మోసగత్తె....


సాటర్డే నైట్ ఫీవర్తో సంతోషంగా లగెత్తుకొస్తే
శనివారం శోభనమేంట్రా మెంటలోడా అని
రెండు గోలీలిచ్చి గురకపెట్టి బజ్జోమన్నావు...

గాలివానలకు గువ్వలా తిరిగి గూడు చేరితే
అలసిపోయావంటూ మాయమాటలు చెప్పి
గప్ చుప్ గా గుండె గదికి గొళ్ళెమేశావు...

చలేస్తోందని చెంత చేరి చీరలో దాక్కోబోతే
పాజిటివ్ లక్షణాలు మొదలయ్యాయంటూ
వేడిగా కరోనా కాషాయం తాగమన్నావు...

ప్రేమతో పట్టెమంచమేసి పక్కకు రమ్మంటే
ముట్టయ్యాను ఇప్పుడు ముట్టుకోకకంటూ
సావుకబురు సల్లగా చెప్పి తప్పించుకున్నావు...

మాటవినక మోజు తీర్చుకుందామనుకుంటే
మొండి మోహమోడా అంటూ పక్కకునెట్టి
మోసగత్తెకి నిలువెత్తు సాక్షంగా నిలిచావు...

దీక్ష


నువ్వు నాతోలేక
యుగాలు గడిచిపోయాయి...
మనం కన్న స్వప్నాలూ చెదిరిపోయాయి...
పగళ్లను కమ్మేస్తున్న చికటిపొరలతో
మన ప్రపంచం వెలుగుని కోల్పోయినట్టుంది...
అప్పుడొకసారి
దోసిట్లో తీసుకున్న నీ మొహం
ఇప్పుడు కన్నీరై వొలికిపోతోంది...
తడిబారిన జ్ఞాపకాల గుండెలోంచి
ఉబికొచ్చే రుధిరాహ్ని
నన్ను భగభగా కాల్చేస్తోంది...
నా దేహమంతా
ప్రజ్వలించే భావోద్వేగాలతో
ఇప్పుడు నీ దీక్ష చేయడమే నాకు మిగిలింది...


ఉప ఉత్పత్తి!


నేను సూర్యుణ్ణి
హృదయమంతా పరచుకున్న ఈ రాత్రి చీకట్లో
నా భావోద్వేగాలు చిందరవందరయ్యాయి

గింజుకుంటున్న ఆకుల మధ్య
చిక్కుకున్న వెన్నెల కాంతుల్లో....
విరహం వలపుల్ని ఒక కవాటంలో
అహం అనుమానాన్ని ఇంకో కవాటంలో పేర్చి
జ్ఞాపకాలతో విలవిలలాడే మనసుకి
శస్త్రచికిత్స చేసుకున్నాను....

ఓపిగ్గా కుట్లు వేసుకున్నాక
ఆకులమధ్య చిక్కుకున్న వెన్నెలను విడిపిస్తే
చిందరవందరయిన తన భావోద్వేగాలతో
పగటి వెలుతురు కోసం
వెదుక్కుంటూ వెళ్ళిపోయింది
తన శస్త్రచికిత్స కోసం
పగలు నేను మేఘాల్లో చిక్కుకుపోయాను...

రాత్రీ పగళ్లు వంతులేసుకొని మేము కాపాడుకునేది అపురూపమైన ప్రేమను!
ఈ ప్రపంచ గమనం మాత్రం
బహుశా మా ప్రయాణంలో ఉపఉత్పత్తి అయుండొచ్చు!!

చిక్కుముడి!


నీ దేహంపై రెండు చందమామల మధ్య
నేనో చందమామనై తిరగాడిన క్షణాలు
నాకింకా గుర్తు...

వెన్నెల కురిపించే మన ఏకాంతాన్ని
ఏ కాలమంటారోనని కాలమే పసిగట్టలేక పారిపోతే
నవ్వి నవ్వి నా గొంతులో తడిఆరిపోయేది...

మళ్లీ మళ్లీ గుర్తొచ్చే
నీ చిలిపిచుంబన రహస్యాల జాతరలో
నన్ను ఎన్నోసార్లు తప్పిపోయేలా చేసి,
వలపు వెదుకులాటలో మళ్లీ కనపడితే
నుదుటిపై ముద్దుల హా'రతి పట్టి నన్ను హత్తుకునేదానివి చుడూ....
అదెంత మధురమో కదా!

మన సరససరాగసమరోత్సాహసమయంలో
తొంగిచూస్తే కిటికీ ఆవల కనపడే కదంబకదనోత్సవానికి మనమెంత ప్రేరణనిచ్చామోనని గర్వపడేవాళ్ళం కదా...

పొగు'పడ్డ ఆ జ్ఞాపకాల చిక్కుముడి విప్పడం నాకిష్టంలేదు...
అందుకే చిక్కులో చిక్కుకుపోయిన నిన్నూ నన్నూ అలానే గుర్తుంచుకుంటా...

నా ప్రేమ!

ప్రేమంటే మానసిక బంధమని
భ్రమలో భ్రమరమై తిరిగాను..

ప్రేమంటే భౌతిక సమక్షమని
సహేతుక సాక్ష్యమై నిలిచావు..

నీకోసం నేను చేసిన పనులచిట్టా అడిగితే
నిన్నేమని సమాధానపరచను?

నా మనసు ఖర్చుచేసిన గతాన్ని
ఘడియల తరబడి గుర్తుకు తెప్పించనా?

కరిగిన కాలపు కన్నీటిచుక్కల్ని పేర్చి
నీ అందమైన దోసిట్లో సముద్రాన్ని ఒంపనా?

నా ప్రేమలో నిస్వార్థాన్ని నిర్వచించమని సవాలువిసిరితే
నా మరణ లేఖను నీ మనసు చిరునామకు పంపనా???

Related Posts Plugin for WordPress, Blogger...