ప్రేమ ప్రయోగశాల...


అగాధాన్ని దాచుకున్న నీ కళ్ళలో
అకస్మాత్తుగా పడేసుకున్న నా మనసుని
ఈ రాత్రికి కొంచెం వెతుక్కొనివ్వు....
దేహానికి దేహాన్ని అప్పగించి
సున్నితపు స్నేహపరిమళంతో
నీ లోలోన నన్ను కనుగొననివ్వు...
కొన్నేళ్ల శూన్యాన్ని బద్దలుగొట్టి
నన్ను నీ ఊపిరి శబ్దాల్లో దాచుకొని
కొన్నాళ్ళు నీలో మొలకెత్తనివ్వు...
మెత్తటి నీ చేతుల్లో నా మొహాన్ని ఎత్తుకొని
మోహంతో కొన్ని ముద్దుల్ని జల్లెడపడుతూ
నీ ప్రేమని నా గుండెల్లో రాలనివ్వు...
జీవితపు ప్రయోగశాలలో
మరపురాని కొన్ని ఆప్యాయతలను
ఈ నిశిరాత్రుళ్ళలో నన్ను సృష్టించనివ్వు...

జీవిత సూత్రం!


నేలరాలి భూమి ఋణం తీరుస్తున్న
కొన్ని పూలను మనసుకు హత్తుకొని
ఆ పుప్పొడి గంధాలకు వో గుర్తింపునివ్వాలి!
సుఖాలకు బానిసైన ఈ శరీరంతో
శ్రామికుల చేతులను ప్రేమగా స్పృశించి
కొద్దిసేపు పశ్చాత్తాపపడాలి!
జీవితాంతం గాలినిచ్చే తరువుకు
ఆకలి ఉన్నంతకాలం గింజపెట్టే రైతుకు
దాహం తీర్చే మేఘానికి కొంత ఋణపడి ఉండాలి!
మట్టి వాసనను చుట్టుకొని
ఈ నేలని చెప్పులు లేని కాళ్ళతో ముద్దాడాలి!
జీవితపు కన్నీటి రుచిని చప్పరించి
సముద్ర కెరటాలకు ఖర్చులేని కానుకలు ఇవ్వాలి!  
కొన్ని నవ్వులను మోయడమే కాదు
కాసింత చెమటని...రవ్వంత రుధిరాన్ని
కొందరికోసం ధారబోయాలి!
మానవత్వపు పరిమళాలతో

ఈ భూమిని రవ్వంత తడి చేయాలి!  
Related Posts Plugin for WordPress, Blogger...