ఉదయించాడు సూరీడు మళ్ళీ...




ఉదయించాడు సూరీడు మళ్ళీ
రాకాసి చీకట్లను చీల్చుకుంటూ ఆకాశ వాకిట్లో మిణుగురల్లే
వాలిన కొమ్మలకూపిరి పోస్తూ పేలిన వెలుగుల మెరుపల్లే
బురద పందులు పిచ్చి కుక్కలు మేల్కొన్నాయ్ బెడ్డు కాఫీకై
చిరుత పులులు గుంట నక్కలు బయల్దేరాయ్ ఫస్టు హంటుకై
దోమలు దోచాయ్ చీమలు చచ్చాయ్
సముద్రాల్నిండాయ్ స్మశానాలింకాయ్
కదలని కాకులు న్యూస్ పేపర్లలో పాడేస్తున్నాయ్
కదిలే కోతులు టీవి బులిటెన్లలో తిరిగేస్తున్నాయ్
ఏనుగు తొండం జింకల మొండెం కోరెను ముసుగుల ఆరాటం
ఊసరవెల్లులు రాక్షసబల్లులు ఆడెను రంగుల కోలాటం
తిరిగి తిరిగి చేస్తున్నాయ్ తుక్కు రాజకీయాలు తిండి ఎక్కువై కండ తక్కువై
రగిలి రగిలి పేలుస్తున్నాయ్ ఉక్కు తూటాలు తిండి తక్కువై కండ ఎక్కువై
పటపట రగిలెను నిప్పుల కణికలు సింగపు రాజుల యుద్ధంలో
కానలు కాల్చెను కులం కొవ్వుతో మతం మత్తుతో క్రోధపు కామాగ్నై... ఆధిపత్యపు దాహాగ్నై...
తీవ్రవాదమై.. ఉగ్రవాదమై.. సామ్యవాదమై.. ప్రజాస్వామ్యమై.. అమ్మెను అడవిని ఎడారికి
ఎలుకలు ఎలుగులు కలుగులు వెదికే... దుప్పిలు లేళ్ళు దిక్కులు దాటే...
ఆవులు దున్నలు ఎద్దులు ఎనుములు
ఆర్పెను నిప్పుల కుంపటిని కార్చిన రక్తపు మడుగులతో...
అస్తమించాడు సూరీడు మళ్ళీ
మైకపు రాత్రిని మేల్కొలుపుతూ శాంతపు కన్నుల కొలిమల్లె
కాటుక ధాత్రిని ఉసిగోలుపుతూ చల్లని వెన్నెల చిలకల్లె
కాదిది జగన్నాటకానికిది అస్తమయం ఔనిది మరో నాటకానికి మహోదయం.!!

4 comments:

  1. అద్భుతావిష్కర్ణ.....సాగనీయండిలా

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానం తోడైంది కదా. ఇక వరదలై సాగుతుంది.
      తాంక్యూ.!

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...