ఆమె ఇప్పుడు వాడి భార్య

వాడి కళ్ళింకా రుధిరాన్నే స్రవిస్తున్నాయ్
కలలు మాత్రం ఊహల్లో భ్రమిస్తున్నాయ్

రెప్పార్పకుండా వాడలానే వాడిపోతున్నాడు
జారిపోతున్న రుధిరంలో అలానే తడిసిపోతున్నాడు

క్షణం వేచిన కాలం మరుక్షణమే మాట మార్చింది
ప్రేమ రక్షణ కరువైన గుండె గోడల్ని కూల్చేసింది

అయినా, ఎందుకో? ఏమో?
వాడి చూపులింకా నిరీక్షణలో నిమగ్నమై ఉన్నాయి
భగ్న హృదయం కాస్తా నగ్నంగా మూగబోతోంది

స్రవిస్తున్న రుధిరం నిండుతూ గుండెనే ముంచేసింది
ఇప్పుడది ఎర్రటి కవచాన్ని కప్పుకొని ఇంకా ఎర్రగా మారింది

అయినా ఆ కళ్ళకు ఏ మూలో ఒక చిన్న ఆశ
తన వాకిళ్ళను మూయక స్రవిస్తూ అలానే ఎదురుచూస్తోంది.

మనసెక్కడుంది? ఆ పొంగుతున్న రక్తానికి
మొత్తంగా నిండి, ఆ కళ్ళనూ ముంచేసింది
అక్కడ ఎండి పొడిబారిన రుధిరమే తప్ప హృదయమే లేదు

ఉన్న ఆ పొడినీ కూడా కక్కుర్తి పడ్డ వ్యాపారొకడు
కస్తూరిలో కలిపి కోవెల్లో అర్చనకని అమ్మేశాడు

ప్రియుడి కోసం కాకున్నా డేవుడి కోసం వచ్చిన ప్రేయసి
కోవెల్లో కుంకుమను నుదుటిపై దిద్దుకుంది

హృదయానికి దక్కని భాగ్యం రుధిరానికి దక్కింది
ఇప్పుడా ప్రేయసి వాడి భార్య
ఎవరు ఔనన్నా కాదన్నా....

22/10/2013




2 comments:

  1. పొడిబారిన రుధిరమే తప్ప హృదయమే లేదు
    కస్తూరిలో కలిపి కోవెల్లో అర్చనకు అమ్మేశాడు...
    Touching lines

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...