పత్ర ప్రేమ ...

అర్ధరాత్రి మొదలైన వెన్నెల చలిగాలిలో
అనార్ద్ర హృదయాన్నెత్తుకుని
ఆర్ద్ర నీటిబిందువునై నేనొచ్చిపడతాను.

నన్ను భరించడం కష్టమే,
అయినా స్పృశించడం ఇష్టమంటావ్.
రాత్రంతా నన్ను హత్తుకునీ;
అక్కున చేర్చుకుంటావ్.
నువ్వు పత్రపాన్పై, నను పవళించమంటావ్.

అంతలోనే నీకేమాయరోగం సోకుతుందో నాకర్థంకాదు.
పొద్దు పొడిచేలోపు నన్ను నీ అంచుల్లోకి తోసేస్తావ్.
వద్దు వద్దంటున్నా ఇక వీడ్కోలు పలకమంటావ్.

నీ పచ్చటి కొనను వీడి కిందపడేవేళ
నేనో నీటి బిందువును కాను.
మొత్తంగా మారిన కన్నీటిబొట్టునౌతా..

ఇంత రెప్పపాటులో అనంత ప్రేమ చూపడమెందుకు?
కాలయాపన లేకుండా నీ ప్రేమను కాలంచేయడమెందుకు?

విరహాన్ని పరిచయం చేయాలనా?
వలపు ఉప్పొంగిందో లేదో పరిక్షించాలనా?
జ్ఞాపకాల భారాన్ని జీవితాంతం మోయమనా?

“ అదిగో వాడొస్తున్నాడు చూడు. వాడికీ వెన్నెలకీ సరిపోదు.
వెన్నెల్లో కొలువుదీరిన బంధాలేవీ వాడికి నచ్చవు.
అందుకే, వచ్చీరాగానే వాడి వేడి కోరలతో అంతట్నీ భస్మం చేస్తాడు.
కొద్ది క్షణాల్లో ఎండకి నేనెండిపోతాను.
నీకెందుకు ఈ శాపం. నాతొ ఉంటే నువ్వూ ఆవిరౌతావ్. “

నా ఇన్ని ప్రశ్నలకూ నీ ఒక్క సమాధానంతో భారంగా వీడ్కోలు పలికావ్ సరే..

ఇప్పటినుండి... నా బ్రతుకంతా భారమే అని ఎందుకు తెలుసుకోలేకపోయావ్ నేస్తం...


( ఆకు - నిటి బిందువు ప్రేమ కథ ఇలా కవితలో చెప్పాలని చిరు ప్రయత్నం. అర్థం కాకుంటే తిట్టండి. మరేం ఫర్వాలేదు. )

02/12/2013



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...