వెక్కి వెక్కి ఏడుస్తున్నావా?హృదయమా! ఓ హృదయమా!! వెక్కి వెక్కి ఏడుస్తున్నావా?
ఎగసే కెరటాల కడలి నిక్షిప్తమైనదా నీ కన్నుల్లో?
ఏం గుర్తుకొచ్చాయని ఏడుస్తున్నావ్?
ఇంకిపొవా నీ కన్నీళ్ళు సెలయేటి ధారల్లా ఎడారుల్లో సాగినా కూడా?
ఎవరు గుర్తుకొచ్చారు నీకు? ఇంతకీ ఎవరు గుర్తుకొచ్చారు?
తన ఇల్లెక్కడంటే ఇప్పటికీ వేలు చాచి
ఊరవతల తల తిప్పే దళితులా?
తన ఆస్తేంటంటే బర్రెంకలపుటొంట్లో
 కరిగిన కండల్ని చూపే కార్మికులా?
తన వృత్తేదంటే మదమెక్కిన దేహంతో
నడవలేక కళ్ళతో మంచాల్ని సైగ చేసే సోమరులా?
తన దారేదంటే బెల్టుషాపుల వైపు
పరిగెత్తే మత్తుటడుగుల తాగుబోతులా?
తన మాటేంటంటే అమాయకుల్ని
నట్టేట ముంచే గారడీలనే మధ్యవర్తులా?
ఏం గుర్తుకొచ్చాయ్ నీకు? అసలు ఏం గుర్తుకొచ్చాయ్ నీకు?
సమాజంతో సహవాసానికి నోచుకోక
చిత్తులేరుకుంటూ  రోడ్లపై బలైన భావి పౌరుల బాల్యాలు గుర్తొచ్చాయా?
అప్పు తీర్చలేక నమ్మిన నేలనమ్మి
ఆత్మహత్య చేసుకునే రైతన్నల తుది శ్వాసలు గుర్తొచాయా?
పట్టించుకోని ప్రభుత్వాశుపత్రుల్లో
పశువులై మ్రగ్గుతున్న దీనులార్తనాదాలు గుర్తొచ్చాయా?
క్షణికావేషానికి లోనై పశ్చాత్తాపంతో
కారాగారాల్లో క్రుంగుతున్న యావజ్జీవ ఖైదీల క్షోభలు గుర్తొచ్చాయా?
బందూకుల్తో సహజీవనం చేస్తూ మంచులెండల్లో
ప్రాణలు త్రుణప్రాయంగా త్యజించే జవాన్ల త్యాగాలు గుర్తొచ్చాయా?
నిక్కచ్చిగా నీకివే గుర్తొచ్చాయంటే ఓ హృదయమా! ఏడ్వు.
ఖచ్చితంగా నేనాపను. కుమిలి కుమిలి ఏడ్వు.
చేతలకంటే కోతలు నయమనుకుంటే ఏడ్వు.
ఏడిస్తే సమస్తం సమసిపోతాయనుకుంటే ఏడ్వు. దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్వు. 
 

నా హృదయానికి ఓర్పెక్కువనా హృదయానికి ఓర్పెక్కువ
ధరిత్రిలా పాపాల్ని భరించెంత కాదు.!
నా ఆలోచనకు పదునెక్కువ
కత్తిలా రక్తాన్ని చిందించెంత కాదు.!
నా ఆవేశానికి అర్థమెక్కువ
ఆయుధంలా అభయాన్నిచ్చెంత కాదు.!
నా చేతలకు కర్తవ్యమెక్కువ
చంద్రుడిలా చీకటికి చేయూతనిచ్చెంత కాదు.!
నా బాధలకు భావాలెక్కువ
కన్నీరులా మనస్సును కరిగించెంత కాదు.!
నా అందానికి వెలుగెక్కువ
సూర్యుడిలా ఉష్ణాన్ని రగిల్చెంత కాదు.!
నా అడుగులకు బాధ్యతలెక్కువ
పశువులా మూర్ఖుల్ని పోషించెంత కాదు.!
నా తెలివికి తెగింపెక్కువ
ధీరుడిలా ధనువును విరిచెంత కాదు.!
నా కోపానికి కండకావరమెక్కువ
కడలిలా కెరటాల్ని ఉసిగొల్పెంత కాదు.!
నా ఊహలకు వైశాల్యమెక్కువ
విశ్వంలా నక్షత్రాల్నిముడ్చుకొనెంత కాదు.!

ఉదయించాడు సూరీడు మళ్ళీ...
ఉదయించాడు సూరీడు మళ్ళీ
రాకాసి చీకట్లను చీల్చుకుంటూ ఆకాశ వాకిట్లో మిణుగురల్లే
వాలిన కొమ్మలకూపిరి పోస్తూ పేలిన వెలుగుల మెరుపల్లే
బురద పందులు పిచ్చి కుక్కలు మేల్కొన్నాయ్ బెడ్డు కాఫీకై
చిరుత పులులు గుంట నక్కలు బయల్దేరాయ్ ఫస్టు హంటుకై
దోమలు దోచాయ్ చీమలు చచ్చాయ్
సముద్రాల్నిండాయ్ స్మశానాలింకాయ్
కదలని కాకులు న్యూస్ పేపర్లలో పాడేస్తున్నాయ్
కదిలే కోతులు టీవి బులిటెన్లలో తిరిగేస్తున్నాయ్
ఏనుగు తొండం జింకల మొండెం కోరెను ముసుగుల ఆరాటం
ఊసరవెల్లులు రాక్షసబల్లులు ఆడెను రంగుల కోలాటం
తిరిగి తిరిగి చేస్తున్నాయ్ తుక్కు రాజకీయాలు తిండి ఎక్కువై కండ తక్కువై
రగిలి రగిలి పేలుస్తున్నాయ్ ఉక్కు తూటాలు తిండి తక్కువై కండ ఎక్కువై
పటపట రగిలెను నిప్పుల కణికలు సింగపు రాజుల యుద్ధంలో
కానలు కాల్చెను కులం కొవ్వుతో మతం మత్తుతో క్రోధపు కామాగ్నై... ఆధిపత్యపు దాహాగ్నై...
తీవ్రవాదమై.. ఉగ్రవాదమై.. సామ్యవాదమై.. ప్రజాస్వామ్యమై.. అమ్మెను అడవిని ఎడారికి
ఎలుకలు ఎలుగులు కలుగులు వెదికే... దుప్పిలు లేళ్ళు దిక్కులు దాటే...
ఆవులు దున్నలు ఎద్దులు ఎనుములు
ఆర్పెను నిప్పుల కుంపటిని కార్చిన రక్తపు మడుగులతో...
అస్తమించాడు సూరీడు మళ్ళీ
మైకపు రాత్రిని మేల్కొలుపుతూ శాంతపు కన్నుల కొలిమల్లె
కాటుక ధాత్రిని ఉసిగోలుపుతూ చల్లని వెన్నెల చిలకల్లె
కాదిది జగన్నాటకానికిది అస్తమయం ఔనిది మరో నాటకానికి మహోదయం.!!
Related Posts Plugin for WordPress, Blogger...