జీవిత సూత్రం!


నేలరాలి భూమి ఋణం తీరుస్తున్న
కొన్ని పూలను మనసుకు హత్తుకొని
ఆ పుప్పొడి గంధాలకు వో గుర్తింపునివ్వాలి!
సుఖాలకు బానిసైన ఈ శరీరంతో
శ్రామికుల చేతులను ప్రేమగా స్పృశించి
కొద్దిసేపు పశ్చాత్తాపపడాలి!
జీవితాంతం గాలినిచ్చే తరువుకు
ఆకలి ఉన్నంతకాలం గింజపెట్టే రైతుకు
దాహం తీర్చే మేఘానికి కొంత ఋణపడి ఉండాలి!
మట్టి వాసనను చుట్టుకొని
ఈ నేలని చెప్పులు లేని కాళ్ళతో ముద్దాడాలి!
జీవితపు కన్నీటి రుచిని చప్పరించి
సముద్ర కెరటాలకు ఖర్చులేని కానుకలు ఇవ్వాలి!  
కొన్ని నవ్వులను మోయడమే కాదు
కాసింత చెమటని...రవ్వంత రుధిరాన్ని
కొందరికోసం ధారబోయాలి!
మానవత్వపు పరిమళాలతో

ఈ భూమిని రవ్వంత తడి చేయాలి!  

1 comment:

  1. పశ్చాత్తాపపడాలి....రైతన్నను మరచినవారు అంటే మనందరమూ

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...