నేనెందుకో...



ఆకాశాన్ని స్పృశించే అంతస్తుల మేడల మధ్య
గజిబిజిగా తిరిగే లగ్జరీ కార్ల ఉరుకులు.
కనిపించి మాయమయ్యే మనుషుల మధ్య
నెత్తిన సిసి కెమెరా, చంకలో లాప్టాప్ తో
మార్బల్స్ పరిచిన కార్పోరేట్ తివాచీపై
నేనూ పరిగెడుతున్నా ఓ యంత్రంలా..

ఎవరో కోక్ టిన్ ను కాళ్ళముందు విసిరేస్తే
చికటైపోయిందని దాన్ని దాటేస్తూ
పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను..

ఎక్కడో ఒక చోట ఒంటరిగా కూర్చొని
నా సి.సి కెమరాతో అంతట్నీ స్కాన్ చేస్తాను.
మధ్యాహ్నపు సూర్యుడి వెలుగులు
అంతస్తుల అద్దాలను తడిపేస్తూ కదలాడుతున్నాయి.
వేగంగా పరిగెత్తే వాహనాల సైలెన్సర్లు వదిలిన పొగలు
అప్పుడే అద్రుశ్యమౌతున్నాయి.
జీబ్రా క్రాసింగ్స్ లో
ఎవరెవరో దిక్కులు చూడకుండా నడుస్తున్నారు.

నేనూ ఒక చిన్న కారేసుకొని రయ్యిమని
ఎండిన ఆకు రాలిన రోడ్డుపై ఉరుకుతాను.
కెమెరా లెన్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ
శరవేగంగా దూసుకెళ్తాను.

ఊరవతల ఇసుక తిన్నెలపై బ్రేక్ తొక్కి
ఒక్కసారిగా ఆవలిస్తూ నీల్గేస్తాను.
ఒంటరిగా గెంతులేస్తూ
నాలో ఉన్న నిజమైన నన్ను బయట పడేస్తాను.

కెమెరా కలర్ బ్యాలెన్స్ సరిచేస్తూ
నీడనిచ్చే చెట్ల కింద నిద్రిస్తూ
పచ్చటి ప్రకృతిని ఆహ్లాదంగా ఆస్వాదిస్తాను.

అక్కడే నిద్రిస్తూ
ఎండిన పూరెమ్మల్ని గాల్లో ఊదేస్తూ పరవశిస్తాను.
ఏదో ఆనందాన్ని గుండెలపై పోస్తూ..
అలా గడిపేస్తాను...

25/12/2013   
 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...