చిక్కుముడి!


నీ దేహంపై రెండు చందమామల మధ్య
నేనో చందమామనై తిరగాడిన క్షణాలు
నాకింకా గుర్తు...

వెన్నెల కురిపించే మన ఏకాంతాన్ని
ఏ కాలమంటారోనని కాలమే పసిగట్టలేక పారిపోతే
నవ్వి నవ్వి నా గొంతులో తడిఆరిపోయేది...

మళ్లీ మళ్లీ గుర్తొచ్చే
నీ చిలిపిచుంబన రహస్యాల జాతరలో
నన్ను ఎన్నోసార్లు తప్పిపోయేలా చేసి,
వలపు వెదుకులాటలో మళ్లీ కనపడితే
నుదుటిపై ముద్దుల హా'రతి పట్టి నన్ను హత్తుకునేదానివి చుడూ....
అదెంత మధురమో కదా!

మన సరససరాగసమరోత్సాహసమయంలో
తొంగిచూస్తే కిటికీ ఆవల కనపడే కదంబకదనోత్సవానికి మనమెంత ప్రేరణనిచ్చామోనని గర్వపడేవాళ్ళం కదా...

పొగు'పడ్డ ఆ జ్ఞాపకాల చిక్కుముడి విప్పడం నాకిష్టంలేదు...
అందుకే చిక్కులో చిక్కుకుపోయిన నిన్నూ నన్నూ అలానే గుర్తుంచుకుంటా...

3 comments:

  1. గుర్తుంచుకుని చిక్కుముడుల్లో ఆనందంగా ఉండగలగడం మీ ధృఢమైన హృదయానికి నిదర్శనం.
    ఎదుటివారి హృదయం కూడా అంతే దృఢంగా ఉండాలి కదండీ. లేదంటే జ్ఞాపకాల్లో బ్రతకలేక వారు బాధపడతారేమో కదాని నా అనుమానం.
    చక్కని పదబంధాలతో అద్భుతమైన కవితను వ్రాసారు విష్వక్సేనులవారు. క్రమం తప్పక వీలున్నప్పుడు వ్రాస్తూ ఉండాలని కోరుకునే మీ చిరకాల అభిమాని పద్మార్పిత మాటను మన్నిస్తారని ఆశ. _/\_

    ReplyDelete
  2. జీవితమంటే రెండు మనసులకే పరిమితం కాదని
    ఆ మనసు యొక్క మందిరమైన దేహం కూడా అందలి భాగమేనని గుర్తు చేశారు
    ఉనికికి కల్పన ఏదో వాస్తవం ఏదో కాల్పనిక వాస్తవికతలే పరిమితం కాదని
    భౌతికానికి అలౌకికానికి లంకె ఆలుమగల చేతిలోనే ఉంటుందని గుర్తు చేశారు
    మార్స్ యోక్క కోపోద్రికాలు వీనస్ యొక్క అందచందాలు వాటికే పరిమితం కాదని
    ఆయ భావుకతలు భార్యభర్తల నడుమ కలగాపులగమేనని గుర్తు చేశారు
    కవితలంటే ప్రకృతి సోయగాలకు సొబగులద్దడానికే పరిమితం కాదని
    వైవిధ్యభరితమైన విషయాలకు సైతం ఆపాదిస్తే వాటికి కూడ ఇలా వ్యాఖ్యానించగలమని గుర్తు చేశారు.

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  3. తెలుగు భాష పై పట్టు బాగా ఉన్నవారు చాలామంది ఉన్నారు బ్లాగులో

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...