నేనొక రాక్షసుడిని!

 

ఒక్క అరుపు నాకోసమని కర్ణభేరిని తాకితే
ఒక్క తలపు తరంగమై మనసును మీటితే
కంట్లో కునుకు దూరిందని
ఒంట్లో వణుకు చేరిందని
చాచిన రెండు చేతుల్నీ దోసిలిగ మార్చి
మొహాన చిరునవ్వును చితిగా పేర్చి
వీడ్కోలు పలికాను.
అలసిపోకుండా రాక్షసుడిలా మారి
కన్నీటి సుడిగుండాలను సృష్టించాను.

ప్రేమ చిందించని నా హృదయాన్ని
పదిలంగా అస్తికల గూడులో దాచేసి
ఆప్యాయతెరుగని నా రుధిరాన్ని
దమని సిరల్లో పరుగులెత్తించి
మైల పడ్డ నా నల్లటి మనసుని
తెల్ల పావురాల నెత్తుటితో అభిషేకించి
విశ్వ శాంతి మంత్రం జపించాను.
వినోదానికి పునాదినని,
నన్ను నేనే ఒక వజ్రమని చెప్పుకున్నాను.

ఈ వజ్రం పైమెరుతో అందర్నీ దోచుకోగలదేమో!
లోని మనో కాఠిన్యం ఇంకో మనసునే కోయగలదు !!

అందుకే
నా సంకెళ్ళ నుండి జాగ్రత్తగా తప్పించుకోండి!
నా ఎద సవ్వళ్ళు వినక తొందరగా పారిపోండి !!


1 comment:

  1. తప్పించుకుని పారిపొమ్మని చెప్పగలరే కానీ తరిమి కొట్టలేరు
    మోము చూసి మోహించిన వారు ముఖం తిప్పుకుంటారేమో
    కానీ ఎదలో ఉన్నవారు ఎద సవ్వళ్ళు వినకుండా ఉండలేరుగా

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...