సిగ్గంటే...

మెత్తటి ఆకుల్నో
నెత్తుటి పిడిబాకుల్నో
దారాలుగా అల్లి
హారాలుగా వేసుకో!
నీ ఆత్మ కప్పుకున్న నగ్న దేహాన్ని
నిండుగా దాచేసుకో!!

రోమరోమాల్లో
అలుముకున్న అయోమయాన్ని
దేహ బాహ్యాల్లో
విచ్చుకున్న వంకర మూలల్నీ
ధూళి కణాలు తాకకుండా
గాలి అణువులు దూరకుండా
గుడ్డ ముక్కల్నో
గడ్డి రేకుల్నో
గబగబా చుట్టేసుకో!
ఉన్న సిగ్గును కప్పేసుకో!!

వలపు వాంఛలు వదిలిపోనివి.
కలుగు కోర్కెలు కాలిపోనివి.
కొత్త సిగ్గుకు మొగ్గ తొడుగు.

మేని ఛాయ మాసిపోనిది.
మనసు గాయం మానిపోనిది.
పాత సిగ్గును తొక్కిపెట్టు.

సిగ్గు సిగ్గులో తప్పిపోతూ
లేని సిగ్గులో నెగ్గుకుంటూ
నవ్వు వస్త్రం కొనుక్కో !!
నిన్ను మాత్రం వెతుక్కో !!!

29/11/2013

2 comments:

  1. ఈ వాక్ప్రవాహానికి ఆనకట్టవేయడం కష్టం :-)

    ReplyDelete
  2. సులభమైతే, ఆనకట్ట వేస్తారా ఏంటి?

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...