నైమిశం!!బ్రతుకు అంకురంలో ఉన్న కొత్త జీవానికి ఊతమిచ్చి వాస్తవాల రెక్కలు తొడిగాక... చిరునవ్వులో గెలుపోటములను చూపి ఎడబాటుతో మనసుల దూరాన్ని కొలిచాక... గుబులు గుండెలో ఆశల అలజడులు రేపి ఆశయాల్ని వలపుతో కలిపి రగిల్చాక... మనసులో సరికొత్త విశ్వాసాన్ని నింపి విశ్వమంత ధీరత్వాన్ని నాలో చూపించాక... స్నేహం..ప్రేమ..మమకారం..అభిమానం.. అన్న కొన్ని బంధాల అంచుల్ని దాటి వొక ఆరాధనాపూర్వక సాన్నిహిత్యంలో నిమిశనిముశమూ వెన్నంటూ ఉన్న నిన్నేమని కొలవనూ.... ఈ జన్మకు!!!

నువ్వు గుండె గడపమాను దాట్న్యాక...ఈ మధ్యగాల
గుండె కాడ షానా నొప్పిగుంటాంది
నువ్వేమన్నా తల్చుకుంటాండావా...

అమ్మలపొద్దున స్నానం చేస్కునేదానికి బాయికాడ పోతే 
కంది శెట్ల సందుల్లోంచి తొంగిజూసిన 
నీ చూపులు గుర్తొస్తాండాయి...

పైటాల అన్నం శరవ తీసి బువ్వ పెట్టుకుంటాంటే 
నువ్వు ఎంగిలి ముద్దులతో కలిపి పెట్టిన 
సంగటి ముద్దలు చానా గుర్తొస్తాండాయి...

మాయటాల గొడ్లకు మేత కోసేదానికి కొడవలితీస్తే
సానబట్టిన భాగమంతా తెల్లగా మెరుస్తా 
నువ్వు పళ్ళెకిరిస్తూ నవ్వుతాన్యట్టుంది...

పొద్దుగూకినాక పొయ్యి ఎలిగించాలని 
గబ్బునునే పోసి అగ్గిపుల్లేస్తె ఆ ఎర్రటి మంటల్లో 
నీ నుదుటి బొట్టు నాకు కన్నుగొడతావున్యట్టుంది...

రోజూ పంపుసెట్టు యేసి నీళ్ళు పట్టనుపోతే 
గలగలా పారే నీ మాటలు వొక్కటే గుర్తొచ్చి 
నా కడ్లంబడి నీళ్లొచ్చి పైరంతా తడుస్తాండాది...

ఎంగిలి మింగుతావున్యా పొలమారతాంది
నన్ను అంతగా తలచుకోకు అమ్మీ
నువ్వు ల్యాకుంటే నా పాణెం పోతావుండాది....

ఈ పండక్కి నీ సమాధికాడనే కుమిలిపోతాండా 
హాయిగా నీ వొళ్ళో తలబెట్టుకొని పండుకున్యట్టుంది
నన్ను కూడా బిర్నా నీకాడికి రానిచ్చుకోయే...

గండికోట జ్ఞాపకం!!


కొన్ని కట్టడాలు
జ్ఞాపకాల హద్దుల్ని చేరిపివేసి
ప్రజల గుండెల్లోంచి జారిపడి
కైఫియతులుగా కాగితాలపై కుమ్మరించబడి
చరిత్రలుగా లిఖించబడతాయి...

వొక జాతి బ్రతికున్నంతకాలం
శిధిలమౌతూనో.. సమాధవుతూనో..
చరిత్ర ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలిస్తాయి...

సుందర దృశ్యానికి అద్దంపట్టే
వొక పర్యాటక మనోరంజకం....
వొక చారిత్రిక శౌర్య శైధిల్యం...
కట్టడాల హృదయ ఘోషను శతాబ్దాలుగా
నిశ్శబ్దంగా మోస్తున్న పెన్నా నది సాక్షిగా...
ఇప్పుడు అందంగా ముస్తాబవుతున్న
యీ సీమ గోడలకూ వున్నది వో వెయ్యేళ్ళ గొప్ప చరిత్ర....

ఆకాశాన్ని తలెత్తి గర్వంగా చూస్తున్న బురుజులు
మనల్ని తలెత్తి చూసేలా చేసే కొయ్య తలుపులు
పగిలిన హృదయాలతో ఆర్ద్రంగా పలకరించే శిల్పాలు
ప్రపంచాన్ని గాలించే బంగారు బైనాకులర్లాంటి మినార్లు
ఎగిరే ప్రపంచానికి ఆవాసాలైన అందమైన పావురాల గోపురాలు
మంచినీళ్ళతో దాహం తీర్చిన అలనాటి కత్తుల కోనేర్లు
యిన్ని మనోహర దృశ్యాలు అందానికే కాదు
కొన్ని తీపీ - చేదు జ్ఞాపకాలకు ఉత్కృష్ట పరాకాష్టలు...
చరిత్రలో కలిసిపోయిన కొన్ని త్యాగాలకు సాక్ష్యాలు...

విదేశీయులపై రొమ్ము విరిచిన
వొక వీరోచిత పోరాటానికీ
భర్తను కోల్పోయి అశ్వమెక్కిన
వొక ధీరురాలి ప్రతీకారానికీ
వందల స్త్రీల అగ్ని ప్రవేశ త్యాగానికీ
విషం చిమ్మిన కొన్ని కుతంత్రాలకీ
సీమ ప్రజల శౌర్య ప్రతాపాలకీ
నిలువెత్తు ప్రతీక.. ఈ గండికోట!

Related Posts Plugin for WordPress, Blogger...