యధార్థ సంకేతం!భయానకం బీభత్సం అంటే ఏంటని
అగ్నిపర్వత విస్పోటనాల్లో
గాండ్రించిన పెనుతుఫాన్లలో
భూస్తాపితం చేసే భూకంపాల్లో....
పంచభూతాల ఆక్రోశాల్లో అస్సలు తొంగిచూడకు!!

అణచివేయబడ్డ మదిలోయల్లోంచి
ఉబికివస్తున్న లావాల్లో చూడు...
కన్నీటి కెరటాలపైనుంచి
తీండ్రిస్తున్న ధు:ఖ కిరణాల్లో చూడు...
తీరని కోర్కెల రుగ్మతల్లోంచి
పుట్టుకొస్తున్న వికృతత్వాల్లో చూడు...

సహనం నశించివేయబడ్డ
కుంచిత హృదయాల్లో చూడు...
తీరం దాటక మరణించబడ్డ
ఉన్నత ఆశయాల్లో చూడు...
కలిసిరాని కాలంచే ఓడించబడ్డ
అలసిన మనసుల్లో చూడు...

కల్పిత శారీరకభాషలతో
గోతులు తవ్వే మనస్తత్వాల్లో చూడు...

మరణమా పరిహసించకు...వెంటాడుతున్న మరణమా!
కారణం లేకుండా విసిగించకు
జీవిత రణం ముగిసి అలిసాక
ఆభరణంగా నిన్నే ధరిస్తానులే!!

వికసించాక వివేకం కోల్పోయి
చీకటి చెరసాలలో చిక్కుకున్నాక
చవిచూడబోతున్న చావు రుచి
వింతగా అనిపించకపోవచ్చులే!!

భయపెట్టడం చేతకాక చితిపేర్చి
సమాధవడమే తరువాయంటూ
కట్టెకాలే కాలమిదేనవి బెదిరించకు
నిశ్శబ్ధ స్మశానం నా స్నేహితుడేలే ! !

ఊపిరి సలుపనీయని బంధాలాటలో
సర్దుకుపోవడం ఆటనియమం కాదని
ఉరే సరైన శిక్షని శ్వాసను నిర్భంధిస్తే
ఏనాడు సరిగా ఊపిరి పీల్చానంటానులే ! !

అపరీష్కృత హృదయావిష్కరణఎదపలకని నిష్కల్మషమైన మాటలతో
ఏనిష్కటమైన కవిత్వాన్ని రాయను?

ఎడతెరిపిలేని ఎదభావాల ఆలాపనలో
ఏరాగం ఎంచుకొని రంజింపచేయను?

ఎడబాటు రాల్చిన కన్నీటి ఓదార్పుతో
ఏరోగముందని ఉపశమనం చెందను?

ఎదురుపడిన ఓటమి గుణపాఠంతో
ఏదోషముందని పరిహారం చెల్లించను?

ఎండమావి మిగిల్చిన నిస్సహాయతలో
ఏకుటిలత్వం దాగుందని నిందించను?

ఎదగనట్టి అపరిపక్వపు ఆలోచనలలో
ఏకపటం దాగుందని వేలెత్తిచూపను?

ఎదురీది అలసిన ఈ జీవనయానంలో
ఏంసాధించానని ఆత్మ తృప్తి చెందను?

పౌలస్త్యంకష్టాలను కన్నీటిని
కాలరాద్దాం మిత్రమా!
సహనంతో సైఅంటూ
సమరానికి సిద్ధమా?

మనమాడే ఆటలోన
కదిలెళ్ళే బాటలోన
పోరాటపు సత్తువుంది!
ఉద్వేగపు నెత్తురుంది!!

తరతరాల తప్పుల్లో
రగులుతున్న నిప్పుల్ని
టోర్నడోలా కబళిద్దాం!
తుఫానులా ఆర్పేద్దాం!!

క్రమమెరుగని భ్రమణంలో
కలికాలపు గ్రహణంలో
కారు చీకట్ల కుట్లు విప్పి
వెలుగుదారం అల్లేద్దాం!

మరక పడ్డ వీధుల్లో
రెప్పార్పని కళ్ళల్లో
కాంతి దివ్వె వెలిగిద్దాం!
మసి మసకలు వెలివేద్దాం!!

మన ఆశకు హద్దులేదు
ఎద ఘోషకు అంతులేదు
కదిలొచ్చెయ్..కదిలొచ్చెయ్
కడలిలాగ ఉరికొచ్చేయ్
తరంగమై తరలొచ్చెయ్...

పోరాటపు పవనాల్లో
వీరులమై విహరిద్దాం!
అదృశ్యపు దేహాలతో
అమరులమై మిగిలిపోదాం!!

యధార్థం
వస్తావు
వెళ్ళగానే గుర్తొస్తావు!
కరుణిస్తావు
కళ్ళుమూయగానే శపిస్తావు!
ప్రేమిస్తావు
ప్రాణమైపోగానే త్యజిస్తావు!

ఇలా ఎందుకని ప్రశ్నిస్తే
"ఊపిరి పీల్చి వదలకపోతే
జీవించడం అసాధ్యం కదా" అంటావు.

ఎన్నోసార్లు నెమరేస్తేగాని అర్థంకాని నీ వాక్యాలు
అర్థమైన వెంటనే నన్ను శూన్యంలోకి నెట్టేస్తాయి!!

ప్రేమ చినుకు (కథ)

సరిగ్గా ఒక సంవత్సరం ముందు "kinige" కథలపోటీలో ఎంపికైన నా మొదటి కథ.   (కథ పాతదే ... ఓపికుంటే చదవండి.)
------------------------------------------------------------------------------------------------------------------------

నిశ్శబ్ధ చప్పుళ్ళు వినిపిస్తూ పిల్లకాలువ పరవళ్ళు తొక్కుతోంది.
మూగ సైగలు చేస్తూ పక్షులు కిలకిలల్ని మానేస్తున్నాయి.
పరుగుల్ని నడకలుగా మలుస్తూ పైరగాలులు సన్నగా వీస్తున్నాయి.
భానుడు దిక్కులు మారుతున్నా చెట్టు నీడ మాత్రం నిద్రిస్తున్న ఆ ప్రేమికుడిపై నుండి జరగడంలేదు.
అతడు కలలు గంటున్నంతసేపూ పరిసరాలు స్తంభించి నిద్రకు ఉపక్రమించాయి. అతనికి లాగానే.
నిశ్శబ్ధతాండవం చేస్తున్న వాతావరణం ఎంతో స్వచ్ఛంగా ఉంది. అతని ప్రేమకు లాగానే.

అక్కడ ఏ సవ్వడీ లేదు, ఏ అలజడీ లేదు.
ప్రేమికుడి హృదయం ఎలా అర్థమయ్యిందో ఏమో ఆ ప్రకృతికి, బాధతో సేదతీరుతున్న అతనికి సహకరిస్తోంది.
అతను మాత్రం ప్రేయసి తలపుల్లో విహరిస్తూ ఉన్నాడు.

మేఘం మేఘాన్ని మొహిస్తే పుట్టిన చినుకొకటి ప్యారాచుట్ లేకుండా నేలపైకి దూసుకెళ్ళింది.
ఎన్ని గాలులు గమ్యాన్ని మార్చడానికి ప్రయత్నించాయో!
ఎన్ని పక్షులు రెక్కల్ని అడ్డుపెట్టాయో!
ఎన్ని పచ్చటాకులు పందిరిగా మారాయో!
ఆ చినుకు దేన్నీ లెక్కచేయలేదు.
వేగంగా ఆ ప్రేమికుడి కనురెప్పపై వాలింది.
అతని తలపులు భగ్నమయ్యాయి.
అంతే! అక్కడ నిశ్శబ్ధం ఒక్కసారిగా బద్దలైంది.

“ ఎక్కడి చినుకువే నువు? నా కునుకును కడతేర్చావు. ప్రేయసెటూ దూరమైంది. కనీసం తన జ్ఞాపకాలతోనైనా సేదతీరుదామని కనులు మూస్తే, ఆ భాగ్యమూ దక్కకుండా చేశావు. మండుటెండకు ఆవిరైపోతావు పో.. “ అంటూ రెప్పలపై కూలబడ్డ ఆ చినుకును కింద పడిఉన్న ఆకుపై అమాంతం విసిరేశాడు.

“ ప్రేమికా! ప్రేమికా! “ అంటున్న చినుకు పిలుపులు అతనికి వినిపించలేదు. అతని పెదాలనుండి ఒక్కమాటా రావడంలేదు. కళ్ళవెంబడి మాత్రం నీళ్ళు జలజలా రాలుతున్నాయి. అతని మౌనాన్ని ఆ చినుకు భరించలేకుంది.

“ నేల దిగే ఉత్సాహంలో మత్తుగా జారిపడ్డానే తప్ప, ఇలా నీ కలల్ని చిత్తు చేస్తాననుకోలేదు. కరుణజూపి శాపాన్ని వెనక్కితీసుకో “ అంటూ ప్రాధేయపడింది.  

“ పిచ్చి చినుకా! నేనేదో ఆవేశంలో ఆవిరైపోతావని అంటే దాన్ని శాపం అనుకున్నావా? మంచుకొండవైన నీవు నేల చేరేలోపు నీరయ్యావు, ఎండపడితే ఆవిరవుతావు. అసలు పుట్టుకతోనే నువ్వు శాపగ్రస్తురాలివి. నన్ను ప్రాధేయపడి ఏం లాభం? ” అంటూ అసహనంతో నిట్టుర్పులొదిలాడు.

ఆ ప్రేమికుడి మాటలు విన్న చినుకుకు దుఃఖం తన్నుకువచ్చింది. చినుకు చినుకే కన్నీరుగా మారింది. స్తంభించిన పిల్లకాలువ సవ్వడిచేస్తూ ఉరకలేస్తోంది. పైరగాలి వేగంగా పరుగులు తీస్తోంది. నీడ కుడా సూర్యుడి చలనానికి వ్యతిరేకంగా కదులుతోంది. చినుకును భరిస్తున్న ఆకు గాలికి కదలాడుతోంది. ఎండ చిన్నగా ఆ చినుకును తాకే ప్రయత్నం చేయసాగింది. చినుకెక్కడ ఆవిరవుతుందోనని ప్రేమికుడు వెంటనే ఆ ఆకును తన చేతిలో బంధించాడు.

“ మిత్రమా! నువ్వు బాధలో ఉన్నా సరే, నన్ను ఎండనుండి రక్షించావు. నీ దుఃఖానికి కారణమేమిటి? అసలు నీ ప్రేయసి ఎందుకు దూరమైంది? నాతో చెప్పవా? “ అని అడిగింది.
“ పిచ్చి చినుకా! తెలుసుకుని నువ్వేం చేయగలవు? సరే, చెబుతాను విను. నా గుండెలో భారం కొద్దిగైనా తగ్గుతుందేమో! “ అంటూ చెప్పసాగాడు.

#     #     #

“ తను మా రాజ్యానికి యువరాణి. అంతఃపురంలో ఆమెను నిద్రలేపడానికి, ఉదయాన్నే పక్షులన్నీ చేరి సుప్రభాత గీతాలాపన చేసేవి. వేకువ తొలి కిరణాలు ఆమెను స్పృశించాలన్న ఆత్రుతతో వేగంగా దూసుకొచ్చి సున్నితంగా తాకేవి. చల్లటి పొగమంచు తెరలుతెరలుగా అంతఃపురాన్ని అలుముకొని, ఆమె శ్వాసగా మారేది.

ఆమె మేనికి సహజంగానే ఒక పరిమళం ఉంటుంది. ఆ పరిమళానికి సుగంధ వృక్షాలు మొహం మాడ్చుకునేవి. సుమాలు కుడా చిన్నబోయేవి.
ఆమె పూల వనాల్లో అలా నడుచుకుంటూ వెళ్ళేటపుడు, ఎన్ని గులాబీలు విచ్చుకునే ప్రయత్నం చేశాయో! ఆమె సోయగాలు చూడటానికి. ఎన్ని ముద్దబంతులు విరగకాసి ఎదురుచుశాయో! ఆమె ముద్దుకోసం.
ఉద్యానవనంలో సుమాలన్ని ఆమె స్పర్శకై కాచుకొనికూర్చుంటే, ఆమె మాత్రం తనకిష్టమైన తామరపుష్పాల కోసం కొలను వైపుగా సాగేది. దూరంనుండి ఆ పద్మాలను చూడటమే తప్ప ఏనాడూ వాటి చెంతచేరి ముద్దాడిందిలేదు.

ఒక యువరాణిగా ఆమెకు ఎటువంటి ఆంక్షలున్నాయో ఆ రాజ్యానికి సేనాధిపతిగా నాకు తెలుసు. ఒక మనసున్న మనిషిగా ఆమె సంతోషాన్ని దూరంచేయకూడదని కూడా తెలుసు. అందుకే రోజుకో పద్మంతో ఆమెకు శుభోదయం పలికేవాడిని. ఎవరికీ తెలియకుండా, ఎన్నో సాయంత్రాలు పద్మాలతో నిండిన కొలనుల్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేవాడిని. ఆమె మురిసిపోతుంటే, ఆ చిరునవ్వులు చూసి నా హృదయంలో ఆనందం తాండవమాడేది. ఆ క్రమంలో నా హృదయాన్ని ఆమెకు ఎప్పుడు అర్పించానో తెలియదు. తనూ నన్ను ప్రేమించేది. ఆ విషయం నాతో చెప్పకపోయినా, ఆమె ప్రవర్తన ప్రస్పుటంగా ప్రతిబింబించేది. అంతలోనే ఈ విషయం మహారాజుగారికి ఎలా తెలిసిందో ఏమో! నన్ను బందీగా మార్చడం, కారాగారానికి తరలించడం వెంటనే జరిగిపోయాయి.

అదే అదునుగా భావించి పక్క దేశపు రాజు మా రాజ్యాన్ని ఆక్రమించేశాడు. ఆ విషయం కారాగారంలో ఉన్న నాకు రెండు రోజుల తర్వాతగానీ తెలియలేదు. ఎంతో కష్టంతో అక్కడినుండి బయటపడి, అంతఃపురానికి వెళ్ళాను. మహారాజుతో సహా సైన్యమంతా శవాలుగా పడిఉన్నాయి. యువరాణి ఆచూకి అసలేలేదు. రాజ్యమంతా పరాయి రాజు ఆధీనంలో ఉంది. ఎన్ని మారువేషాలు వేశానో నా ప్రేయసి జాడ కోసం. ఎన్నో యుద్ధాలను జయించి రాజ్యాన్ని కాపాడిన నేను. ఈ సారి అటు రాజ్యాన్ని, ఇటు నా ప్రేమను, దీన్నీ కాపాడుకోలేకపోయాను....
”  అని చెబుతూవుండగానే గాలికి ఆ ఆకు ఎగురుకుంటూ పిల్లకాలువలో పడింది.
“ ప్రేమికా! నీ ప్రేమను నేను గెలిపిస్తాను....” అంటూ ఆ చినుకు అరుస్తూ కొట్టుకునిపోయింది.

“ కొమ్మల చాటున, పూరేమ్మల మాటున...
కోనలలోన, కొలనులలోన... ఎక్కడ ఉన్నా వెతికేస్తా!
చినుకు తలిస్తే ఏమవుతుందో లోకానికి నే చూపిస్తా!     
పత్రంపై సవారీ చేస్తూ పవిత్ర ప్రేమను గెలిపిస్తా! ”
అంటూ ఆ చినుకు నీళ్ళపైనుండి వెళ్తూ అంతటా గాలిస్తోంది.

ఎన్ని పాయలు చిలిందో! ఆ పిల్లకాలువ. అలసిపోయి పత్రంపై కునుకు తీస్తున్న ఆ చినుకును ఒక కొలనులోకి తీసుకెళ్ళింది.
ఆవలిస్తూ ఆ చినుకు మెల్లగా కళ్ళు తెరిచింది.

ఆ కొలనంతా పద్మాలతో నిండిపోయి ఉంది. ఇంకా చంద్రుడు వెళ్ళిపోకుండా ఎందుకో కాచుకొనిఉన్నాడు. ఆ వేకువన, చంద్రుడి కిరణాలకు కొలనంతా వెండిసముద్రమై మిలమిలా మెరుస్తోంది. ఎగురుతున్న సీతాకోకచిలుకలలోంచి తరంగాలను వస్త్రంగా చుట్టుకొన్న శ్వేత పద్మంలా ఒక యువతి ఎర్రటి పద్మాన్ని విరహంతో ముద్దాడుతోంది. మనసులో ఎదో వేదన ఉన్నట్లు అసహనంగా, అమాయకంగా కనిపిస్తోంది.

“ అబ్బా! ఎంత సౌందర్యంగా ఉందో ఈమె! అచ్చం దేవతలా ఉంది. బహుశా ఈమే అనుకుంటా ఆ యువరాణి. ఇంక ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దర్నీ వెంటనే కలిపేయాలి. ఎలా? నావల్ల అవుతుందా?... “ అనుకుంటూ దీర్ఘాలోచనలో పడింది.

కొద్దిసేపటి తరువాత తెల్లారింది. యువరాణి మాత్రం ఒకచోట కూర్చొని పద్మాన్ని సుతారంగా నిమురుతూ ప్రియుడి ఆలోచనల్లో ఉంది. కళ్ళవెంట నీరు ధారగా కారుతున్నాయామెకు.

“ ఇక నేను ఉపేక్షించకూడదు. నా ప్రాణాన్ని పణంగా పెట్టయినా సరే ఈ ప్రేమను గెలిపించాలి ” అనుకుంటూ సుర్యకిరణాల వైపుగా ఆకుని నడిపించిందా చినుకు. కిరణాల తాకిడికి ఆ చినుకు కొద్దిసేపటికే ఆవిరిగా మారి మేఘంలో కలిసిపోయింది. ఆలస్యం చేయకుండా మేఘాన్ని వదిలి ఆ ప్రియుడి పైనే మళ్ళీ వర్షించింది. ప్రేయసి జాడను చెప్పి, వారి ప్రేమకు ప్రాణం పోసింది. 
  
ఇప్పటిదాకా ఎన్నో ప్రేమకథలను చుసిన నాకు, ఇదో గొప్ప అందమైన ప్రేమకథలా అనిపించింది. ప్రాణాలను త్యజించి వాళ్ళ ప్రేమను గెలిపించిన ఆ ప్రేమ చినుకుకు నా సలాం! ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ... మిమ్మల్నందరినీ అనుక్షణం గమనించే అంతులేని ఆకాశాన్ని.   


Related Posts Plugin for WordPress, Blogger...