కవితా మాత్రికలు 3x3 ( 11-20 )


11.

నోరు తెరిచి చూస్తోంది
మబ్బులు కరుణిస్తాయని నేల
 
నెర్రలు చీలి వినోదానందా !
12.
ఆలోచించి మాట్లాడితే నత్తి
ఆలోచించక మాట్లాడితే సుత్తి
మౌనానికే శక్తి వినోదానందా !
13.
ఆదమరిస్తే ఆవలింతల పోటు
ఆత్రమైతే ఆవేశంతో చేటు
ఆలోచించరా! ముందు వినోదానందా !
14.
బ్రతికి పంచితే కీర్తి
చచ్చాక చెందితే అపకీర్తి
చచ్చినా బ్రతికేసేయ్ వినోదానందా !
15.
రాముడంటే ఓ దేవుడు

 దేవుడంటే గొప్ప మనుషుడు
ఎందుకింకా చెవుడు వినోదానందా !
16.
లగ్నం చేస్తే మనస్సు
ఫలించదా ప్రతి తపస్సు
వరాల్ని వర్షిస్తూ.. వినోదానందా !

17.  
అవసరమని చేయకు అప్పు
అదలవాటుగా మారితే తప్పు 
జీవితానికే పెనుముప్పు వినోదానందా ! 

 18.  
ఆనందంగా ఉండాలంటే నిత్యం
జంకకుండా పలకాలి సత్యం
సకలం సంతోషమే వినోదానందా !

19.
ఆత్మవిశ్వాసం పెంచేదే భక్తి  
విజయానికి కావాలి మేధాశక్తి  
దీపమెందుకు గాలిలో వినోదానందా !
 
20.  
పెరుగు చిలికితే వెన్న
పూలు చిదిమితే తేనె
మనసు కదల్చవేం? వినోదానందా !

    

|| నీ కోవెల ||



నీవు నడిచిన అడుగుల జాడలను
ఒక్కొక్కటిగా వొడిసిపట్టి తెచ్చిన మట్టిని
నా మనసు వనాల్లో వికసించిన
ప్రేమాసుమాలతో అర్చనలు చేస్తున్నా...


మెరిసే తారవైన నీవు
ఆకాశం వదిలి నా హృదయంలొ వెలిగితే
రోదించి కూలబడ్డ
ఆ భాష్ప జల మేఘాలతో
నీకు అభిషేకం చేస్తున్నా...


మైమరపించి ఉర్రూతలూపే
నీ కోకిల గానాలు
వసంతం వీడి నా చెంత చేరితే
విలపించే ఆ ఆమని నిన్నందుకోవాలని
చాచే తన లేలేత చిగురు కొమ్మలతో
నీకు మాలలు అల్లేస్తున్నా...


నీ హృదయంలో నాకు చోటులేదని తెలిసి
నువు కొలువైన నా హృదయాన్నే
ఓ కోవెలగా మలిచేస్తున్నా...


నువు తొలిచిన నా హృదయ లోయల్ని
నీ కోవెల ముందు కొలనుగా చేసి
నా కన్నీటి ధారలతో నింపేస్తున్నా...

27/08/2013

|| బాబోయ్! దోమలు ||



దోమలూ జోల పాటలు పాడుతాయ్...
కానీ, కాస్త కర్ణకటోరంగా!
‘గుయ్య్..’ మంటూ ఎన్నో భావాలు పంచుకుంటాయ్...
మనకేమాత్రం అర్థం కావుగా !
ఎన్నో పరాన్నజీవులకు ఇవి టిక్కెట్టు అడగని రక్త విమానాలు...
రోగాలు రవాణా చేస్తూ,
భోగాలు అనుభవించే స్వేచ్చా సమూహాలు...
శోకాలు మిగిలిస్తూ చక్కర్లుకొట్టే చలాకీ స్మగ్లర్లు...
మగదోమలు పాపం! మన రక్తం పీల్చని సోమర్లు...
అమ్మో! ఆడదోమలు;
శూలాలు తొండంలో దాచుకున్న రాక్షస జలగలు...
వినాయకుడి చేతి పళ్ళెంలో లడ్లలా,
చితిని చుట్టేసిన బుల్లెట్లలా,
సూక్ష్మ హిమాలయాల్ని తలపించే వీటి గుడ్లు...
సముద్రంలో సర్పకన్యలు విహరిస్తున్నట్లు,
నీరు ఎక్కడ నిలువ ఉన్నా నాట్యమాడే వాటి లార్వాలు...
అబ్బో! ఇంకా ఎంతచెప్పినా అది చాలా తక్కువేలే!
మనుషులంటే మాత్రం వీటికి తరగని మక్కువేలే!!

25/08/2013

ఇది మన తెలుగురా !

రచన:: వినోద్ || ఇది మన తెలుగురా ! ||


(మనతెలుగు మన సంస్కృతి వారు నిర్వహించిన పోటిలో ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత.)

కవితా మాత్రికలు 3x3 [6-10]



6.
తప్పుడు మాటల మగడు
తిప్పుడు నడకల మగువ
తిప్పలు పడరా? వినోదానందా !


7.
చూపులో ఉన్నది దోశం
సవరిస్తే వస్తుంది రోషం

వేషంలో లేదు వినోదానందా !


8.
చందస్సు చెదిరిన పద్యం
అర్థం కుదరని గద్యం
వెలగని దీపాలే వినోదానందా !

9.
తూర్పున ఉదయానికి ఆభరణమైన
వేకువ తొలి కిరణంలా
నీతిని అలంకరించుకో వినోదానందా !


10.
అన్నీ తనలో ఇముడ్చుకొన్నా
ఏమీ లేనట్లుండే చీకటి
నిరాడంబరత నేర్పును వినోదానందా !

23/08/2013


కవితా మాత్రికలు 3x3 [1-5]



ఈ మధ్య కవితా మాత్రికలని ఓ కొత్త రచనా ప్రక్రియను మొదలుపెట్టాను.
ఎన్ని వరుసలు రాస్తామో, వరుసకు అన్ని పదాలు రాసుకుంటూ పోవడమే. కాకపొతే నేను 3x3 మాత్రిక రూపంలో మొదలెడుతున్నాను.
పైత్యం ముదిరి పాకాన పడింది. అందుకే ఇలా ......
1.
ఎవడు పోగొట్టుకున్న హృదయమో
చీకట్లను కొల్లగొట్టిన ఉదయమై

వెలుగుల్ని వెతుక్కుంటోంది వినోదానందా!

2.
వాడు ప్రపంచాన్ని తాగి,
జీవితాల్ని భోంచేసిన ప్రకృతిలా;

ప్రేమను విసర్జిస్తున్నాడు వినోదానందా !


3.
ఆకాశం ఆదమరచి నిదరోతూ

ఉరుముల గురక పెడుతోంది

నక్షత్రాల్ని మేల్కొలపాలని వినోదానందా !


4.

మసిబారిన లాతరు చిమ్నీ

వెలుగును తినేస్తోంది కొద్దికొద్దిగా

నెత్తినెక్కిన అహంలా వినోదానందా !


5.

సముద్రాల్ని ఎత్తుకెళ్తే మేఘాలు;

చేపల కన్నీళ్ళు సృష్టిస్తాయి -

ఇంకో సముద్రాన్ని వినోదానందా !

|| అది ముదిరిన ప్రేమ ||


అది వలపుల హిమగిరి
జార్చిన విరహపు ఝరి
వయ్యారం !
అది తపనల సుమసిరి
పూడ్చిన మోహపు విరి
సింగారం !
అది తలపుల తొలకరి
నేర్చిన పరువపు కరి
ఘీంకారం !

అది మనసున పూచిన
ఆశల తహతహ
ఆరాటం !
అది తనువున రేగిన
యవ్వన ధణధణ
పోరాటం !
అది కలయిక వేచిన
కోర్కెల తటపెట
కోలాటం !

15/08/2013

|| తుంటరి పిల్ల ||


నన్ను చూసి కన్ను కొట్టెనే
వయ్యారిభామ వాలుజడల వొంపు చూపెనే !
చిలిపి పెదవి పంట కొరికెనే
గుండెల్లో దూరి ఘల్లు ఘల్లు నాట్యమాడెనే !

రాలిపోయే వనాల పూలజల్లు పులకరింత
పారిపోయే సింగారి వలపు ఉచ్చు వేసినాక
ఉన్నచోటే జాబిల్లి జామురాత్రి ఆవలింత
చూడబోతే చిన్నారి వయసు గాడి తప్పెనంట

ఆశపెట్టి అందాలు కుమ్మరించి తడిపినాక
నిద్దరోయే మదన మోహమింక ఆగదంట
దుమ్మురేపే దమ్మెంతో చూపమంటూ వచ్చినాక
తుమ్మెదల్లే రమించి సొగసునంత జుర్రుకోనా

నన్ను చూసి కన్ను కొట్టెనే
వయ్యారిభామ వాలుజడల వొంపు చూపెనే !
చిలిపి పెదవి పంట కొరికెనే
గుండెల్లో దూరి ఘల్లు ఘల్లు నాట్యమాడెనే !

05/08/2013

ప్రకృతితో నా వింత పరిణయం



                                                       కవితకు దృశ్య రూపం

 
సెలయేటి కరతాళ ధ్వనులేవో
వింతగా వినిపిస్తున్నాయి.
పచ్చటి వనాల తోరణాలేవో
కొత్తగా కనిపిస్తున్నాయి.
వెచ్చటి వలపు పవనాలేవో
గాఢంగా స్పృశిస్తున్నాయి.

ఆ పలుకులో ఏదో స్తబ్ధత!
ఆ చూపులో ఏదో ఆర్ధ్రత!
ఆ స్పర్శలో ఏదో చేయూత!

పంచేంద్రియాలకు అందని భావాలేవో
నా మనసుని ముసిరేస్తున్నాయి.
పంచభూతాలు పసిగట్టని ప్రశాంతతలేవో
నా చుట్టూ ఆవరిస్తున్నాయి.

వింతలకు నెలవైన విశ్వమంతా
నన్నే గమనిస్తున్నట్టుంది.
క్రొత్తదనానికి కొలువైన వింత
లోకంలో నేనున్నట్టుంది.

చుట్టూరా ఏదో హడావిడి!
మనసులో మాత్రం అలజడి!

పావురాళ్ళ వర్తమానాలు,
చిలకమ్మల పెద్దరికాలూ;
తేల్చేసాయి నా సందేహాలు.
కలిపేసాయి తమతో సంబంధాలు.
నా భ్రహ్మచర్య భగ్నానికి,
ప్రకృతితో నా లగ్నానికీ
చూసేసాయి ముహూర్తాలు.

వెదురు వనాలు వాయిస్తున్నాయి!
వేవేల మేళకర్త రాగాలెన్నో.
వంతపాడి స్వరాలు కలిపేస్తున్నాయి!
విరిసిన కోయిలమ్మల గొంతులెన్నెన్నో.

నోరూరి ఉసిరి తిని తరించిన జిహ్వ
నీటిలో కొత్త రుచినేదో సంతరించుకున్నట్లు
విశ్వమంతా ఈ వైవిధ్య గీతాలాపనలో
కొంగ్రొత్త భావాలతో మురిసిపోతోంది.

ఆనందంతో గంతులేస్తున్న నీలిమేఘాలు
ఊరుముల ఔట్లను పేలుస్తున్నాయి.
మెగావాట్ల విధ్యుత్ ఫ్లాషులతో మెరుపులు
ఒక్కో క్షణాన్నీ అపురూపంగా బంధించేస్తున్నాయి.

అచ్చరువొందిన తారాసమూహాలు
ఆనందపు చిరునవ్వులతో తళుక్కుమంటున్నాయి.
తనువు పులకరించిన వినీలాకాశం
విరిజల్లుల అక్షింతలు కురిపిస్తోంది.

ప్రేయసిగా నేనారాధించిన ప్రకృతి
తనంతట తానుగా నాతో పరిణయానికి సిద్ధమై
నా ప్రేమ శాశ్వతమని ఋజువు చేస్తున్న
ఈ శుభసంధర్భాన మీ ఆశీర్వాదాలనూ ఆశిస్తూ...

... . ..
మీ వినోద్

                                                  02/08/2013



Related Posts Plugin for WordPress, Blogger...