కోయ్యగుర్రమైతేనేం!


మనస్సు అద్దమై
అద్దం వందల ముక్కలై
ముక్కలు మనుషుల ప్రతిబింబాలై
ప్రతిబింబాలు సమాజపు పరావర్తనాలై
చూసే ఎన్నో వెక్కిరి చూపులు.
చేసే ఇంకెన్నో పరిహాసపు పకకలు.
  
 ముసురుకున్న అన్నిటి నడుమ
ఆశయాన్ని గుండెల్లోంచి పెకళించి,
ఆవేశాన్ని గమ్యంకోసం అణచిపెట్టి,
అనంత దూరం పయనించాలని,
అలసిపోని అశ్వాన్నెక్కానన్న ఆనందంతో
సహనవాహనంపై సవారీ చేస్తున్నా...

నాదంతా నిజం లాంటి భ్రమ!
ఊహాజనిత వాస్తవం!!
ఏంటని మేల్కొంటే,
నేనెక్కిందో కొయ్య గుర్రం!!!

 అయితేనేం?
నాది కిరణానికి కరిగిపోయే
మంచు దేహం కాదు.
భయంకర లావా ప్రవాహానికి తొలి రూపం.
మహోజ్వలిత నిప్పు రణానికి మలి దాహం. 
నాది త్వరణానికి వణికిపోయే
పెళుసు ప్రాయం కాదు.
ప్రేమనే కవచంగా ధరించిన ఉక్కు హృదయం
స్వార్థాన్నే అర్థించని అగ్గి రుధిరం.

అందుకే..
కొయ్య గుర్రానికీ 
నేను పరుగులు నేర్పిస్తాను!
దాని సకిలింపులూ వింటాను!!
నిగమ నడివీదుల్లో,
నిర్మానుష దారుల్ని ఎంచి,
మొలిచిన చీకటి గడ్డిమొక్కల్ని చీల్చుకుంటూ,  
ధైర్యంతో ముందుకు నడిపిస్తాను!

ధరిత్రిని నిభిడాశ్చర్యంలో ముంచేస్తాను!!

4 comments:

  1. మీ నిప్పుకణిక లాంటి కవిత్వం కొయ్యగుర్రానికి పరుగులు నేర్పగలదు... వండర్ ఫుల్....

    ReplyDelete
    Replies
    1. పరిగెత్తితే ఖచ్చితంగా మిమ్మల్నే మొదట ఎక్కిస్తాను... త్యాంక్యు

      Delete
  2. mee kanchu kavitwamloe koyyagurram kuuDaa kiilugurramai parugulu teestundi :-)

    ReplyDelete
    Replies
    1. అయితే ,, సతీష్ కొత్తూరి గారి తర్వాత మీకే దానిపై ఎక్కే చాన్స్ ఇస్తానుగా .. :))

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...