతల కన్నీళ్లు!
మనస్పర్ధల అలజడులతో ఉప్పొంగే భావావేశాల్లో
తుడిచిపెట్టుకుపోయే ప్రేమాభిమానాలు!

కోపతాపాల శత్రుసైన్యాన్ని
క్రోధావేశాల బలహీనతల్ని
ధనాత్మక ఆలోచనలతో జయించినపుడే కదా
అపార్థాల అడ్డుగోడలు తొలగి
దారంతా నిండిన సుమగంధాల పలకరింపులు
జీవితాన్ని ఇంకొంత దూరం
ఓపిగ్గా నెగ్గాడానికి దోహదం చేస్తాయి!

అగాధధరీ...


లోతుతెలియని అగాధమంత నీ మనసుతో
అంతులేని ఆకాశమంటూ నన్ను కీర్తిస్తూ
నీలోకి సమ్మోహనంతో స్వాగతిస్తావు!
నీక్కావలసింది అర్థమైనట్లు మెల్లగా నిన్ను పరుచుకొని
నా దాహాన్ని దేహంతో తీర్చుకోవడానికని
తీయని ప్రయాసపడటానికి ప్రయత్నిస్తాను!
అచ్చం జీవితంలానే మొదట మెల్లగా ప్రాకుతూ
ఆపై నడక తర్వాత ఆపకుండా పరిగెత్తి
జీవన గమ్యాన్ని చేరుకున్నట్లు అలసిపోతాను!
నుదుటిపై జారే చెమట చుక్కని ముద్దాడుతూ
నీ కన్నీటి తడిని పరిచయం చేస్తావు!
వ్యధ నిండిన గాలిబ్ గానంలా
అందమైనదిగానే కనిపించే నీ మొహాన్ని
మోహపు మసక వెలుతుర్ల మధ్య వుంచి
కొన్ని బాధల్ని నవ్వులతో కలబొసి
నాపై నిట్టూర్పుతో వంపుతావు!
సహజంగానే నీ తలను నా గుండెలపై వుంచి
నిన్ను సేదతీరుస్తానోలేదో తెలియని నాపై
అసహజంగా ఒక బాధ్యతను మోపి
మన బంధానికి ఇంకాస్త రంగులద్దుతావు!
వ్యధను పంచుకొని బాధను కాసింత తుంచుకోవడానికి
ఎంతైనా ఈ రాత్రుళ్ళు కాస్త సహాయపడతానుకుంటూ
ఎంతోకొంత బోధపడినవాడిలా నీ ఒళ్లో తలపెట్టుకుని
కన్నీళ్లను తుడుస్తూ కాసేపు ప్రపంచాన్ని మరచిపోతాను!

ఆకు పందిరి...

నిన్ను దూరం నుంచి కావలించుకుంటూ
నీ జీవితాన్ని కావలిగాస్తూ
ప్రాణవాయువును కానుకిచ్చే ఆకుపచ్చ హృది
అదిగో అంతరించిపోతున్న ఆ అడవే!

నీకోసం గగన శిఖరాలను కరిగిస్తూ
వురిమే మేఘాలను వింజామరై కదిలిస్తూ
చినుకు రవ్వల్ని నేలదించే అమృతవర్షిణి
అదిగో నువ్వు నరికేస్తున్న ఆ అడవే!

మృత్తిక లోతుల్లో ప్రేమవేర్లను పెనవేసి
నేలంతా పారవశ్యంతో పరచుకుని
నీకు ఆహారాన్నీ ఆహ్లాదాన్నీ పంచె ఆకుపందిరి
అదిగో నీదోపిడీకి ఖాళీ అవుతున్న ఆ అడవే!

రోదించే కరువు కన్నీళ్లు చూడలేక
మట్టికీ మేఘానికీ వంతెనవేసి
నీ మనుగడకు నీళ్ళను ధారబోసే నిచ్చెలి

అదిగో నువ్వు మరచిపోతున్న ఆ అడవే!

దొర గాళ్లు...


వాళ్ళు దొరతనపు కంపుని
దోసోట్లో పట్టుకుతిరిగెటోళ్లు
నువ్వు పొరబాటున కనబడితే
వాళ్ళు ముందు నీ బట్టలు చూస్తారు
నీ పేరును బట్టి ఏమీట్లో వెదుకుతారు
మాటలు కలిపి మూలాల్లో దూరతారు
నీ చర్మం రంగులో నీ పూర్వీ'కుల
రక్త నమూనాల్ని అంచనా వేస్తారు
నీ హోదాలు పలుకుబళ్ళు ఆరా తీసాక
మెల్లగా దోసిలి విప్పి
తాతల గొప్పలు ఇంటిపేరులోని వీరత్వాలు
తోకలోని పౌరుషాలు కథలు కథలుగా నీపై కుమ్మరిస్తారు
నిన్ను సరిగ్గా అంచనా వేశాక
నీపై సానుభూతితోనో నీ పట్ల అజమాయిషీతోనో
మెల్లగా భయపడేలా చేస్తారు
నీ అవసరాలన్నీ తెలుసుకొని
వారి చుట్టూ తిరిగేలా ప్రణాళికలు రచిస్తారు
నీ చుట్టూ తెలియని ఉచ్చు బిగించి
నీ అన్నం మెతుకుల్లో వేలుపెట్టి
నీ జీవితాన్ని వాళ్ళ తీరని ఆకలికి బలి ఇస్తారు
వేటాడ్డానికి అలవాటుపడ్డ దొరల దేహాలు
మళ్లీ ఇంకో బలిపశువుకై వెతుకులాటకు బయలుదేరతాయి
Related Posts Plugin for WordPress, Blogger...