నిచ్చెలి...


ఆమె కోసం అందంగా పేర్చబడుతున్న
ఈ కన్నీటి అక్షరాలు
కేవలం దుఃఖ్ఖానికో దురదృష్టానికో
ప్రతీకలు కాదలుచుకోలేదు...

విధిని ఎదిరించి
సమాజానికి సవాలు విసరడానికో
ఆమెకై సానుభూతికోసం అర్థించడానికో
ఈ అక్షరాలను వృధాచేయదలుచుకోలేదు...

ఆమె సున్నితపు యద అంచులను
సరళంగా చీల్చి
బ్రతుకును కోరుకొని దారిలో మలుపులు తిప్పిన
కొన్ని నిస్వార్థపు త్యాగాలను కప్పివేసే ఈ అక్షరాలు
ఆమె గుండె గోడలపై రాసుకున్న
ఓటమి తాలూకు విజయాల్ని
ఆనందంగా వినిపించే విషాదప్రహసితాలు!

ఛిద్రమయిన కలల్ని ఇంకోసారి కలగనకుండా
నిద్రనే మానేసిన ఆ వనితను స్పృశించడానికి
ఆతృతతో పరిగెడుతున్న ఈ అక్షరాలు
తొలివేకువ పక్షుల కువకువలతో
సంభాషిస్తున్న మౌన సరాగాలు...

నైమిశం!!బ్రతుకు అంకురంలో ఉన్న కొత్త జీవానికి ఊతమిచ్చి వాస్తవాల రెక్కలు తొడిగాక... చిరునవ్వులో గెలుపోటములను చూపి ఎడబాటుతో మనసుల దూరాన్ని కొలిచాక... గుబులు గుండెలో ఆశల అలజడులు రేపి ఆశయాల్ని వలపుతో కలిపి రగిల్చాక... మనసులో సరికొత్త విశ్వాసాన్ని నింపి విశ్వమంత ధీరత్వాన్ని నాలో చూపించాక... స్నేహం..ప్రేమ..మమకారం..అభిమానం.. అన్న కొన్ని బంధాల అంచుల్ని దాటి వొక ఆరాధనాపూర్వక సాన్నిహిత్యంలో నిమిశనిముశమూ వెన్నంటూ ఉన్న నిన్నేమని కొలవనూ.... ఈ జన్మకు!!!

నువ్వు గుండె గడపమాను దాట్న్యాక...ఈ మధ్యగాల
గుండె కాడ షానా నొప్పిగుంటాంది
నువ్వేమన్నా తల్చుకుంటాండావా...

అమ్మలపొద్దున స్నానం చేస్కునేదానికి బాయికాడ పోతే 
కంది శెట్ల సందుల్లోంచి తొంగిజూసిన 
నీ చూపులు గుర్తొస్తాండాయి...

పైటాల అన్నం శరవ తీసి బువ్వ పెట్టుకుంటాంటే 
నువ్వు ఎంగిలి ముద్దులతో కలిపి పెట్టిన 
సంగటి ముద్దలు చానా గుర్తొస్తాండాయి...

మాయటాల గొడ్లకు మేత కోసేదానికి కొడవలితీస్తే
సానబట్టిన భాగమంతా తెల్లగా మెరుస్తా 
నువ్వు పళ్ళెకిరిస్తూ నవ్వుతాన్యట్టుంది...

పొద్దుగూకినాక పొయ్యి ఎలిగించాలని 
గబ్బునునే పోసి అగ్గిపుల్లేస్తె ఆ ఎర్రటి మంటల్లో 
నీ నుదుటి బొట్టు నాకు కన్నుగొడతావున్యట్టుంది...

రోజూ పంపుసెట్టు యేసి నీళ్ళు పట్టనుపోతే 
గలగలా పారే నీ మాటలు వొక్కటే గుర్తొచ్చి 
నా కడ్లంబడి నీళ్లొచ్చి పైరంతా తడుస్తాండాది...

ఎంగిలి మింగుతావున్యా పొలమారతాంది
నన్ను అంతగా తలచుకోకు అమ్మీ
నువ్వు ల్యాకుంటే నా పాణెం పోతావుండాది....

ఈ పండక్కి నీ సమాధికాడనే కుమిలిపోతాండా 
హాయిగా నీ వొళ్ళో తలబెట్టుకొని పండుకున్యట్టుంది
నన్ను కూడా బిర్నా నీకాడికి రానిచ్చుకోయే...

గండికోట జ్ఞాపకం!!


కొన్ని కట్టడాలు
జ్ఞాపకాల హద్దుల్ని చేరిపివేసి
ప్రజల గుండెల్లోంచి జారిపడి
కైఫియతులుగా కాగితాలపై కుమ్మరించబడి
చరిత్రలుగా లిఖించబడతాయి...

వొక జాతి బ్రతికున్నంతకాలం
శిధిలమౌతూనో.. సమాధవుతూనో..
చరిత్ర ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలిస్తాయి...

సుందర దృశ్యానికి అద్దంపట్టే
వొక పర్యాటక మనోరంజకం....
వొక చారిత్రిక శౌర్య శైధిల్యం...
కట్టడాల హృదయ ఘోషను శతాబ్దాలుగా
నిశ్శబ్దంగా మోస్తున్న పెన్నా నది సాక్షిగా...
ఇప్పుడు అందంగా ముస్తాబవుతున్న
యీ సీమ గోడలకూ వున్నది వో వెయ్యేళ్ళ గొప్ప చరిత్ర....

ఆకాశాన్ని తలెత్తి గర్వంగా చూస్తున్న బురుజులు
మనల్ని తలెత్తి చూసేలా చేసే కొయ్య తలుపులు
పగిలిన హృదయాలతో ఆర్ద్రంగా పలకరించే శిల్పాలు
ప్రపంచాన్ని గాలించే బంగారు బైనాకులర్లాంటి మినార్లు
ఎగిరే ప్రపంచానికి ఆవాసాలైన అందమైన పావురాల గోపురాలు
మంచినీళ్ళతో దాహం తీర్చిన అలనాటి కత్తుల కోనేర్లు
యిన్ని మనోహర దృశ్యాలు అందానికే కాదు
కొన్ని తీపీ - చేదు జ్ఞాపకాలకు ఉత్కృష్ట పరాకాష్టలు...
చరిత్రలో కలిసిపోయిన కొన్ని త్యాగాలకు సాక్ష్యాలు...

విదేశీయులపై రొమ్ము విరిచిన
వొక వీరోచిత పోరాటానికీ
భర్తను కోల్పోయి అశ్వమెక్కిన
వొక ధీరురాలి ప్రతీకారానికీ
వందల స్త్రీల అగ్ని ప్రవేశ త్యాగానికీ
విషం చిమ్మిన కొన్ని కుతంత్రాలకీ
సీమ ప్రజల శౌర్య ప్రతాపాలకీ
నిలువెత్తు ప్రతీక.. ఈ గండికోట!

రిక్తధ్వని...అంతరంగంలో అగాధమంత బాధను
కుత్తుక దాటనివ్వకుండా
విరిసిన పెదవులపై ప్రహసనాలనే 
వ్యసనంగా చేసుకుని బ్రతుకుతున్నపుడు
వొక అసంపూర్ణ వర్ణచిత్రంలా
మనసులో ఏదో అసంతృప్తి...

మదిలో మూగబోతున్న
కొన్ని భావాల వెలితిని
వెతికి వెతికి వెలికితీయాలనే
వొక జిజ్ఞాశాపూర్వక వెంపర్లాట...

జీవితమనే జీవనదిలో
ఆశయాల్ని ఒడ్డుకు నెట్టేసే కొన్ని అలలూ...
కొన్ని సహాయాలకు ప్రతీకగా
కృతజ్ఞతల ఒడ్డున కట్టబడ్డ ఇంకొన్ని ఆలయాలూ...

మనశ్శాంతిని మర్మగర్బంగా యిముడ్చుకోలేక
తృప్తీ - అసంతృప్తీల నడుమ
వొక యెద పడుతున్న నిశ్శబ్ధ సందిగ్థత ...

రహస్య యుద్ధం....ఏదో క్రొత్తదనపు కాంక్ష
గుండెవాకిళ్ళను దాటుకుంటూ
కళ్ళలో ప్రత్యక్షమై
ఒక ప్రత్యక్ష పొరుకి సన్నద్ధమౌతున్నట్టు
చుట్టూ అలుముకున్న ఏదో యుద్ధ వాతావరణం...

'సేవ్ కరెంట్' అంటూ వెలుతురు ఆర్పేస్తూ
ప్రేమని పునరుధ్ధరించే
ఒక శృంగారపు ఎత్తుగడతో
నువ్వు నా ఒళ్ళోకి వాలిపోయి
నన్ను మెత్తగా హత్తుకున్న స్పర్శ...

దేహాల రాపిడితో జనించిన
కొన్ని వోల్టుల విద్యుత్తుతో
ఇరువురి భావాలను బదిలీ చేస్తూ
దేహమొక ఒక ప్రేమ ట్రాన్స్ఫార్మర్ లా
మారిన మన ఒక భంగిమ...

రసవత్తర పోటీలో సింబాలిగ్గా
మనసుల తీసివేతల్లో శేషంగా
దేహాల కలబోతాల్లో లబ్దంగా అంతా ప్రేమే...

జీవితం కళతో ప్రయాణించడానీకో
మనసుకూ దేహానికీ ఒక సుఖమనే మోక్షాన్ని ప్రసాదించడానికో
ఇది అంతా ఇంకొంచెం మెరుగైన పనే...
రహస్యంగా దాచబడ్డ అతి గొప్ప పనే...

కాస్తంత ఎంగిలిపడరాదూ...


ఈ దినం ఎంతో శుభమైనదో
మరింత శోభాయమైనదో కావొచ్చు...
ఇంటి వాకిళ్ళలో కొన్ని గంధపు పరిమళాలో
పెరట్లో కొన్ని రంగుల సీతాకోకలో వీయవోచ్చు....

నీ ఎదురు చూపులు ద్వారానికి వొక గడపగానో
గోడకి ఒక కిటికీగానో మారవచ్చు...
నీ ధ్యాస గ్యాస్ స్టవ్ పై మరిగే ఎసరో
పొంగిపోతున్న పాలో కావొచ్చు....
నీ ఆశ దేవుని గదిలో పవిత్రమైన ప్రసాదమో
గదిని ఆవరించిన అగర్బత్తీ ధూపమో కావొచ్చు....

నువ్వు ఒక దిగ్భ్రాంతికర హృదయంతోనో
సంభ్రమాశ్చర్యపు అయోమయ మనస్తత్వంతోనో
ఇంటి మూలల్లో...మంచాల్లో..ఊయల్లో...
అలా అటూ-ఇటూ ఒంటరి సమూహంగానో
ఆవరించిన శూన్యాన్ని ఛేదించే గాలి కెరటంలానో  
మెల్లమెల్లగా రోజంతా పరుచుకోవోచ్చు....

నీకు అలసటా రాదు...ఎదురుచుపుల్లో విసుగూ రాదు
దాహమూ వేయదు....వెన్నంటే పొట్టలో ఆకలీ కలుగదు
ఆఫీస్ నుంచి నేనోచ్చేసాను
నీ క్రమానుగత వొక వొంటరి అలవాటు నుంచి

ఒక్కసారి దూరమై కాస్తంత ఎంగిలిపడరాదూ...

మట్టి చేతులు


ఒకడు నీ రక్తాన్ని తాగి
స్వేదంతో స్నానం చేసుకుంటాడు ...
మరొకడు నీ రెక్కల్ని వాడుకొని
వాడి డొక్క నింపుకుంటాడు...
ఇంకొకడేమో నీ కండల్ని కరిగించి
కనకపు కుర్చీలో కూర్చుంటాడు...
అనేకమంది
నీ అమాయకత్వాన్నో
నీ శ్రమించే వ్యక్తిత్వాన్నో
అలుసుగా చేసుకొని
నలుసులా నిన్ను నలిపేసారు....
ఎందరో
నీ మట్టి చేతులను తొక్కిపెట్టాక
నీ మెత్తని కుత్తుకఫై కత్తిపెట్టాక
ఆఖర్లో నిస్సాహాయతతో ఏడుస్తావెందుకు?
ప్రశ్నించడం చేతగాక చచ్చిపోతావెందుకు?
వొక విరగకాసిన తెంపరితనంతో
బాధల బందీఖనాలో బానిసత్వాన్నితెంపుకొని
ఒక్కసారి చచ్చిపోకుండా....
పోరాడుతూ ప్రతిరోజూ బ్రతుకవోయ్...బ్రతుకు...
జీవులకు తిండిగింజలు పెట్టే పచ్చని మొక్కలా  
కోట్ల కర్షకులకు ఆదర్శంగా
మా స్వార్థం కోసమైనా
ఇంకొన్నేళ్ళు బ్రతకవోయ్ భగవద్స్వరూపుడా!!!తను...!!


మంచు బిందువుల్ని తొడుక్కుని 
చలిని ఆస్వాదించే చెట్టుకోమ్మల్లా 
తడి ఆరని హృదయంతో 
చెలి తెచ్చే వసంతమ్ కోసం
నేను ఎప్పటికీ ఎదురు చూస్తూంటాను...
తన భరోసానిచ్చే పిలుపు
భారాన్ని తొలగించే తొలకరిజల్లై
నిలువెల్లా ఎప్పుడూ తడుపుతూనే ఉంటుంది...
పీల్చే గాలిలో గంధమై
తాగే నీరులో మకరందమై
స్పృశించే వస్తువులో అందమై
తనెప్పటికీ నాతోనే సహచరిస్తుంటుంది...
ఆమె కోసమే పదేపదే వినిపిస్తున్న
నా హృదయ సరాగం
ఆమె నిరీక్షణలో
ఇప్పటికీ విలపిస్తూనే ఉంది...

ఐడెంటిటి...

కులమతాల కవాతు ధ్వానాల్లో 
ధ్వంసమైన ఓ సందేహ దేహమా!
పుట్టుకతో వొక ఐడెంటిటీని ముద్రించబడ్డ 
జుగుప్సాకర క్రోమోజోమువి నువ్వు....
గతం విత్తు తాలూకులక్షణాలను
బలవంతంగా జొప్పించే
వొక విద్రోహ సమాజం ఆడే
క్రూరత్వపు యుద్ధతంత్రంలో
బలిపశువైన రక్తపు ముద్దవి నువ్వు....
పొరబాటున నువ్వు రాజకీయంలో వొక వోటువో
మతవిశ్వాసాల్లో వొక భక్తుడవొ మాత్రం కాకపోతే
దేశద్రోహశంకతో నీ చేతులకు ఇనుప సంకెళ్ళే!!!

ఒక చిన్ని చరిత్ర


గుహల్లో మనుషులూ
రాళ్ళ రాఫిడికి నిప్పురవ్వలు
కొత్తయుగంలో పరుగెత్తిన చక్రాలు
సింధూ పరివాహక సంస్కృతులు
సర్పలిపి ఆకృతులు
వేదకాలపు కొత్త దేవుళ్ళు
అడ్రస్సులు తెలియని ఆర్యులు
అస్తిత్వానికి యజ్ఞయాగాలు
విఛ్ఛలవిడి బలిదానాలు
సత్యాహింసల బౌద్ధజైనాలు
హర్యాంక గాంధార సింధ్ సేత్రపీలు
మగధ శిశునాగ నందులు
అలెగ్జాండర్-పోరస్ సెల్యుకస్- చంద్రగుప్తులు
కళింగలో అశోకుడు కళ్ళజూసిన రక్తాలు
శుంగ కణ్వ శాతవాహనులు
కనిష్క శాతకర్ణ గుప్తులు
పల్లవ చాళుక్య రాష్ట్రకూటులు
అద్వైత శంకరాచార్యులు
ఖజురహో ఛండేలులు
వరంగల్లు కాకతీయులు
ఘజినీ ఘోరీ చొరబాట్లు
ఖిల్జీ సుల్తాన్ బహ్మనీలు
విజయనగర హరిహర బుక్కరాయలు
తెలుగు లెస్స కృష్ణదేవరాయలు
రాజపుత్ర మొగలాయి పీష్వాలు
విదేశీ దురాక్రమణలు
పాగా వేసిన ఆంగ్లెయులు
మతసంస్కరణొద్యమాలు
ఆవుకొవ్వు తూటాలు
రాజ్య సంక్రమణ సిద్ధంతాలు
సిపాయిల తిరుగుబాటు విప్లవాలు
భీబత్సమైన దళిత తిరుగుబాటు ఉద్యమాలు
కాంగ్రేస్ పుట్టుక వెనుక జుగుప్సాకర పరీస్తితులు
మితవాద అతివాద దశలు
బెంగాల్ విభజన వందేమాతరోద్యమాలు
మింటో మార్లే చేంమ్స్ ఫర్డ్ ద్వంద చట్టాలు
హోం రూల్ ఖిలాఫత్ సైమన్ కమీషన్లు
సహాయనిరాకరణ దండియాత్రలు
తిలక్ బోస్ గాంధీ అంబేద్కర్లు
ముస్లీం లీగ్ కుట్రలు
క్విట్టిండియా అణచివేతలు
బెంగాల్లో కరువులు
మౌంట్ బాటన్ పాచికలు
విభజనలో పారిన రక్తాలు
రక్తాన్ని కప్పి భారత జెండా రెపరెపలు

అర్రే...


పుర్రెలో పుట్టిన భావాలను
వెర్రి మనసు గ్రహించడంలేదని
వర్రీ అవకు నేస్తం....
కర్రి కోసం కొట్టుకునే
గొర్రె మొహాలు వెక్కిరిస్తున్నాయని
హర్రీ బర్రీగా డెసిషన్లంటూ
బుర్ర చించుకోకు మిత్రం....
బర్రెల్లా ఎదిగిన
దొర్రిపళ్ళ మెధావుల నాల్కల్లో
మర్రి విత్తంటి వాళ్ళ మస్తిష్కాల్లో
చెర్రీ, బ్లాక్ బెర్రీల భావాత్మక రుచులు ఇమడలేవు సత్యం...
అర్రే!.. నీ భావాలకు
కొర్రీలు వేయడమే ఈ లోకం పని రా భాయ్...

ఉత్కమణo!వెలుగుల్ని నిషేధిస్తూ
నిశీధిని ఆహ్వానిస్తూ
ఎక్కడో చరమాద్రిన అస్తమించే ఎర్రటి సూరీడు
ప్రపంచాన్ని పగలంతా వెలిగించాడు కానీ
మూడత్వంతో కుచించుకుపోతున్న
ఒక్క చీకటి హృదయాన్నైనా వెలిగించలేక
దివి భువితో కలిసే పెవీలియన్లో కనుమరుగైపోతున్నాడు పాపం....

టన్నుల ఉక్కు కవచాల్లో భద్రంగా దాచుకొన్న
జుగుప్సాకర మెటీరియలిస్టిక్ భావాలు
మనిషితనాన్ని వేల పాథంలోతుల్లో నేట్టేస్తున్నపుడు  
ఆ మనస్తత్వాల్లో భానుడి వెలుగులు ప్రసరించడానికి
ఎన్ని కోట్ల కాంతిసంవత్సరాలు పడుతుందో...

ఉత్కృష్టపు గారడీల సెప్టిక్ ట్యాంక్ జీవితాల్లో
త్రవ్వినకొద్దీ వూరే దుర్ఘంధపు గరళాలనూ...
నికృష్టపు ఆరాటాల స్వార్థ హృదయాల్లో
క్వింటాళ్ళకొద్దీ బయటపడే కుటిలత్వాలనూ...
సమూలంగా పెకలించడానికి
ఒక్క రోజుకి ఎన్ని గెలాక్టిక్ ఉదయాలు అవసరమో!?  

దైగంబరికం!


ఎందుకు నువ్వు వస్త్రాన్ని కప్పుకుతిరగాలో
వొకసారి ప్రశ్నించుకొన్నావా?
యే ధూళి రవ్వలో
యే చలి పరాగాలో
యే వర్షపు తుంపరలో
నిన్ను తాకుతాయనో కాక
యే కళ్ళు నీ నిజరూపాన్ని చూస్తాయనో
నీ ఒళ్ళు కొన్ని జంతువులకన్నా
భిన్నంగా ఉండాలనో
మేను మన్నయ్యేదాకా
మనస్సు నగ్నత్వాన్ని వదిలేసి
వొంటికి కొన్ని వేల సార్లు రంగుల బట్టలు కప్పుకుంటావు...

శరీరం కోసం మానసికంగా జోప్పించబడిన
వొక క్రమానుగత మార్పు
యుగాలుగా నీ దేహాన్ని
దేహమందలి అనేక భాగాల్ని
వింత సాంప్రదాయాల పోగులతోనో
వైవిధ్య సాంస్కృతిక విప్లవాల వడుకులతోనో
కప్పుతూ ఇప్పటి నీ స్థాయిని కించిత్ శాసిస్తోంది...

నీ మనసుకి యేదో లేనితనాన్ని తొలగించి
నీ మేనికి వొక ఔన్నత్యాన్ని ఆపాదించే వస్త్రం
నీ దిగంబరత్వాన్ని దోచేస్తోందా? దాచేస్తోందా?

ఎప్పుడైనా ప్రశ్నించుకోన్నావా??   

జీవచ్ఛవం...

అనుభవంతో నువ్వు గ్రహించిన సారాన్నో
విచక్షణతో నువ్వు సంపాదించుకొన్న నిగ్రహాన్నో
జీవితంలో వొక్కోసారి కోల్పోవాల్సివస్తుంది
మనసు గొడలకు భద్రంగా అంటిపెట్టుకున్న కొన్ని బంధాలను
యిష్టాయిష్టాల పెనుగులాటలో జారిపోకుండా
మరింత భద్రంగా దాచుకోవాల్సివస్తుంది
భరించడం బాధ్యత అయినపుడు
అనుబంధాలు గాయపరచిన ప్రతిసారీ
కలిమిలేముల్లో కలిసుండేలా
వొక సున్నిత వాగ్దానం చేయాల్సిఉంటుంది
బంగారు కోటగా కట్టుకొన్న
వొక బంధం మనసు గొడలుదాటి
దూరమయినట్లు అనిపించినప్పుడు
కొంచెం వెర్రిదనమో
ఇంకొంచెం వెలితిదనమో
మనస్సులో చివుక్కుమంటుంది
ఎక్కడి అగ్నిపర్వతమో ఇక్కడ బద్దలవుతున్నట్లు
ఎక్కడి సుడిగుండమో ఇక్కడ విజృంభిస్తున్నట్లు
వొకటే నిరాశ...వొకటే నిర్వేదం ...
అగాధమంటి ఒకటే బాధ
అదేవరూ పూడ్చలేనిది
పూడ్చినా లోలోపల కుంగిపోయే ఒక హరివాణమై
మనస్సు లోతుల్ని పరీక్షిస్తూనేవుంటుంది
పరీక్షలో నెగ్గడం అంటే బంధాల బంధిలో నువ్వు జీవించడం
ఓడిపోవడం అంటే బంధాల గిరిదాటి నువ్వు జీవచ్ఛవమవడం
Related Posts Plugin for WordPress, Blogger...