ఓ మగాడా...



ఎవరు నువ్వు?
మాతృగర్భాన్ని తొలిచిన పురుగువా
మగువ దేహాన్ని వలచిన ప్రియుడివా
వారసుడంటూ కీర్తించబడే స్వార్థపిండానివా
వావీవరసల ఉచ్చులో తచ్చాడే అర్ధసన్యాసివా

అవును... కాదు కాదు...
నువ్వసలు నువ్వేనా
ఈర్షను జీర్ణించుకున్న నిర్జీవివేమో
పశ్చాత్తాపమెరుగని ఉన్మాదివేమో

ఏమో
నువ్వసలు నువ్వు కాకపోవచ్చేమో
మృత్యులోయలోపడి
మృతసంద్రాన్నీదే వానరానివేమో
కానరాని మనసు శిలను దాచిపెట్టి
మొండిబండలా బ్రతికే శిలాజానివేమో

అవును
ఒక్కోసారి నువ్వంతేనేమో
అంతేనా
ఇంకేం కావా నువ్వు?
అవుతావేమో కాస్త చూడు...
ఆలోచనల్ని అతికిస్తే
నిస్తేజాన్నొదిలిన నింగివౌతావేమో
ఊహల్ని శ్వాసిస్తే
రెక్కలవసరం రాని విహంగానివౌతావేమో
మగువ మనసెరిగితే
మంచును వెదజల్లే సూర్యతేజానివౌతావేమో

ఏమో
ఏమో నువ్వన్నీ అవుతావేమో
అపుడప్పుడూ అసలేం కావేమో..
ఏం చేసినా చేయనట్లు
చేయకున్నా చేసినట్లు
గొప్పవాడిగానో..
గొప్పలు చెప్పుకున్నవాడిగానో
ఎప్పుడో ఒకసారి
ఎక్కడో ఒకచోట
కుప్పకూలిపోతావ్....
ఓ మగాడా !
మనసును మోస్తున్న నువ్వు
యంత్రంలా కనబడే ఓ మనిషివే !!

3 comments:

  1. మాతృగర్భాన్ని తొలిచిన పురుగువా
    మగువ దేహాన్ని వలచిన ప్రియుడివా
    వారసుడంటూ కీర్తించబడే స్వార్థపిండానివా
    వావీవరసల ఉచ్చులో తచ్చాడే అర్ధసన్యాసివా....అన్నీ మీరే అనేసుకుంటే, ఇంక మేము అనడానికేముంది.
    Very impressive.

    ReplyDelete
  2. చా....మగాళ్ళందరినీ అలా తిట్టకండి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...