సాగిపో....



కష్టం నష్టం వచ్చాయంటూ
ఒంట్లో సత్తువ వదలొద్దు...
బాధా ధు:ఖం తరిమాయంటూ
కంట్లో నెత్తురు రాల్చొద్దు...

ఆవేశం కోపం కలిగాయంటూ
శీఘ్రమే కుత్తుక కదపొద్దు...
అలుపూ సలుపూ వచ్చాయంటూ
గమ్యం తలుపులు మూయొద్దు...

వెలుగూ నీడా కలిశాయంటూ
వేదన కట్టలు తెంచొద్దు...
వానకి వరద తోడైందంటూ
తర్కానికి తిలోదకాలొదలొద్దు...

చేతులు కట్టుకు కూర్చోకుండా
చకచక ఎత్తులు సిద్ధం చెయ్...
కాళ్ళకు బుద్ధిని చెప్పేయకుండా
కుదురుగా నిలబడి యుద్ధంచేయ్...

వెలుగుకు నువ్వే వాహనమయ్యి
లోకం మొత్తం ప్రసరించేయ్...
చిరునవ్వుకే నువ్వు బానిసవయ్యి
చిగురించిన ఆశలను పాలించెయ్...

05/05/2014

6 comments:

  1. కవిత ఆసాంతం రిథమిక్ గా ఉంది.
    అంతకంటే ఎక్కువ ' ఇన్స్పైరింగ్' గా కుడా ఉంది

    "ఆవేశం కోపం కలిగాయంటూ
    శీఘ్రమే కుత్తుక కదపొద్దు...
    అలుపూ సలుపూ వచ్చాయంటూ
    గమ్యం తలుపులు మూయొద్దు..."

    మీ కవితలో ఎంతో విలువైన పదాలివి.
    బాగుంది . వినోద్ బాబు ( ముద్దబ్బాయ్ వి కదా )
    అభినందనలతో

    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ముద్దబ్బాయ్ అంటూ ముద్దు చేస్తుంటే ... మీ మురిపాలకు బానిసనయిపోయాను శ్రీపాద గారు... త్యాంక్యు!!

      Delete
  2. ఎంతో చక్కని పదాలతో చిక్కని భావాన్ని పలికారు. ప్రేరణోభరితం

    ReplyDelete
    Replies
    1. ఎంచక్కా భలే ఉంది మీ స్పందన! త్యాంక్యు సంధ్య గారు'!!

      Delete
  3. ఈ కవిత నాకోసమే రాసారు అన్న భావం. ప్రతి అక్షరాన్ని నాకు నేనే అన్వయించుకుని సాగిపోయే ప్రయత్నం చేయాలి అనే అంత గొప్పగా రాసారు వినోద్

    ReplyDelete
    Replies
    1. నా జన్మ ధన్యమయింది. మీ ఈ స్పందనతో... థాంక్స్ అ లాట్ పద్మార్పిత గారు :-)

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...