గండికోట జ్ఞాపకం!!


కొన్ని కట్టడాలు
జ్ఞాపకాల హద్దుల్ని చేరిపివేసి
ప్రజల గుండెల్లోంచి జారిపడి
కైఫియతులుగా కాగితాలపై కుమ్మరించబడి
చరిత్రలుగా లిఖించబడతాయి...

వొక జాతి బ్రతికున్నంతకాలం
శిధిలమౌతూనో.. సమాధవుతూనో..
చరిత్ర ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలిస్తాయి...

సుందర దృశ్యానికి అద్దంపట్టే
వొక పర్యాటక మనోరంజకం....
వొక చారిత్రిక శౌర్య శైధిల్యం...
కట్టడాల హృదయ ఘోషను శతాబ్దాలుగా
నిశ్శబ్దంగా మోస్తున్న పెన్నా నది సాక్షిగా...
ఇప్పుడు అందంగా ముస్తాబవుతున్న
యీ సీమ గోడలకూ వున్నది వో వెయ్యేళ్ళ గొప్ప చరిత్ర....

ఆకాశాన్ని తలెత్తి గర్వంగా చూస్తున్న బురుజులు
మనల్ని తలెత్తి చూసేలా చేసే కొయ్య తలుపులు
పగిలిన హృదయాలతో ఆర్ద్రంగా పలకరించే శిల్పాలు
ప్రపంచాన్ని గాలించే బంగారు బైనాకులర్లాంటి మినార్లు
ఎగిరే ప్రపంచానికి ఆవాసాలైన అందమైన పావురాల గోపురాలు
మంచినీళ్ళతో దాహం తీర్చిన అలనాటి కత్తుల కోనేర్లు
యిన్ని మనోహర దృశ్యాలు అందానికే కాదు
కొన్ని తీపీ - చేదు జ్ఞాపకాలకు ఉత్కృష్ట పరాకాష్టలు...
చరిత్రలో కలిసిపోయిన కొన్ని త్యాగాలకు సాక్ష్యాలు...

విదేశీయులపై రొమ్ము విరిచిన
వొక వీరోచిత పోరాటానికీ
భర్తను కోల్పోయి అశ్వమెక్కిన
వొక ధీరురాలి ప్రతీకారానికీ
వందల స్త్రీల అగ్ని ప్రవేశ త్యాగానికీ
విషం చిమ్మిన కొన్ని కుతంత్రాలకీ
సీమ ప్రజల శౌర్య ప్రతాపాలకీ
నిలువెత్తు ప్రతీక.. ఈ గండికోట!

3 comments:

  1. చరిత్రకారులా మీరు :)

    ReplyDelete
  2. చాలా చక్కగా చిత్రీకరించారు కవితలో చరిత్రని.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...